ఈశ్వర శతకము - డా.అందె వేంకటరాజము - అచ్చంగా తెలుగు

ఈశ్వర శతకము - డా.అందె వేంకటరాజము

Share This

ఈశ్వర శతకము - డా.అందె వేంకటరాజము

దేవరకొండ సుబ్రహ్మణ్యం
 



కవి పరిచయం: ఇతడు 1933 అక్టోబరు 14కు సరియైన శ్రీముఖ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ నవమినాడు లింబయ్య, భూదేవి దంపతులకు జన్మించాడు. ఈతని జన్మస్థలము కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రామం. పద్మశాలి కులస్థుడు. కోరుట్లలో ఏడో తరగతి వరకు చదివిన అందె వేంకటరాజము ఎనిమిదో తరగతి నుండి జగిత్యాల హైస్కూలులో చదివాడు. 1951లో హెచ్చెస్సీ ఉత్తీర్ణుడయ్యాడు.హెచ్చెస్సీ పాసైన తర్వాత అందె వేంకటరాజము నిజామాబాద్ జిల్లాలోని భిక్కునూర్‌లో ఉపాధ్యాయులుగా చేరాడు. ఇతడు మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. తర్వాత తెలుగు భాషా పరీక్షలను రాసి తెలుగు పండితుడు అయ్యాడు. ఆనాటి తెలుగు భాష పాఠ్యగ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి. వాటిని చదివి గ్రాంథిక భాషలో కవిత్వం రాయడం నేర్చుకున్నాడు. అయినప్పటికీ చిన్నప్పటినుంచి చుట్టూ ప్రజలు పాటలు పాడడం విని తాను ఎన్నో పాటలు కట్టాడు. కాని పాటకు పాఠ్యపుస్తకాల్లో సాహిత్య గౌరవం లేకపోవడంతో దాన్ని అలానే వుంచి పద్యం రాయడం నేర్చుకున్నాడు.అష్టావధాన ప్రక్రియలో ప్రవేశించి 88 అష్టావధానాలను పూర్తిచేశాడు. ఇతడు ఎం.ఏ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వానమామలై వరదాచార్యులవారి కృతులు-అనుశీలనము అనే సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా పొందాడు. కోరుట్ల డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి 1992 జూన్ 30వ తేదీన రిటైరయ్యాడు. గృహవాస్తు పండితుడిగా కూడా ఇతడు రాణించాడు. ఇతడు సెప్టెంబరు 11 సోమవారం 2006న తన 73వ యేట మరణించాడు.

అందె వేంకటరాజము వచన కవిత తప్ప మిగతా సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టాడు. నాటకాలు రాశాడు. పాటలు రాశాడు. సాహిత్య విమర్శ రాశాడు. దాదాపు డెబ్భయి కథలు రాశాడు. అర్థరాత్రి సుప్రభాతం, పసివాని మూడో పెళ్ళి, మైసమ్మ భయం, అంగడి వింతలు, విచిత్రమైన భక్తురాలు మొదలైన కథలు కొన్ని ఉదాహరణలు. ఇతడు రచించిన పుస్తకాల జాబితా

నవోదయము (కవితాసంపుటి)
మణిమంజూష (కవితాసంపుటి)
భారతరాణి (నాటికల సంపుటి)
భువనవిజయము (నాటిక)
వానమామలై వరదాచార్యుల వారి కృతులు - అనుశీలనము (సిద్ధాంత గ్రంథము)
మానసవీణ (కవితాసంపుటి)
ఈశ్వర శతకము
మాధవవర్మ (నాటకము)
సాహితీ జీవన తరంగాలు (సాహిత్యవ్యాసాలు)
అవధాన పద్యమంజరి
కళాతపస్విని (కావ్యము)
భజన గీతాలు
శ్రీ గోవిందగిరి తత్వ గీతమాల
నింబగిరి నరసింహ శతకము
విచిత్రగాథలు
స్వర్ణ భారతము (పాటల సంపుటి)

వీరికి "కవిశిరోమణి" "అవధాన యువకేసరి" "అవధాన చతురానన" అనే బిరుదులు ఉన్నవి.
(తెలుగు వికీపీడియా నుండి)

శతక పరిచయం:

"ఈశ్వరా" అనే మకుటంతొ శార్ధూల, మత్తేభ వృత్తాలలో 101 పద్యాలతో రచింపబడిన  ఈశతకం భక్తిరస ప్రధానమైనది. చక్కని ధారాశుద్ధి కలిగిన కవిత లో ఈకవి ఈశ్వరుని నామరూపాతీతునిగా సంభోదిస్తు, నవవిధభక్తులందు ఒకటైన ఆత్మనివేదనమును నిండించి ఈశతకాన్ని పండించారు. అదేవిధంగా భక్తిపేరిట లోకంలో జరుగుతున్న దురాచారములను మనకు దర్శింపచేసారు.
కొన్ని పద్యాలను చూద్దాము

హరి యన్నన్ హరుఁ డన్న నర్థమున రవ్వంతైన బేధంబులే
దరయన్ భేదము జూపు వారకట! వ్యర్థానర్థముల్ రేఁపువా
రిరుగన్నుల్ పెరలంచు ద్రువ్వ గతి యున్నే అచ్చు వేరైన బం
గరు సొమ్ముల్ పరవస్తుజన్యములె కంగా రేలకో యీశ్వరా!

ఈవే తల్లివి తండ్రి వీవె చెలి వేవె యాత్మబంధుండవున్
నీవె విద్యవు నీవె విత్తమవు నీవె సర్వమున్ నాకు నో
దేవా! నీ కితరంబు విశ్వమున నెందే నెద్దియే నున్నదే
కైవల్యాత్మక! యోపరాత్పర! నన్నున్ గాపాడవే యీశ్వరా!

రసనాగ్రంబున వాణి నర్తన మొనర్పన్ బ్రహ్మవై యీ జగ
ద్విసరంబున్ సృజియించి, లక్ష్మి యెదలో వెల్గొంద విష్ణుండవై
పొసఁగన్ బ్రోచి, యమేయశక్తి మెయిలోఁ బొల్పార రుద్రుండవై
కసిదీరన్ బ్రళయం బొనర్చెదవో, ఓంకారాత్మకా! యీశ్వరా!

ఈవే బ్రహ్మవు నీవే విష్ణుఁడవు నీవే దేవ! శంభుండవున్
నీవే వాణివి నీవె ఇందిరవు నీవే శాంభవీమాతవుం
నీవే దివ్యగుణస్వభావక్రియలన్ దేవాదిదేవుండవై
భావింపన్ బహునామరూపములతో భ్రాజిల్లెదో యీశ్వరా!

ఆంధ్ర సంస్కృతపదాలకు అక్కడక్కడా తళుకులు సమకూరుస్తూ "ఖాయము", బజారు, "టెష్టరు" వంటి అన్యభాషాపదాలు కూడా వీరి పద్యాలలో మనం చూడవచ్చు.

మైకుల్ వచ్చెను భక్తియున్ భజనలున్ బాజారు పాలయ్యెఁ బూ
జాకార్యంబు నటప్రదర్శనము గాసాగెన్ త్వదారాధనో
త్సేకం బెంతయు యాంత్రికం బగుచు వర్తిల్లెన్ భవన్మందిరా
నీకంబుల్ కుజనాళ్యధీనములు బందెన్ మ్రందెదో యీశ్వరా!

సమకాలీన సమాజములోని అనేక విషయాలపై ఈశతకంలో కవియొక్క భావాలను మనం చూడవచ్చును.

కరవాలంబునుదూసి యొక్కఁడు మహాకౌటిల్య మేపారఁగా
నెరగాలంబును వేసి యొక్కఁడయయో యీ ధాత్రి ఘోరంబుగా
నరులన్ భ్రష్టులఁ జేసి స్వీయమతముల్ బట్టింతు రాస్తిక్యమీ
కరణిన్ వేసెను వెఱ్ఱివేషములు సద్గత్యాప్తికే యీశ్వరా!

పొడుమో చుట్టయొ యిచ్చువాని కెద యుప్పొంగన్ గృతజ్ఞుండగున్
కడుఁ గీర్తించుచు మానవుండు వరమౌ కాయంబుతో నీభువిన్
పొడమన్ జేసి సమస్త సౌఖ్యముల నింపుల్ నింపినన్ దాను నీ
యెడ రవ్వంతయుఁ జూపడే నెనరు తండ్రీ! మూఢుఁడై యీశ్వరా!

ఇటువంటి చక్కని భక్తిరస ప్రధానమైన ఈశతకాన్ని అందరూ తప్పక చదవవలసినది.
మీరూ చదవండి . మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages