త్రివిక్రమావతారం - 3
శ్రీరామభట్ల ఆదిత్య
ఆ తరువాత విష్ణుమూర్తి మళ్ళీ తన వామనరూపాన్ని ధరించాడు. హేతి, ప్రహేతి, విప్రచిత్తీ మొదలైన రాక్షసులు ఇంద్రుడు మొదలైన దేవతలను గెలిచిన వీరులు. అంతటి ఆ రాక్షస వీరులు "ఇతడు మూడడుగులనే కారణంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని ధరించిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడినమాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మొదలైనవారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి." అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. గండ్రగొడ్డళ్ళూ, అడ్డకత్తులూ, ఈటెలూ మొదలైన ఆయుధాలు ధరించి, చెలరేగి అన్ని వైపులా మూగారు. అదంతా చూసి విష్ణుసేవకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన సేనాపతులు పదివేల ఏనుగుల బలంతోచొప్పున గల తమతమ సైన్యాలనూ ఆయుధాలనూ సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి చక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు.
ఓ రాక్షసవీరులారా! ఆగండి! యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలకూ దుఃఖాలకూ అధికారియైన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు. దేవతలకు చేటు కలిగించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేసాడు. అటువంటి దేవుని ఏమనగలము. ఇదే మన అదృష్టఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణుసేవకులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవనిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము. ఇప్పుడు వద్దు. కనుక, ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపొండి." అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానంచేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు.
ఐశ్వర్యం నశించినా బలిచక్రవర్తి లో దీనత్వమూ కంపమూ కలుగలేదు. అంతే కాదు వెనుకటికంటే ఔన్నత్యమూ. తెగువా, జ్ఞానమూ, ధైర్యమూ అధికం అయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూచి వామనుడు ఇలా అన్నాడు. ఓ దనుజేంద్రా! బలీ! మూడడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకమూ, సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం ఒక అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు రెండు అడుగులైంది. ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది. ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా! అందువల్ల, నీకు కొంచెంసేపటిలో నరకం ప్రాప్తిస్తుంది. సందేహం లేదు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆచోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు." ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు.
( ఇంకా ఉంది )
No comments:
Post a Comment