ఇరవుగా నిన్నెరిగిరి యిదివో నీదాసులు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0337-04 సం: 04-217
పల్లవి: ఇరవుగా నిన్నెరిగిరి యిదివో నీదాసులు
పరదైవములమీద నొల వేయనేల పనిలేవు నీమాయలు కరుణానిధీ
చ.1: ముంచెను నీపాదములు మూడులోకములయందును
యెంచెను నీ వేయినామాలు యిలలో వేదవ్యాసుడు
చంచులదలచిరి నిన్ను మున్నే సనకాదియోగీంద్రులు
పొంచి యింకా నీకు దాగజోటు లేదు యిందు బొడచూపవే యింకవెడమాయలేలా
చ.2: కొనెను నీపాదతీర్థము బ్రహ్మ కోరి నీపాదము గడిగి
వినుతించె నీమహిమ తొల్లె వేయినోళ్లుగల శేషుడు
అనిరి నిన్నెక్కుడనుచు మొదల శుకాది మునీంద్రులెల్లా
పొనిగి నీవు మాయ సేయజోటు లేదు మమ్ము పొసగి యేలుకోవె పురుషోత్తముడా
చ.3: యెక్కెను ధ్రువుడు పట్టము యిదివో నిన్నుగొలిచి
చిక్కెను నీశరణాగతి నేడు శ్రీవైష్ణవులచేతను
గక్కన శ్రీవేంకటేశుడా యిట్టె కాచితివి మాటకే మమ్ము
యిక్కడ నీమాయసేయజోటులేదు నిన్నునెరిగిరి నీదాసులిందిరారమణా
భావం
పల్లవి:
కరుణానిధీ!(దయకు నిధి వంటివాడా !)ఇదిగో ! నిన్ను స్థిరమయిన తమ భక్తి స్థానముగా నీదాసులు తెలుసుకొన్నారు.
ఇతర దైవములమీద మాకు దృష్టి పోయిందని నెపము ఎందుకు వేస్తావు? నీమాయలకు పనిలేదు.
చ.1:
నీపాదములు మూడులోకములయందు అతిక్రమించాయి.
ఈ భూమిలో వేదవ్యాసుడు నీ వేయినామాలు (విష్ణు సహస్రనామాలు) చెప్పాడు.
సనకుడు మొదలైన యోగీంద్రులు నిన్ను ముందే ప్రసిద్ధిగా తలచారు.
ఇంకా నీకు దాగటానికి చోటు లేదు .ఇక్కడ ఈలోకంలో నాకు కనబడవయ్యా ! ఇంకా అల్పమైన మాయలెందుకు?
చ.2:
నీపాదము కడిగి బ్రహ్మ కోరి నీ పాదతీర్థము గ్రహించాడు.
పూర్వమే వేయినోళ్లుగల శేషుడు నీమహిమ వినుతించాడు.
మొదటే శుకుడు మొదలయిన మునీంద్రులందరూ అందరికంటె నువ్వెక్కువని అన్నారు.
ఓ పురుషోత్తముడా!నీవు మాయ చేయటానికి చోటు లేదు. మమ్ము ఏలుకోవయ్యా !
చ.3:
ఇదిగో ! నిన్నుకొలిచి ధ్రువుడు రాజ్యము పొంది సింహాసనమెక్కాడు.(ధ్రువ నక్షత్రమయ్యాడు)
నేడు శ్రీవైష్ణవులచేత నాకు నీశరణాగతి దొరికింది.
శ్రీవేంకటేశుడా! శరణు అను ఒక మాటకే మమ్ము రక్షించావు.
లక్ష్మికి ఇష్టమైన వాడా ! ఇక్కడ(ఈ శరణాగతి విధానంలో) నీమాయచేయటానికి చోటు లేదు. నిన్ను నీ దాసులు తెలుసుకొన్నారు.
విశేషాలు
ధ్రువుడు
ధ్రువుడు ఉత్తానపాదునికి సునీతియందు పుట్టిన కొడుకు.
ఒకనాడు ఉత్తానపాదుడు సింహాసనముమీద కూర్చుండి తన రెండవభార్య అగు సురుచియొక్క బిడ్డను తొడమీద ఉనిచికొని ఉండగా ధ్రువుడు చూచి బాల్యచాపల్యముచేత తానును
తండ్రితొడ ఎక్క కోరెను.
సురుచి ఆధ్రువుని అభిప్రాయము ఎఱిగి కడు అహంకారముతో తండ్రితొడ ఎక్కవలెను అను అపేక్ష కలిగిన నీవు ఏల సునీతి కడుపున పుట్టితివి అని అడిగెను.
ఆమాట ధ్రువుడు విని తన హృదయమునకు అది బాణమువలె నాటగా ఆవృత్తాంతము తల్లికి ఎఱిగించి ఆమె ఆజ్ఞ పొంది నారద మహర్షి యొక్క ఉపదేశమున మిక్కిలి ఉగ్రమైన
తపస్సు చేసి విష్ణువును ప్రత్యక్షము చేసికొని తల్లితో గూడ అత్యున్నతమైన పదమును పొందాడు. (పురాణనామచంద్రిక యెనమండ్రం వెంకటరామయ్య)
***
No comments:
Post a Comment