త్రివిక్రమావతారం - 2
శ్రీరామభట్ల ఆదిత్య
ఆ విశ్వరూపాన్ని ధరించినటువంటి త్రివిక్రముని వర్ణన ఇలా చేశారు పోతనామాత్యులవారు.
విశ్వరూపత్రివిక్రముడు తన ఒక పాదముతో భూలోకాన్ని కప్పి, మొదటి అడుగుగా స్వర్గలోకాన్ని దాటి రెండవ పాదముంచాడు. రెండవ అడుగుగా వేసిన పాదముతో పైలోకాలను అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వలన బ్రహ్మాండం యొక్క పైభాగము బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై శోభించాడు.
విశ్వరూపంతో ఒకపాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద లాగా కనిపించింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెదవలె ప్రకాశించింది. అన్ని లోకాలనూ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్ళకాంతికి సత్యలోకంలోని బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటీ వలె వెలవెల పోయింది. సంసారబంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచీ మొదలైన వారూ, సనందుడూ మొదలైన దేవర్షులూ, అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలూ, తర్కశాస్త్రాలూ, వేదాలూ, వేదాంగాలు, ఇతిహాసాలూ, ధర్మశాస్తాలూ, మహజ్ఞానులైన పుణ్యాత్ములూ మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో "మేము భావిస్తున్న పెన్నిధి కనిపించింది. ఈనాడు మేము ధన్యులం అయ్యాము." అనుకున్నారు.
విశ్వరూపత్రివిక్రముడి బొడ్డు తామరను చూసి "నా జన్మస్థానం ఇదే సుమా!" అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహోన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. యోగమార్గంలో ఊహించి బ్రహ్మదేవుడు మున్నగు లోకపాలకులుమహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేసారు; మేలైన సుగంధ ద్రవ్యాలను, ధూపదీపాలనూ సమర్పించారు. అనంతమైన పేలాలనూ అక్షతలనూ చల్లారు. ఫలాలూ కానుకలూ సమర్పించారు. సంతోషంతో కీర్తించారు. శంఖాలు మున్నగువాటిని ఊదారు. జయజయ ధ్వానాలు చేసారు. కరుణాసముద్రా! త్రివిక్రమదేవా! అని కొనియాడారు.
భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు. అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కానీ, మనసుతో ఊహించడానికి కానీ వీలుకాక బలిచక్రవర్తి, ఆ సభలోని వారూ చక్కటి స్తోత్రాలు చేసారు.
( ఇంకా ఉంది)
No comments:
Post a Comment