అనసూయ ఆరాటం - 16 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 16 

చెన్నూరి సుదర్శన్ 

 

కన్కయ్య కార్ల ఆదిరెడ్డిని జహీరాబాదుకు తీస్కపోతాంటే.. గిసోంటి ఏ.సి. కార్ల పయానం చేత్తనని కలల సుత అనుకోలేదని సంబుర పడబట్టిండు.

కూకట్‌పల్లి నుండి జహీరాబాదు చేరెటాల్లకు కమస్కం రెండు గంటల టైం పట్టింది. సురేందర్ దగ్గరుండి జాగ్రత్తలు చెప్పుకుంట సాగనంపిండు.

సక్కంగ కారు జహీరాబాదు టెలీఫోన్ అఫీసు ఎన్కాల ఉండే మానయ్య కమ్ర ముందల ఆగింది. వీల్ల కోసమే ఎదురి సూత్తాన మానయ్య కారు సప్పుడుకు సట్న తలుపు తీసి ఉర్కచ్చిండు.

 డిక్కీ తెరవంగనే ఆదిరెడ్డి, మానయ్య కలిసి సామానంతా దించిండ్లు. కారు లోపల సుత కొంత సామానుండె అది సుత దించి కమ్రల ఓమూలకు సదిరిండ్లు. 

“మానయ్యా.. నీకు తోడుగా ఆదిరెడ్డిని తీస్కచ్చిన. మంచిగ పని నేర్పియ్యి. ఇద్దరు కలిసి ఫోన్లు, కంప్యూటర్లు ఫిట్టింగులు చెయ్యుండ్లి” అన్కుంట వర్క్ ఆర్డర్లు తీసిచ్చిండు. అవన్నీ జహీరా బాదులనే గాకుంట.. సుట్టుముట్టు ప్రైవేటు కంపెనీలల్ల  ఫిట్టింగులు చెయ్యాలె. కొన్ని బీదర్ల సుత ఉన్నై. 

ఆదిరెడ్డికి అడ్వాన్సుగ వెయ్యి రూపాయలిచ్చిండు కన్కయ్య. మానయ్యకు అప్పటిదాకా చేసిన ఫిట్టింగులకు కమీసనిచ్చిండు. 

“ఇది నీపని.. అది నాపనని కొట్లాడుకోకుంటా.. కలిసి మెలిసి పని చెయ్యుండ్లి. మీ పనితనం బాగుందని మెప్పుకోలు వత్తే  ఇంకా మీకు జీతం పెంచుతా..” అని ఆశ సూపి పొయిండు కన్కయ్య.

***

ఆదిరెడ్డికి సురేందర్ చెప్పిన మాటలే యాదికత్తానై. 

‘కష్టే ఫలి.. అన్నరు. బాగా కట్టపడు. నీ మీద తమ్ముడు చెల్లె. అమ్మా ఆధారపడి ఉన్నరు. నీతి. నిజాయితీ తోటి పని చేసుకుంట మంచి పేరు తెచ్చుకోవాలె. లోకం మెచ్చుకుంటది..’  అని నిద్రల ఆదిరెడ్డి కలవరిత్తాంటే వీపు తట్టి లేపిండు .. మానయ్య.

తెల్లందాక ఒకరి కట్టాలు మరొకలు  చెప్పుకున్నరు. 

పురంగ తెల్లారినంక లేచి చెరువుకు పోయి అన్ని పనులు చేసుకొని వచ్చిండ్లు. వంట చేసుకొని తిని సామాను సదురుకొని పనిల పడ్డరు.

పది రోజుల్లనే ఆదిరెడ్డి పనిల ఆరితేరిండు.

ఏనెల కానెల పెండింగు లేకుండా పని చేత్తాంటే.. కన్కయ్య ఓ పక్క ఖుషీగున్నడు. మరో పక్క ఆదిరెడ్డికి జీతం కంటే.. కమేసనే ఎక్కువ ముట్టబట్టింది. ఇంటికి పంపించే పైసల మూట పెరుగబట్టింది. 

అనసూయ కారట్ల మీద కారట్లు  “నాకు తమ్ముడు లేని లోటు తీర్సినౌ తమ్ముడూ..”  అని రాయించి సురేందర్‌‌కు టప్పల ఏయించేది. 

“అక్కా నువ్వు ఇక్కడి ఫికరు చెయ్యకు. ఆడ అనిమిరెడ్డిని.. జయమ్మను బాగా సదివించు” అని సురేందర్ జవాబులు రాసేటోడు.

***  

ఆదిరెడ్డికి మల్లో యాడాది సర్వీసు  పూర్తయ్యింది. ఊల్లె శాన మందికి తెల్సి పోయిండు. ఆదిరెడ్డి వత్తెనే ఫోన్లు బాగైతయని అందరికి నమ్మకం కుదిరింది.

ఒకరోజు ఆదిరెడ్డి జహీరాబాదు చిట్ ఫండ్ కంపెనీల ఫోన్లు ఫిట్టింగులు చేత్తాంటే.. ఒక మెకానిక్ వచ్చి ఏ.సి. ఫిట్టింగ్ చేత్తాండు. మెకానిక్‌నడిగి పేరు తెల్సుకున్నడు. రాంబాబు అని చెప్పిండు.  

వాల్ల కాంట్రాక్టర్ కాంతయ్య వచ్చి లెక్క సూసుకొని పైసలు తీసుకుంటాంటే ఆదిరెడ్డికి ‘అబ్బ గన్ని పైసలా..!’ అనిపిచ్చింది. 

కాంతయ్య పని చేసుకొని రాంబాబును తీసుకొని పోవుకుంట ఆదిరెడ్డిని పిలిచిండు.

“బాబూ నే పేరేంది” అని అడిగిండు కాంతయ్య. 

“సార్.. నాపేరు ఆదిరెడ్డి” అని ఎంతో మర్యాదగ చెప్పిండు. 

“ఎంత కాలం నుండి ఈ పని చేత్తనవ్” 

“దాదాపు యాడాది అయితాంది సర్” 

“నీకు నెలకెంత గిట్టుబాటైతాంది”

“సార్.. ఏదో పొట్ట గడ్తాంది” 

“నా దగ్గర పనిచేత్తవా.. నెలకు నాలుగు వేలిత్త. ఒక్కొక్క ఏ.సీ. ఫిట్టింగుకు కమీసనిత్త”

ఎగిరి గంతేసినంత పని సేసిండు ఆదిరెడ్డి. కాని పైకి మాత్రం “మా సార్‌కు ఒక మాట చెప్పి..” అంటాంటనే..

“సారుకు చెప్పుకుంటవో.. ఎవలకు చెప్పుకుంటవో.. నాకు తెల్వదు. ఎండకాలం సీజన్ల ఏ.సీ. ఫిట్టింగులకు శాన గిరాకి ఉన్నది. కస్టమర్లందరు సక్తు చేత్తాంటరు. నీకు హైద్రాబాదులనే ఎక్కువ పని ఉంటది. వచ్చే సోమారం నా ఆఫీసుకు రా.. నువ్వు రాకపోతే ఇంకోలను సూసుకుంట” అని కీసల కెల్లి తన విజిటింగ్ కారటు తీసిచ్చి..  కారు తానకు పోబట్టిండు కాంతయ్య. ఇంతల ఎవలో కలిత్తే ఆగిండు.

రాంబాబు తోని కాంతయ్య ఎసోంటోడో.. తెల్సుకున్నడు ఆదిరెడ్డి. 

“నువ్వు తప్పకుండా రా.. ఆదిరెడ్డీ.. మనమిద్దరం కలిసి పనిచేద్దాం” అన్కుంట.. కాంతయ్య ఇషార చేత్తాంటే రాంబాబు ఉర్కిండు కారెక్కడానికి. 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages