నెత్తుటి పువ్వు (చివరి భాగం)
మహీధర శేషారత్నం
తనలాంటి మనస్సున్నవాళ్ళకి కేవలం ఏదో చిన్న స్కూలులో ఆయాగానైనా ఇబ్బంది లేదు.
ఇలా ఆలోచించుకుంటూ ఉంది. చూద్దాం, చిన్నాడు కూడా స్కూలుకి వెళ్ళాలిగా, లేకపోతే ఎవరు చూస్తారు? ఇలా ఆలోచించినప్పుడల్లా ఆడవాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉండాలి అనే రాజుమాటలు పదేపదే గుర్తుకొచ్చేవి. అప్పుడప్పుడు ఎదురింటి ఖాశించీ వచ్చి నాలుగు మాటలు చెప్పిపోతూ ఉండేది. రాజుబాబు శానా మంచోడు అంటూ.
“ఈ శానా మంచోడు” నాకు పిల్లలకు మాత్రమే అన్యాయం ఎందుకు చేస్తాడు? తనకి తెలిసి రాజు తన జేబులో డబ్బులు తీసి కష్టాల్లో ఉన్నవాళ్ళకి సాయం చేసేవాడు. పెట్టలేకపోతే పెట్టే ఇల్లెనా ఎక్కడుందో చెప్పాలనేవాడు. అలాంటివాడు తనను, పిల్లలను ఇలా దిక్కులేని వాళ్ళలా వదిలేసి ఇలా ఎలాచేసాడు? ఇది నిజంగా ప్రమాదమేనా?
ఒక్కోరోజు రాత్రి ఈ ఆలోచనలతో నిద్రపట్టేది కాదు. ఒకరోజు వసంత, వాళ్ళ ఆయన వచ్చారు. వసంత వస్తూనే వదినగారిని కౌగిలించుకొని భోరున ఏడ్చేసింది. “వదినా! అన్నయ్య లేని ఇంటికి రాలేకపోతున్నా” అంటూ, లక్ష్మికి కూడా కళ్ళ నీళ్ళు తిరిగాయి.
“తప్పదు వసంతా! మీ అన్నయ్య చాలా తేలికగా బంధాలు తెంచుకున్నాడు. కాని పిల్లలు.... నేను ఒంటరిదాన్ని కాను. నా పిల్లలు బిచ్చగాళ్ళు కాకూడదు. ఎలాగైనా వీళ్ళని చదివించి జీవితంలో తలెత్తుకు నిలబడేలా చేస్తా. ఇంక నా ఆశ, ఊపిరి వీళ్ళే”. కళ్ళల్లో నీళ్ళున్నా కంఠం దృఢంగా ఉంది.
ఇదంతా చూస్తున్న లక్ష్మి వదినకి కొంచెం మంటగా ఉంది. “ఏం చేస్తామమ్మా! మా ఖర్మ ఇలా కాలింది. అందరికీ సుఖపడే గీత ఉండద్దు.” అంది నిందా గర్భంగా.
నేను మిమ్మల్ని గమనించలేదు అక్కయ్య గారూ! ఎలా ఉన్నారు” అంది వసంత నొచ్చుకుంటూ.
“ఏం చేస్తామమ్మా! ఎవరో గిట్టని వెధవలు కేసులు పెట్టారు. ఆయన జైలులో, నేను ఇక్కడ.. ఏడుపు గొంతుతో అంది.
“బాధపడకండి అక్కయ్యగారూ! నేను ఈ ఊరు ట్రాన్సఫర్ చేయించుకున్నాను. నాది ప్రైవేటు జాబే గదా! ఒకొళ్ళకొకళ్ళం కాస్త తోడుగా ఉండచ్చు.” అన్నాడు మృదువుగా వసంత భర్త. లక్ష్మి ముఖంలోకి వెలుగొచ్చింది. ప్రేమగా వసంతను కౌగిలించుకుంది. సత్యం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తన కాగితాలు ఏమయినట్టు? ఎక్కడున్నట్టు? తెలియటంలేదు, అప్పుడప్పుడు భార్య జైలుకి వచ్చి చూసిపోతోంది. ఏ చెల్లెలి మీద ప్రేమతో ఇదంతా చేసాడో ఆ చెల్లెలు మాత్రం ఒకసారీ రాలేదు. అతను నాగరాజు ఇంత పనిచేస్తాడని ఊహించలేదు. నాగరాజే తన కాగితాలతో తనని ఇరికించాడా అనుకుందామంటే అప్పుడే అతనుపోయి సుమారు ఏడాదవుతోంది. ఎవరి పని ఇది? సత్యం మెత్తగా ఉండే నాగరాజు ఏమీ చెయ్యలేడనే అనుకుంటున్నాడు. ఎవరి పని ఇది? ఆ దొంగముం.... అయిన లక్ష రూపాయలు దొబ్బి అడ్డంగా సాక్ష్యం చెప్పింది. ఇన్నాళ్ళు ఉబ్బేసి పనులు చేయించుకున్న ఈ దొంగ, నా కొడుకులు ఒక్కడూ కూడా చచ్చావా? బతికావా? అని తొంగి చూడడంలేదు. పత్తిత్తుల్లా మడత నలగని వెధవ కండువాలు వేసుకుని ఉపన్యాసాలు మాత్రం ఇస్తున్నారు.. అవినీతి అవినీతి అంటూ..
సత్యం జైలులో నలిగిపోతున్నాడు, సత్యం భార్య ముభావంగా ఉన్న లక్ష్మి దగ్గర ఉండలేక చిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది, ఎంతైనా సొంత కొంపా గూడూ ఉన్నాయిగా అనుకుంటూ...
నాగరాజు ఊళ్ళో పొలమూ, పాత ఇల్లూ. అమ్మకం పెట్టేశారు. నాగరాజు, వసంత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి నాగరాజు పెళ్ళయ్యేదాకా ఉంది. తల్లి పోయాక నాగరాజు ఉన్నంతలో మంచి సంబంధం చూసి చెల్లెలు పెళ్ళి చేసాడు. వసంతకి నాగరాజు, నాగరాజుకి వసంత తప్ప అటెవరూ లేరు.
ఇటు లక్ష్మికి కూడా పెద్దబలగం అంటూ లేదు. తల్లిపోయాక తండ్రి అన్నకి వాట పంచి ఇచ్చి మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. లక్ష్మికి పెళ్ళప్పుడు పసుపు కుంకాలుగా ఒక ఎకరం పొలం, పదికాసుల బంగారం పెట్టాడు.
అంతకంటే లక్ష్మికి పుట్టింటి ఆసరాలేదు. నాగరాజు పోయినప్పుడు తండ్రి, సవతి తల్లి అందరితో పాటే వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళిపోయారు. ఆవిడకి నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, ఇద్దరు మగ. ఈరోజుల్లో కూడా, అందులోనూ ఈ వయసులో నలుగురు పిల్లల బాధ్యతా అనుకున్నా లక్ష్మి. నోరు విప్పలేదు. ఇలాంటి విషయాలు తండ్రితో ఎలా మాట్లాడతాము అని తను, అన్నా ఒకరి కొకరు తప్ప తమవైపు పెద్దగా రాకపోకలు లేవు.
లక్ష్మి కోరినట్టే శంకరం ఒక బ్రోకరు ద్వారా తమ ఇంటి సమీపంలో ఒకపాత ఇల్లు చూసాడు. నిజానికి అది పది సంవత్సరాల కింద కట్టిందే. నూటయాభై గజాలలో కింద నాలుగు గదులు, పైన నాలుగు గదులు. అంతా కలిసి నలభై లక్షలు. అంతా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనాలు ఉండే ఏరియాకాబట్టి ఆ రేటుకు వచ్చింది. అదీకాక డిమానిటైజేషన్ దెబ్బకు అమ్మకాలు, కొనుగోళ్ళు కూడా సరిగాలేవు. అవసరంపడి అమ్ముకుంటున్నా రనడం వలన శంకరం సంప్రదించాడు. లక్ష్మి తన పొలంకూడా అమ్మకానికి పెట్టింది. అన్నగారు జైల్లో ఉన్నాడు. ఊళ్ళో గొడవలు, తండ్రి ఇంటికి వెళ్ళింది. తండ్రిని పిన తల్లిని పిలిచి సంప్రదించింది. మీ చేనుకు ఆనుకొనే ఉంది కనుక నీ పేరరాయించుకో, న్యాయంగా ఇక్కడ ఎంతరేటు ఉంటే అంత రేటుకట్టి నాకు డబ్బు ఇయ్యి. అని అడిగింది. తండ్రి నా దగ్గర అంత డబ్బులేదు అని సణిగాడు. పినతల్లి ముందుకు వచ్చి సరే మేమే తీసుకుంటాము. అని తన అన్నగారి దగ్గర వడ్డీకి తిప్పుతున్న డబ్బు తీసుకు సర్దుబాటు చేసుకొందామంది.
లక్ష్మి శంకరంతోటి, వసంత మొగుడితోట సంప్రదించింది. లాయర్ ద్వారా రిజిస్ట్రార్ ఆఫీసు ద్వారా అన్నీ పక్కగా చేసుకోవాలని నిర్ణయించారు.
లక్ష్మి నాకు ఎక్కువ బంగారం ఎలాగూ లేదు. లాకర్ రెంట్ దండగ. ఎందుకో ఆయన తీసుకున్నాడు. ఖాళీచేసి ఆ బంగారం కూడా అమ్మేద్దాము అంది. “అవసరం లేనివి అమ్ముకోవడం ఎందుకమ్మా! బంగారం ఎప్పుడైనా అవసరానికి అమ్ముకోవచ్చు. అది కష్టం కాదు.” అని శంకరం తోసిపుచ్చాడు. వసంత, భర్తకూడా అదే అన్నారు.
అసలు లాకరులో ఏమున్నాయో చూసి చిన్న లాకరు తీసుకుందాము మధ్య సైజు లాకరు ఇచ్చేదాము. అనుకున్నాడు. లక్ష్మికి తోడుగా వసంత, శంకరం కూడా వచ్చారు. లాకరులో బంగారంకంటే కాగితాలు ఎక్కువ కనిపించాయి.
“ఏమిటమ్మా ఇవి? అని అడిగాడు శంకరం. “ఏమో అన్నయ్యా! నాకు తెలిసి ఏమీ పెట్టలేదు ఇందులో!” అంది అయోమయంగా.
సరే! నువ్వు గోల్డు తీసుకో. లాకరు ఖాళీ చెయ్యి. అంటూ ఆ కాగితగాలన్నీ బేగ్లోపెట్టి జిప్పులేసాడు. తమ లాకరు ఖాళీచేసినట్టు చెప్పి, చిన్న లాకరు ఉంటే ఇమ్మని అడిగారు. ప్రస్తుతం లేదని ఉన్నప్పుడు ఇస్తామని చెప్పారు.
“అమ్మా! లక్ష్మీ! ఈ కాగితాలు మా ఆఫీసుకు సంబంధించినవేమో! చూడనా! నువ్వు తీసుకెడతావా?” అన్నాడు శంకరం.
“నాకేం తెలుస్తుంది అన్నయ్యా! నువ్వే తీసుకెళ్ళు” అంది. శంకరం ఇంటికెళ్ళి తాపీగా మంచంమీద కూర్చుని కాగితాలన్నీ చదివాడు. శంకరానికి సత్యంచుట్టూ ఉచ్చుపన్నిన దెవరో అర్ధమయింది. నాగరాజు పోతూ పోతూ సత్యాన్ని ఇరికించి సరోజ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఒరిజినల్స్ కూడా ఎన్.పి. ఆఫీసుకు స్పీడు పోస్టులో పంపేశాడు. చేతులు దులుపుకున్నాడు. అయితే నాగరాజులా తనపేరు, ఊరు తెలియచేయలేదు.
వారం తిరగకుండానే శంకరానికి ఎస్.పి. ఆఫీసు నుండి రమ్మని పిలుపు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. శంకరం బితుకూ బితుకూ మంటూ వెళ్ళాడు.
“ఊఁ! శంకరం..... స్టేషన్ నెం.... ధైర్యంగా వచ్చి ఎందుకు ఇవ్వలేదు.” సూటిగా అడిగాడు ఎస్.పి. “వివరాలు నాకు సరిగా తెలియవు సర్! నాగరాజు లాకర్లో ఉన్నాయి. ఎవరికివ్వాలో తెలియక మీకు పంపాను.” వినయంగా అన్నాడు శంకరం.
ఊఁ! మీ ఫ్రెండుకి సహాయం చేద్దామని ఈ ప్రయత్నం... మంచిదే. ఇన్నాళ్ళు ఊరుకుని తన మరణానికి ముందు ఈ పనిచేయడంలో నాగరాజుకి, సత్యానికి మధ్య ఏదో ఘర్షణ ఉందని తెలుస్తూనే ఉంది. అయినా సత్యం చేసిన పనులు నిజంగా వెధవ పనులని ఎంక్వరీలో ఋజువైంది. కనుక శిక్షపడుతుంది. అది కోర్టు చూసుకుంటుంది. అయినా నాకు అన్ని వివరాలు తెలుసు కాని, ఏడాది దాటిన కేసుని తిరగదోడి నాగరాజు మరణాన్ని చర్చచేసి అతని భార్యా బిడ్డలను క్షోభలో పడెయ్యాలను కోవటం లేదు. తెలుసుకోవాలంటే ఇది పెద్ద విషయం కాదు. రెండురోజులలో అన్నీ బయటికి లాగగలను.” అన్నాడు సీరియస్గా.
శంకరం తలవంచుకు నిల్చున్నాడు భయం భయంగా “నువ్వు నీ పేరు ఊరు రాయకపోయినా నిన్ను పిలిపించ గలిగాను కదా! నాగరాజు ఫొటోస్టాట్లు పంపిస్తే, నువ్వు ఏకంగా ఒరిజినల్సే పంపించావు. అంటే క్లోజ్ ఫ్రెండ్ అయితే తప్ప ఇలా చెయ్యలేడు. నాగరాజు క్లోజ్ ఫ్రెండ్ ఎవరా? అని ఆరాతీస్తే నీ విషయం తెలిసింది. ఒకటే ఊరు, ఒకటే స్కూలు, ఒకటే డిపార్టుమెంటు, కొన్నాళ్ళపాటు ఒకటే స్టేషన్, మోరోవర్ నాగరాజు పేదసాదలకు సహాయంచేసేవాడని కూడా నా ఎంక్వయిరీలో తేలింది. ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు వెళ్ళు” అన్నాడు కసిరినట్టు.
శంకరం నెమ్మదిగా తల ఊపి నమస్కారం చేసి బయటికి నడవబోయాడు. ఊఁ! ఆ అమ్మాయి పేరేమిటి? లక్ష్మి కదూ! ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ళు, ఏడాదిలోపు బాబులు, ఇద్దరు.
డిపార్టుమెంటు వాళ్ళకే డిపార్టుమెంటు అంటే నమ్మకం లేకపోతే జనాలెలా నమ్ముతారయ్యా! ఈ కాగితాలతో ఎప్పుడోపెట్టి కేసు పెట్టాల్సింది.... యూస్ లెస్ ఫెలోస్! ఫో!” కసిరాడు.
శంకరం బయటికి వచ్చి గుండె నిమురుకుని గట్టిగా శ్వాసపీల్చుకున్నాడు. పులి నోట్లో తలపెట్టి తీసి బయటపడినట్లయింది.
ఇ.సి.కి అప్లై చేసారు. లింకు డాక్యుమెంట్లు ఫొటోస్టాట్ కాపీలు తీసుకున్నారు. కరెంటు బిల్లులు, హౌస్ టాక్సు బిల్లులు, వాటర్ బిల్లులు దొరికినంత వరకు అప్టు డేటుగా తీసుకున్నారు. ఎన్ని చేసినా డాక్యుమెంటు రైటరుని కలిసి పకడ్బందీగా రాయించి తరువాత లాయర్ ని కూడా సంప్రదించారు.
నెలలోపలే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు చేతిలోకి తీసుకుని లక్ష్మి భోరుమంది. నాగరాజు ఉండి ఉంటే ఇల్లు కొనుక్కున్న సంబరం ఎంత బాగుండేది. ఇప్పుడు దిక్కుమాలిన స్థితిలో... ఏడుపు ఆపుకోలేక పోయింది. వసంత వదినగారి భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా బయటకు తీసుకు వచ్చింది.
ఆడపిల్లకి ఆస్తివాటాగా ఏమయినా ఇవ్వాలా? అని లాయర్ని మొదటే అడిగింది లక్ష్మి, వాళ్ళ అమ్మగారు ఉండగానే ఆ అమ్మాయికి కొంత, మీ భర్తగారికి కొంతరాసి ఇచ్చేశారు కనుక ఏమీ అవసరం లేదన్నాడు లాయరు.
మంచి ముహూర్తం చూపించి వసంతని, భర్తని పీటలమీద కూర్చొని గృహప్రవేశం చేయించారు. చేస్తున్నంత సేపు వసంత కళ్ళు, లక్ష్మి కళ్ళు ధారాపాతమయ్యాయి. శంకరం కోప్పడ్డాడు. వాడికి ప్రాప్తంలేదు. శుభకార్యంలో కన్నీళ్ళు కూడదు, అంటూ దేవుడి పటాల పక్కన నాగరాజు కూడా దండ వేసుకు కూర్చున్నాడు.
లక్ష్మి బుజ్జిగాడి చేత దేవుళ్ళకు, దండం పెట్టిస్తూ “నాన్నకి కూడా దండం పెట్టమ్మా” అంది. పక్కనే ఉన్న పార్వతి చేతిలో ఉన్న పాప అప్పుడప్పుడే మాటలు వస్తుండటంతో నాన్న! నాన్న! అంటూ తనూ జేజి పెట్టింది. పార్వతి ఉలిక్కి పడింది.
వసంత కుటుంబంపై పోర్షన్లో అద్దెకుండేట్టు అనుకున్నారు. బయట ఇచ్చే అద్దేదో లక్ష్మికే ఇచ్చి ఒకళ్ళ కొకళ్ళు తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. లక్ష్మి వసంత భర్తకి దండం పెట్టింది. “అయ్యో! అక్కయ్య గారూ! ఆశీర్వదించవలసిన చేతులివి!” అంటూ అతను లక్ష్మి చేతులు పట్టుకున్నాడు.
లక్ష్మి, పిల్లల జీవితాలు ఒకగాడిలో పడ్డాయి.
ఇంటికొచ్చాక పాప దండం పెట్టడం గురించి పార్వతి ఆశ్చర్యపోయింది.
“ఇందులో వింతేముంది? దానికి వచ్చినవి నాలుగే పదాలు. అత్త, తాత, అమ్మ, నాన్న, పిల్లలు అనుకరిస్తారు. ఇలా అర్థం లేకుండా మాట్లాడకు. అసలు నీకు ఇలాంటి ఆలోచనలెలా వస్తాయి? అలాంటి ఆలోచన వచ్చిందంటే పాపని నీ కూతురని నువ్వు పూర్తిగా అనుకోవటం లేదని అర్థం” అంటూ శంకరం గట్టిగా కేకలేసాడు.
“ఏమన్నానని అంతలేసిమాటలు” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ పార్వతి వంటింట్లోకి వెళ్ళిపోయింది. పార్వతినయితే కోప్పడ్డాడు కాని శంకరం మనసు మనసులో లేదు. పసివాళ్ళ దిగులు దిగులుగా తిరుగుతున్న లక్ష్మిని చూస్తే నాగరాజు మీద పట్టరానికోపం వస్తోంది. సరోజకి చాలా అన్యాయం జరిగింది. క్రూరంగా హత్యచేయబడింది. ఐతే పోయినవాళ్ళ కోసం లక్ష్మిని, పసివాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలెయ్యాలా? పాపకి తాము ఆసరా ఉన్నారు. సరోజ నెవరూ తేలేరు. కొంచెమైనా కుటుంబము గురించి ఆలోచించకుండా ఇంత పనిచేస్తాడా?
అలా చేస్తాడనే ఊహే తనకు రాలేదు. ఏమాత్రం అనుమానం వచ్చినా కంటికి రెప్పలా కాచుకునేవాడు. అలా దిగులు దిగులుగా ఆలోచించుకుంటూ మంచంపై వాలాడు.
ఎట్టకేలకు సత్యానికి బెయిలు దొరికింది. దొరికిందే తడవుగా తమ ఊరెళ్ళి ఎస్.పి. ఆఫీసులో ఎవట్లో పట్టుకుని విషయం రాబట్టాడు. ఎలా తెలిసిందో తెలియదు కాని బాస్ ఈ కేసు స్వయంగా ఎస్.పి.గారే చూసారు. ఆయన దగ్గర నీకు సంబంధించిన ఫైలు పూర్తిగా ఉంది.
చావు కబురు చల్లగా చెప్పాడు వాడు.
అంటే నాగరాజే చచ్చేముందు ఇలా కసి తీర్చుకున్నాడన్న మాట. నాగరాజు పోయాక సత్యం లక్ష్మి ఇంట్లోనే పదిహేనురోజులపాటు ఉండిపోవడం రాజు రాసిన ఉత్తరం అతని దృష్టిలోకే రాలేదు.
వెంటనే చెల్లెలు దగ్గరకు వెళ్ళాడు.
లక్ష్మి అన్న గారికి బెయిలు దొరికినందుకు సంతోషించింది. పోన్లే! విడుదలయ్యావుగా. ఇంక దిక్కుమాలిన రాజకీయాలు మాని హాయిగా వ్యవసాయం చేసుకో! అంది.
“ఏమిటి చూసుకునేది? మీ ఆయన చచ్చి పగ సాధించాడుగా!” అన్నాడు విరుచుకుపడుతూ.
“ఏమిటంటున్నావు? ఆయనకు నీమీద పగేమిటి? చచ్చి సాధించడం ఏమిటి? ఒళ్ళు తెలుసే మాట్లాడుతున్నావా?” కోపంగా అంది.
“ఆఁ! ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నాను. వాడి భాగోతం బయటపెట్టేసరికి నా మీద కక్ష సాధించాడు” కసిగా అన్నాడు.
“మాటలు జాగ్రత్తగా రానీయి. ఏమిటలా వాడూ, వీడూ అంటూ. మనిషి ఎదురుగా లేడు అనా? మరింత కోపంగా అంది.
“నీ మొగుడేం శ్రీరామచంద్రుడు కాడు. వాడు ఒకదాన్ని ఉంచుకున్నాడు. వాడి భాషలో రెండో భార్య.... గారాల భార్య. తెలుసా! అది బయటపెట్టేనని నా మీద కక్షగట్టి ఇరికించాడు.”
“ఏం వాగుతున్నావు? నిజం చెప్పు. నేను నమ్మలేక పోతున్నాను.” కుర్చీలో కూలబడుతూ అంది. చెల్లెలు ముఖం చూసి సత్యం కొంచెం భయపడ్డాడు. జరిగేదేదో జరుగుతుంది. తను అనవసరంగా భయంలో, బాధలో వాగేసాడు.
ఏదో జరిగిందిలేమ్మా! నేను వార్నింగిచ్చి వదిలించేశాను అనునయంగా అన్నాడు. “నేను నమ్మను, ఆయన అలాంటివాడు కాడు. నీమీద కేసులు వచ్చేసరికి ఆయనని తిడుతూ, నిందలేస్తున్నావు?” అరిచింది.
“సరే! అలాగే అనుకో! వస్తానమ్మా!” వెళ్ళబోయాడు. “వెళ్ళడం కాదు. చనిపోయినవాడిమీద అంత నిందవేసి ఎలా వెడతావు ఋజువు చెయ్యి”
“వదిలెయ్యమన్నాగా! వదిలెయ్యమ్మా!” అనునయించబోయాడు. “నేను వదలను” మొండిగా అంది. “అయితే మీ ఆయన ఆప్తమిత్రుడు ఉన్నాడుగా ఆయన్నే అడుగు” “ఎవరు? శంకరం అన్నయ్యా!” ఆశ్చర్యంగా అంది. “ఆ శంకరాన్నే....... ఉండు నీ ఎదుటే తేలాలి.” పంతంగా అని శంకరానికి కాల్ చేసింది. శంకరం లిఫ్ట్ చేసి “స్టేషన్లో ఉనానమ్మా డ్యూటీలో ఏంకావాలి?” అన్నాడు చిన్నగా. “నీ డ్యూటీ అయిపోయాక ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా!” అంది. “అలాగయితే నాలుగు గంటలకొస్తాను” అన్నాడు. “ఆగు! సాయంత్రం నాలుగు గంటల కొస్తానన్నాడు. విషయం తేలేకే నువ్వు వెళ్ళేది.” అంది. “ఏమిటమ్మా చిన్న పిల్లలా! ఏదో వాగాననుకో! వదిలెయ్” అన్నాడు అనునయంగా. “నాకు అవతల పనులున్నాయమ్మా”! అన్నాడు.. “వెడుదువుగాని ఎంత రెండు మూడు గంటలు. వంట చేసాను అన్నం తిని పడుక్కో!” అంది. సత్యం చేసేదిలేక కూలపడ్డాడు. అన్నట్టుగానే సాయంత్రం శంకరం వచ్చాడు. “ఏమిటమ్మా! ఏదైనా అర్జంటు పనా!” అంటూ.
కాస్త టీ పెడతాను, తాగి మాట్లాడుకుందాం అంటూ ఐదు నిమిషాలలో ట్రేలో మూడు కప్పులుతో టీ తెచ్చింది.
అన్నయ్యా! నిజం చెప్పాలి నువ్వు. మా ఆయన ఎవతినో ఉంచుకొన్నాడా? పెళ్ళిచేసుకున్నాడా? అంది సూటిగా శంకరాన్ని చూస్తూ,
టీ తాగుతున్న శంకరం ఉలిక్కి పడ్డాడు. టీ తొణికి షర్టుపై పడింది. “ఏమిటమ్మా! ఆ మాటలు. ఎవరు చెప్పారు?” అన్నాడు ఓరగా సత్యం కేసి చూస్తూ. “ఎవరు చెప్తే ఎందుకు? ఉందా? లేదా?” సూటిగా అడిగాడు సత్యం. “ఉందని చెప్పిన వాళ్ళను ఆవిడను తీసుకొచ్చి చూపించమనమ్మా!” అన్నాడు తాపీగా.
“ఉందని తెలుసు. కాని ఎవరో ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసు” బింకంగా అన్నాడు సత్యం.
“ఆహా! నువ్వు చెప్పావా? ఇంకా ఎవరు చెప్పారో అనుకున్నాను. నువ్వయితే బాగా వివరంగా చెప్పి చూపించగలవే” అన్నాడు శంకరం వెటకారంగా.
“బాగుంది నేనెలా చెప్పగలను, ఎవరో అనుకుంటే విన్నాను.” “విన్నావా? చూశావా?” “ఇదేం పోలీసు స్టేషన్ కాదు. సరిగ్గా చెప్పండి” విసుగ్గా అంది లక్ష్మి, “నాకంటే బాగా మీ అన్నకే అన్ని విషయాలు తెలుసమ్మా! తెలుసుకో! నే వస్తాను” లేవబోయాడు. “వీల్లేదు, వీడేదేదో వాగుతున్నాడు. ఈ రోజు నాకు అసలు విషయం తెలియాల్సిందే! పంతంగా అంది
“మీ అన్నను అడుగమ్మా! నాకేం తెలుస్తుంది, చెప్పినవాడు అతనే గదా!” కూలబడ్డాడు మళ్ళీ. “ఏమిటన్నయ్యా! వేళాకోళానికి ఇది సమయం” కోపంగా అంది లక్ష్మి.
ఇలాంటి విషయాలలో వేళాకోళాలేమిటమ్మా!” “నాకు నిజం తెలియాలి. ఏం చెయ్య లేకపోయినా నాకెందుకో ఆరాటంగా అంది” లక్ష్మీ కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి.
“అలాగే! నిజమే కదా కావల్సింది” అంటూ చటుక్కున లేచి శంకరం సత్యాన్ని చాచి కొట్టాడు. “అన్నయ్యా! ఏమిటిది? లక్ష్మి అడ్డుకోబోయింది. “నువ్వు పక్కకు తప్పుకో”.
దొంగనా కొడకా! చేసిందంతా చేసేసి ఇప్పుడు వేషాలేస్తున్నావా? పోయినవాళ్ళు ఎలాగూపోయారు అని లక్ష్మి ముఖం చూసి తెలిసినా ఎవరో తెలియనట్టు ఇన్వెస్టిగేషన్ కి కేసు వదిలేశాను. నేను నా కంప్లైంటులో ఒక్క ముక్కరాస్తే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరయ్యేది. “శంకరంలోని పోలీసోడు బయటికి వచ్చాడు. బెల్ట్ తీసి బాదడం మొదలు పెట్టాడు.
సత్యం లబోదిబో మన్నాడు. లక్ష్మి అన్నయ్యా! అన్నయ్యా! అని అరుస్తూనే ఉంది.
“ఊఁ! ఇప్పుడు చెప్పు. లక్ష్మి కోసమని ఆగాము. ఇప్పుడు లక్ష్మికి నువ్వే చెప్పుకున్నావు కాబట్టి ముందు నువ్వు చేసిన వన్ని చెప్పు. అప్పుడు రింగులు రింగులుగా నేను ఫ్లాష్ బాక్ చెప్తాను” హేళనగా అన్నాడు అయినా కేసు లేదనుకుంటున్నావేమో! మా ఎస్.పి. ఆవలిస్తే పేగులు లెక్కపెడతాడు. తవ్వకాలలో ఇదీ బయటికి వస్తుంది. జీవితాంతం చిప్పకూడే”
“ఊఁ! చెప్పు. సరోజ నెవరు ఎందుకు చంపారో చెప్పు” హుంకరిస్తూ నిలబడ్డాడు.
“నాకేం తెలుసు, అసలు సరోజ ఎవరు?” తత్తరపడ్డాడు.
“నా ఇంట్లోనే ఉన్న నా చెల్లెలు, అన్నయ్యా! అన్నయ్యా అంటూ నన్ను నమ్మిన నా చెల్లెలు. నా రక్షణలో ఉంటే సరోజకు ప్రాణహాని ఉండదని నాగరాజు నమ్మిన నా చెల్లెలు” .... శంకరం కళ్ళు నిండుకున్నాయి.
“నేనెవరిని చంపలేదు”... బింకంగా అన్నాడు సత్యం. “సరే! అయితే రేపే నేను అరెస్టు వారెంటు తీసుకొచ్చి సెల్లో పడేసి కుమ్మిస్తాను, నిజాలు బయటికి అప్పుడే వస్తాయి.” ధర్డ్ డిగ్రీ పనిష్మెంట్! నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ దిగివచ్చి చెపుతుంది.” ఇదేదో తేలేక మాట్లాడుకుందామమ్మా!” శంకరం బయల్దేరపోయాడు.
“నన్ను క్షమించండి, నేనే సరోజని చంపించాను, నా చెల్లెలుకి అన్యాయం జరుగుతుందని... కాళ్ళమీద పడ్డాడు.
“తప్పు తెలుసుకుని ఎవరి జీవితమార్గంలో వాళ్ళు విడి విడిగా సుఖంగా బ్రతుకుతుంటే కథను మొదటికి తీసుకొచ్చిన వెధవవి నువ్వు. నువ్వు నాతోకాని, రాజుతో కాని మాట్లాడి విషయం తెలుసుకున్నావా? అసలా ప్రయత్నం చేసేవా? పైగా రాజుని బెదిరిస్తావా? నువ్వుచేసే వెధవ పనులు మాకు తెలియవనుకున్నావా? అన్నీ తెలుసు. కాని మన ఊరు కాదు, మన జ్యూరిష్డిక్షన్ కాదు. కంప్లైంట్ కూడా పెట్టనప్పు డెందుకులే అని ఊరుకున్నాము. ఒక బలహీన క్షణంలో రాజు చేసిన తప్పుకు ఇంత వేధింపా? వాడి కాలి గోటికి సరిపోదు నీ జీవితం. ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా గుండెల్లో కత్తిరింపేసావు కదరా! నువ్వు ఆ అమ్మాయిని తన్నినట్టు ఈడ్చు కెళ్ళినట్టు అన్నిటికి సాక్ష్యాలున్నాయి. ఎవరు అని కేసు పరిశీలిస్తూనే ఉన్నారు. క్లోజ్ చెయ్యలేదు.
నా కొడకా! ఇప్పటికే మూడు కేసులున్నాయి. ఇది నాలుగో కేసు అవుతుంది. ఆ అమ్మాయి నా ఇంట్లో ఉండి హత్యకు గురి అయింది కాబట్టి నా సాక్ష్యం బలమైనది తెలుసుకో!....
ఒక్క తన్ను తన్ని శంకరం బయటికి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇదంతా చూసి అవాక్కయి పోయింది. స్పృహ కోల్పోయినట్టయింది.
“నువ్వు.... నువ్వు.... ఒక అమ్మాయిని చంపేసావా? అందుకేనా బావ నీ అన్న నీడ పడనీయకు అన్నాడు. ఎందుకు చేసావు?” అంది తీవ్రంగా.
ఇంక నువ్వు అరిచి చెప్పక్కర్లేదు. నీ కోసమే .. భయం భయంగా అన్నాడు.
నాతో చెప్పాల్సింది, నేను నా భర్తతో మాట్లాడుకునేదాన్ని. అర్ధం అవుతోంది. అయితే ఆయనది ప్రమాదం కాదు. అంత ఘోరాన్ని చూడలేకపోయుంటాడు. ఆ చావుని గుండెల్లో అనుక్షణం మోయలేక, నాకు చెప్పలేక చనిపోయుంటాడు.
లక్ష్మికి గుండెలు పగిలేంత దుఃఖం వచ్చింది. ఏమూలో ఉన్న అనుమానం నిజమైనట్టు తెలిసింది. ఎంత బాధ కలగకపోతే నాగురించి పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకుని ఉ 0టాడు.
నేను మీ అన్నయ్య వచ్చేసరికి రక్తపు మడుగులో ఉంది. ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా పాపం పిచ్చి పిల్ల... ఎవరూ లేరు, మీరే నాకు పార్వతీ పరమేశ్వరులు వదినా! అనేది. ఏదో ఆడపిల్లని ఒకదాన్నీ ఎందుకు? అని మా ఇంట్లోనే ఒక గది ఇచ్చాము. మీ అన్నగారు, సరిగా విషయం తెలుసుకుని చంపకుండా ఉంటే బాగుండేది.
అన్నిటికీ చంపడాలూ, చావడాలే పద్దతి కాదు కదా వదినా! 'అనునయంగా అంది భర్త ఆ పని చెయ్యడం, అన్నిటికన్నా ముందు తన అన్న ఆ పిల్లని చంపెయ్యడం... జీర్ణించుకోలేక పోతోంది.
“క్షమించు లక్ష్మి, మీ అన్నయ్యకి విషయం తెలిసాక చక్కదిద్దడానికే ప్రయత్నించారు. నాకు అదే చెప్పారు. నేను చూసాను. మీ అన్నయ్య కొంచెం నిగ్రహంతో విషయం తెలుసుకుని ప్రవర్తించుంటే బాగుండేది. నాగరాజన్నయ్యకు నువ్వు అంటే ప్రేమ. కాని ప్రతివాడి మనసులో ఏదో ఒక బలహీన క్షణం ప్రవేశిస్తుంది. దాన్ని అంగీకరించక తప్పదు. వాళ్ళు తప్పు చేసారనుకుంటే ఆ తప్పుకు శిక్ష పడింది.
లక్ష్మి అప్పటికీ మాట్లాడలేదు. పిల్లలు మనకి ముఖ్యం. వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు. అనునయంగా అంది.
ఇంతలో బుజ్జిగాడు ఏడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. వాడి మూడు చక్రాల సైకిలు పక్కింటి పిల్లలాక్కుందిట. అందుకు వాడి ఏడుపు.
లక్ష్మికి ఒంటిమీద స్పృహ వచ్చింది.
వాణీ ఒళ్ళో కూర్చో పెట్టుకుని కళ్ళు, ముఖము తుడిచింది. మన సైకిలు నాన్నా అది. సరదాగా ఒకసారి తొక్కి ఆడుకుని ఇచ్చేస్తుంది. మన వస్తువు ఎవరు తీసుకుంటారు. అంటూ ఓదార్చింది.
ఇంతలో వసంత చంటాణ్ణి తెచ్చి వదినగారి ఒళ్ళో పడుకో బెట్టింది.
రావచ్చా! అంటూ వసంత భర్త లోపలికి వచ్చాడు. లక్ష్మి మంచం మీద సర్దుకు కూచుంది. పార్వతి కుర్చీ తెచ్చి వేసింది.
అక్కయ్య గారూ! మీరు అనుమతిస్తే వసంత మీ అరుగుమీద చిన్న ఫలహారాల బడ్డీ పెట్టుకుంటుంది. ఏమంటారు?” అన్నాడు.
వసంత, లక్ష్మి! అర్థం గానట్టు చూసారు. అతను వసంతకేసి అర్ధవంతంగా చూసాడు.
చాలాచోట్ల ఇలాంటి బళ్ళు చూసాక నాకు ఆలోచన వచ్చింది. పిల్లాడు పెద్దాడవుతున్నాడు. వాడికి స్కూలు ఫీజులు, పెద్ద చదువులు..... నాదా చిన్న ప్రైవేటు జాబ్. ఏదో వయసులో ఉండగానే నాలుగు డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుందనిపించింది.
అందరి రియాక్షన్ కోసం చూసాడు.
అవునవును మా చిట్టి తల్లికి కూడా చదువులు, పెళ్ళి.... అసలే ఆడపిల్ల తల్లినమ్మా! నేనూ చేరతాను. ఏమంటావు వసంతా!” అంది పార్వతి.
అక్క గార్ని కూడా కలుపుకుంటే ముగ్గురాడవాళ్ళు, చెయ్యలేనిదేముంటుంది? ఇంట్లో చెయ్యటం లేదు. పదిగంటల వరకు ఓన్లీ టిఫిన్ సెక్షన్, టీ, కాఫీ, మన ఇంట్లో పిల్లలకు ఫ్రీ, పెద్దవాళ్ళు మనం ఎవరు తిన్నా డబ్బాలో డబ్బు లెయ్యాల్సిందే!
ఇదుగో నా పెట్టుబడి ఐదువేలు. నా పెట్టుబడి తీర్చేసి ఖర్చులు పోను లాభాలు పంచుకోండి ఓ.కే.. అన్నాడు అతను ఐదువేలు లక్ష్మి దగ్గరగా మంచం మీద పెడుతుంది.
వసంత ముఖంలోకి ఆనందం వెల్లువలా వచ్చింది మంచి ఐడియా ఇచ్చారండి. మా మహాలక్ష్మి ఫలహారశాల చూసుకోండి... అంటూ భర్త చేతులు పట్టుకు ఊపేసింది.
వారంలో బోర్డు తెలిసింది. గుమ్మం జనంతో కళకళలాడింది. ఎవరికీ ఇప్పుడు దేని గురించి ఆలోచించే తీరికేలేదు.
ఎప్పుడో ఎవరో చెపితే తెలిసింది లక్ష్మికి సత్యానికి ఐదేళ్ళ జైలు శిక్ష పడిందని. జీవనది ప్రవహించడం ఆగదు. అడ్డువస్తే పక్కనుండైనా తన దారి తను చూసుకు ప్రవహిస్తూనే ఉంటుంది.
(అయిపొయింది)
No comments:
Post a Comment