అనసూయ ఆరాటం - 13 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 13

చెన్నూరి సుదర్శన్ 


“తమ్ముడూ.. నువ్వేం చెప్తే అది చేస్త” అన్నది అనసూయ.


          “మా ఇంటి పక్క ఖాళీ జాగల గుడిసేపిత్త. అందుల ఉండుండ్లి. అందాక ఆదిరెడ్డిని ఏదన్నా షాపుల ఉంచుదాం. అనిమిరెడ్డి, జయమ్మలు సదువు ఆపద్దు. నేను రవీందర్ అన్నకు కారటేత్త.. వాల్ల నాయ్న చేసిన  పని రాత్త”


          “వద్దు తమ్ముడూ.. ఇంకా మా మీద పగ బడ్తరు. కారటు రాసుడు పెట్టుకోకు. నువ్వన్నట్టు గుడిసె దొరింపు చేసుకుందాం” అన్నది అనసూయ.


          బతుకమ్మ సుత తన కొడుకు గుడిసె అన్న మాటనే కరారు చేసింది.


          సురేందర్ గుడిసెకయ్యే కర్సంత పెట్టుకున్నడు.


***


          దసరకు ముందచ్చే పున్నం ఆదిరెడ్డి పుట్టిన రోజు. అదే రోజు గుడిసె ప్రవేసం చేసింది అనసూయ.


          ఆదిరెడ్డిని సైకిల్ శంకరయ్య షాపుల పెట్టిచ్చిండు సురేందర్.


“సైకిల్ మెకానిక్ నేర్చుకుంటే మున్ముందు సంతంగ షాపు పెట్టుకోవచ్చు” అని నూరిపోసిండు.


 “సరే మామయ్యా..” అని తలాడిచ్చిండు ఆదిరెడ్డి. అదే సంగతి  శంకరయ్యకు చెప్పి మంచిగ పని నేర్పియ్య మన్నడు.


          సురేందర్‌కు ఊల్లె మంచి కదరున్నది. ఆయన మాటకు అందరు విలువిత్తరు. శంకరయ్యకు ఇంకా ఎక్కువ అభిమానం. తన కొడుక్కు సురేందర్ పైసలు తీసుకోకుంట టూచన్ చెబ్తాండు. సురేందర్ తల్సుకుంటే టూచన్ల మీద మస్తు సంపాయించొచ్చు. కాని పైసల మీద ఆశ లేదు. మా ఊల్లె పిల్లలంతా ప్యాసు కావాలె అనుకునే టోడు. బీద బిక్కీ సూసెటోడు. పైసలిమ్మని సక్తు చేసేటోడు కాదు. ఇయ్యగలిగే శక్తి ఉండి ఇస్తే తీసుకునే టోడు. లేనోడు ఇచ్చినా తీసుకునేటోడు కాదు.   


          అందుకే సురేందర్ అంటే ఊరోల్లంత పానమిడ్తరు.


          ఆదిరెడ్డికి ఇంకా పిల్లకాయ చేట్టలు పోలేదు. పగటీలి ఇంటికి బువ్వకచ్చేటప్పుడు సైకిలు పయ్య తోని ఆడుకుంటచ్చి.. ఆడుకుంట పోయేటోడు. అనసూయ కూలి కైకిలుకు వేన్నీల్లకు సన్నీల్లు లెక్క ఆదిరెడ్డి ఆముదాని తోడయ్యింది.


          సురేందర్ అండసూసుకొని అనసూయ ముర్తాందని సేట్లుకు కోపం బొండ్గెలదాక ఉన్నది. కాని ఏమీ చెయ్యలేక పోతాండ్లు. ఈడికెల్లి పురంగ ఎల్లగొట్టాలనుకున్న వాల్ల ఎత్తు పారలేదని.. ఇంకేం చేత్తరో.. అని అనసూయ ఇంకో పక్క భయ పడుతనే ఉన్నది.


          అనసూయ భయపడ్డట్టే అయింది. సురేందర్‌కు హైద్రాబాదు కాలేజీల లెచ్చరర్  నౌకరచ్చింది.


          సురేందర్‌ పెండ్లాం పిల్లలను తీసుకొని పయాన మయ్యిండు.


          రాజయ్య, బతుకమ్మలు సాగదోలుతాండ్లు. సురేందర్ పోతాండని తెలిసి వాడకు వాడ కదిలింది.  


“మామయ్యా.. మల్ల ఎప్పుడొత్తవ్” అని అడుగబట్టింది.. జయమ్మ ఎడ్సుకుంట.


అనసూయకు దుఖమాగుత లేదు. దగ్గరికి తీసుకున్నడు సురేందర్.


“అక్కా.. నువ్వసలే దైర్నం చెడకు. నేను ఎక్కడున్నా .. నా పానమంతా మీ మీదనే ఉంటది. నేను హైద్రాబాదు పోయినంక రవీందర్ అన్న తోటి మాట్లాడి వాల్ల కంపెనీల ఆదిరెడ్డికి ఏదైనా పని సూడమంట. మీ బతుకులు గాడిన పడే దాక నాకూ నిమ్మలముండది” అని సొంత తమ్ముని లెక్క అంటాంటే అనసూయ దేవునికి దండం పెట్టబట్టింది.


రాజయ్య, బతుకమ్మల కండ్లు చెమ్మగిల్లినై.  


         సురేందర్ కూకట్‌పల్లి హైద్రాబాదు కాలేజీల జాయినయ్యిండు. కొడుకును సర్కారు బల్లె షరీకు చేసిండు. కూకట్‌పల్లిల రామాలయం దగ్గర ఒక ఇల్లు కిరాయకు తీసుకున్నడు. ఇంటికి కాలేజీకి పెద్ద దూరమేమీ ఉండది. కాలి నడకనే పోయి వత్తాంటడు.


          వారం రోజులు గడ్సింది. తాప తాపకు ఆదిరెడ్డి యాదికత్తాండు.


ఒక రోజు ఐతారం రవీందర్ ఇంటి పత్త తీసుకొని లోకల్ బస్సుల బైలెల్లిండు. రవీందర్ ఉండేది ఉప్పల్ల. శాన దూరం. గంట పట్టింది. అడుక్కుంట.. అడుక్కుంట మొత్తానికి ఇల్లు దొర్కబట్టిఁదు.


          రవీందర్ ఇంట్లనే ఉన్నడు. సురేందర్‌ను సూడంగనే బీర్పొయిండు.


          “తమ్ముడూ.. ఇప్పుడే వత్తానవా” అన్కుంటచ్చి కావలిచ్చుకున్నడు.


          “అన్నాయ్యా నేను పోయిన వారమే వచ్చిన. నాకు కూకట్‌పల్లి జూనియర్ కాలేజీల లెక్చరర్ నౌకరచ్చింది. నీకు ఇదే పత్తకు కారటేసిన. ముట్టనట్టున్నది”


          “ముట్టింది కాని నేనే చెప్పుడు మర్సిపోయిన” అన్కుంట వంటింట్లకు పోబట్టింది రవీందర్ పెండ్లాం రజిత.


          “గట్ల మర్చిపోతె ఎట్ల రజితా..” అన్కుంట.. రవీందర్ పిల్లి కూనలెక్క రజిత వెనకాల వంటింట్లకు  పోయిండు.


          అందుకే అంటరు. ఇయ్యం అందుకునే జాగల ‘ఉన్నోనింటికి పిల్లనియ్యాల్నట.. లేనోని ఇంట్లకెల్లి  తెక్చుకోవాల్నట’. రజిత వాల్లు బాగా ఉన్నోల్లని గమండెక్కువ.


          సురేందర్ కొంచెం సేపు సోంచాంయించిండు. ఆదిరెడ్డి సంగతి వదినె ముందల చెప్పద్దనుకున్నడు.


          ఇంతల రవీందర్  వంటింట్లకెల్లి బైటికచ్చిండు. రెండు చాయెల కోపులు పట్టుకొని. ఒక కోపు సురేందర్‌కిచ్చుకుంట..  “తమ్ముడూ.. మీ వదినె వంట చేత్తాంది. తిని పోవాలె”  అన్నడు. సురేందర్ ‘సరే’ అన్నట్టు తల్కాయె ఊపిండు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages