రాజ్యలక్ష్మి ఐ.పి.ఎస్. - అచ్చంగా తెలుగు

రాజ్యలక్ష్మి ఐ.పి.ఎస్.

Share This

 రాజ్యలక్ష్మి .పి.ఎస్.

(మా జొన్నవాడ కథలు)

-          డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858) 


          మొక్కను నాటడం అందరూ చేస్తారు. దాన్ని జాగ్రత్తగా పెంచే తీరులో పెంచితే అది వటవృక్షమై, మధుర ఫలాలను ఇవ్వడమే గాక, నలుగురి నీడను కూడా యిస్తుంది. అలాంటి కథే మన రాజ్యలక్ష్మిది.

          వాకిట్లో పోలీసు జీపు ఒకటి ఆగింది. వెరండాలో సోఫాలో కూర్చున్న వెరోనికా ఉలిక్కిపడింది. టక టక బూట్ల శబ్దం చేసుకుంటూ, ఒక లేడీ ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చింది ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొంది. మిగతా వాళ్ళను బయటే ఉండమని సైగ చేసింది. విషయం ఏమిటో వెరోనికాకు గాని టీ.వీ చూస్తున్న వాళ్ళాయన జాన్ కు గానీ అర్ధం కాలేదు. జాన్ భయపడి లేచి నిల్చుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వెరోనిక మాత్రం "అమ్మా! క్షమించండి! నాకు మోకాళ్ళ ఆపరేషన్ అయింది. లేవలేను" విషయం ఏమిటో చెప్పండి అన్నట్లు దణ్ణం పెట్టింది..

"పెద్దవారు. దండం పెట్టకండి. మీరు మూణ్ణెల్ల క్రితం నెల్లూరు పొగతోటలో అక్కడ ఒక బిల్డింగు నిర్మాణంలో ఉండగా అక్కడ నిరాహార దీక్ష చేశారు. ఆవిషయమై మాట్లాడాలని వచ్చాను. నేను క్రొత్తగా నెల్లూరుకు వచ్చిన డి.ఎస్.పి."

"అమ్మా! ఆ స్థలంపై మేము హక్కుల్ని ఎప్పుడో వదులుకున్నాం. మేమేమీ చెయ్యలేము. ఎం.ఎల్.ఎ బావమరిది ఆ స్థలాన్ని కబ్జా చేశాడని, ఏభై లక్షలు చేసే స్థలం ఎప్పుడో మా తండ్రిగారు నాకు ఇచ్చిందన్న బాధకొద్దీ దీక్ష చేశాను. క్షమించండి. మమ్మల్ని ఈ వయసులో పోలీసు స్టేషన్లకు తిప్పకండి. ఆయన మీద ఎలాంటి కేసులూ పెట్టే ధైర్యం మాకు లేదు."

డి.ఎస్.పి "కానిస్టేబుల్..ఆ బుట్ట ఇలా తీసుకురా!" అనగానే ఒక బుట్ట తెచ్చి ప్రక్కన పెట్టగానే, బయటకు వెళ్ళు అన్నట్లు సైగ చేసింది. బుట్టలోనుండి ఒక పూలమాల తీసి వెరోనికా మెడలో వేసి, పూలను తలపై పోసింది.

"ఎవరమ్మా నువ్వు!  నాకు మాలెందుకు వేస్తున్నావు? సరైన ఇంటికే వచ్చారా? ఒక్క సారి చూసుకోండి." అన్న ప్రశ్నకు డి.ఎస్.పి "నా పేరు రాజ్యలక్ష్మి, నన్ను రాజీ అంటారు. ఈ వూర్లో పన్నెండేళ్ళ క్రితం మండపం ప్రక్కన కాపుర మున్న  సీతాపతి కూతుర్ని" అనగానే వెరోనికా మనసు ఒక పది పన్నెండు సంవత్సరాలు  సినిమా రీలులా వెనక్కు వెళ్ళింది.           

***

          సమయం సాయంత్రం ఆరుగంటలు కావస్తోంది. క్రమంగా చీకట్లు కమ్ముకొస్తున్నాయి. పద్మావతి  కాలుగాలిన పిల్లిలా వాకిట్లోకి ఇంట్లోకి తిరుగుతోంది. సీతాపతి తాపీగా ఈజీఛైర్లో కూర్చొని న్యూస్పేపరు చూస్తున్నాడు.

"ఏమండీ...టైం ఎంతయిందో గమనించారా!  రాజ్యం స్కూల్ నుంచీ  ఇంకా రాలేదండీ!"

"వస్తుందిలేవే! అన్నిటికీ కంగారే నీకు. ఆఫీసు నుండి ఇప్పుడేగా వచ్చాను. కాఫీ అన్నా నా మొహాన పొయి!"

"రోజూ ఐదింటికే టంచనగా వచ్చే పిల్ల..." అనగానే బయట గుమ్మం వద్దకు వెళ్ళి వచ్చి… "అదుగో.. చూడు! వస్తోంది..కనిపించిందా? చూడుకంగారు పడకే అంటాను. మీటింగో పెట్టుంటారు స్కూల్లో" అన్నాడు వీధిలోకి చూస్తూ.

రాజ్యం రాగానే స్కూలు బ్యాగు టేబుల్ మీద పడేసి "నాన్నా..మా హెడ్మిస్ట్రెస్ మేడం మీ ఇద్దరినీ రేపు ఒకసారి  స్కూలుకు రమన్నారు" అనేసి వంటింట్లోకి వెళ్ళి ఫ్రిజ్లో బాటిల్ తీసుకుని మంచినీళ్ళు గబగబా తాగుతోంది.

"మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టావే స్కూల్లో... చెప్పి చావు!" అరిచింది పద్మావతి.

"ఏయ్..ఏమిటా అరుపులు? చిన్నగా మాట్లాడలేవా? నీ అరుపులు బజారంతా వినిపిస్తున్నాయి." అన్న సీతాపతి మాటలకు "నాన్నా..అమ్మకు అలవాటేగదా.. అలాగే అంటుంది కానీ నేంచెప్పేది విను" అనగానే ఇద్దరూ రాజ్యం వంక ఆశ్చర్యంతో చూశారు.

"ఇవాళ స్కూల్లో యూనిట్ టెస్ట్ మార్కులిచ్చారు. మామూలుగా  నాకు ఫస్ట్ వచ్చింది" అని మళ్ళీ ఇంకో గుటక మంచి నీళ్ళు తాగింది.

"అయితే.. మంచిదేగదా.. దానికి మేమెందుకు స్కూలుకు రావడం…" అన్న పద్మావతి మాటలను అందుకుంటూ "ఆగమ్మా.. సాంతం విను..నేను మధ్యాహ్నం లంచి బెల్లో తొందరగా అన్నం తినేసి రేపటి లెక్కలు హోంవర్కు చేసుకుంటున్నాను. ఇంతలో రాకేష్ వాడి ఫ్రెండ్సు క్లాస్రూములోకి వచ్చిదీని ఏషాలు చూశావారా.. కిషోరూ.. ఇంటికెళ్ళి చేసుకోవచ్చుగదా.. హోంవర్కు!” అనగానే ....”ఇంట్లో అంట్లు తోముతుందేమో రా!”.. అని కిషోర్ నవ్వాడు. నేను మీకనవసరంరా! నేనెక్కడైనా చేసుకుంటా! మీరెవరు అడగడానికి? పొయి పనిచూసుకోండి! అన్నాను. రాకేషు వినకుండా క్లాస్ ఫస్ట్ వస్తుందని దీనికి బాగా గర్వం..అవీ ఇవీ మాట్లాడాడు. నేను అవున్రా! నువ్వు నా మీద పడి ఏడవడమెందుకు? నువ్వూ బాగా చదువుకోని చావొచ్చు గదా! అన్నాను. దానికి వాడు నన్ను చావమంటావా అని నా జడ పట్టుకుని లాగాడు.  నేను ముక్కుమీద ఒక్కటి గుద్దాను." అంది. సీతాపతి పద్మావతి మొహాలు చూసుకుని "అప్పుడేమైంది?" అని అడగ్గానే రాజ్యం మెల్లిగా "దెబ్బ కొద్దిగా గట్టిగానే తగిలినట్టుంది. ముక్కులో నుంచి రక్తం వచ్చింది" అనగానే "తర్వాత.." అన్నారు. “ రాకేష్ ఇంటికి ఫోన్ చేసినట్టున్నాడు. సాయంత్రం వాళ్ళ అమ్మ స్కూలుకొచ్చి  నా నా గొడవ చేసింది. క్లాస్ టీచర్ హెచ్.ఎం కు కంప్లెయింట్ చేసింది.  అందుకే హెడ్మిస్ట్రెస్ మిమ్మల్నిద్దరినీ రేపు ఒకసారి రమ్మన్నారు"

"ఎంతపని చేశావే! దరిద్రం మొహమా! గొడవలూ అవీ మానేయమని చెప్పానా లేదా? ఎల్.కేజీ నుంచీ ఇదే తంతు నువ్వు. ఆడపిల్లనన్న ఇంగితజ్ఞానం ఉందా నీకసలు!" అని ఫైరయింది.

"ఏమీ అవదులే.. రేపు వెళ్దాం.. సారీ చెప్దాం" అని సీతాపతి చాలా సింపుల్‌గా అనగానే "ఈమె గారి స్కూల్ చదువు అయేలోపు ఎన్ని సారీలు చెప్పాలో, ఎంతమందితో మాటపడాలో.. ఏమిటో! నేను రాను. నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి మీరే మానేజ్ చెయ్యండి. ఖర్మ!" అని కూతురుని కొరకొర చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. నీకేం భయంలేదు నేనున్నాను అని సీతాపతి సైగ చేశాడు.

- ప్రక్కరోజు ఉదయం. హెడ్‌మిస్ట్రెస్ వెరోనికా గదిలో సీతాపతి, రాకేష్ అమ్మ, నాన్న సమావేశమయ్యారు. రాకేష్ అమ్మ బుడి బుడి రాగాలు తీస్తూ ఏడుస్తూ ఉంది.  హెడ్‌మిస్ట్రెస్ "మీరు ఊర్కోండి" అని సముదాయించి, రాకేష్‌ను, రాజ్యాన్ని పిలవమని అటెండర్‌కు చెప్పింది. వారిద్దరూ వచ్చి 'గుడ్మార్నింగ్ మేడం' అని నిల్చున్నారు.

"రాజీ నువ్వు చేసింది తప్పు! మగ పిల్లల్ని అలా కొట్టొచ్చా?. అంకుల్‌కు ఆంటీకి సారీ చెప్పు" అన్న హెడ్‌మిస్ట్రెస్ మాటకు రాజీ "సారీ మేడం! మొదట వీడు నాజోళికి రాకూడదు. వచ్చినా వెళ్ళకుండా ఏదేదో వాగి నా జడ పట్టుకుని లాగాడు. అందుకనే చెయ్యి చేసుకోవలసి వచ్చింది. మొదట వాణ్ణి నాకు సారీ చెప్పమనండి. నేనూ చెప్తాను" అంది ధైర్యంగా.

"చూశారా మేడంగారూ..మీ ముందే ఎలా ప్రవర్తిస్తోందో రౌడీ పిల్ల!" అని రాకేష్ వాళ్ళ అమ్మ అనగానే, " ఎక్స్‌క్యూజ్ మీ.. మేడం... మీ అబ్బాయిని మొదట కంట్రోల్‌లో పెట్టుకోండి. ఏ ఆడపిల్లయినా జడపట్టుకుని లాగితే ఊర్కుంటుందా! మీ అబ్బాయి రౌడీ పని చెయ్యలేదా!  మీరు ఇలాగే సమర్ధిస్తే పెద్దయ్యాక ఇంకా చాలా ఘోరాలు జరుగుతాయి" అని సీతాపతి అన్నాడు.

"మా అబ్బాయికి ముక్కులోంచి రక్తం కారింది. తను బాగానే ఉంది కదా!"

"మీ వాడు మా అమ్మాయి జోళికి రాకుండా ఉంటే ఇలా అయ్యేది కాదుగదా!"

"ఇక ఆర్గుమెంట్స్ ఆపండి!. రాకేష్, రాజ్యం ఇద్దరికీ చెప్తున్నా! ఇటువంటి గొడవలు పడితే మీ ఇద్దరికీ టి.సి ఇచ్చి పంపిచ్చేస్తాను. వెళ్ళండి మీ క్లాసుకు" అంది.

          అందరూ లేచే సరికి సీతాపతిని ఉండమన్నట్టు సైగ చేసి.. "మీరు వెళ్ళండి. నేను సీతాపతిగారితో అన్నీ చెప్పి పంపిస్తాను. ఇంకో సారి ఇలా జరక్కుండా.." అనేసరికి వెళ్ళిపోయారు. "సీతాపతిగారూ.. మీ అమ్మాయి చెప్పింది చాలా కరెక్టు. ఆడపిల్లలు  భయపడి ఊర్కోడం వల్లనే లోకంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మీ అమ్మాయిని ఇలాగే పెంచండి. ధైర్యంగా ఉండమనండి. అన్యాయాన్ని ఏమాత్రం భయంలేకుండా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేయమని చెప్పండి.  నేను ఇలా అన్నానని స్కూల్లో ఎక్కడా చెప్పకండి. మీ బిడ్డ ఉన్నత విద్యావంతురాలై దేశానికి ఆదర్శం కావాలని ఆ జీసస్ అండగా ఉండాలని కోరుకుంటున్నాను.  వెళ్ళిరండి!" అని నమస్కారం చేసి మెడలోని శిలువను కళ్ళకద్దుకుంది.

***

          “అమ్మా! రాజీ నువ్వా తల్లీ..” అని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది వెరోనిక.  వెరోనికను గట్టిగా కౌగలించుకుని...  "అవును టీచర్! మీరానాడు వేసిన మొక్కను నేను. మీరు ఇచ్చిన ధైర్యంతోనే పట్టుదలగా ఐ.పి.ఎస్ చదివాను. మీ పొగతోట స్థలం కాగితాల జెరాక్సు ఇవ్వండి. ఈ పేపరుపై ఒక్క సంతకం పెట్టండి చాలు" అంది.  వారంరోజుల్లో ఇంటితో సహా స్థలం వెరోనికా వశమయిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను..

-0o0-

No comments:

Post a Comment

Pages