త్రివిక్రమావతారం - 4
శ్రీరామభట్ల ఆదిత్య
భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రావడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా.
ఓ పరమేశ్వరా! ఆనందస్వరూపా! తల్లితండ్రులూ, అన్నదమ్ములూ, మిత్రులూ, గురువులూ, బుద్ధిచెప్పడంతో ఏమీ నష్టం కలుగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మావంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గరువులలో మొదటిగురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగాగాని సిగ్గుగా కానీ లోటుగా కానీ బాధగా కానీ నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్నుఎదిరించి పోరాడి యోగీశ్వరులు పొందే స్థానాన్ని పొందారుకదా స్వామీ! నీ దగ్గర అసాధ్యం అన్నది ఏముంది? అయ్యయ్యో! మృత్యువు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడు దగ్గర చుట్టమా? యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాళ్ళతో కానీ మలచాడా? సత్యం ఇలా ఉండగా, మూర్ఖుడు సత్యమూ దానమూ దయా ధర్మమూ మొదలైనవాటిని వదలివేస్తున్నాడు.
ఈ మాయాసంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు. పురాణపురుషా! "చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది" అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్సించలేకపోయారు. నీవు అర్థివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!".
ఇంతలో అక్కడకి ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలమూ, తాజా పద్మాలవంటి కన్నులూ కలవాడు; పచ్చని పట్టువస్త్రాన్నికట్టుకున్నవాడు; చక్కగా మాట్లాడడంలో నిపుణుడు; సంసారపు బంధాలను తెగత్రెంచుకున్న సుగుణసంపన్నుడు; భక్తితో భగవంతుని పాదాలను లోబరచుకున్నవాడు; దుఃఖాన్ని పారద్రోలి జ్ఞానవిద్యతో ఆనందించేవాడు; అటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు. బలి చక్రవర్తి తన తాత రాక గమనించినా, వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందు వలన, అతడు ప్రహ్లాదుడికి నమస్కారం చేయడానికి వీలుకాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్ళు పొంగాయి; అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు; వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు, ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడూ మొదలైన వారితో కూర్చుని యున్న వామనదేవుని చూసాడు; సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి; ఒడలు పులకరించింది; అతడు స్వామికి సాగిలబడి నమస్కరించి ఇలా మనవి చేసాడు.
( ఇంకా ఉంది)
No comments:
Post a Comment