మానసవీణ - 34 - అచ్చంగా తెలుగు

 మానసవీణ - 34 

రచన :ఘాలి లలిత ప్రవల్లిక

9603274351


అసలీ గ్రామం లోని ముసుగు మనుషులు ఎవరు ?

మానస ను ఎందుకు వెంబడిస్తున్నారు ?

విద్యార్థులను చదవనివ్వకుండా చేస్తున్న శక్తులు ఏవి ?

మానస వాటిని ఎదుర్కోగలదా ?

ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న అనిరుద్ద్ కు దినేష్ గుర్తుకొచ్చాడు. ఎస్ ఈ విషయం దినేష్ కి చెప్పాలి నేను నిర్ణయించుకుని దినేష్ కి ఫోన్ చేసి చెప్పాడు.

***

ప్రయాణ సౌకర్యాలు అంతగా లేకపోయినా పచ్చని మొక్కలతో, రకరకాల పూలతో స్వాగతం పలికే ఆ గూడెంలో పట్టుమని పాతిక కుటుంబాలు కూడా లేవు. వారంతా అడవికిపోయి కరక్కాయలు, కుంకుండుకాయలు, లాంటివి తెచ్చుకుని సంతలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ గుడెసెల మధ్య ఉన్నది ఒకే ఒక డాబా ఇల్లు .ఆ ఇల్లు అప్పలనాయుడు ది. కుటుంబం అంతా పట్నంలోనే ఉండేది. గిరిజనులతో పని పడ్డప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఈతని చేతికింద మెరికల్లాంటి గూడెపు వీరులు పది మంది ఉన్నారు. అప్పలనాయుడు ఇచ్చే తెల్లచుట్ట అంటే వాళ్లకు చాలా ఇష్టం. అది కాలిస్తే స్వర్గలోకం వీళ్ళ ముందుకు వచ్చేసిందా !?! అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు దొరతాగగా మిగిలిన సీసాలో సరుకు కూడా పోస్తూ ఉంటాడు. వాటి కోసం ఆ దొర ఏం చెప్తే అది చేసేస్తారు.

పొట్టిగా నల్లగా లావుగా బుర్ర మీసాలతో ఉన్న అప్పలనాయుడు చక్రాలు ఉన్న పెద్ద టేకు కుర్చీలో  కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా ఓ నలుగురు గిరిజన యువకులు చేతులు కట్టుకుని నుంచొని ఉన్నారు.

"ఏడరా? ఆ పంతులమ్మ? ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చినారు?" కోపంతో అరుస్తున్నాడు అప్పలనాయుడు.

"అట్టుకొచ్చే టైంకి ఆడెవడో గద్దలా గొచ్చి తన్నుకు పోశాడు దొరా !" తలదించుకుని చెప్పారు ఆ యువకులు.

    "సవట మాటలు మాట్లాడబోకండి. ఓ ఆడ మనిషిని తీసుకు రాలేరా? ఎదవ ల్లారా! బూటకాలాడుతున్నారు బూటు కాలితో తన్నినానంటి గూడెం అవతల పడతారు." కోపంతో రెచ్చిపోయి అరుస్తున్నాడు అప్పలనాయుడు.

మన్నింపులు దొరా సత్తె పమాణికం. ఆడెవడో మోటారు బండి మీదొచ్చి అట్టుకుపోనాడు."అంటూ నెత్తిమీద చేతులేసుకుని చెప్పారు వాళ్ళు.

"రి సర్లే... భయానికి ఇక ఈ గూడెం వంక కన్నెత్తి చూడదు. మళ్లీ గనుక వచ్చిందో వదిలి పెట్టకండి. అర్దమయ్యిందా ?" హూంకరిస్తూ  చెప్పాడు అప్పలనాయుడు.

"అలాగేదొర" అంటూ తలూపారు వాళ్ళు.

"రేపు పొద్దున్నే కొండవతల భూమి దగ్గరకు రండి. ఆకులు కోయాలి." చెప్పాడు అప్పలనాయుడు.

"అట్నేదొర" అన్నారు వాళ్ళు.

"ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.ఏర్పాట్లు చూడండి." అని చెప్పి వారి చేతికి ఓసీసా ఇచ్చాడు.

"అట్నే దొరా" అని వంగి దండం పెట్టి అక్కడ నుంచి బయలుదేరారు వాళ్ళు.

"లేడి కూనకూరైతే ఎట్టేగలము గాని. ఈదొరకు ఈ రోజు ఏ గుంటనట్టుకు రావాలిరా?" అనుమానంగా అడిగాడు వారిలో ఒకడు.

"ఆ సూరి గాడి బొట్టె దానీయాల వప్పజెప్పేద్దాం" అన్నాడు వారిలో ఇంకొకడు.

"అది ఐపోనాది గందా! ఏటి మర్సిపోనావేటి?" అన్నాడు వారిలో ఒకడు.

"వయసు కొచ్చిన గుంటలందరూ ఐపోనారు. మరి ఏర్నప్పసెప్పాలి?చిరాగ్గా అన్నాడు ఒకడు.

"ఓపని సేద్దామేటి? ఆ ఈరి మామ బొట్టె నట్టుకుపోదాం" సలహా ఇస్తున్నట్లుగా అన్నాడు మొదటివాడు.

"ఏది ఆ ఎల్లమ్మనా! అది ఈడేరలేదు కదా! అది పుట్టి ఆరేళ్ళన్నా కాలేదు వద్దోరే. ఇంకేర్నన్నా సూద్దాం" అన్నాడు రెండోవాడు.

"ఇంకేరున్నారు. పాతాళ్ళను దొరా ముట్టడు కదా !?!" అన్నాడు మూడోవాడు.

"సరే సీకటేళ సూద్దాంలే ఎరోకర్ని. ఇక ఆపేసేయండి గూడెపోళ్ళొస్తున్నారు" అంటూ హెచ్చరించాడు నాలుగో వాడు.

***

ఎలాగైనా ఈరోజు మానసతో మాట్లాడి తన దగ్గరే ఉంచేసుకోవాలనుకున్న రఘు రామ్ కు కృషీవలరావు నుంచి ఫోన్ వచ్చింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages