చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 19
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
(వీలర్ని ఆసుపత్రిలో చేర్చే సందర్భంలో అమీ తన స్నేహితురాలు జోడీ గురించి నాన్సీకి చెబుతుంది. ముగ్గురు అమ్మాయిలు జోడీని కలవాలని నిర్ణయించుకొంటారు. అదే సమయంలో నాన్సీ గురించి ఆరా తీస్తున్న సీమన్ యింటి చిరునామా తెలుసుకొని ముందుగా అతని యింటికి వెళ్తారు. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@@@@
ఆ యింటివాకిట్లో రెండు కుర్చీలు ఈదురుగాలి విసిరేసినట్లు తలకిందులుగా పడి ఉన్నాయి.
"ఇక్కడ ఎవరూ నివసించటం లేదన్నది ఖచ్చితం" అందామె. "ఏమైనప్పటికీ, మనం గంట మోగించి చూద్దాం."
ఆమె కాలింగ్ బెల్ స్విచ్చిని నొక్కటమే గాక, తలుపు గొళ్ళాన్ని కూడా కొట్టి చూసింది. కానీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
"ఇది ఖచ్చితంగా మన కేసును క్లిష్టతరం చేస్తుంది" అని అంది జార్జ్.
"నాకు ఆశ్చర్యంగా ఉంది" నాన్సీ పరధ్యానంగా అంది. "ఈ యిల్లు ఖాళీగా ఉందని తెలుసుకొని సీమన్ వాడుకొంటున్న అబద్ధపు చిరునామానా, లేక ఏదో కారణం చేత ఈ యింటికి దూరంగా ఉంటున్నాడా?"
"ఓహ్! అతన్ని మరిచిపోదాం" బెస్ సూచించింది. "మనం కనుగొనబోయే జోడీ ఆరంస్ట్రాంగ్ విషయంపై నాకు ఎక్కువ ఆసక్తి ఉంది."
అక్కడనుంచి ఆరంస్ట్రాంగ్ యింటికి ఒక మైలు దూరం ఉంది. కానీ వాళ్ళు నడిచి వెళ్ళటం ద్వారా, ఆ యింట్లో వాళ్ళని పిలిచే సహేతుకమైన సమయానికి అక్కడకు చేరుకొన్నారు.
వారు యింటి ముంగిట్లోకి వెళ్తుండగా, నాన్సీ తన స్నేహితురాళ్ళతో గుసగుసలాడింది, "మనం జోడీ గురించి, ఆమె దత్తత గురించి మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. ఆ విషయం కదిపితే ఆమె తల్లిదండ్రులకు కోపం రావచ్చు. జోడీ అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వీళ్ళకు లేకపోవచ్చు. మిసెస్ ఆరంస్ట్రాంగే ఆ విషయాన్ని ముందుగా కదుపుతుందని ఆశిద్దాం."
"నువ్వన్నది నిజమే!" బెస్ అంది. "ఏది తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నామో ఆమెకు తెలియనియ్యవద్దు."
"జోనీ హోర్టన్ ఫొటో నా పర్సులో ఉంది" అంది నాన్సీ. "ఆరంస్ట్రాంగ్ దంపతులు జోడీని దత్తత చేసుకొన్న వెంటనే తీయించిన ఫొటోని చూడగలిగితే, బహుశా ఆ రెంటినీ మనం రహస్యంగా పోల్చి చూడొచ్చు."
ముగ్గురు అమ్మాయిలు ఆశగా తలుపు దగ్గరకెళ్ళారు. నాన్సీ కాలింగ్ బెల్ మోగించింది. ఆహ్లాదకరమైన, అందమైన నలభై ఏళ్ళ స్త్రీ వారికి బదులిచ్చింది. ఆమె వచ్చిన వారిని చూసి పలకరింపుగా నవ్వింది. "మిసెస్ ఆరంస్ట్రాంగ్?" నాన్సీ ప్రశ్నించింది.
"అవును."
అమీ కాడ్మస్ ని తాము కలిసినట్లు నాన్సీ చెప్పింది. జోడీని కలవమని తమకు అమీ సూచించినట్లు తెలిపింది. "మేము ఒక మోటెల్లో ఉన్నాం. మాకు ఈ పట్టణంలో ఎవరూ తెలియదు."
"లోపలికి రండి" అని మిసెస్ ఆరంస్ట్రాంగ్ వారిని ఆహ్వానించింది. "నన్ను క్షమించండి. జోడీ ఇక్కడ లేదు. ఆమె తన తండ్రితో వ్యాపార పర్యటనకు వెళ్ళింది. సాయంత్రానికి గానీ యింటికి రాదు."
నాన్సీ చిరునవ్వు నవ్వింది. "అయితే మేము మీ అమ్మాయిని చూడటానికి మరొకసారి వస్తాం" చెప్పిందామె.
"దయచేసి వెళ్ళొద్దు" స్నేహపూర్వకంగా చెప్పింది మిసెస్ ఆరంస్ట్రాంగ్. "రోజంతా యింట్లో ఒక్కర్తినే ఒంటరిగా ఉంటాను. నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడతాను. డీప్ రివర్ కి మీరు ఎలా వచ్చారో చెప్పండి."
"మా అమ్మకు యిక్కడ డార్లింగ్ మోటెల్ గురించి తెలుసు" అకస్మాత్తుగా బెస్ చెప్పింది.
"అది చాలా ఆకర్షణీయమైన ప్రాంతం" మిసెస్ ఆరంస్ట్రాంగ్ ఒప్పుకొంది.
కొంతసేపయ్యాక నాన్సీ వ్యాఖ్యానించింది, "జోడిన్ అన్న పేరు బాగుంది కానీ అసాధారణమైనదిగా ఉంది."
“అవును, అదె..” మిసెస్ ఆరంస్ట్రాంగ్ అంగీకరించింది. ఆమె కొన్ని సెకన్లపాటు అంతరిక్షంలోకి చూసి, తరువాత చెప్పసాగింది, "మిస్టర్ ఆరంస్ట్రాంగ్, నేను ఆమెకు ఆ పేరు పెట్టలేదు. ఆమెను మేము దత్తత చేసుకొన్నాం. అప్పటికే ఆమెకు ఆ పేరు ఉంది."
"ఆమెను ఎప్పుడూ జోడీ అనే పిలుస్తారా?" బెస్ అడిగింది.
మారుపేరు కూడా ఆమె దత్తత నాటికే తమ కుమార్తె కలిగి ఉందని మిసెస్ ఆరంస్ట్రాంగ్ చెప్పింది. అది ఆమె స్వంత తల్లే పెట్టింది. “దత్తత చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆమె కథలో రహస్యం లేదు. ఇక్కడ ఉన్న వారికి ఇది తెలుసు. ఏమి జరిగిందో జోడీకి కూడా చెప్పబడింది. కానీ ఆమె ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తుందా అని నాకు అనుమానం. మేము ఆమెను బాగా ప్రేమించాం. ఇప్పుడు ఆమెకు మేమే తల్లిదండ్రులం."
జోడీ సుమారు మూడేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు, డీప్ రివర్ పట్టణానికి పక్కనే ఉన్న దత్తత సమాజంలో ఆమెనెవరో వదిలిపెట్టారని మిసెస్ ఆరంస్ట్రాంగ్ బహిరంగపరచింది. "మిస్టర్ ఆరంస్ట్రాంగ్, నేను ఒక పాప గురించి అడిగినప్పుడు, జోడీని తీసుకెళ్ళమన్నారు. ఆమెను చూడగానే, మేము ఆకర్షణలో పడిపోయాం. ఆమె సమాజం యొక్క విశ్రాంతి మందిరం దగ్గర నిద్రపోతూ కనిపించిందట. ఆమె దుస్తులకు ఒక చిన్న కాగితం పిన్ చేయబడి ఉంది. ఆమె పేరు జోడిన్ హోల్ట్ అని, ముద్దు పేరు జోడీ అని దానిపై ఉంది. ఆ కాగితంలో వంకరటింకరగా వ్రాసిన అక్షరాల్లో యిలా ఉంది, "ఈ పిల్లపై నాకున్న సర్వ హక్కులను వదులుకొని, మీకు దత్తత కోసం ప్రతిపాదిస్తున్నాను. ఆమె తల్లి."
అప్పుడు కొంత యిబ్బందికరమైన విరామం చోటుచేసుకొంది. తరువాత నాన్సీ నవ్వుతూ అంది, "అయితే ప్రతీది ఆమె కోసం అద్భుతంగా మారిందన్న మాట!"
"మేము అదే ఆశిస్తున్నాం. జోడీ ఎల్లప్పుడూ అభిమానించదగిన అమ్మాయి. ఆ పియానో పైన ఉన్నది ఆమె ఫొటోనే!"
ముగ్గురమ్మాయిలు చూడటానికి లేచారు. పొడవైన, ఆకర్షణీయమైన, నల్లని జుట్టు గల అమ్మాయి ఆ ఫోటోలో వారికి కనిపించింది.
"ఎంత ముద్దొస్తోందో!" బెస్ ఆశ్చర్యపోతూ అంది. నాన్సీ, జార్జ్ కూడా తమ అభినందనలు తెలియపరుస్తూంటే, మిసెస్ ఆరంస్ట్రాంగ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి.
"ఆమె ఫోటోలు చాలా బాగుంటాయి" అంది నాన్సీ. "మీరు ఆమె ఫోటోలు చాలా తీయించాల్సింది." తన మాటలకు మిసెస్ ఆరంస్ట్రాంగ్ కొన్ని ఫోటోలైనా బయటకు తెచ్చి చూపిస్తుందని నాన్సీ మనస్ఫూర్తిగా ఆశించింది.
"అవును, నిజమే!" అన్నదా మహిళ. "కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, పాత చిత్రాలు ఏదో విధంగా అటక పైకి ఎక్కేసి, మూటల్లో చేరిపోయాయి."
తాము అక్కడ చాలాసేపు ఉన్నామని నాన్సీ భావించింది. జోడీని కలవాలని యింతకు ముందు కన్నా ఎక్కువ ఆసక్తిగా ఉందని మాటవరుసకు వ్యాఖ్యానించింది. తనకు వీలు కుదిరినప్పుడల్లా ఆ అమ్మాయిని తనతో మాట్లాడమని చెప్పమంది.
ఈ సందేశాన్ని అలాగే ఆమెకు అందజేస్తానని జోడీ తల్లి వాగ్దానం చేసింది. తరువాత, "నేను మీ అమ్మాయిలతో కలవమని నా కూతురితో చెప్తాను కూడా" అంది.
ఆమె ముగ్గురు అమ్మాయిలను వీధి గుమ్మంవరకూ వదిలిపెట్టింది. వారామెతో పోయి వస్తామని చెప్పారు. ఒకరి చేతినొకరు పట్టుకొని ముగ్గురు అమ్మాయిలు వీధిలోకి వచ్చాక, "సరె! మనకేమన్నా విషయం తెలిసిందా లేదా?" అని బెస్ అడిగింది.
"జోడీ దుస్తులకు పిన్ చేయబడిన ఆ నోట్ విషయమే నన్ను ఆశ్చర్యపరుస్తోంది"అంది నాన్సీ. "ఏదైనా అవకాశం ఉంటే, ఆమెనే జోనీ హోర్టన్ అవుతుంది.. . .పేరుల్లో గొప్ప సారూప్యత ఉందని మీరే అంగీకరిస్తారు. . . .ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయబడి ఉండొచ్చు. ఆ సమయానికి ఆమె తల్లి బతికి లేనందున వ్రాయబడిన ఆ నోట్ ఫోర్జరీ అని తెలుస్తోంది. ఆ చిన్నపిల్లని పక్కకు తప్పించటం ద్వారా, మిసెస్ హోర్టన్ ఆస్తికి తానే వారసురాలినని ఒక మోసగత్తె క్లెయిం చేయగలిగింది."
ఈ సిద్ధాంతమే కనుక నిజమై ఉంటే, పసిపిల్ల కిడ్నాప్, ఆస్తిని దొంగతనంగా చేజిక్కించుకోవటం చేసిన వ్యక్తి, పిల్ల పేరుతో సైతం, చాలా భారీ ఎత్తునే ప్రణాళికను ఆలోచించాడనిపిస్తోందని వివరంగా నాన్సీ విశ్లేషించింది. ఈ చిన్న పాప కేవలం తన పేరును మాత్రమే చెప్పుకోగల వయసులో ఉంది కాబట్టి అసలు పేరుతో సారూప్యత గల మరో పేరును ఎంచుకొనే వీలుంది.
"నువ్వు అనేదేమిటంటే" బెస్ చెప్పసాగింది, "ఆమె తన పేరును జోనీ హోర్టన్ అని తెలియపరచినా, ప్రజలు జోడీ హాల్ట్ అన్న పేరును ఆ పాప తప్పుగా ఉచ్చరించి చెబుతోందని అనుకోవచ్చునంటావు, అంతేనా?"
నాన్సీ అవునన్నట్లు తలూపింది. "జోడీ మనకు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాను" అని ఆమె వ్యాఖ్యానించింది. "ఆమె అలా చేస్తే, మనం ఆమెను దత్తత తీసుకొన్నారన్న విషయాన్ని ప్రస్తావించకూడదని అనుకొంటున్నాను. అలా చేయకపోయినా, ఆమె బాల్యానికి సంబంధించిన ఏవైనా ఆధారాలు రాబట్టగలమేమో చూద్దాం."
"మనం యిప్పుడు ఏమి చేయబోతున్నాం?" బెస్ అడిగింది.
"మన తదుపరి మజిలీ ఆసుపత్రి అని నేను అనుకొంటున్నాను" నాన్సీ బదులిచ్చింది. "వీలర్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అతను మనల్ని చూడగలిగే స్థాయిలో కోలుకొంటాడని నేను ఆశిస్తున్నాను. అతను మాకు చూపించాలని కోరుకొన్న వ్యక్తి ఎవరో అడిగి తెలుసుకోవాలనుకొంటున్నాను."
అమ్మాయిలు ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడంతా గందరగోళంగా ఉంది. నర్సులు, డాక్టర్లు యిద్దరు పోలీసులతో ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. ఏమి జరిగిందో అని ఆలోచిస్తూ, నాన్సీ డెస్క్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న నర్సు సహాయకుణ్ణి, తాను, తన స్నేహితురాళ్ళు మిస్టర్ వీలర్ని చూడటానికి వీలవుతుందేమోనని అడిగింది.
"మిస్టర్ వీలర్!" సహాయకుడు త్రుళ్ళిపడి అరిచాడు. "అతను ఈ ఉదయం యిక్కడనుండి కిడ్నాప్ చేయబడ్డ రోగి!"
ఆ మాటలకు నాన్సీ మైకం కమ్మినట్లయి, చేష్టలుడిగి చూస్తోంది. నర్స్ సహాయకుడు ఆసుపత్రి సిబ్బందిని గట్టిగా పిలిచాడు, "మిస్టర్ వీలర్ని తెలిసిన వ్యక్తి ఎవరో యిక్కడ ఉన్నారు."
తక్షణం వాళ్ళంతా నాన్సీని చుట్టుముట్టి ప్రశ్నలతో ముంచెత్తారు.
(సశేషం)
No comments:
Post a Comment