పురాణ కధలు - బసవ పురాణం -24
పి.యస్.యమ్.లక్ష్మి
24. మరి కొందరు శివ భక్తుల కధలు
శివుడు భక్తులంటే తనకున్న ప్రేమను, వారు తనకెంత ముఖ్యులో వివరిస్తూ
మరికొన్ని కధలు చెప్పాడు.
బాణుని కధ
బాణుడు బలి చక్రవర్తి పెద్ద కొడుకు.
ఆయన గొప్ప శివ భక్తుడు. విశాల
సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ, రోజుకి వెయ్యిసార్లు శివ పూజ చేసేవాడు. దానితో ఆయనకి శివపూజకే సమయం సరిపోకపోవటంతో
రాజ్య పరిపాలనా కార్యక్రమాలు సరిగా చూసుకోవటానికి సమయం సరిపోయేది కాదు. అందుకని శివుడు అతనిని కరుణించి ఒకే సమయంలో
వెయ్యిసార్లు పూజ చెయ్యటానికి వీలుగా వెయ్యి చేతులిచ్చాడు. దానితో అతడు తక్కువ సమయంలో శివ పూజ
వెయ్యిసార్లు చెయ్యగలిగాడు. దానితో అతని
కీర్తి లోకమంతా వ్యాపించి, అతనిని చూడటానికి ఎక్కడెక్కడినుంచో ప్రజలు
రాసాగారు. వాళ్ళతో మాట్లాడుతుంటే అతని పూజ
భంగమవుతుందని శివుడు బాణుడి పూజ పూర్తయ్యి అతను ప్రసాదం స్వీకరించేదాకా ఎవరూ
అతనికి అంతరాయం కలిగించకుండా అతని ద్వారం వద్ద తనే కావలి వుండేవాడు. ఇది భక్తుని భక్తికి భంగం కలిగించకుండా
భగవంతుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు.
భక్తునిపట్ల భగవంతునికికల ప్రేమని తెలియజేసే కధ.
కలియంబి నయనారు కధ
ఈయన ఒక ధనికుడు. గొప్ప శివ
భక్తుడు. నిత్యమూ శివ భక్తుల పూజించి వారల
భోజనాదులచే సంతృప్తి పరచేవాడు. ఈయన
పరిచారకులలో ఒకరు యజమానికి తెలియకుండా పారిపోయి లింగధారియై జంగమ భక్తులతోకూడి
తిరుగుతూ, వారితో కలసి ఒకసారి కలియంబి నయనారు ఇంటికి ఆతిధ్యానికి వచ్చారు. వారికి అర్ఘ్యాద్యుపచారాలు చేసే సమయంలో నయనారు
భార్య తమ పరిచారకుని గుర్తించి ఆతనికి కాళ్ళు కడిగే సమయంలో ఇతను మన
పరిచారకుడు. ఈతని కాళ్ళు మీరు కడుగ రాదు
అని నీరు పోయటం ఆపింది. అతను ఎవరైనా
ప్రస్తుతం లింగధారుడు. జంగమ భక్తుడు. అతనిని పూజించవద్దని చెబుతావా అని భార్యమీద
కోపగించి అతని కాళ్ళు కడగటానికి నీరు పోయని భార్య చేతులు కోపంతో నరికేశాడు. నయనారు భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై
ఆమెకి చేతులిచ్చి, కరుణించాడు.
గణపాలుని కధ
పూర్వము గణపాలుడనే రాజు తన రాజ్యములోఅందరూ లింగధారులు కావలెనని
సంకల్పించి అందరినీ నయానో, భయానో, ధనాకర్షతోనో, ఇంకేదో విధంగానో లింగధారులను
చేయసాగాడు. శివుడు అతనిని
పరీక్షించదలచి లింగధారుడు కానివానిగా అతని దగ్గరకు వచ్చి, “ రాజా, నేను
మీకు శిస్తు బాకీ లేను. కప్పము
ఎప్పటికప్పుడు కడుతున్నాను. దేవరవారికి
కానుకలు సమర్పించుకుంటున్నాను. నేను
ప్రభుత్వానికి ఏ విధమైన బాకీలేను. అయినా
మీ భటులు నన్ను అనేక విధముల ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకో విచారించి తగు ఆనతి ఇవ్వండి” అని ప్రార్ధించాడు.
అప్పుడు రాజు, “నీ విషయము విచారించి తగు చర్య తీసుకుంటాముగానీ, లింగధారులు
కానివారికి మా సభలో ప్రవేశం లేదు. వాకిట
కాపలా వున్న భటులను తప్పించుకుని నువ్వెలా లోపలకి వచ్చావు? ముందు వెళ్ళి లింగధారివై తిరిగి రా. అప్పుడు తగిన చర్య తీసుకుంటాను” అన్నాడు.
వచ్చిన ఆసామీ, “అయ్యా, మా వంశంలో ఎవరూ లింగధారులు లేరు. అలాంటప్పుడు నేనెలా కాగలను?” అని అడుగగా రాజు కావలసింత ధనమిస్తానని ఆశ
చూపాడు. అనేక విధాల నచ్చజెప్పబోయాడు. అయినా లాభం లేకపోయింది. విసిగిన రాజు తన కత్తి తీసి అతని గొంతు
నరకబోయాడు. ఆ సమయంలో శివుడు తన నిజ రూపంలో
ప్రత్యక్షమయి, “రాజా, నిన్ను పరీక్షించదలచి ఈ రూపంలో వచ్చాను. ఏమి వరం కావాలో కోరుకో” అన్నాడు.
గణపాలుడు “దేవా నాకు వరమివ్వదలచుకుంటే, నువ్వు ముందు వచ్చిన రూపంలో లింగధారివైరా. నాకంతకుమించి వేరే వరమక్కరలేదు” అనగా శివుడు భక్తుని కోరిక మన్నించవలసి వచ్చింది. భగవంతుడికి భక్తులంటే అంత ప్రీతి.
***
No comments:
Post a Comment