పాముల పాపన్న - అచ్చంగా తెలుగు

 పాముల పాపన్న

(మా జొన్నవాడ కథలు)

-డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


"ఏమయ్యోవ్... లోపల నీ ఫోను అదేపనిగా మొగతా ఉండాది..కాస్తా చూస్కో" అని భార్య చెప్పడంతో పాపన్న ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తాడు. అవతలి వాళ్ళు చెప్పింది విని, గబ గబా బయటకొచ్చి "కరణంగారింట్లో పామొచ్చిందంట. అంతా తెగ బయపడతా ఉండారు. మళ్ళీ ఒక అరగంటలో వచ్చేస్తా.." అని పంగాలు కర్రా, గోతాం సంచీ తీసుకుని సైకిలెక్కి బయల్దేరాడు పాపన్న.

పాపన్న కరణంగారింటికి చేరేసరికి అంతా బయట నిలబడి చూస్తూ ఉన్నారు. పాపన్న కనబడగానే ప్రాణం లేచొచ్చింది వాళ్ళకు. “రా..రా.. పాపన్నా.. ఆ వంటింట్లోకి పో.. పెద్ద పామంట. ఇంత బారుందంట" అని కరణంగారు చెప్పంగానే లోనకు వెళ్ళాడు. పిల్లాలూ పెద్దలూ పది, పదిహేను మంది దాకా పోగయ్యారక్కడ. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

కరణంగారి వంటిల్లు పూరిల్లు కావడంతో కర్రతో అక్కడా ఇక్కడా పొడుస్తుంటే జర్రున చూరులోకి జారుకుంటోంది. ఆరడుగుల పైనుంది. తెల్లగా ఉంది. మొదట్లో కుబుసం వల్ల అలా తెల్లగా ఉందనుకున్నాడు గానీ పది నిముషాలు దానితో యుద్ధం చేసింతర్వాత అది నిజంగానే శ్వేతనాగని తేలింది. పిల్లలు వంటింట్లోకి కిటికీల ద్వారా తొంగి తొంగి చూస్తున్నారు. అరగంటసేపు తంటాలు పడితే కానీ, దాని మందల అర్ధంకాలేదు. జర్రున నూనె కట్టెడ లాగా జారిపోతోంది. అప్పుడప్పుడూ ఏదో ద్రవం లాంటిది పైకి చిమ్ముతోంది. తుమ్మ బంకలాగా ఉండలుండలుగా ఉంది. భయంకరమైన కంపు. ముక్కుకు గుడ్డ కట్టుకుని మొత్తానికి పట్టుకుని గోతాంలో దూర్చి బయటికి వచ్చాడు. బయటకు రాగానే పిల్లలంతా పెద్దగా చప్పట్లు కొట్టారు. కరణం "పాపన్నంటే పాపన్నే! తిరుగులేదు" అని జేబులోంచి ఐదువందల నోటు తీసి ఇచ్చేసరికి పాపన్న కళ్ళు ఆనందంతో మెరిశాయి. పొద్దుణ్ణుంచీ ఇంతవరకూ కాఫీనీళ్ళు కూడా తాగలేదు పాపన్నా! అందరం భయపడి ఛస్తూ ఉన్నాము. ఇంకేం భయంలేదుగదా!" అనగానే “ఇంకేమీ లేవయ్యా! హాయిగా ఉండండి" అని గోతాం సైకిలు మీద పెట్టుకుని పంగాలు కర్ర భుజం మీద వేసుకుని బయలుదేరాడు.

తెల్లనాగుపామును చూడ్డం పాపన్నకు ఇదే మొదటిసారి. జొన్నవాడలో కొన్ని వందల పాములను ఐదు నిముషాల్లో పట్టుకున్నాడు. ఈ పామే ఇంత సతాయించింది. ఊరిచివర చిన్న కొండలా ఉన్న ప్రాంతానికి చేరాడు. గోతాం ముడి విప్పి క్రింద పడేశాడు. కానీ పాము బయటికి రాకపోయేసరికి పంగాలు కర్ర లోపలబెట్టి పొడిచేసరికి ఒక్కసారి బుస్సుమని బయటకొచ్చింది. పడగెత్తి మూడడుగులు పైకి లేచి, నాలుక ఆడిస్తూ నిలబడింది. ఒక్కసారి పాపన్నను నిశితంగా పది సెకన్లు చూసి పొదల్లోకి జారుకుంది. పాపన్న మొదటిసారి  పామును చూసి భయపడ్డాడు. కాళ్ళు భూమిలోకి దిగబడ్డట్టు అనిపించింది.

సైకిలెక్కాగానే గతం గుర్తుకొచ్చింది. తను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు జరిగిందా సంఘటన.  నాయనతో కలిసి కొండబిట్రగుంట తిర్నాళ్ళకు పొయినప్పుడు, అంగళ్ళు చూస్తూ చూస్తూ..నాయన చేయి వదిలేసాడు. ఎంత వెతికినా నాయన కనపళ్ళేదు. మైకు దగ్గర చెప్పించినా నాయన జాడ లేదు. ఏడుస్తూ అక్కడ తిరుగుతూ ఉంటే ఒక సాధువు కనిపించాడు. ఆయనకు ఎనభై యేళ్ళు ఉంటాయి. దేహమంతా ముడుతలు పడింది. తన్ను దగ్గరకు పిలిచి విషయం అడిగి "మాది నరసిమ్ముల కొండ. మీ ఊరు పక్కన్నే.. జొన్నవాడకు నేను తీసుకుని పోతాను. భయపడకు" అని ఓదార్చాడు. ఒక పెద్ద మండపం మీదకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఒక పొట్లంలో ఉన్న అన్నం కలిపి పెట్టాడు. "పెద్దయిన తర్వాత ఏంపని చేస్తావు?" అని అడిగాడు. "మానాయన పొలంకాడ పని.. నేనూ పెద్దయింతర్వార్త అదే చేయ్యాల. బళ్ళో అయివార్లు నీకు చదువురాదు. మానెయ్ అన్నారు" అని జవాబివ్వగానే..ఆయన నవ్వి "నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. అది రోజూ మనసులో అనుకుంటూ ఉండు. కావాలంటే కాగితం మీద రాసుకో. ఎవ్వరికీ చెప్పొద్దు. పొద్దున్నే స్నానం చేసింతర్వాత దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుని పది సార్లు చదువుకో. నీకు పాములను పట్టుకునే శక్తి వస్తుంది. పాములు నిన్నేమీ చేయలేవు" అనగానే "అమ్మో! చిన్నప్పటినుంచీ పాములంటే  చచ్చే బయం నాకు. ఒకసారి నాయనతో బాటూ చేలోకి పోతే గనిమల మీద పామొచ్చింది. అది చూసి నాకు వారం రోజులు జరం. అప్పటినుండి చేలోకి పోతే ఒట్టు!" అన్న మాట విని "అదంతా చిన్నప్పుడు. ఇప్పుడు అలా జరిగే ప్రసక్తే లేదు" అని నాతో ఆ మంత్రం కనీసం పాతికసార్లు చెప్పించాడు . నాకు నోటికి వచ్చేసింది. "భేష్! ఇక నీ పేరు పాముల పాపన్నగా మారుతుంది" అని చెప్పి ఇద్దరం బస్సులో ఎక్కి జొన్నవాడలో  దిగాం. ఆయన "మీ ఇళ్ళు ఎక్కడో నీకు తెలుసా!" అనగానే "ఓ!" అన్నాను. బస్సు వెళ్ళిపోయింది. ఆయనను మా ఇంటికి తీసుకుపోదామని  తిరిగిచూస్తే, ఆయన జాడలేదు.

బడిమానేసి ఆపన్లూ యీపన్లూ చేస్తూ ఉండగా, నాయన హటాత్తుగా చనిపోయాడు. నేను సాధువు చెప్పిన మంత్రం మాత్రం రోజూ ఏదో ఒక టైంలో చదువుతూనే ఉండేవాడిని. నాకు పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి చేసి తనూ నాయన్ను  చేరుకుంది  అమ్మ.   రోజు కూలీ ఐదువందలు తెస్తేగానీ ఇల్లు గడవదని భార్య సతాయించటంతో వెళ్ళకతప్పలేదు.

ఒకరోజు పొలానికి ప్రక్కనే ఉన్నఅఱటి తోటలో పెద్ద త్రాచుపాము  వచ్చింది. అందరూ హడలెత్తి పరుగులు తీస్తున్నారు. సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఒక్కణ్ణే తోటలోకి బయల్దేరాను. "ఒరే పాపిగా పోమాకు. ప్రమాదం" అని అందరూ అరుస్తున్నా, ప్రాణాలకు తెగించి వెళ్ళాను. సాహసించి ఒంటిచేత్తో పామును పట్టుకుని బయటికి వచ్చాను. అందరూ ఆశ్చర్యపోయారు. చిన్నప్పుడు నీళ్ళ పామును చూసి జ్వరం తెచ్చుకున్న పాపడేనా నువ్వు? అని బిత్తరపోయారు జనం. ఆరోజునుండి జొన్నవాడ చుట్టుప్రక్కల గ్రామాల్లో నా పేరు పాముల పాపన్నగా  మోత మోగి పోయింది. అలా ఆలోచిస్తూ ఉండగానే తెలీకుండానే ఇంటికి చేరుకున్నాను.. భార్య మామూలుగానే పామును పట్టుకుని వచ్చిన రోజు దిష్టితీస్తుంది. దిష్టి తీసి, అలాగే జేబులో ఉన్న ఐదొందలు లాగేసుకుంది.

ఆరోజు రాత్రి లోపల ఉమ్మదం వల్ల చెమటతో తడిసిపోతూ నిద్రపట్టడం లేదని వరండాలో ఉన్న నులకమంచంపై నడుంవాల్చి వళ్ళు తెలీని నిద్రపోయాను. అర్ధరాత్రి ఒంటిగంటయిందన్నట్టు, లిక్కర్ ఫాక్టరీలో సైరన్ మ్రోగింది. అలవాటుగా లఘుశంకకు వెళ్ళాలనుకున్న నేను మంచం దిగబోతూ ఎందుకో క్రింద చూశాను. వీధిలైటు వెలుగు వరండాలో పడుతోంది.  ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. మంచానికి ఐదు అడుగుల దూరంలో మూడు నాగుపాములు చుట్టలు చుట్టుకుని పడగలెత్తి నా వేపు చూస్తున్నాయి. శరీరం ఒణికింది. ఏనాడూ ఇలా జరగలేదు. సాధువు చెప్పిన మంత్రాన్నే చదువుకుంటూ తెల్లవారేదాకా గడిపాను.

ఆరోజు దార్లో, వీధిలో, పొలంలో ఎక్కడ పడితే అక్కడ పాములు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఏమయిందో అర్ధం కాలేదు. పొలానికి వెళ్ళినవాడిని వంట్లో బాగోలేదని చెప్పి సైకిలెక్కి ములుమూడి ప్రక్క ఊరిచివర ఉన్న నాగేంద్రస్వామి ఆలయానికి చేరుకున్నాను. అక్కడ పెద్ద పుట్ట. నాగ ప్రతిష్టలు అక్కడే చేస్తుంటారు. మహిమాన్వితమైన ప్రదేశం.  అక్కడి పూజారి ఒక ముసలి స్వామీజీ. ప్రక్కనే ఉన్న ఆశ్రమంలో తనకు ఊహ తెలిసినప్పటినుంచీ ఉన్నాడు.   స్వామీజీ వెళ్ళేసరికి ధ్యానంలో ఉన్నాడు. ఒక అరగంట తర్వాత కళ్ళు తెరిచాడు. తను "స్వామీ.." అంటూ విషయం చెప్పబోతూ ఉండగానే "ఊ..అర్ధమయింది. ఏమీ చెప్పకు. ఇక పాములు పట్టడం ఆపెయ్! నీ ప్రాణానికి ప్రమాదం సంభవించే సమయం ఆసన్నమయింది" అన్నాడు. మళ్ళీ స్వామీ! అనగానే అడ్డుకుని "నీకు పాము మంత్రం ఉపదేశం ఉంది కానీ..ఈరోజు నుంచీ మానెయ్. నీమీదకు ఏ పామూ రాదు" అని  ఆకుపచ్చ పొడి పొట్లాం ఒకటి చేతికిచ్చి, "దీనితో పెన్నా నదిలో అభ్యంగన స్నానం చెయ్యి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక నువ్వు వెళ్ళు. నాకు జపానికి వేళయింది" అన్నాడు.  

ఒక నెలరోజుల అనంతరం జొన్నవాడ పూజారి ఆయన కుమారుడిచేత నాగ ప్రతిష్ట చేయించడానికి అక్కడికి వెళ్ళాడు. మాటల మధ్యలో "మా పాపన్న పాములు పట్టుకోడం ఉన్నట్టుండి ఆపేశాడు" అనగానే స్వామీజీ నవ్వి.. "ఇక్కడి పుట్టలోని శ్వేతనాగు నెలరోజుల క్రితం ఉన్నట్టుండి మూడు రోజులు కనిపించకుండా మాయమయింది. తర్వాత నిదానంగా ఈ పుట్టను చేరుకుంది. అది పాపన్న పనే అని నాకు అర్ధమయింది. అందుకే పాపన్నకు ఇక ఆ వృత్తి మానుకోమని నేనే సలహా ఇచ్చాను" అనగానే "స్వామీజీ అదేం విచిత్రమో పాపన్న ఆ వృత్తి మానేశాక పాములు కూడా జొన్నవాడలో ఈ మధ్య కనపడ్డంలేదు" అని నవ్వాడు. "దైవ ఘటనలకు చాలా అర్ధాలు..అంతరార్ధాలు ఉంటాయి. పాముల జోళికి మనం వెళ్ళనంతవరకూ అవి మనజోళికి రావు. పాముల వల్ల పర్యావరణానికి, ముఖ్యంగా రైతులకు కలిగే లాభాలను మనం తెలుసుకోవడంలేదు. పాములే లేకుంటే ఎలుకల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. రైతు పంటలు పండించుకునే పరిస్థితే లేకుండా పోతుంది. పాములకు మనిషి ఆహారం కానేకాదన్న విషయం తెలుసుకుంటే చాలు. అవి ఉద్దేశ పూర్వకంగా మనకు హాని చేయవు. కేవలం తమను తాము రక్షించుకునేందుకే కాటు వేస్తాయి. దాదాపు అరవై యేళ్ళుగా ఇక్కడ వాటితోనే గడుపుతున్నాను కదా!" అని అన్నాడు. స్వామీజీ చెప్పిన మాటలు వింటూ ఉంటే నిజమే అనిపించింది పూజారికి.

****

No comments:

Post a Comment

Pages