ఉరికంబం - అచ్చంగా తెలుగు

 ఉరికంబం 

 డా.టేకుమళ్ళ వేంకటప్పయ్య 



"ఒరేయ్! దానన్నా! ఎంతసేపు అలా నాయన ఫొటో చూస్తూ నిలబడతావ్! వచ్చి అన్నం తిను"

"ఇవాళ ఎన్నో తేదీరా? ధర్మయ్యా!"

"పన్నెండు… అయితే?"

"నెల?"

"పన్నెండు - ఆ గుర్తొచ్చింది ఇవాళ నాయన పోయిన రోజు"

"అందుకే ఇవాళ పొద్దున్నే కామాక్షమ్మ దేవళంలో ఒక బ్రాహ్మడికి 500 రూపాయలిచ్చి నలుగురికి భోజనం పెట్టమని చెప్పి వస్తున్నా! ఇంకోటి చెప్పనా?"

"చెప్పు దానన్నా!"

"మన చిన్న తమ్ముడు జనార్ధన్ ఊరువదలి వెళ్ళి ఎల్లుండికి అంటే 15వ తేదీకి సరిగ్గా పదిహేనేళ్ళు అవుతున్నాది"

"నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ దానన్నా! అవును మనం పొలం పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాడు ఐదో తరగతి ఆర్నెల్ల పరీక్షలు వ్రాయకుండా సినిమాకు బోయినప్పుడు..చింత బరికెతో బాదావని…కోపగించి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఏమో!..."

"ఎక్కడో ఉంటాడు క్షేమంగా.. మనకే బాధ పెట్టిపోయాడు. ఇప్పుడు పాతికేళ్ళ వాడయి ఉంటాడు. ఆరోజుల్లో జిల్లా మొత్తం వెదికించాం. బస్సుల వెనకాల పోస్టర్లు అంటించాం. ఎక్కడికి బొయినాడో…. ఇంతవరకు జాడ లేదు. ఎప్పటికయినా వాణ్ణి చూడాలని ఉంది ధర్మా! ఒక్కసారి  ఇంకెప్పుడూ కొట్టనురా! అని వాడికి చెప్పాలని ఉందిరా!"

"ఆ యోగం ఉందో లేదో మనకు. వదిన గూడా సడన్‌గా మనల్ని ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళిపోయింది. తలుచుకుంటే బాధగా ఉంది"

"నాయన ఆరోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేయబట్టి నెల్లూరు సెంట్రల్ జైల్లో తలారి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నేను వ్యవసాయం జేస్తాను నాకు ఒద్దంటే ఆ ఉద్యోగం నీకిచ్చారు. తలారి పని చేస్తున్నావని పిల్లను గూడా ఈయకపాయె ఎవరూ నీకు. అదీ ఉద్యోగమే కదా! మనమేం కావాలని చంపుతున్నామా ఏందీ?"

"వదిలెయ్! దానన్నా! మన ఇద్దరం హాయిగా ఉన్నాం కదా! ఏ పనీ లేకుండా నెలకు 5 వేలు బ్యాంకులో పడుతున్నాయి ఆ జైలర్ దయవల్ల. నాయనిచ్చిన రెండెకరాలున్నాయి. ఇంకెందుకు దిగులు చెప్పు?"

"నీకు పెళ్ళీ పెటాకులు అవకపోతే బాధ గాదట్రా ధర్మా!"

"వదిలేయ్ దానన్నా! హాయిగా ఉన్నాను నాకేంది?"

"ఓరే ధర్మా! నీ ఫోనే మొగతా ఉంది చూడు ఈ టైంలో ఎవరో!"

పది నిముషాలు మాట్లాడి అన్నా! జైలర్ ఫోన్ జేశాడు. అర్జెంటుగా కలవాలంట! కోపంగా ఉన్నాడు.  నేంబోవాల నెల్లూరికి  ఇప్పుడే!"

"సరే అన్నం బాక్సులో పెట్టుకోనెళ్ళు. దార్లో బస్సులో అన్నా తిను. టైం ఒంటిగంట దాటింది"

"అట్టాగే అన్నా.. ఫోన్ జేస్తా నీకు"

***

"నెల నెలా ఫోన్ జెయ్యమంటే చెయ్యవా నువ్వు? డబ్బులు తేరగా తీసుకుంటున్నావు ఆ మాత్రం బుద్ధుండదా ధర్మయ్యా నీకు? నెల నెలా జీతం లేటయిమాత్రం ఫోన్ టంఛనుగా చేస్తావు" విసుక్కున్నాడు జైలర్.

మౌనం గా నిలుచున్నాడు.

"సరేలే … అర్జెంటుగా నువ్వు రాత్రి బండికి ఈరోజు రాజమండ్రి బోవాల! నెల్లూరు డి.ఎస్.పి దొర ఆర్డర్. మళ్ళీ నువ్వొచ్చేది ఎల్లుండి మధ్యాన్నమే!"

"అయ్యా! నాతో పనా ఆడ!"

"ఆ తలారులతో పనేముంటుంది ధర్మయ్యా! ఏదో ఉరి కేసు. అర్జెంట్ అట. పొలిటికల్ గొడవ కేసు. నీకు పాతికవేలిస్తారు.     ఈ వెయ్యి రూపాయలు తీసుకో. ఈ చీటీ అక్కడ సెంట్రల్ జైల్లో చూపీ. లోనకు బంపిస్తారు" అని చేతులో పెట్టాడు.

"అయ్యా! తప్పదా అయ్యా! రాజమండ్రి తలారి లేడాయ్యా?"

"లేడ్రా..ఆడు బొంబాయో..ఢిల్లీనో బొయ్యాడంట. ఆఖరుకు చర్లపల్లి తలారి కూడా కూతురు పెళ్ళని మొహo చాటేశాడట. తప్పదు మనకు"

"సర్లే అయ్యా! అట్నే! ఉంటానయ్యా!"

"రేయ్ ఆ చీటీ జాగ్రత్త పారేశావంటే నిన్ను లోనకు బంపరు"

"అట్నేలే అయ్యా.. ఉంటా! నెల్లూరు రైల్వే స్టేషనుకు జేరుకున్నాడు.

 ***

ఉదయాన్నే ఆటో దిగి సెంట్రల్ జైలు ముందు తలుపు తట్టాడు.

సెంట్రీ తలుపుతీసి ఎవరు కావాలన్నట్టు చూశాడు.

జేబులోంచీ లెటర్ తీసి ఇచ్చాడు. "లోపలకురా..జైలర్‌గారు చెప్పార్లే!" అని గేటు తీశాడు.

చాలా పెద్ద  జైలే అది. 1602 సం.లో డచ్ వారు రాజమండ్రిలో ఒక కోటను నిర్మించగా, బ్రిటిష్ వాళ్ళు 1864 సం. లో దీన్ని కేంద్ర జైలుగా మార్చేశారు. 196 ఎకరాలలో ఉన్న ఈ జైల్లో  భవనాలు 37.24 ఎకరాల్లో ఉన్నాయి. మొత్తం తిరగాలంటే రెండు గంటలు పట్టేట్టుంది.  దిక్కులు చూస్తున్న ధర్మయ్యను "మొహం కడుక్కున్నావా? నాష్టా కావాలా?" అన్న ప్రశ్నకు తలూపాడు.

లోనకు తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టించి కాఫీ ఇచ్చాక "ఇంతకుముందు ఎంతమందిని ఉరి తీశావు?" అన్నాడు. ధర్మయ్య నవ్వి ఊరుకున్నాడు జవాబు చెప్పలేదు. సెంట్రీ మళ్ళీ రెట్టించనూ లేదు.

ఇంతలో జైలర్ రావడంతో సెంట్రీ ధర్మయ్యను పరిచయం చేశాడు.  "లోనకురా! మాట్లాడాలి" అంటూ ఒక విశాలమైన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రకరకాల అలమారలున్నాయి. బహుశ: ఖైదీల బట్టలు పెట్టుకునేవి కావచ్చు.

"కూర్చో! అనుభవశాలివని చెప్పాడు నెల్లూరు జైలర్" అని నవ్వాడు.

ధర్మయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

"ధర్మయ్యా! రేపు నువ్వు ఉరి తీసే వ్యక్తి వయసులో చిన్నవాడైనా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. చిన్న బ్లేడ్ ముక్కతో..గుండు సూదితో కూడా మనుషులని చంపగలడు. పేరు జానీ…  క్రిస్టియన్లనుకుంటా!  హైదరాబాదులో కిరాయి తీసుకుని మనుషులను చంపుతుంటాడు. జానీని సాయంత్రం చూపిస్తాను.  మరీ దగ్గరకు వెళ్ళ్కు. వాడితో ప్రమాదం. ఈలోపు నువ్వు ఏర్పాట్లు చేసుకో! బరువు 70 కిలోలు. అక్కడే సిమెంట్ బస్తా..ఇంకా తూకం రాళ్ళు ఉన్నాయి. ఒకసారి ట్రెయిల్ చూసుకో!"

"సార్! ఆఖరి సారి ఎవరిని ఉరి తీశారు ఇక్కడ?"

"చెప్తా పదా!" అని ఆ రూముకు తీసుకుని వెళ్ళాడు.

అక్కడ బోర్డు చూడు. 1976లో నంబి కృష్ణప్ప అనే వ్యక్తిని ఉరితీశారు. ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసా? లడ్డూలు తినాలని ఉందన్నాడట. తినింతర్వాత ఉరి తీశారట! జానీ ఏమి కోరుతాడో..ముందే కనుక్కోవాలి" అని నవ్వాడు.

46 యేళ్ళయింది. కోర్టులు ఉరి శిక్షలు విధించినా.. ఆఖరి నిమిషంలో క్షమాభిక్ష ప్రసాదించిన ఘటనలు అనేకం. ఆఖరి నిమిషంలో యావజ్జీవ కారాగార ఖైదీలుగా మారుతున్నారు. చట్టంలోని లోటుపాట్లతో ఉరి నుంచి తప్పించుకుని జీవితాంతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. 

"జానీకి రాష్ట్రపతి క్షమాబిక్ష పెట్టలేదా సార్!" 

"నో.. వీడెంత నొటోరియస్సో తెలుసా! ఎంతమందిని చంపాడో లెక్కలేదు. ఆర్నెల్ల క్రితం, హైదరాబాదులో ఒక జడ్జిని, అడ్డొచ్చిన ఆరుమంది కుటుంబ సభ్యులను కూడా లేపేశాడు. పాతిక మంది  పోలీసులు మూణ్ణెల్లు  వలవేసి, గాలించి గాలించి పట్టుకున్నారు వీడిని. మహా ప్రమాదం. “

"వినడానికే భయంగా ఉంది సార్!"

"అవును. మేమూ వాడితో చాలా జాగ్రత్తగా ఉన్నాం"

" ఉరి తాడు తెప్పించారా?"

"ఆ.. తెప్పించాం. ఖైదీ వచ్చినరోజే బక్సర్‌కు ఆర్డర్ పెడితే పది రోజుల క్రితం వచ్చింది. భారత ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఉరి తాళ్ల తయారీపై దేశంలో నిషేధం ఉంది. ఎక్కడంటే అక్కడ చేయకూడదు కదా! బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచీ ఒక్క బీహార్లోని బక్సర్ సెంట్రల్ జైలులో మాత్రమే దాన్ని చేస్తారు.

"సార్! ఉరితాళ్ల తయారీ యంత్రాన్ని బ్రిటీష్ పాలకులు బీహార్లో మాత్రమే ఎందుకు పెట్టారు? మిగతా చోట్ల కూడా పెట్టొచ్చుకదా!"

"అందుకు జవాబు బ్రిటీష్ వాళ్ళే చెప్పాలి. నాకైతే  తెలిసినంతవరకూ ఈ నిర్ణయం వెనుక వాతావరణ పరిస్థితులకు ముఖ్య పాత్ర ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఉరి తీసేందుకు ఉపయోగించే తాడు చాలా మృదువుగా ఉంటుంది. ఇందుకోసం చాలా మృదువైన నూలును వాడాల్సి ఉంటుంది. బక్సర్ జైలు గంగా నది ఒడ్డున ఉంది కాబట్టి అక్కడే ఆ యంత్రం పెట్టి ఉంటారు. అయితే, ఇప్పుడు నూలును మృదువుగా మార్చే అవసరం లేకుండా పోయింది. రెడీమేడ్‌గా ఉన్న నూలు అన్నిచోట్లా వస్తున్నా..ఇంకా ఉరితాడు మాత్రం అక్కణ్ణీంచే వస్తోంది" అన్నాడు.

బక్సర్ జైల్ సూపరింటెండెంట్ అరోరాతో మాట్లాడాను. ఒక్కో ఉరితాడుకు రెండువేలవుతుందట. మళ్ళీ కొరియర్ చార్జీలు. అవీ ఇవీ తడిసి మోపెడు. ఉరితాడు తయారీ కోసం జే34 అనే నూలును వాడతారని, గతంలో ప్రత్యేకంగా నూలును పంజాబ్ నుంచి తెప్పించేవారని, ఇప్పుడు ఇతర సప్లయర్స్ నుంచి వస్తోందని చెప్తూ.. తాడును చేయడం ఎక్కువగా చేత్తో చేసే పనేనట. దారాలను తాడులా అల్లేందుకు మాత్రమే యంత్రం పనిచేస్తుంది. మొదట 154 నూలు దారపు పోగులుండే ఉండలను తయారు చేస్తారు. ఇలాంటివి ఆరు ఉపయోగించి, 16 అడుగల పొడవుండే తాడును అల్లుతారు. తాడు తయారీలోని చివరి దశ మొత్తం ప్రక్రియలో అన్నింటి కన్నా ముఖ్యమైందని ఆయన చెప్పాడు. ఉరి తాడు వల్ల ఎలాంటి గాయాలూ కాకూడదని, కేవలం ప్రాణం మాత్రమే పోవాలని నియమనిబంధనలు ఉన్నాయి. ఆరూంలో అలమారలో ఉంది. జాగ్రత్తగా ట్రైల్ వేసుకో!" అని జైలర్  వెళ్ళిపోయాడు. ఈ ఉరితాడుకు ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతూ తన పనిలోకి దిగాడు.

 ***      

"ట్రెయిల్ సరిగ్గా ఉందా? లీవర్ సరిగ్గా పనిచేస్తోందా? గ్రీజు వేయించావా? " అన్న జైలర్ ప్రశ్నలకు అన్నీ బాగున్నాయి సార్" అన్నాడు ధర్మయ్య.

"రేపు ఉదయం 5.30 నుండి 6 లోపు ఉరి తియ్యాలి. మనం ఒకసారి ఖైదీ దగ్గరకు వెళ్ళి వద్దాం పదా! అని నలుగురు సాయుధ సైనికులను వెంట తీసుకుని లోనకు వెళ్ళారు. విశాలమైన గదులు.

ఒక గది ముందు ఆగారు.  అందరూ లోనకు ప్రవేశించారు. లోపల ఒక యువకుడు నడిమ పాపిటతో గడ్డం మీసాలతో ఉన్నాడు. మెడలో శిలువ దండ వేలాడుతోంది.  ధర్మయ్య కొంచెం వెనగ్గా నిలబడి గమనిస్తున్నాడు.

"నేనేం భయపడడంలేదు… ఇన్స్పెక్టర్! రేపేనా నా ఉరి" అని నవ్వాడు. ధర్మయ్యను జానీకి పరిచయం చేశాడు జైలర్. ధర్మయ్య "నీ మీద నాకేం పగలేదు. నువ్వు నా శతృవు కాదు. నా వృత్తి ధర్మం" అన్నాడు తలవంచుకుని సూటిగా అతని కళ్ళలోకి చూడలేక.  ఐదునిముషాల అనంతరం.. ఇన్స్‌పెక్టరుతో జానీ  "మీతో ఒక విషయం చెప్పాలి".

"చెప్పు జానీ!"

"ధర్మయ్యను బయటికి పంపండి" అన్నాడు. జైలర్ కొంచెం ధైర్యం తెచ్చుకుని గన్-మెన్‌లను కూడా బయటికి వెళ్ళమని చేతిలో రివాల్వరు పట్టుకుని "చెప్పు జానీ!" అన్నాడు. "భయపడకండి!  నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇవాళ. హాయిగా చావాలనుకుంటున్నాను. ఎందుకంటే... అని జానీ చెప్పిన మాటలు విన్నాక…  "అలాగే! జానీ…. నీ చివరి కోరిక తప్పనిసరిగా తీరుస్తాను" బి హాపీ జానీ..సారీ.. క్షమా బిక్ష రాలేదు. రేపు ఉదయం 5 గంటలకు డాక్టరు వచ్చే వేళకు  స్నానంచేసి తయారుగా ఉండు! "

"నాకు తెలుసు సార్! క్షమా బిక్ష వచ్చే తప్పులా నేను చేసింది?" అని నవ్వాడు.

చనిపోయే ముందు రోజుకూడా అతని గుండె ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు అంతా. 

"సార్! చివరికోరిక ఏమిటట?  నన్నెందుకు బయటకు బొమ్మన్నాడు జానీ.. అన్న ధర్మయ్య ప్రశ్నకు..సూటిగా ధర్మయ్య వేపు చూసి...కళ్ళు క్రిందికి దించుకుని "సారీ… ధర్మయ్యా!  ముందు చెప్పవద్దని  జానీ కోరిక.  రేపు ఉదయం చెప్తానులే!" అన్నాడు.

***

         ఉదయం నాలుగున్నరకే జైలర్ డాక్టరును తీసుకుని వచ్చాడు. చేతిలో ఉన్న పొట్లం టేబులు మీద పెట్టాడు.  కాఫీలు త్రాగారు. టైం ఐదు కాగానే నలుగురు గన్‌మెన్లను వెంటపెట్టుకుని జానీ రూముకు వెళ్తూ ధర్మయ్యను చూసి "నువ్వు తయారుగా ఉండు! ఒక అరగంట అంతే! ఐదున్నరకు అమలు చెయ్యాలి. నువ్వు ఆ రూముకు వెళ్ళి సిద్ధంగా ఉండు!" అని పంపేసి డాక్టరుతో నడుస్తూ జైలరు అతని చెవిలో చిన్నగా  చెప్పిన మాటలకు " హయ్యో! అవునా! నోటిమీద చెయ్యి పెట్టుకున్నాడు.

ముందు ఇద్దరూ వెనుక ఇద్దరూ గన్‌మెన్స్ నడుస్తుండగా బయటికి తీసుకుని వచ్చారు జానీని. అంతా ఉరి తీసే రూంలోకి ప్రవేశించారు.

"ధర్మయ్యా! అంతా రెడీనా?"

"యెస్ సార్!"

"ఇదుగో! ధర్మయ్యా! ఈ పొట్లంలో ఉన్నది జానీ చేత తినిపించు" అన్నాడు.

"అతనేమన్నా చిన్న పిల్లాడా సార్? ఇవ్వండి తింటాడు" అన్నాడు. త్వరగా తంతు ముగించుకుని నెల్లూరికి రైలు ఎక్కాలన్న ధ్యాసతో ధర్మయ్య.

"ధర్మయ్యా! నువ్వూ జానీ ఆ కుర్చీల్లో కూర్చోండి" అన్నాడు.

అలాగే అని కూర్చున్నారు. ధర్మయ్యకు ఏమీ అర్ధం కావడంలేదు.

"ఈపొట్లంలో ఉన్న పెరుగన్నం కలిపి అతని నోట్లో పెట్టు. ఇదే అతని ఆఖరు కోరిక!"

"నన్ను పెట్టమంటున్నారా?"

"అవును! నువ్వే పెట్టాలని అన్నాడు"

ముద్దలు నోట్లో పెడుతూ..నన్ను క్షమించమని మరోసారి కోరుకుంటున్నాను." అనగానే.."ధర్మన్నా! ఊరుకో! పెద్దన్న దానన్నను క్షమించమని మరీ మరీ కోరానని చెప్పు. చనిపోయే ముందు స్వంత అన్న చేతి అన్నం తినే అదృష్టం దక్కిందన్నానని చెప్పు"   అని వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు. అంతే! అక్కడ అంతా నిశ్శబ్దం.

బాబూ …జనార్ధన్!  నువ్వా! అని ఒక్క కేక పెట్టాడు ధర్మయ్య. ఇద్దరూ కౌగలించుకుని పెద్దగా ఏడ్చారు.

"సార్! ఈ పని మీరెవరైనా చెయ్యండి. స్వంత తమ్ముడికి ఉరి వెయ్యలేను సార్..సారీ.."అంటూ కాళ్ళమీద పడ్డాడు.

తప్పదు ధర్మయ్యా! ఇది నీ వృత్తి అంటూ పదినిముషాలు బోధపరచాడు.

జనార్ధన్ "అన్నా! నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. తప్పదు" అంటూ ఉరితాడు మెడకు తగిలించుకుని నిలబడ్డాడు. బలవంతంగా లేచి లీవరును లాగబోతూ సొమ్మసిల్లి పడిపోయాడు. జైలర్..జానీ..నన్ను క్షమించు!" అని లీవర్ లాగేశాడు.

అరగంట అనంతరం ధర్మయ్య లేచి ఏడుస్తూ…ఉరికొయ్యకు వేలాడుతున్న జానీ శవాన్ని పట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు.  నెల్లూరు జైలరుకు జరిగింది చెప్పి అతని శవాన్ని ఒక ప్రత్యేక అంబులెన్సులో జొన్నవాడ పంపేందుకు సిద్ధం చేశాడు. 

***

         అంబులెన్సు జొన్నవాడ వేపు సాగిపోతోంది. అన్న ఇక్కడికి వచ్చే ముందురోజు "నేను పోయేలోపు ఎప్పటికయినా వాణ్ణి చూడాలని ఉంది ధర్మా! ఒక్కసారి  ఇంకెప్పుడూ కొట్టనురా! అని చెప్పాలని ఉందిరా!"  అన్న మాటలు ధర్మయ్యకు చెవుల్లో మార్మోగుతున్నాయి.  “అవును పెద్దన్న చేత ఆ మాట చెప్పించాలి” అప్పుడే జనార్ధన్ ఆత్మకు శాంతి!.

***

 

No comments:

Post a Comment

Pages