మానస వీణ-37
కూరేళ్ళ శ్రీ శ్రేయ
మానస మీ కుమార్తే... అని రఘురాం కి చెప్దామని అనుకున్న కృషివలరావు..... క్షేమ సమాచారాలు అన్నీ తెలుసుకుని ప్రత్యక్షం గా కలిసి ఈ విషయం చెప్తే ఇంకా బావుంటుంది అనుకొని ఫోన్ పెట్టేసాడు.
ఈలోగా అదే నిజం చెప్పడానికి దినేష్... పనులన్నీ ముగించుకొని రాత్రి తన ఇంటి నుంచి బయలుదేరాడు.
దారిలో దినేష్ కి బండి కున్న లైట్ వెలుతురు లో దూరంగా ముగ్గురు మనుషులు ఒక చిన్న పిల్లని తీసుకొని వెళుతూ కనిపించారు.
అనుమానం కలిగిన దినేష్ వాళ్లను ఆపి అడగటం కన్నా వెనకాలే వెళ్లి గమనించటం మంచిది అనుకున్నాడు. బండి అక్కడ ఆపి వేగంగా నడుస్తూ కొంత దూరం వాళ్ళని గమనిస్తూ వెళ్ళాక వాళ్ళతో ఉన్న చిన్న పిల్లని బెదిరించి ఊరి పెద్ద అప్పలనాయుడు కోసం తీసుకొని వెళుతున్న విషయం దినేష్ కి అర్థమైంది. వాళ్ళు ఆ పిల్లని అప్పలనాయుడు దగ్గరకి తీసుకొని వెళ్లే లోపు పోలీస్ బెటాలియన్ కి ఫోన్ చేసి మీడియా కి కూడా సమాచారం ఇచ్చి అప్పలనాయుడుని ఎలాగైనా ఆధారాలతో అరెస్ట్ చేయాలని అలోచించి ఫోన్ మెసేజ్ ఇస్తున్న... దినేష్ వెనకనించి ఎవరో కొట్టడంతో అక్కడే కూలబడ్డాడు. ఇంతలో... ఏదో అలికిడి వినిపించి దినేష్ వైపు వస్తున్న ఇద్దరు వ్యక్తులు కాళ్లకు బుద్ధిచెప్పారు.
***
అక్కడే తెల్లారి పోయింది. ఈ లోగా కృషీవలరావు కూడా మానస గురించి నిజం చెప్పడానికి బయలుదేరాడు.
ఇంతలో ఈ విషయం చెప్తే మానస ఎలా స్పందిస్తుందో అని అనుకుంటూ మానస కి ఎదురుపడిన రఘురాం కొంత తడబడుతూనే తనను దత్తత తీస్కోవాలను కున్న విషయాన్ని మానస చెవిలో వేసాడు. కంగారుగా ఉన్న రఘురాంకి తన చిరునవ్వుతో మానస ఊరట ఇవ్వటమే కాకుండా, ‘నేను ఎపుడో మీ కూతురుని ఐపోయాను. దానికోసం మీరు ప్రత్యేకంగా నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యండి. మీ సంతోషం కోసం నేను ఏది చేయమన్నా చేస్తాను’ అంది మానస.
ఊరి వాళ్ళకి చదువు విలువ చెప్పే పని మీద రేపటి నుంచి ఎలా వెళ్ళాలి? ఈ అప్పలనాయుడు మళ్ళీ ఏ రూపంలో వచ్చి అడ్డు కుంటాడో... వాడికి ఎలా బుద్ధి చెప్పాలి అనుకుంటూ... అక్కడ నుంచి చేతిలో కాఫీ కప్పుతో శ్రావణి గదిలోకి వెళ్ళింది మానస.
ఆనందం పట్టలేకపోతున్న రఘురాం ‘నేను అనవసరంగా చాలా ఆలోచించాను. మానస ఇంత సంతోషంగా ఈ విషయం ఒప్పుకుంటుందని అనుకోలేదు,’ అని తనలో తాను మాట్లాడుకుంటూ గట్టిగా పనివాడిమీద కేక వేశాడు.
‘ఏర్పాటుకు అన్నీ మొదలు పెట్టండి ఈరోజే ఇంట్లో కార్యక్రమం ఉంది. వెంటనే పంతులుగారు కి కూడా కబురు చేయండి’ అనుకుంటూ శ్రావణి దగ్గరకి వెళ్లి ఈ విషయం చెప్పాడు. తన సంతోషం మాటల్లో చెప్పలేము. పక్కనే ఉన్న మానస, శ్రావణిని కౌగలించుకొని ‘నేను ఎపుడూ నీ కూతురినే అమ్మా’ అని అనడంతో రఘురాం... శ్రావణి ఇద్దరి కళ్ళలో ఆనందభాష్పాలు నిండాయి. వెంటనే రఘురాం గదిలోంచి బయటకు వచ్చి అందరికీ ఆహ్వానం చేయడం కోసం ఫోన్ తీసుకొని, ఒక్కో నంబర్ కి లైన్ కలిపి పట్టలేని ఆనందంతో ఆహ్వానం పలుకుతున్నాడు.
ఈ విషయాలు ఏవీ తెలియని కృషీవలరావు... మానస గురించి నిజం చెప్పడానికి దారిలో ఉన్నారు.
అప్పలనాయుడుకి భయపడినా పని మధ్య లో వదలకూడదు. చదువు విలువ తెలియజేసే పని ఓ నాల్రోజులాగి మళ్ళీ మొదలు పెట్టాలి. ఈసారి అనిరుధ్ ని తోడు తీసుకోనే వెళ్ళాలి అనుకుంది మానస.
No comments:
Post a Comment