'ఆధ్యాత్మికత..సాంకేతికత' - అచ్చంగా తెలుగు

'ఆధ్యాత్మికత..సాంకేతికత'

Share This

 'ఆధ్యాత్మికత..సాంకేతికత'

-సుజాత.పి.వి.ఎల్.


ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో, ధర్మానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధానపాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం. అలా కాకుండా సాంకేతికతను ధర్మ విచ్యుతికి కారకం చేస్తే అది సంఘాన్ని భ్రష్టుపట్టిస్తుంది. మన సనాతన సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిది. ఒకప్పుడు ఎన్నో ప్రణాళికలు రచించి, డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్లి, అక్కడ గదులను పొందడానికి ఎన్నో అగచాట్లు పడేవారు. దర్శనం పొందడమూ కష్ట సాధ్యమయ్యేది. అలాంటిది ఇప్పుడు ఆన్లైన్ ఆధారిత సేవల నమోదు ఎంతో సులువు అయిపోయింది. ఒకవేళ ఆరోగ్యం సరిగా లేక, సెలవులు దొరకక, వయోభారం వల్లనైనా మరే ఇతర కారణాల చేతనైనా వెళ్లలేని వారుంటే, ఆన్లైన్లో సరైన పైకం చెల్లించి కావలసిన సేవలు నమోదు చేసుకుంటే, వారు కోరుకున్న తేదీలో, సమయంలో అవి అందుబాటులోకి వస్తాయి. మన తరఫున ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుంకుమ, అక్షతలు, ప్రసాదాలు సైతం మన ఇంటి గడప ముందు వాలతాయి. ఒకప్పుడు మనకు కొన్ని ప్రముఖ దేవాలయాలే తెలిసేవి. ఇప్పుడు మారు మూల పల్లెల్లోని, కుగ్రామాల్లోని గుళ్లను, దేవతామూర్తులను, అక్కడి విశేష పూజలను, వేడుకలను, జాతరలను యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో చూసి మురిసిపోతున్నాం. తరిస్తున్నాం. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రసంగం, సత్సంగం, ప్రవచనం జరిగినా మన కళ్ల ముందు ప్రత్యక్షమయి, మనలను పునీతం చేస్తున్నాయి. ఆధ్యాత్మికతలో సాంకేతిక ప్రగతి భాగం పొంది భక్తజనోద్ధరణకు ఈ విధంగా ఎంతో తోడ్పాటునందిస్తోంది. 
ప్రతిదానికీ బొమ్మతో పాటు బొరుసు ఉంటుంది. అలాగే సాంకేతికతను ఆలయాల్లో దుర్వినియోగపర్చడం క్షమార్హం కాని నేరం. పశ్చాత్తాపం కూడా ఆ పాపాన్ని కరిగించదని పండితులంటారు. అది మన ఆధ్యాత్మికత సంపదను  క్షీణింపజేస్తుంది. విలువను తగ్గిస్తుంది. మన ఆచార వ్యవహారాలను గుప్తంగా, పదిలంగా చూసుకోవాలి. 
కొన్ని దేవాలయాల్లో ఛాయా చిత్రాలు తీయకూడదని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంటుంది, అయినా కొంతమంది చాటు నుంచి ఆ పని చేస్తూనే ఉంటారు. గర్భాలయాల్లోని దేవుళ్ల విగ్రహాలను కొన్ని అనూచానంగా పాటిస్తున్న, నియమిత విధి విధానాలతో వేదబ్రాహ్మణుల చేతుల మీదుగా ప్రతిష్ఠ గావిస్తారు. అందువల్ల వాటికి ప్రత్యేక శక్తి చేకూరుతుంది. ఆ విగ్రహాలను ఫోటోలు తీయకూడదు. అలా చేస్తే ప్రతిమల్లోని శక్తి సన్నగిల్లుతుందని అంటారు పూజారులు. ఆ మూల మూర్తులను సైతం ఎవరికీ తెలియకుండా రహస్యంగా చరవాణిల్లో బంధించి ఏదో సాహసం చేసినట్టుగా భావిస్తుంటారు కొందరు. తప్పు చేయడం గొప్ప ఎన్నటికీ కాదు.
గుళ్లు, గోపురాలు, ఆలయాలు, తీర్థాలు అంటే భక్తికి, ముక్తికి మూల స్థానాలు. ప్రతి ఆలయానికీ ఒక చరిత్ర ఉంటుంది. స్థల పురాణం ఉంటుంది. వీలుంటే అది తెలుసుకోవాలి. మహాత్ములు, పుణ్యపురుషులు తిరుగాడిన ప్రదేశంలో మనం చరించే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందరూ అన్ని చోట్లకీ వెళ్లలేరు. దైవ దర్శనానికీ ప్రాప్తం ఉండాలి. మనకు ఆ అవకాశం రావడం అదృష్టం కాక మరేమిటి.
ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినప్పుడు త్రికరణశుద్ధిగా ఉండాలి. అల్లర్లు, కేరింతలు, గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా, అక్కడి వాతావరణానికి, ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా నడచుకోవాలి. 
మనం శారీరకంగా, మానసికంగా సేదదీరాలంటే అనేక ఉద్యానవనాలు, పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండవచ్చు, ప్రవర్తించవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని, శోభను మన సందర్శన ఇనుమడింపజేయాలేగాని, మసకబార్చకూడదు.
సాంకేతిక ప్రగతితో ఎల్లలు దాటుతున్న మన ఆధ్యాత్మిక పర్యటనను పంచుకున్న వారి మనసు స్వచ్ఛతనొందాలి, అప్రయత్నంగా మూతబడిన కళ్లముందు దైవం ప్రత్యక్షమవ్వాలి, చేతులు ముకుళితమవ్వాలి. అంతేకాని హేళనచేసేట్టుగా ఉండకూడదు. వెకిలిచేష్టలకు వేదికవ్వకూడదు. అప్పుడే భక్తి ముక్తిదాయకంగా సాంకేతికత భక్తుడికి ఉపకరిస్తుంది. ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది.

***

No comments:

Post a Comment

Pages