సూరిబాబు
(మా జొన్నవాడ కథలు)
- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)
పదవతరగతి పరీక్ష ఫెయిలంతర్వాత, లుంగీలు కట్టుకుని
పెన్నానది ఒడ్డునున్న రచ్చబండమీద, చీట్లపేక ఆడుకునే బ్యాచ్ ఒకటి జొన్నవాడలో ఉంది. ఆ
పోరంబోకు బ్యాచికి సూరిబాబు నాయకుడనే చెప్పాలి. సూరిబాబు ఆ ఊర్లో పేరుమోసిన మోతుబరికి
ఒక్కగానొక్క కొడుకు. అందంగా ఉంటాడు. ఇంకా పెళ్ళికాలేదు. 30 యేళ్ళు దాటినా పెళ్ళి కాలేదనే
కంటే, వాడే చేసుకోలేదని చెప్పవచ్చు. ఇంట్లో అందమైన అక్క కూతురు నిర్మల ఉన్నా, సూరిబాబు
పాతికేళ్ళు దాటినా, ఏమీ చెప్పకపోయేసరికి, నిర్మలకు వేరే సంబంధం చూసి పెళ్ళి చేశారు.
వాడిది ఆడింది ఆట పాడింది పాట ఆ ఊర్లో. అడ్డూఆపు లేకుండా అచ్చేసిన ఆంబోతులా తిరుగుతుంటాడు.
నెల్లూరులో వచ్చిన సినిమాలన్నీ మొదటి రోజునే చూసేయడం, చీట్లపేక, సిగరెట్, తాగుడు, పెన్నలో
స్నానం చేసి అమ్మవారిని దర్శనానికి వచ్చే ఆడపిల్లలను ఏడిపించడం, వీటన్నింటికి సూరిబాబు
లీడర్ కావడమే కాకుండా, చేతినిండా క్యాష్ ఉండడం వల్ల, అందరిని తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు.
వ్యసనాలకు బానిసలైన కుర్రగ్యాంగు వాడికి దాసోహం
అంటూ ఉంటారు.
సూరిబాబుది పెద్ద ఇల్లు. దేవళానికి దగ్గరగా
ఉంటుంది. ముందర వరండా పడగొట్టించి వాళ్ళ నాయన 6 రూములు కట్టించాడు. అక్కడకు పిల్లలు
పుట్టలేదని, అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తామని మొక్కుబడి తీర్చుకుందామని వచ్చే వాళ్ళకు బాడుగకు ఇస్తుంటారు. సూరిబాబు అందంగా ఉన్న ఆడవాళ్ళను
మాయమాటలు చెప్పి, డబ్బు, నగలు ఎఱచూపి లొంగదీసుకుంటాడని ఊరందరికి తెలిసినా ఎవరూ ఆ విషయాన్ని
గురించి మాట్లాడరు. పంచాయితీ బోర్డ్ ప్రెసిడెంట్, సూరిబాబు వాళ్ళ నాయనకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్నో గలభాలు
జరిగినా, లెక్క చేయకుండా తిరిగే మనస్తత్వం వాడిది.
ఒకరోజు ఉదయాన్నే కార్లో తల్లి, తండ్రి కూతురు
లలితాదేవి జొన్నవాడలో దిగారు. లలితావాళ్ళది
ప్రక్కన ఉన్న పాత మినగల్లు. లలితాదేవి చాలా
అందంగా సినీ యాక్టరులా ఉంటుంది. వాళ్ళ నాన్న పాతూరు ప్రెసిడెంటు. వెంకురెడ్డి అంటే
ఆ చుట్టుపక్కల పెద్ద పేరు. పెళ్ళయి మూడేండ్లయినా పిల్లలు కలగక పోవడం వల్ల కామాక్షి
అమ్మవారి సన్నిధిలో నెల రోజులు నిద్ర చేయిస్తామని తల్లితండ్రులు మ్రొక్కుకున్నారు.
అమ్మయి మ్రొక్కు తీరడానికి, మదరాసు నుండి పిలిపించి, ఒక శుభ ముహుర్తం చూసుకుని జొన్నవాడలో
దిగారు. లలితాదేవి భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీరు.
రెండు నెలలు అమెరికాకు కంపెనీ పని మీద వెళ్ళాడు. భర్త ఇవన్నీ మూఢనమ్మకాలని, డాక్టరును కన్సల్ట్ చేయాల్సింది
పోయి, ఈ నిద్రలేమిటని, ఏమాత్రం ఇష్టంలేకపోయినా
అత్తామామా మొహం చూసి వాళ్ళ కోసం ఒప్పుకున్నాడు. ఇదే తగిన సమయం అనుకుని వాళ్ళు
అక్కడ దిగారు.
లలితాదేవి వాళ్ళు పెన్న దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని
అమ్మణ్ణి దర్శనం కోసం బయటకు వస్తుండగా సూరిబాబు ఫ్రెండు రాము చూడనే చూశాడు. "సూరీ!
చూశావా! పిల్లను. ఎంత అందం రా! దేవతా స్త్రీలా ఉందిరా! మొహంలో ఎంత కళ ఉందో చూశావా?
సినిమా యాక్టర్లందరూ ఈ అమ్మాయి ముందు వేస్టే!" రాము అనేసరికి సూరిబాబు గమనించి
అలానే చేతిలో ఉన్న చీట్లపేక పడేసి "తర్వాత కలుస్తా!" అని చెప్పేసి లలితాదేవి
వాళ్ళ వెంట దేవళంలోకి నడిచాడు.
దేవళంలో వారికి టిక్కెట్లు అన్నీ స్వయంగా తెచ్చి
ఇచ్చి మాటలు కలిపి వాళ్ళు నెలరోజులు ఉండడానికి వచ్చినట్టు తెలుసుకున్నాడు. దర్శనం అయ్యాక
"ఎక్కడో ఎందుకు అంకుల్.. మా యిల్లు ఉంది. గదులన్నీ ఉన్నాయి. మీకు ఏ.సి రూం ఇస్తాం.
ఏమీ ఎక్‌స్ట్రా చార్జికూడా లేదు. రండి అని పిలుచుకు వెళ్ళి వాళ్ళ నాన్నకు విషయం చెప్పాడు.
వాళ్ళ నాయన రూం ఇచ్చి, సూరిబాబు వంక అదోలా చూసి "మా వాడు మీకు పరిచయమా?"
అని అడిగాడు. లలితాదేవి వాళ్ళ నాయన "లేదండీ..దేవళంలోనే
పరిచయం అయ్యారు. చాల మంచి పిల్లవాడు. గుడిలో అన్నీ చూపించి చాలా సహాయం చేశాడు"
అన్నాడు. "మళ్ళీ ఇదో ఏదో క్రొత్త గొడవ.. హతోస్మి!" అనుకున్నాడు రూము తాళాలు
వాళ్ళకు ఇస్తూ.
పుణ్యక్షేత్రాలలో
నిద్రించడం వల్ల కలిగే శుభాలను పూజారి వారికి తెలియజేశాడు. వెంకురెడ్డిగారు ఊళ్ళో పనులున్నాయని
ఆరోజు సాయంత్రమే కార్లో వెళ్ళిపోయాడు. లలితాదేవి వాళ్ళ అమ్మతో కలిసి రోజూ తెల్లవారు ఝామునే పెన్నానదిలో
స్నానం చేసి తడిబట్టలతో ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం కూడా
దర్శనం చేసుకుని, దీక్ష వహించి, లలితా సహస్రనామ
పారాయణ చేస్తూ చాలా నిష్టగా ఉంటున్నది.
లలితాదేవి పెన్నలో స్నానం చేయడానికి ఒకరోజు
సూర్యోదయం కాకుండానే బయలుదేరింది. వెంట అమ్మ కూడా ఉంది. సూరిబాబు కూడా స్నానానికి ఉపక్రమించి
దిగాడు. అక్కడ సుడిగుండాలున్నాయని చూపిస్తూ "అటు వెళ్ళవద్దు" అంటూ పొరబాటుగా
పట్టుకున్నట్లు నటిస్తూ లలితాదేవి నడుము మీద చేయి వేశాడు. అలా పట్టుకున్నాడో లేదో...
అంతే ఏదో షాక్ తగిలినట్టయింది. వెనక్కు పడిపోయాడు. వెయ్యి వోల్‌ట్ల విద్యుత్తు వొంట్లో
ప్రవహించినట్లైంది. ఒక్క క్షణం ఏమైంది అర్ధం కాలేదు. చాలా నీరసంగా అనిపించింది. మెల్లిగా
ఒడ్డుకు వచ్చి కూర్చున్నాడు. ఏమైంది అసలు. తనకు షాక్ ఎందుకు కొట్టింది ? అర్ధం కాలేదు.
ఇవేమీ అంతగా లలిత వాళ్ళు మాత్రం, మామూలుగా దేవళానికి వెళ్ళి దర్శనం చేసుకుని రూముకు
వెళ్ళిపోయారు.
సూరిబాబుకు మైండ్ బ్లాంక్ అయింది. తిన్నగా
రచ్చబండ వద్దకు చేరుకుని, కాసేపట్లో స్నేహితులతో కలిసి పోయి ఈ విషయం మర్చిపోయాడు. పేకాట
ఆడుతూ ఉండగా ఒక ఎనభై సంవత్సరాల సన్యాసి ఒకడు వచ్చి బండపై కూర్చుని "ఓం నమశ్శివాయ"
అనే మంత్రం పెద్దగా చదువుతూ, చేత్తో చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నాడు. సూరిబాబుకు
చాలా చిరాకుగా ఉంది. "ఏయ్..ముసలోడా ఆడా చెట్టుకింద కూర్చోపో.. లెయ్ ఈణ్ణుంచీ!.
అసలే ముక్కలు పడక నేంజూస్తా ఉంటే. చెవిలో జోరీగ మాదిరి ఒకటే గోలగా ఉండాదే.." అని
గదిమాడు. స్నేహితులంతా పెద్దగా పక పకా నవ్వారు. సన్యాసి లేచి నుంచుని ఒక్కసారి సూరిబాబు
వంక నిశితంగా చూస్తూ "ఊ.. నీవు చేస్తున్న
పని బాగాలేదు నాయనా... ఆపకపోతే ప్రాణ గండం. జాగ్రత్త!" అన్నాడు. సూరిబాబు
"చీట్లపేక ప్రాణాపాయం ఎలా అవుతుంది ముసలోడా!" అన్నాడు. "నేను చెప్పేది
అర్ధం కానట్టు నటించబాక! అర్ధం చేసుకో! నీకు ప్రాణగండం పొంచి ఉంది. అర్ధమైందా!"
అని వెళ్ళిపోయాడు. ముసలోడు చెప్పేదేమిటో నిజంగానే అర్ధం కాలేదు సూరిబాబుకు. అందరూ వెళ్ళిపొయ్యాక
సూరిబాబు ఆ సన్యాసి కోసం స్కూటర్ మీద తిరుగుతూ
జొన్నవాడ అంతా చాలాసేపు వెదికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు.
ముందురోజు జరిగిన విషయం గుర్తొచ్చి ప్రక్కరోజు
ఉదయం, నెల్లూర్లో ఒక ఫ్రెండ్‌కు ఫోన్‌లో చెప్పగానే వాడు విరగబడి నవ్వి "ఇంకా సన్యాసుల
మాటలు నమ్ముతున్నావా? నువ్వు సక్సస్ కాగానే నాకూ చెప్పు. పని అయ్యాక మంచి మందు పార్టీ
ఉంటుంది" అన్నాడు. నీళ్ళల్లో జరిగిన విషయం చెబితే "పిచ్చోడా.. నీళ్ళల్లో
ఉన్న ఏదో పురుగు కుట్టడం వల్ల నీకు వల్లంతా అలా జలదరింపు వచ్చి ఉంటుంది" అని చెప్పాడు.
హమ్మయ్య నిజమే అయిఉంటుందని తీర్మానానికి వచ్చాడు సూరిబాబు.
ప్రక్కరోజు యధావిధిగా పెన్న ఒడ్డుకు బయలుదేరుతుంటే
అమ్మ వచ్చి "ఒక్క క్షణం ఆగరా!" అంది. ఏమిటి? అన్నట్టు చూడగానే "నిన్న
రాత్రి నాకు ఏదో పీడకల వచ్చిందిరా! నువ్వు పోకిరి పనులు మానెయ్.. రోజులన్నీ ఒక మాదిరిగా
ఉండవు. నాకేదో భయంగా ఉంది" అన్న మాటకు నవ్వి "నువ్వు పది సంవత్సరాలు చెబుతున్న
మాటేగా ఇది. నీకు కలలు రానిది ఎప్పుడు? భయపడనిది ఎప్పుడు? " అంటూ బయటికి వెళ్ళిపోయాడు.
నిస్సహాయ స్థితిలో కళ్ళు తుడుచుకొంది.
ఇంక రెండురోజుల్లో లలితాదేవి వాళ్ళు దీక్ష
ముగిసి వెళ్ళిపోతున్నారన్న మాట తండ్రితో చెబుతుండగా విన్న సూరిబాబుకు టెన్షన్ ఎక్కువైంది. ఆరోజు రాత్రి 10 గంటలకు, ధైర్యం కోసం లైట్‌గా మందు
పుచ్చుకుని, లలితా వాళ్ళ రూం తలుపు తట్టాడు. లలితాదేవి లలితా పారాయణంలో ఉంది. తలుపుతీసి
ఎవరా అని చూసి వెంటనే "ఏమిటి సూరిబాబు గారూ.. ఈవేళప్పుడొచ్చారు? అమ్మ నిద్రపోతున్నది.
చెప్పండి" అన్న మాటకు నవ్వి "కూర్చోవచ్చా?" అని అడిగాడు. "త్వరగా
చెప్పండి" అంది. "ఏమీ లేదు. మీరు వెళ్ళిపోతున్నారా? " అన్న ప్రశ్నకు
"అవును. దీక్ష పూర్తయింది. నాన్నగారికి
చెప్పాము. రేపు మీకు ఇవ్వాల్సిన పైకం మొత్తం ఇచ్చేస్తాము. యెల్లుండి ప్రయాణం"
అని ఇక తలుపు వేసుకోనా? అన్నట్టు చూసింది. "మీరు చాలా అందంగా ఉన్నారు. బిడ్డలకోసమే
కదా ఈ తాపత్రయం మీకు" అన్న సూరిబాబు మాటలు
అర్ధం కాక అయోమయంగా చూసింది. "మీకు బిడ్డలు కావాలంటే ఈ దీక్షలతో కాకుండా.. నేను
మీకు సహాయం చేస్తాను. మీ వారు ఎలాగూ ఫారిన్‌లో ఉన్నారు. ఎవరికి తెలియదు. నాలుగు రోజులుండండి
చాలు. మీకు ఏమి గిఫ్ట్ కావాలో చెప్పండి. తెచ్చి ఇస్తాను. మీ దీక్షకు కూడా ఫలితం దక్కుతుంది.
కాదనకండి ప్లీజ్" " చిరునవ్వుతో
తన చేయి పట్టుకుంటూ అడిగిన మాటకు లలితకు పూర్తి క్లారిటీ వచ్చింది. వెంటనే ఆమెకు ఏదో
పూనకం వచ్చినట్లైంది. కళ్ళు చింతనిప్పులయ్యాయి.
ముడి వేసుకున్న జుట్టు గాలిలోకి ఎగరసాగింది. ఆవేశంతో ఊగిపోతోంది. సూరిబాబు భయపడ్డాడు.
మొదటిసారి ఆడదాన్ని చూసి భయపడ్డాడు. "ఏం కూశావురా! బుద్ధిలేని వెధవా! నిన్నూ.."
అంటూ వాకిట్లో తలుపుదగ్గర నిల్చున్న సూరిబాబును ఎడంకాలు లేపి ఎగిరి గుండెల మీద తన్నింది.
తమాయించి నిలబడాలని ప్రయత్నించిన సూరిబాబు అదుపుతప్పి ధన్ మన్న శబ్దంతో మెట్లమీద వెనక్కు
పడిపోయి దొర్లుకుంటూ క్రిందకు పడిపోయాడు. ఏమీ
జరగనట్టు తలుపులేసుకుంది లలితాదేవి.
రాత్రి పదిన్నర దాటడం వల్ల ఊరంతా నిద్రపోతున్నది.
అటుగా వెళ్తున్న దేవాలయం గుర్ఖా రాత్రి 12
గంటల సమయంలో పహరా తిరుగుతూ, సూరిబాబును చూసి
"అయ్యో! బాబు ఇలా పడిపోయాడేమిటి?" అని కంగారుపడుతూ వాళ్ళ నాన్నను తలుపుతట్టి
నిద్రలేపాడు. ఎలా జరిగిందో అర్ధం కాలేదు. అరుగు
చివర క్రింద ఉన్న బొంతరాయి తలకు గ్రుచ్చుకోవడం వల్ల చాలా రక్తం పోయి కాలువ కట్టింది.
వెంటనే కారులో నెల్లూరు అపోలో హాస్పిటలుకు తరలించారు. మరుసటిరోజు
సాయంత్రం స్పృహలోకి వచ్చిన సూరిబాబు ఎవరిని గుర్తు పట్టడం లేదు. తల్లి దండ్రులు కన్నీరు
మున్నీరుగా విలపిస్తున్నారు.
పూజారికి నమస్కరించి దక్షిణాతాంబూలం ఇచ్చి
లలితాదేవి, భర్త, అమ్మా, నాన్న కారులో పాతూరుకు ప్రయాణమయ్యారు. సూరిబాబు 10 రోజుల తర్వాత
డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చినా ఎవరిని గుర్తుపట్టకుండా పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు.
లలితాదేవికి పండంటి మగ బిడ్డ పుట్టిన తర్వాత
మరుసటి సంవత్సరం జొన్నవాడకు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి మ్రొక్కు తీర్చుకుని వెళ్ళిపోతూ
పోతూ సూరిబాబువాళ్ళ ఇంటి వంక చూసింది. సూరిబాబు
వరండాలో నిలబడి ఉన్నాడు. జుట్టూ గడ్డం, మీసాలు పెరిగిపోయి శూన్యంలోకి చూస్తూ, ఏదో గొణుక్కుంటూ
నిలబడి ఉన్నాడు. ఒక గొలుసు కాలికి గేటుకు కట్టివేయబడి ఉంది. లలితాదేవి మొహం పక్కకు
తిప్పుకొని గుడివైపు తిరిగి కామాక్షమ్మకు మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుంది.
-0o0-
No comments:
Post a Comment