అనసూయ ఆరాటం - 15 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 15 

చెన్నూరి సుదర్శన్ 


ఆదిరెడ్డి  తన దగ్గర ఉంటే రవీందర్ ఇంకా జల్దిన నౌకరి సూత్తడని అనసూయకు కారటేసిపిలిపిచ్చిండు సురేందర్. 

ఓరోజు.. ఆదిరెడ్డి “నా దగ్గర్నే ఉన్నడన్నా..” అని ఫోను చేసి రవీందర్‌కు చెప్పిండు.

రవీందర్ అన్న మాట తప్పలేదు. మంచి పేరు మోసిన ఒక సివిల్ కాంట్రాక్టర్  తాన పనిప్పిచ్చిండు. ఇస్టోర్ రూంల సామాను ఇచ్చుడు పుచ్చుకొనుడు.. రిజిస్టర్ల రాసుకొని వారానికోపాలి లెక్క అప్పజెప్పుడు ఆదిరెడ్డి పని. ఆఫీసు తార్నాకల. 

ఆదిరెడ్డిని సురేందర్ ఇంట్లనే ఉంచుకున్నడు. పొద్దుగాల ఎనిమిదింటికే సురేందర్ పెండ్లాం ప్రమీల కట్టిచ్చిన సద్దిపట్టుకొని ఆదిరెడ్డి తార్నాక ఆఫీసుకు పోయేటోడు. తిరిగి రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరేటోడు.

రాను బోను శాన తక్లీబైంతాందని కాంట్రాక్టర్‌నడిగి అదే ఆఫీసుల ఎన్కాల ఒక కమ్రల ఉండబట్టిండు ఆదిరెడ్డి. ఒక్క పూట తిండి.. ఇంకో పూట టిఫిన్లు ఓటల్ల చేసేటోడు. వారంల ఒక రోజు సురేందర్ ఇంటికచ్చి కడుపు నిండ తిని మాట్లాడి పోయేటోడు. 

రజిత మంచిగ మాట్లాడదని.. రవీందర్ ఇంటికి పోవుడు అంతంత మాత్రమే..  

“మామయ్యా.. నాకు మీ ఇంట్లనే మంచిగనిపిస్తది” అనేటోడు సురేందర్ తోటి.  

ఏమాటకామాటే చెప్పుకోవాలె. ఆదిరెడ్డి శాన తెలివి కల్లోడు. నలుగురి తోటి ఎట్ల మసులుకోవాలే.. పదిమందిల ఎట్ల మాట్లాడాలే.. బగ్గ తెలుసు. ఎవలైనా ఒక పాలి కలిత్తే సాలు.. ఆయన పేరూ.. ఊరూ అన్నీ యాదికి పెట్టుకుంటడు. అందరితోటి వట్టిగనే కలిసి పోతడు.. మర్యాదగ మాట్లాడుతాంటడు. 

నెల తిరిగే టాల్లకు ఆదిరెడ్డిల  శాన మార్పు కనబడ్డది. పాత బస్తీ నుండి వచ్చేటోల్ల దగ్గర ఉర్దు మాట్లాడుడు నేర్సుకున్నడు. ఇంజనీర్ల తోటి మాట్లాడుడు అలవాటై ఇంగిలీసు సుత తోడెం, తోడెం మాట్లాడబట్టిండు. 

కాంట్రాక్టరు ఆదిరెడ్డి తెలివికి చేతి రాతకు.. లెక్కలు నమ్మకంగ అప్పజెప్పుడు సూసి ఖుషీ అయిండు. మల్ల పైలికి జీతం పెంచిండు.

ఆదిరెడ్డి నెల, నెలా ఇంటికి కొన్ని పైసలు పంపుడు షురువు సేసిండు.

***

రాజిరెడ్డి పనిల చేరి యాడాది గడ్సింది.

సచ్చిపోయిన వాల్ల నాయ్న లింగారెడ్డి పైకెల్లి దీవెన లిత్తాండనుకుంట.. రాజిరెడ్డి నసీబు ఖులాయించ బట్టింది. 

అవ్వాల రాజిరెడ్డి దగ్గరికి సామాను తీసుకుందామని ఒక పెద్ద ఫోన్ల కాంట్రాక్టర్ కన్కయ్య వచ్చిండు. కన్కయ్య వచ్చినప్పుడల్లా ఆదిరెడ్డి పనితనం సూసుకుంట మెచ్చుకునే టోడు. మెల్లంగ.. మెల్లంగ మాటలు కలిపి ఆదిరెడ్డి ఇంటి సంగతులన్నీ తెలుసుకున్నడు. ఆదిరెడ్డి శాన నమ్మకమైన మనిషని మన్సుల కరారు సేసుకున్నడు కన్కయ్య.  

“ఆదిరెడ్డీ.. నాదగ్గర పని చేత్తవా” అని అడిగిండోరోజు.

ఆదిరెడ్డి అప్సోసై సూడబట్టిండు. 

“సూడు రెడ్డీ.. నీ అంత తెలివి కల్లోడు గిసోంటి పని సేసుడు క్యాబిల్ కాదు. ఏదైనా టెక్నికల్ పనులు నేర్సుకుంటే ఇంకా నీ తెలివి పెరుగుతది. నేను ఆఫీసులల్ల ఫోన్లు.. వాటి ఎక్స్‌టెన్షలు.. కంప్యూటర్లు పెట్టుడు గుత్తకు తీసుకుంట. నాతాన కమస్కం పది మంది పనిచేత్తాండ్లు. అయినా సరిపోతలేరు. నువ్వు వచ్చినవంటే.. మావాల్లు పని నేర్పిత్తరు. నువ్వు ఎన్ని ఫిట్టింగులు చేత్తే అన్నింటికి కమీషన్ ఇత్త. మీదికెల్లి నెలకు నువ్వు అడిగినంత జీతమిత్త” అని ఆశ సూపిండు కన్కయ్య. 

“ఇప్పుడు ఎంత ఇత్తాండు మీ సారు” 

“వెయ్యి రూపాయలిలిత్తాండు సార్. కాని ఇక్కడ మా సారుకు చెప్పకుండా పని బందు పెడితే ఎట్ల..” అని అమాయకంగ అడిగిండు ఆదిరెడ్డి.

“నీకు రెండు వేలిత్త. ఇవన్నీ ప్రైవేటు పనులు. ఎవ్వలైనా యాడ జీతమెక్కువిత్తే ఆడ పనిచేత్తరు. నువ్వేమైనా బాండు పేపరు మీద రాసిచ్చినవా.. అయినా నేను మీ సారుకు చెప్పే తీసుక పోత. ఆయనకు మస్తుమంది దొరుకుతరు గిసోంటి పనులకు” అన్నడు కన్కయ్య. “అయితే ఇంకో విషయం.. నీకు పని జహీరాబాదుల ఉంటది. అక్కడ మానయ్య అని ఒకాయన పనిచేత్తాండు. ఒక్కనికి పని కట్టమైతాంది. అతని కమ్రల ఉండు. ఇద్దరూ వండుక తినుండ్లి. ఇద్దరు కలిసి పని చెయ్యుండ్లి. ఆలోచన సేసుకొని చెప్పు. తొందరేం లేదు”

“రెండు వేల రూపాయలు.. డబల్ జీతం. మల్ల మీదికెల్లి కమీసను. మా మామయ్యనడిగి చెబుతా సార్..” అన్నడు రాజిరెడ్డి.

అదే రాత్రి సురేందర్ ఇంటికి పోయి కన్కయ్య ఫోన్ల కాంట్రాక్టర్ రమ్మన్న సంగతి చెప్పిండు. 

“నిజమే.. రెడ్డీ. టెక్నికల్ పని నేర్సుకుంటే మున్ముందు నీ జీవితం బాగు పడ్తది. ఇంకా ఏమీ ఆలోసన చెయ్యకు. జహీరాబాదు వెళ్ళు. నేను రవీందర్ అన్నకు చెపుతా..” అని భరోసా ఇచ్చిండు సురేందర్.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages