త్రివిక్రమావతారం - 5 - అచ్చంగా తెలుగు
 త్రివిక్రమావతారం - 5

శ్రీరామభట్ల ఆదిత్య 




"స్వామీ నీవు వీనికి మొదట ఇంద్రపదవి ఇచ్చావు. మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికీ మూలకారణం అయి ఉన్నది; గర్వం అనే కారుచీకటిని కలిగించేది; అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే; అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు; పరమాత్ముని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకూ కొరగానిది; అది నీపాద సేవకు సాటిరాదు; ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు; చెవులు వినిపించవు; మనస్సుకు మైకం కమ్ముతుంది; నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేసావు.". ఆసమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండుచేతులనూ నుదిటిపై జోడించి "దయామయా! లక్ష్మీపతీ! నాకు పతిభిక్షపెట్టు" అంటూ ముల్లోకాలకూ ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది.

ఓ లోకపూజ్యుడా! లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు.ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా! "కాదు, లేదు, పో, ఇవ్వను" అన లేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేసాడు కదా! ఇంకెందుకు స్వామీ! లక్ష్మీపతీ! నా పతిని బంధిస్తున్నావు. ఇలా ప్రహ్లాదుడూ వింధ్యావళీ విన్నవించు సమయమున బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నాడు.


ఓ దేవదేవా! దేవవంద్యా! జగన్నాథా! కమాలల వంటి కన్నులుగల శ్రీహరీ! నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు; బలిచక్రవర్తి గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేసాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు. నీచే దయచూప దగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన, గరిక పత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేసాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్ళతో కట్టివేయడం న్యాయము కాదయ్యా!". ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు అగు వామనుడు ఇలా అన్నాడు.

"ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో, వాడి సంపద అంతటిని అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారిస్తుంటాడో, వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ, చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో, వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకికసంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు.

ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు.

( ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages