థాంక్స్
ఫర్ కాలింగ్
శెట్టిపల్లి
అరుణా ప్రభాకర్
“హల్లో”
“చెప్పు”
“అంతా ఒకే కదా?”
“అంతా ఒకే . థాంక్స్
ఫర్ కాలింగ్.”
“ఏం చేస్తున్నావ్”
“మూడు రోజులు
రిహార్సల్ చేశా. అనుకున్నట్టే జరుగుతుంది అంతా. ఏడు గంటలకి నాన్న, నేను, తమ్ముడూ భోంచేసాము. వాళ్ళిద్దరూ పడుకున్నారు.
అమ్మ అన్నయ్య కోసం ఎదురు చూసి ఇప్పుడే వాడు రాగానే వాడికి భోజనం వడ్డించి తను
తింటూంది. అరగంట పడుతుంది. ఈ టైమ్ లో మాస్టర్ కీ మార్చేసి నా దగ్గరున్న కీ
పెట్టేస్తాను. దాంతో అమ్మ డోర్ లాక్ చేసి పడుకుంటుంది. రాత్రి పదకొండు గంటలకి నేను
మెల్లిగా బయలుదేరి స్టేషన్ కి వచ్చేస్తా. అప్పటికి మన ట్రైన్ కి ఇంకా గంట టైముంటుంది.”
“ఎక్షలెంట్ . అన్నీ
సర్దుకున్నావా”
“అన్నీ ఏం లేవు. నేను
సెల్ ఫోన్ కూడా తేవట్లేదు. నీ దగ్గర ఇంకో సిమ్ ఉందన్నావుగా”
“ఉంది ఉంది. ఫోన్
అక్కర్లేదులే. ఇంకా ఏం సర్దుకున్నావు.”
"ఏం సర్దుకోను. అమ్మో
ఇంకేమయినా ఉందా. అమ్మకి అనుమానం రాదూ”
“అదేంటి. ఏం లేకుండా
ఎలా వస్తావు.”
“చేతులూపుకుంటూ. రేపు నువ్వు రెండు చీరలు కొనివ్వలేవా ఏం.”
“రెండు ఏం ఖర్మ. నీ
దగ్గర నగలేవో ఉన్నాయన్నావుగా."
“ఆ. ఉన్నాయి”
“అవి తెచ్చుకోవట్లేదా”
“ఇప్పుడవెందుకు”
“మనవెంట ఉంటే మంచిదని.
పదిహేను లక్షలు విలువ చేస్తాయన్నావుకదా”
“పదిహేను అప్పటి మాట.
ఇప్పుడు ఇరవై లక్షల పై మాటే. అయినా గుళ్ళో పెళ్ళికి అవన్నీ అవసరమా ఏం”
“పెళ్ళికి కాదు. ఉంటే
మంచిది కదా అని. ఇంతకూ ఇప్పుడెక్కడున్నాయవి.”
“అమ్మ బీరువాలో. ఈ టైం
లో ముట్టుకుంటే అనుమానం రాదూ.”
“ఒక పని చేద్దాం.
ఇవాల్టికి డ్రాప్ అవుదాం. నువ్వు వీలు చూసుకుని నగలు సర్దుకుని నీ దగ్గర
పెట్టుకో. వీలును బట్టి మనం ఇంకోనాడు బయలు దేరుదాం. ఓకే నా”
“ఓకే. చిన్న సవరణ.
ఇవాల్టికే కాదు , ఎప్పటికీ డ్రాప్ అవుదాం.
థాంక్స్ ఫర్ కాలింగ్....”
“హల్లో “
“.........”
“హల్లో”
క్లిక్.
*****
No comments:
Post a Comment