చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 22 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 22

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 22

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery

నవలా రచయిత : Carolyn Keene


 

(హేంస్టెడ్ కి తను గూఢచారినని తెలిసినందుకు నాన్సీ బిత్తరపోయింది. అక్కడ హోటల్లో చంద్రగిరి కోట పాత చిత్రాన్ని చూస్తుందామె. హేంస్టెడ్ ద్వారా పీటర్ జుడ్ గురించి తెలుసుకొని, నాన్సీ తన స్నేహితురాళ్ళతో అతని వద్దకు వెళ్తుంది. పీటర్ జుడ్ కి వీలర్ గురించి, హాస్పిటల్ నుంచి అతను కిడ్నాపైన విషయం తెలిపి, మిసెస్ హోర్టన్ ఎస్టేట్ వ్యవహారంలో అతనికి తెలిసిన నిజాలను అడుగుతుంది. అతను వారికి ఆ కథను చెప్పబోతుండగా ఎవరో తమ మాటలను పొంచి వింటున్నారని నాన్సీ గ్రహించి, ఆ అజ్ఞాతవ్యక్తిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. తరువాత . . .)

@@@@@@@@@@@@@@@@


గట్టు దిగి రేవు వైపు వేగంగా పరుగెడుతున్న ఒక వ్యక్తి వెంట పడ్డ నాన్సీ, తన పరుగు వేగాన్ని పెంచింది. కానీ ఆమె అక్కడకు చేరుకొనే లోపే, అమ్మాయిలు ఆపిన అద్దె పడవ పక్కన కట్టేసి ఉన్న మరొక మోటారుబోటులోకి దూకి, నది మీద దూసుకుపోయాడు.


రేవుకి చేరుకొన్న నాన్సీ ఆగిపోయింది. అతన్ని వెంబడించటానికి ప్రయత్నించినా ఫలితం లేదు. అతను బయల్దేరి చాలాసేపయింది. బెస్, జార్జ్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు.


"ఎవరతను?" బెస్ అడిగింది. "నువ్వెందుకు అతని వెంటపడ్డావు?"


మిస్టర్ జుడ్ కథను ప్రారంభించబోతుండగా, కిటికీకి వెలుపల పొంచి వింటున్న వ్యక్తి తల పై భాగం కనిపించిందని యువ గూఢచారి వివరించింది. "అతను పడవలోకి దూకుతున్నప్పుడు గమనించాను . రివర్ హైట్స్ లో నన్ను అనుసరించాడని మీరు చెప్పిన వ్యక్తి యితనే అనుకొంటున్నాను. ఇక్కడ డీప్ రివర్లో జార్జ్ ని అనుసరించిన వాడు యితనే! నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడని చెప్పింది ఈ వ్యక్తి గురించే!"


"మనమేం చేస్తున్నామో కనిపెట్టాలని బాగా నిశ్చయించుకొన్నట్లు కనిపిస్తోంది" బెస్ వ్యాఖ్యానించింది.


"అతనే అని నేనూ అనుకొంటున్నాను " జార్జ్ అంగీకరించింది. "నాకు తోచినంతవరకు, అతను ఖచ్చితంగా మన శత్రువు."


"కిడ్నాపర్లలో యితను ఒకడు కావచ్చు" బెస్ అనుమానం వ్యక్తపరచింది. "మనం అతని వెంట ఎందుకు పడలేదు? అతను మనల్ని మిస్టర్ వీలర్ దగ్గరకు తీసుకెళ్ళేవాడేమో!"


జార్జ్ ఈ ఆలోచనను ఎగతాళి చేసింది. "ఖచ్చితంగా అతను ఆ పని చేయడు" నవ్వుతూ అందామె. "ఏమైనప్పటికీ, ప్రస్తుతం అతన్ని మనం అధిగమించలేము."


నాన్సీ అంగీకారసూచకంగా తల ఊపింది. "మనం వెనక్కి వెళ్ళి మిస్టర్ జుడ్ చెప్పే కథను విందాం" ఆమె సూచించింది.


కుటీరం లోపల మరొకసారి ఆమె పొంచి వినే ఆ వ్యక్తి గురించి, గతంలో అతనితో ఎదురైన అనుభవాల గురించి వివరించింది. "అతను ఎవరై ఉంటాడో మీకు తెలుసా?"


జుడ్ తెలియదన్నట్లు తలూపాడు. తరువాత నాన్సీ అంతరాయం కలిగిన కథను చెప్పమని అతన్ని కోరింది.


"సుమారు పదిహేనేళ్ళ క్రితం న్యూయార్కు నుంచి నేరుగా డీప్ రివర్ వచ్చే రైల్లో నేను ఉన్నప్పుడు," అతను చెప్పటం మొదలెట్టాడు, "ఆ రైలు బోగీల్లోని ఒక దానిలో ముగ్గురు ప్రయాణీకులను ప్రత్యేకంగా గమనించాను - ఒక మగ, ఒక ఆడ, రెండు-మూడు ఏళ్ళ వయసు ఉన్న అందమైన పాప. నాకు కొంత ఖాళీ సమయం దొరికినప్పుడు, ఆమెతో మాట్లాడాను. ఆమె తన పేరు జోనీ అని, మరొక అమ్మమ్మతో ఉండటానికి వెళ్తున్నానని చెప్పింది."


నాన్సీ, బెస్, జార్జ్ ఏకాగ్రతతో వింటున్నారు. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది!


"జోనీ నేను ఎప్పటికీ మరిచిపోలేని ఒక వ్యాఖ్య చేసింది. తనతో పాటు ఉన్న తాత, అమ్మమ్మ ప్రజలకు దేవుడి గురించి చెప్పటానికి చాలా దూరం వెళ్తున్నారని ఆ పాప చెప్పింది."


"మిషనరీలా?" బెస్ అడిగింది.


"అదే అనుకుంటా!" జుడ్ చెప్పాడు. "సరె! ఆ చిన్నపాప, తన తాత, అమ్మమ్మలు డీప్ రివర్లో దిగిపోయారు. వారిలో ఎవరినీ నేను మళ్ళీ చూడలేదు. నెలల తరువాత, మిసెస్ హోర్టన్, ఆమె ఎదిగిన మనుమరాలు జోనీ గురించి విన్నప్పుడు, రైల్లో చూసిన వాళ్ళ గురించి గుర్తు చేసుకొన్నాను. ఆ ఎదిగిన అమ్మాయి డబ్బు పొందటం గురించి ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాను. అంతేకాదు, మిస్టర్ వీలర్ కి ఆ కథను చెప్పాలి అనుకొన్నాను."


"అంతకు ముందు మిస్టర్ వీలర్ కి ఈ విషయాన్ని మీరు చెప్పారు కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదంటారా?" జార్జ్ అస్పష్టంగా అంది.


"నేను ముందు చెప్పినట్లుగా, అతను నన్ను చూసి నవ్వాడు. అదో రకమైన వెర్రితనం అనిపించి, ఈ కథను మళ్ళీ ఎవరి దగ్గరా, ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు, బహుశా, మిస్టర్ వీలర్ తన మనసును మార్చుకొని, దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అనుకొన్నాడేమో!"


"ఎటువంటి సందేహం లేదు," నాన్సీ అంగీకరించింది. “మీరు ఆ వివరాలను మాకు ఇవ్వగలరా?"


"ఆ అమ్మాయికి విశాలమైన నీలి కళ్ళు మరియు అందమైన ఉంగరాల జుట్టు ఉన్నాయి."


నాన్సీ ఉత్సాహంగా తన పర్సు తెరిచి, రెండేళ్ళ వయసులో ఉన్న పాప, జోనీ హోర్టన్, ఫొటోని బయటకు తీసింది. "ఈ పిల్లేనా?" అని ఆమె అడిగింది.


ప్రస్తుతం ఆశ్చర్యపోవటం జుడ్ వంతయింది. "ఇది ఖచ్చితంగా ఆమెలానే కనిపిస్తోంది" మాజీ కండక్టర్ అన్నాడు. "అయితే యిది చాలాకాలం క్రితం జరిగిన సంఘటన కావచ్చు, కానీ నాకు గుర్తు ఉన్న పాప జోనీ పోలికలోనే ఉంది."


హోర్టన్ కుటుంబంతో నాన్సీకి ఉన్న సంబంధం గురించి వివరించమని జుడ్ అడిగాడు. "వాస్తవానికి, యిది మా నాన్నగారి కేసు" ఆమె బదులిచ్చింది. ఈ దర్యాప్తు విషయంలో తన భాగం గురించి బహిర్గతం చేయటం అవివేకం కావచ్చునని ఆమెకు తెలుసు. "కొద్దిసేపట్లో నాన్న డీప్ రివర్ కి వస్తారని ఆశిస్తున్నాను. అతి త్వరలోనే ఆయన బహుశా మీతో మాట్లాడటానికి రావచ్చు."


ఈ డొంకతిరుగుడు సమాధానం జుడ్ ని సంతృప్తిపరచినట్లు అనిపించింది. అతను మరేదైనా చెప్పే ముందే నాన్సీ లేచి, అతనికి ధన్యవాదాలు తెలిపి, తాము తప్పక వెళ్ళాల్సిన పని ఉందని చెప్పింది.


"మీరు త్వరలోనే మిస్టర్ వీలర్ ను కనుగొంటారని ప్రగాఢంగా నేను ఆశిస్తున్నాను" రేవు దగ్గరకు వెళ్తున్న అమ్మాయిలకు జుడ్ అరిచి చెప్పాడు.


అమ్మాయిలు తమ చిన్న పడవలో కూర్చున్నాక, నాన్సీ ముఖం విశాలమైన నవ్వుతో విప్పారింది. "ఇది యింతవరకు మనకు లభించిన వాటిలొ అత్యుత్తమ క్లూ!" ఉత్తేజంతో చెప్పింది.


"అద్భుతమైనది కూడా!" బెస్ అంది. "దీన్ని నువ్వెలా అభివృద్ధి చేయబోతున్నావు?"


పట్టణంలోని దుకాణాదారుల మధ్య కొద్దిగా శోధిస్తే మంచిదని తనకు అనిపించినట్లు నాన్సీ చెప్పింది. "వారిలో కొంతమంది పదిహేనేళ్ళ క్రితం యిక్కడ ఉన్నవారు కావచ్చు. చిన్న పిల్ల కోసం హోర్టన్ యింటికి ఏదైనా వస్తువులను పంపి ఉంటే, బహుశా ఆ విషయం మనకు తెలియపరచవచ్చు."


అమ్మాయిలు వాణిజ్య ప్రాంతాన్ని భాగాలుగా విభజించాలని నాన్సీ సూచించింది. తరువాత ఆయా ప్రాంతాల్లోని దుకాణాదారులకు విడివిడిగా ఫోన్లు చేయాలి.


ఈ రకమైన తవ్వకాన్ని మధ్యాహ్నంలోని తరువాతి భాగంలో పూర్తిచేయాలి. నాన్సీ ఒక చిన్న బొమ్మల దుకాణంలోకి ప్రవేశించేవరకు, తమకు ఏదైనా క్లూ దొరకవచ్చునన్న ఆశను వదిలేసుకొన్నారు. దాన్ని ఒక వృద్ధుడు, ఒక స్త్రీ నడిపిస్తున్నారు. ఆ జంట ముప్పై ఏళ్ళుగా ఆ పట్టణంలో ఉంటున్నారని తెలుసుకొన్న నాన్సీ, ఆడమనిషిని ప్రశ్నించింది.


స్త్రీ, పురుషుడు ఒకరినొకరు చూసుకొని, తరువాత నవ్వారు. చివరకు ఆ స్త్రీ మాట్లాడింది. "పాప బహుమతి విషయంలో నాకు బాగా గుర్తుంది. క్రిస్మస్ సమయంలో బాగా అందమైన బొమ్మ ఒకటి, కారేజ్ గురించి మాకు ఎప్పుడూ ఫోనులో ఆర్డరిస్తే అమ్మేవాళ్ళం. వాటిని హోర్టన్ యింటి దగ్గరకు పంపించే వాళ్ళం."


"వాటిని బట్వాడా చేసే వ్యక్తి అక్కడ ఒక చిన్న పాపను చూసాడా?" నాన్సీ అడిగింది.


"లేదు. మా దూత అక్కడ ఎవరినీ చూడలేదు. అతను తెలియపరచిన విషయం నాకు బాగా గుర్తుంది. హోర్టన్ వాకిలి దగ్గర ఒక చెక్కు, ఒక చీటి పెట్టి ఉండెది. ఆ చీటిలో బొమ్మలను అక్కడ వదిలేయమని సూచనలు ఉండేవి."


ఆమె ఎందుకు ఈ విచారణ చేస్తోందని మగ దుకాణాదారుడు నాన్సీని అడిగాడు. "నాన్నకు హోర్టన్ కుటుంబం పట్ల ఆసక్తి ఉంది. నా స్నేహితులు, నేను సెలవుల్లో విహారయాత్రకు యిక్కడకు వచ్చాం. నాకు వీలైనంతగా వారి గురించి తెలుసుకోమని ఆయన నాతో చెప్పారు" సాధ్యమైనంత ఉదాసీనంగా నాన్సీ బదులిచ్చింది.


"అలాగా?" మగ మనిషి అన్నాడు. "ఇంతకు మించి మరేమీ చెప్పలేము" అతను పక్కకు తిరిగి వెనకాల గదిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక కుర్రాడు, ముందు ద్వారంనుంచి లోనికి వచ్చాడు. ఆడ మనిషి లోనికి వెళ్ళింది. అమ్మాయిలు బయటకొచ్చారు.


"ఈ రోజు మనకు అదృష్టం పట్టిన రోజు" అంది బెస్. "బహుశా చంద్రమణే దీనిని తీసుకొచ్చి ఉంటుంది."


నాన్సీ నవ్వింది, కానీ తమకు ఆ రోజు రెండు అమూల్యమైన క్లూలు దొరికినట్లు అంగీకరించింది. "ప్రస్తుతం నేను అనుసరించడానికి చాలా బాటలు ఉన్నాయి. దేన్ని అనుసరించాలో నాకు తెలియటం లేదు. నేను ఎక్కువగా అనుసరించాలనుకొంటున్నది జోడీ ఆరంస్ట్రాంగ్ తో మాట్లాడే అవకాశాన్ని."


"అయితే నువ్వు యిప్పుడే ఎందుకు మాట్లాడవు?" జార్జ్ అంది.

"ఆమె ఈపాటికి యింటికి వచ్చేసే ఉంటుంది."


"లేదు" అంది నాన్సీ. "నేను స్నేహం కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తే, ఆరంస్ట్రాంగులకు అనుమానం వచ్చి, నన్ను జోడీని చూడనివ్వరు."


"నువ్వు చెప్పింది నిజమే!" అంది బెస్. "ఏమైనా, కుర్రాళ్ళు ఈ రోజు వస్తున్నారన్నది మరిచిపోకు. వాళ్ళిక్కడకు వచ్చే లోపల నా జుట్టుకి షాంపూ పెట్టుకోవాలనుకొంటున్నాను. చుట్టుపక్కల చూడాల్సిన ప్రాంతం ఎంతో ఉంది. పడవ ప్రయాణంలో కూడా గాలి బాగా వీస్తుంది."


అమ్మాయిలు టాక్సీలో మోటెల్ కి బయల్దేరారు.


(సశేషం)


No comments:

Post a Comment

Pages