శ్రీథరమాధురి - 100 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 100

Share This

 శ్రీథరమాధురి - 100 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు) 


ఎవరైనా మోసకారులని మీరు విమర్శించే ముందు, మీరు కూడా వారిలో ఒకరా కాదా అని సమీక్షించుకోండి.

****
మంచిచెడులు, తప్పొప్పులు, అందవికారాలు వంటి బంధాలకు అతీతమైన వారి వద్దనే సత్యం ఉంటుంది. అతడు కేంద్రంలో గట్టిగా నాటుకుని ఉంటాడు, ఆధ్యాత్మిక ప్రగతి కోసం అతడే నమ్మదగినవాడు. ఇతరులందరితో అది కేవలం ఒక అహపు యాత్ర మాత్రమే. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనే పేరుతో కలహానికి కాలు దువ్వడమే!
  
****
మీరు ఎదిగేకొద్దీ ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని కోల్పోతారు. మీకు జ్ఞానం ఉందని మీరు భావించగానే, ఆశ్చర్యపోవడమనేది మీ వద్ద నశించడం మెదలుపెడుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డను చూడండి. దాని ఆకారంలోని కోమలత్వాన్ని, అది పుట్టినప్పటి సౌందర్యాన్ని చూడండి.‌ అమాయకమైన దాని మొహాన్ని చూడండి. నాజూకైన చేతులను, కాళ్లను, అందమైన అరచేతినీ, ముద్దొచ్చే వేళ్లను చూడండి. ఇప్పుడు మీరు ఆ సౌందర్యాన్ని చూసి, భగవంతుడి యొక్క సృష్టిని చూసి, ఆశ్చర్యపోతారు. ఎక్కడో ఆ ఆశ్చర్యపోయే గుణం ఇప్పటికీ మీలో దాగి ఉంది, పూర్తిగా మరుగున పడలేదు.
 
****
నైతిక విలువలు అనేవి బుద్ధికి సంబంధించినవి...
కళాభిరుచి శాస్త్రమనే అంశానికి హృదయమే కేంద్రము.
 
****
జీవితం యొక్క ద్వంద్వ స్వభావాన్ని ఆమోదించిన వారిలోనే జ్ఞానోదయం కలుగుతుంది. మంచిచెడులు, తప్పొప్పులు, బలం-బలహీనత, స్వర్గం-నరకం వంటి వాటిలో మధ్యలో ఉండటం అలవర్చుకుంటే ద్వంద్వాలు మీపై ప్రభావాన్ని చూపలేవు. మీరు అంచుల్లో ఉన్నప్పుడే అజ్ఞానం మిమ్మల్ని అధిగమించి, మీరు సంతులనం కోల్పోయేలా చేస్తుంది.
 
****
మీరు చాలా టెన్షన్ తో ఉన్నప్పుడు...
 
మీకు ఆందోళనగా ఉన్నప్పుడు...
 
మీరు మీ ఆలోచనలని, ఆశించటాలను వదలలేనప్పుడు...

ఈ వాస్తవాన్ని ఎదుర్కోడానికి మీకు భయంగా ఉన్నప్పుడు...

ఈ మంత్రాన్ని పఠించండి...

"సుదర్శన మహా జ్వాలా కోటి సూర్య సమప్రభా అజ్ఞాన అంధస్య మేదేవ విష్ణోర్ మార్గ ప్రదర్శయ!"

సుదర్శన భగవానుడిపై ఒక అందమైన మంత్రం.

హే సుదర్శనా! అగ్ని రూపంలో మీ నుంచి జనించే జ్వాలల యొక్క తీవ్రత, కోట్ల కొద్దీ సూర్యుల నుంచి జనించే శక్తికి సమానమైనది.
 
నాలో ఉన్న అజ్ఞానమనే చీకటిని, ఆ జ్వాలలు రూపుమాపి, విష్ణువుని చేరే మార్గంలో నన్ను నడపాలి.
 
సు+దర్శన = మంచి+దృష్టి... 
కేవలం బాహ్య దృష్టి మాత్రమే కాదు మంచి అంతర్దృష్టి కూడా... మీకు మంచి అంతర్దృష్టి ఉన్నప్పుడు మీరు వాస్తవాన్ని మనసారా అర్థం చేసుకుని ఆమోదిస్తారు.
 
మంచి అంతర్దృష్టి లేకపోతే, అది వాస్తవాలను త్రోసిపుచ్చి, టెన్షన్లకు, ఆందోళనకు, ఆశించడాలకు దారి తీస్తుంది.
 
అమిత శక్తివంతులైన నారాయణ భగవానుని చేతిలో ఉన్న సుదర్శన చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ విశ్వంలో ఉన్న కోట్లాది సూర్యులతో పోల్చదగినంత శక్తిని సృష్టిస్తుంది.
ఈ అపరిమితమైన విశ్వశక్తిని గురించి ప్రార్థించినా, ధ్యానించినా అది మన బుద్ధిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. విష్ణు భగవానుడిని చేరే మార్గాన్ని కాంతివంతం చేస్తుంది.

అమితమైన టెన్షన్లు, ఆందోళన, ఆశించడం అనేవి మార్గానికి అడ్డంకులుగా ఉంటున్నాయి.

కాబట్టి ఇవన్నీ చీకటి శక్తులు. ఈ చీకటి అజ్ఞానం తప్ప‌మరేమీ కాదు. సుదర్శన భగవానుడు నాతో ఉంటే ఇవన్నీ నాకు, సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని చేరే పథంలో నా ఉపాసనకూ, అడ్డు పడలేవు, 

'విష్ణు' అంటే 'సర్వవ్యాపి' అని అర్థం.

విష్ణు అంటే ఆయన దేనిలోనైనా, ప్రతీదానిలోనూ ఉన్నారని అర్థం. మన ఉనికికి కారణం ఆయనే! ఆయన సృష్టిలోని ప్రతి అంశంలోనూ వ్యాపించి ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా జరిగితే మీరు జీవితాన్ని గొప్పగా ఆమోదించడం నేర్చుకుంటారు. మీరు అమితమైన శాంతితో, పరమానందంతో, జ్ఞానులై జీవిస్తారు.

***

No comments:

Post a Comment

Pages