మానసవీణ 36 - అచ్చంగా తెలుగు

                                                 మానసవీణ 36

టేకుమళ్ళ.విజయ లలిత





బొటానికల్ టూర్ కి బయలుదేరిన ఎం.ఆర్. కాలేజ్ స్టూడెంట్స్ అదే అటవీ ప్రాంతానికి వచ్చారు. 20 మంది విద్యార్థులతో పాటు లెక్చరర్స్ భారతి, నీరజ, రవీంద్ర, శరత్ క్లర్క్ రమణ కూడా. మొత్తం 25 మంది ఆ ప్రాంతానికి చేరారు.

ముందుగా నిర్ణయించబడిన ప్రకారం  వారికి అప్పలనాయుడు భవంతిలో వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి.

అప్పలనాయుడు ఈ విద్యార్థుల బృందంతో పాటు తనకు నమ్మకస్తులైన ఐదుగురు అనుచరులను ఆ అటవీ ప్రాంతానికి పంపించి వారి దినచర్యను గమనించమని, తరువాత రోజు వారి ప్రణాళికను గమనించమని చెప్పేవాడు. అంతేకాక మరికొందరిని పంపి ఆ బృందం వారిని భయకంపితులను చేయడానికి అడవి మృగాల లాగా అరవమని ప్రోత్సహించాడు.

అతడు ‘పయోముఖ విష కుంభం’ అనే విషయాన్ని అతని మాటలు, ప్రవర్తన ద్వారా గమనించిన ఆదిత్య, సాయి, రఘు అనే ముగ్గురు విద్యార్థులు అప్పలనాయుడుని, అతడి అనుచరులను ఒక కంట కనిపెట్టసాగారు. లెక్చరర్స్ తో చెప్పినా వారు సరైన ఆధారం లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. కానీ వారు కూడా భయపడ సాగారు.

లెక్చరర్స్ చెప్తున్న కొత్త విషయాలను వింటూ ఆయా మొక్కలు, చెట్లు, వనమూలికల ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు విద్యార్థులు.

మరో నాలుగు రోజులలో  టూర్  పూర్తి చేసుకుని తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతామనే ఆనందం ఫైనలియర్ పూర్తి కావస్తుండడంతో స్నేహితుల నుండి విడిపోతామన్న బాధ వారి మనసులో దోబూచులాడుతోంది.

సరదాగా ఫోటోలు తీసుకుంటున్న వారికి క్రూరమృగాల గాండ్రింపులు తమకు సమీపంలో వినిపించడంతో బెదిరిపోయి ఎవరికి తోచిన దిక్కునకు వారు పారిపోయారు.

చీకటి పడే సమయానికి అంతా తాము బయలుదేరిన స్థలానికి చేరినా తమ లో వర్ష, శ్వేతా కనిపించకపోవడంతో వారిలో ఆదుర్దా మొదలైంది. అదే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భీకరమైన వాన ప్రారంభమైంది. ఏం చేయాలో తోచక భయపడుతున్న వారిలో ముందుగాతేరుకున్న రఘు స్నేహితులు ఆదిత్య, సాయి, లెక్చరర్ రవీంద్ర తోపాటు అడవిలోకి బయలుదేరి మిగిలిన వారిని రమణ, మరియు శరత్ సార్ సహాయంతో వసతికి చేరుకోమని చెప్పాడు.

అటవీ ప్రాంతం కావడం పైగా  భయంకరమైన వాన కారణంగా మొబైల్ ఫోనులకి సిగ్నల్స్ లేవు.

మొబైల్ సహాయంతో లైట్ వేసుకొని నలుగురూ చాలా జాగ్రత్తగా ముందుకు కదిలారు.

వర్షా, శ్వేతా అని పిలిచే వారి పిలుపులు  ఉరుముల శబ్దం లో కలిసిపోతున్నాయి. దాదాపు 3 గంటల సేపు ఆ ప్రాంతమంతా గాలించినా వారికి  ఏ ఆధారం దొరకలేదు.

హఠాత్తుగా రవీంద్ర సార్ కాలుకి  ఏదో తగలడంతో వంగి తీసారు. అది శ్వేత మొబైల్ ఫోన్ అని గుర్తించడంతో వారు మరింత ఆందోళనకు లోనయ్యారు. ఆ విద్యార్థినులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోగలిగే ఆధారం మరింత బలహీనమైంది.

ఈలోగా వీరిలో సాయికి దూరంగా వేరే దిక్కు లో ఏదో వెలుగుతూ కనపడటంతో అటువైపు కి వారందరూ చేరుకున్నారు.  అది వారిద్దరిలో ఒకరైన వర్ష మొబైల్ అని తెలిసింది. ఆ మొబైల్ లో ఒక వీడియో రికార్డు అవుతూ చార్జింగ్ అయిపోవడంతో ఆగిపోయింది.  ఆ వీడియో చూసే అవకాశం వారికి లేకుండా పోయింది. రెండు ఫోన్లు రెండు దిశల్లో దొరకడంతో వారి ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో అక్కడే నిలిచి పోయారు.

***

ముందు జరిగిన  సంఘటనను మరచిపోలేని మానస. రెండు రోజులుగా స్కూలుకు వెళ్లడం మానేసింది.

తనతో పాటు తన వారికి ఏమైనా అయితే???

          ఆ ఆలోచన మానసను మరింత కుంగదీస్తోంది.

అసలు ఆ ముసుగు వ్యక్తులు ఎవరు? మానసను ఎందుకు వెంబడించారు అనే ఆలోచనతో, ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోననే ఆశతో, తన మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి అడవిలోకి బయలుదేరిన అనిరుధ్ కి శ్వేత, వర్ష ల కోసం వెతుకుతున్న ఆ నలుగురు కనిపించారు.


(సశేషం)

No comments:

Post a Comment

Pages