రేకు: 0337-01 సం: 04-214
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
9866691587
పల్లవి:
దైవమొకడే మాతలపు నొకటే
పావనమైతిమి పదరేమా
చ.1:
హరి యెటు దలచిన నటయీని
పరుగుగోరికల పనులేలా
ధర నభయ మొసగు దైవముబంట్లము
మరలి యితరులకు మఱి వెరచేమా
చ.2:
పురుషోత్తమానతి బుట్టినవారము
అరిదిసిరులకై యలపేలా
సరి లక్ష్మీపతి శరణాగతులము
అరయగ నితరుల నడిగేమా
చ.3:
శ్రీవేంకటపతిచేత జీవులము
దావతి నితరము తగులేలా
వావిరిని కరివరదుని వారము
తావున బందాలదగిలేమా
పల్లవి:
మా దైవము ఒకడే.(శ్రీ వేంకటేశ్వరుడే) మా ఆలోచన ఒకటే.(శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి అను ఆలోచన)
అందువల్ల పవిత్రులమయ్యాము. ఇక ఎందుకు త్వరపడుతాం?,కోపిస్తాం? చలిస్తాం? ( ఇవేవి చేయమని భావం)
చ.1:
హరి ఏవిధముగా తలచిన అలా అవుతుంది.
అటువంటప్పుడు పరుగెత్తే కోరికల పనులు ఎందుకు? (ఆరాటాలు అనవసరమని భావం)
ఈ భూమిలో అభయము ఇచ్చు దేవుని(శ్రీ వేంకటేశ్వరుని) సేవకులము.
ఇతర దైవాల వైపు మరలి భయము తెచ్చుకొంటామా?( మరలమని భావం)
చ.2:
పురుషోత్తముడైన విష్ణువు దయతో పుట్టినవారము.
దుర్లభమైన సిరుల కొరకు శ్రమ ఎందుకు?
ఆ లక్ష్మీపతి శరణాగతులము.
ఇక సిరులకొరకు ఇతరులను అడుగుతామా? (అడగమని భావం)
చ.3:
శ్రీవేంకటపతికి లోబడిన జీవులము.
అత్యాసక్తి చెంది , ప్రయాసలకు గురియయి, శ్రమపడి ఇతరదైవాలను ఆరాధించుట ఎందుకు?
అధికుడైన , బంధం తొలగించిన ఆ కరివరదునికి ( ఏనుగును రక్షించిన విష్ణువుకు)చెందిన వారము.
ఇంకా ఈ లోకంలో బంధాలలో తగుల్కొంటామా? (తగులుకొనమని భావం)
No comments:
Post a Comment