మాతృత్వం
భావరాజు పద్మిని
"ఉళుళుళూ... అడ్డెడ్డెడ్డె... బాబుగోరూ, ఇలా సూడండి..."
చాచిన కాళ్ల మీద పడుకోబెట్టుకున్న చంటిబిడ్డకు నూనె మర్ధన చేస్తా ఆడిస్తాంది అన్నవరం. ఆ వింత శబ్దాలకు కళ్లు విప్పార్చి చూస్తూ, బోసినవ్వులు నవ్వుతున్నాడు పాపడు.
లక్ష్మీకళ ఉట్టిపడుతూ తెల్లగా మెరిసిపోతా ఉంటాది అన్నవరం. చూసినోళ్లెవరైనా కళ్లు తిప్పుకోలేని అందం తనది. అయినా, పద్ధతిగా చీరకట్టుకుని, చివర్లో రిబ్బను కట్టిన బారు జడ వాలుగా వేసుకుని, అందులో మందారవో, బంతిపూవో తురుముకుని, కోల బొట్టుతో, చేతులకి మట్టి గాజుల్తో, మానర్సాపురం కొండాలమ్మ తల్లిలా కళకళ్లాడతా ఉంటాది తను. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో, గలగలా కబుర్లాడతా సందడిగా ఉంటాది అన్నవరం.
బిడ్డ రెండి చేతుల్ని, పొట్టమీదకు చేర్చి నొక్కి, రెండు కాళ్లనూ మడిచి నొక్కి, "యాండోయ్, ఇల్లాగ నువ్వుల నూనె రాత్తా కాళ్లూ సేతులూ సవరదీత్తే, ఇనుములెక్కన అవుతాది ఒల్లు, ఏటీ... ఇంటన్నారా? అన్నిటికీ ఆ నవ్వులోటి!" బిడ్డ నవ్వులకు మురిసిపోతా మెటికలు ఇరిసి, "ఐబాబోయ్! ఎంత దిట్టో!" అంటూ నోటి మీద వేలేసుకుంది అన్నవరం.
"ఊరుకోవే! నువ్వలా లొడలొడా మాటాడతా ఉంటే మాత్రం, వారం క్రిందట భూమ్మీద పడ్డ పసిగుడ్డుకు తెలుస్తుందా ఏంటి, ఓ కబుర్లూ నువ్వూనూ!" మురిపెంగా కసిరింది సత్యవేణి.
"యాండీ, బాబుగోరూ! ఇప్పట్నించీ ఇల్లాగ మాటాడతా ఉంటే, వొస పోయకుండానే తొరగా మాటలట్టుకుంతారని మీ అమ్మమ్మగోరికి సెప్పండి, సరేనా? మారాజాబాబు, మా బంగారుతండ్రి!" బిడ్డ మొహం మీదకు నీళ్లు వెళ్లకుండా, మెడదగ్గర చేతులడ్డంపెట్టి, పొట్టమీద నీళ్లుపోస్తా అంది అన్నవరం.
"సర్లేవే, కబుర్లపోగువి! నీ మాటలకేం గానీ, స్నానం కావచ్చిందిగా, తలమీద నీళ్లు పోసేందుకు రానా?" అంటూ చెంబందుకుంది సత్యవేణి.
దోసిలి నిండా పోయించుకున్న వేణ్ణీళ్లను, బోర్లా పడుకోబెట్టిన బిడ్డ తలమీద, వీపుమీద అరచేతులతో తడతా పోసి, తరువాత పసిబిడ్డను కూర్చోబెట్టి, తలకు అరచెయ్యి అడ్డం పెట్టి, తలమీద జాగ్రత్తగా నీళ్లు పోసింది అన్నవరం. చివరగా బిడ్డ కళ్లు, నోరు తుడిచి, నోట్లో వేలు పెట్టి శుభ్రం చేసి, మల్లెపువ్వులాంటి టర్కీ టవల్లో పడుకోబెట్టి, అమ్మమ్మకు అందించి, తడిచీర పిండుకుంటా లేచి, పీటలు ఎత్తేసింది.
"సాంబ్రాణీకి కుంపట్లో బొగ్గులు వెలిగిచ్చొస్తా, ఒక్కసారి బిడ్డను తీసుకోవూ!" అంటా పడగ్గది లోనికెళ్లింది సత్యవేణి.
"రాజాబాబూ! రండి నా దగ్గరకి..." అంటూ బిడ్డను తీసుకుని, ఒళ్లు తుడవసాగింది అన్నవరం. ఇంతలో,
"అమ్మా! పసికందుని గొడ్రాలైన అన్నవరం చేతుల్లో పెడతావా? బుద్ధుందా?" గది లోపల్నుంచి సత్యవేణి కూతురు మంజుల అరిచింది.
"గట్టిగా అరవకు. తను వింటే బాధపడుతుంది. అయినా, ఆపరేషన్ అయిన పిల్లవి. అంత ఆవేశపడకు. రెస్ట్ తీసుకో." నచ్చజెప్పి బయటికొచ్చింది సత్యవేణి.
అన్నవరం కళ్లలో నీళ్లు తుడుచుకుంటా బిడ్డను సత్యవేణి చేతికిచ్చి, వెళ్లిపోబోయింది.
"అన్నవరం! నాకా మోకాళ్ల నొప్పులు, దానికా ఆపరేషన్ అయింది. ఇద్దరం పసిబిడ్డకు స్నానమాడించలేము. నువ్వే రావాలి. అది చిన్నపిల్ల, తెల్సీతెలీక చుట్టుప్రక్కల వాళ్ల మాటలు విని, ఏదో అంటోంది. ఏమీ అనుకోకు, దాన్ని క్షమించు." అన్నవరం కళ్లలోకి చూస్తా అభ్యర్థనగా అంది సత్యవేణి.
"అంతమాటెందుకండీ అమ్మగోరూ. అందరూ అనేదేగదండీ, అలవాటైపోయింది. ఎళ్తన్నానండి, సాయంకాలం వొస్తాను." కళ్లలో ఇంకా ఉబుకుతున్న కన్నీళ్లను ఆపుకుంటా బైటికెళ్లిపోయింది అన్నవరం.
కాసేపు అటే చూస్తా నిలబడి, పసిబిడ్డకు సాంబ్రాణి వేసి, తయారుచేయడానికి కదిలింది సత్యవేణి.
"అమ్మా, పెద్దదానివి, పసికందుని మాతృత్వానికే నోచుకోని గొడ్రాలి చేతుల్లో పెట్టడం మంచిదికాదని నేన్నీకు చెప్పాలా?" బిడ్డకు జుబ్బా తొడుగుతున్న సత్యవేణిని నిలదీసింది మంజుల.
"అవునే, అది గొడ్రాలే! సమాజం గొంతుకోసిన గొడ్రాలు, మొగుడి నిర్వాకానికి బలైన గొడ్రాలు, జీవితం దాన్ని నిలువెల్లా దగా చేసినా, మనుషుల్ని ప్రేమించడం తప్ప ద్వేషించడం, తెలీని గొడ్రాలు...!"
"అమ్మా! నేనడుగుతున్నదేంటి, నువ్వు చెబుతున్నదేంటి? పనమ్మాయిని వెనకేసుకొచ్చి, సొంత కూతుర్నే ఆక్షేపిస్తావా? నువ్వసలు కన్నతల్లివేనా?" విసురుగా అంది మంజుల.
"అవునే. తల్లిని గనుకే చెప్తున్నాను. నోటికెంతమాటొస్తే అంతమాటనడం గొప్పకాదు. ఇంత చదువుకున్నావు ఎందుకూ నీ చదువు చట్టుబండలు కానూ! అసలు అన్నవరం గురించి తెలిస్తే ఇలా అనవు, విను ముందు." అంటూ ఇలా చెప్పసాగింది సత్యవేణి.
***
13 ఏళ్లకే, తనకంటే 12 ఏళ్లు పెద్దైన మేనమామ నిచ్చి పెళ్లి చేశారు అన్నవరానికి. వెర్రిబాగుల్ది, చిన్నప్పటినుంచి 'మేనమామే నీ మొగుడు' అని చెప్పడంతో అతని మీదే ప్రాణాలు పెట్టుకుంది. భర్తంటే విపరీతమైన ఇష్టం అన్నవరానికి. వాడు రాత్రిళ్లు తాగొచ్చి కొట్టినా, పగలు ప్రేమగా చూసుకుంటాడని, సరిపెట్టుకునేది. ఉన్నట్టుండి పెళ్లైన మూడేళ్లకే ఏదో జబ్బు చేసింది అన్నవరానికి! డాక్టరమ్మకు చూపించుకుంటే, అప్పుడు తెలిసింది అసలు నిజం!
అన్నవరం భర్తకు తాగుళ్లే కాదు, చెడు తిరుగుళ్లు కూడా బాగా అలవాటు. రకరకాల ఆడవాళ్ల సాంగత్యం వల్ల, ఏవేవో అంటురోగాలు ముసురుకుని ఉన్నాయట. వాటన్నింటి పరిణామం... అన్నవరం గర్భసంచి కుళ్లిపోయింది. తీసేస్తేగానీ తను బ్రతకదని డాక్టరమ్మ చెప్పింది.
చిన్నప్పటి నుంచి పిల్లలంటే ప్రాణం అన్నవరానికి. స్వచ్ఛమైన వారి నవ్వుల్లో, మాటల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా లేని హాయి తోచేది తనకు. అలాంటిది హఠాత్తుగా గర్భసంచి తీసేస్తారనగానే నెత్తిమీద పిడుగు పడ్డట్టు నిలబడిపోయింది అన్నవరం.
"డాక్టరమ్మా! ఆడికో బిడ్డను కనిస్తే చాలు. నేను సచ్చిపోయినా పర్లేదు. ఒక్క బిడ్డను కూడా కన్లేనంటారామ్మా?" అడుగుతున్న అన్నవరాన్నే అబ్బరంగా చూస్తూ, మాటలు రాక, అడ్డంగా తలూపింది డాక్టరమ్మ.
కొన్నాళ్ళకు తనకు ఆపరేషన్ చేసి, గర్భసంచి తీసేసారు. నెమ్మదిగా కోలుకున్న అన్నవరం, ఇకపైన ఊళ్లో పిల్లలందర్నీ తన పిల్లల్లాగే భావించడం మొదలుపెట్టింది.
ఇంత జరిగినా మొగుడిలో మార్పు లేదు. తాగుడు, తిరుగుడూ షరా మామూలే. డబ్బు ఇబ్బంది తట్టుకోలేక, మొండి మొగుడిని దార్లో పెట్టలేక, దేహీ అని ఎవరి ముందూ చేయి చాచలేక, చివరికి ఇళ్లలో పనులు చేయడం మొదలుపెట్టింది.
ఇదంతా తెలిసినా సమాజంలో మార్పులేదు. తనకు 'గొడ్రాలు' అని పేరుపెట్టింది. ఏ శుభకార్యాలకూ పిలవకూండా వెలేసింది. అంతటితో కడుపు నింపుకోకుండా వచ్చిపోయే నీలాంటి వాళ్లకి కూడా ఆ కబురు మోసి, కడుపు నింపుకుంటోంది.
ఇప్పుడు చెప్పు మంజులా! మొగుడి తిరుగుళ్లకి బలైన ఆడది గొడ్రాలు ఎలా అవుతుంది? శుభ్రమైన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి, ఇంకా పూలరంగడిలా ఊరేగుతున్న దాని మొగుడు గొడ్డుమోతాడా, తను గొడ్రాలా?
అవసరాన్ని బట్టి ఆధునికులమని చెబుతూనే, అవకాశాన్ని బట్టి 'పాత పద్ధతులను పాటించవా?' అని సవాలు చేసే నీలాంటి వాళ్లని ఛాందసులని అనాలో లేక నవీన తరానికి ప్రతినిధులనాలో నాకు తెలీట్లేదు.
ఆధునికత విశాల దృక్పథంలో ఉంటుంది. ఎవరినైనా లోపాలతో సహా ప్రేమించగల సహృదయతలో, ఇతరుల్ని నొప్పించని మాటలో ఉంటుంది. అజ్ఞానంలో వాళ్లొక మాట అన్నా పట్టించుకోకుండా ఉండే మనో ధైర్యంలో ఉంటుంది. ఉన్నంతలో మనం ఆనందంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందమయం చేయడంలో ఉంటుంది. వేసుకునే బట్టల్లో, పూసుకునే సెంట్లలో కాదు.
వంద మందిలో ఉన్నప్పుడు, ఎవరైనా పిల్లాడు 'అమ్మా!' అని పిలిస్తే, అక్కడున్న తల్లులందరూ తిరిగి చూస్తారు. వాళ్ల పిల్లలు, పెరిగి పెద్ధైనా సరే, 'అమ్మా!' అన్న ఒక్క పిలుపు వాళ్లను స్పందించేలా చేస్తుంది. అదీ మాతృత్వం అంటే!
తాను కడుపునిండా తిన్నా, బిడ్డ తినకపోతే, అమ్మ ఆకలి తీరదు. అదీ మాతృత్వమంటే! అమ్మకు దెబ్బలేం తగలకపోయినా, తన బిడ్డ మోకాలికి గాయమైతే, అది తగ్గేదాకా అప్రయత్నంగా ఆ తల్లి తన మోకాలికేసి చూసుకుంటూ ఉంటుంది. అంటే, తన దేహం, బిడ్డ దేహం వేర్వేరు అన్న భావన, అమ్మ మనసులో ఉండనే ఉండదు! ఇదీ మాతృత్వమంటే!
మొన్న అమెరికా నుంచొచ్చిన సావిత్రమ్మగారి మూడేళ్ల మనవడికి కరోనా సోకితే, కన్నతల్లి కూడా దగ్గరకు వెళ్లడానికి భయపడితే, తన ప్రాణాలు పణంగా పెట్టి, పదిరోజులూ అక్కడే ఉండి బిడ్డకు సేవలు చేసింది అన్నవరం. ఇది అమ్మతనం కాదా?
నెల రోజుల క్రిందట జానకమ్మ గారి ఆరేళ్ల మేనల్లుడికి అమ్మవారు పోస్తే, అంటురోగమని తెలిసినా, వాడి మంచం పక్కనే కూర్చుని, పసుపు, వేపాకులు నూరిన ముద్ద రాస్తా, బిడ్డకు కబుర్లు చెప్పి అన్నం తినిపిస్తా, తగ్గేదాకా వదల్లేదు అన్నవరం. అదీ తల్లిదనం కాదా?
అంతెందుకు, నువ్వు హాస్పిటల్ లో ఉండగా, ఎదురుగదిలో పదేళ్ల పాపను చేర్చారు గుర్తుందా? రోడ్డు దాటి స్కూలుకు వెళ్తుండాగా, వాను గుద్దేసి, రక్తమోడుతున్న ఆ పిల్లని, ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా, అరచేతుల మీద ఎత్తుకుని, పరిగెత్తుకొచ్చి, ఆస్పత్రిలో జేర్చింది ఎవరో కాదు, మన అన్నవరమే! దీన్ని మాతృత్వం అనరా?
మాతృత్వమంటే క్షమ... మాతృత్వమంటే దయ... మాతృత్వమంటే మూర్తీభవించిన ప్రేమ! ఇవన్నీ అన్నవరంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే తను, ఎవరినైనా అక్కున చేర్చుకుని ఆదరించగల జగదంబ. మన నర్సాపురం లో ఉన్న బిడ్డలందరికీ అమ్మ. అందుకే నా మనవడిని ఆ అమ్మవారి చేతిలో పెట్టాను.
ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా? ఇంకోసారి చెప్పుడు మాటలు విని, ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకోను. తెలిసిందా...
మంజుల కళ్ల వెంట అప్రయత్నంగా కన్నీరు ధారగా కారసాగింది. "రేపు అన్నవరానికి సారీ చెప్తానమ్మా. నన్ను క్షమించు" అంది నెమ్మదిగా.
మనవడ్ని కూతురి ఒళ్లో పడుకోబెట్టి, ఇద్దరినీ కలిపి కావలించుకుంది సత్యవేణి.
***
No comments:
Post a Comment