చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 23 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 23

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 23

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery

నవలా రచయిత : Carolyn Keene

 

(నాన్సీ వెంటపడ్డ వ్యక్తి ఆమెకు దొరక్కుండా పడవలో పారిపోతాడు. జుడ్ అతనెవరో తనకు తెలియదంటాడు. పద్దెనిమిదేళ్ళ క్రితం రైల్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పాపను చూసి, ఆమెను పలకరించినట్లు జుడ్ అమ్మాయిలకు చెబుతాడు. నాన్సీ చూపించిన జోనీ ఫోటో, అప్పుడు తాను చూసిన అమ్మాయి పోలికలో ఉందని అంగీకరించాడు. అమ్మాయిలు చాలా ఏళ్ళుగా డీప్ రివర్లో ఉంటున్న ఒక దుకాణంలో విచారించగా, తాము హోర్టన్ యింటికి సరుకులను పంపినా, వాటిని గుమ్మం దగ్గరే వదిలి, అక్కడ ఉన్న చెక్కు తీసుకొనేవారమని, భౌతికంగా యింట్లో ఎవరినీ చూడలేదని చెబుతారు. తమ మిత్రులు వస్తున్నందున తాను ముస్తాబు కావాలని బెస్ చెప్పటంతో వారు మోటెల్ కి బయల్దేరుతారు. తరువాత. . .)

@@@@@@@@@@@@@


అమ్మాయిలు టాక్సీలో మోటెల్ కి బయల్దేరారు. వాళ్ళక్కడకు చేరుకోగానే, నాన్సీ టెలిఫోను దగ్గరకు వెళ్ళింది. ఆమె పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోను చేసి, దొంగిలించబడ్డ తన కారుకి సంబంధించిన సమాచారమేమన్నా ఉందేమోనని అడిగింది.


"దొరకలేదు" డ్యూటీలో ఉన్న అధికారి చెప్పాడు. "నన్ను క్షమించండి మిస్ డ్రూ! దాన్ని కనుక్కొనే ప్రయత్నంలోనే మేమింకా కష్టపడుతున్నాం."


తరువాత నాన్సీ మిస్టర్ వీలర్ కనిపించాడా అని అడిగింది. మళ్ళీ లేదనే బదులొచ్చింది. నాన్సీ ఫోను పెట్టేసింది.


గాయపడిన న్యాయవాది ఆచూకీపై ఆందోళన, నిరాశ ఉన్నప్పటికీ, ఆ రోజు లభించిన కొత్త క్లూలు ఆమెను ప్రేరేపించాయి. ఉత్తేజితురాలైన ఆమె వెంటనే గదికి వెళ్ళి విశ్రాంతయినా తీసుకోవాలి లేదా బయటకు వెళ్ళటానికి దుస్తులన్నా మార్చాలి అని భావించింది. "నేను దుర్భిణీ(బైనాక్యులర్)ని తీసుకొని, ఆ కోటను మరొకసారి చూడాలి" అని నిర్ణయించుకొందామె.


అద్దాలను తీసుకొని ఆమె భవనం పైకప్పు పైకి వెళ్ళింది. ఆమె దుర్భిణీని సుదూర భవనంపై కేంద్రీకరించినప్పుడు, కోట యొక్క బురుజు పైభాగం స్పష్టంగా కనిపించింది.


నాన్సీకి ఊపిరాగిపోయింది. బుగ్గమీసాలు, చింపిరి జుట్టుతో ఉన్న ఒక వ్యక్తి బురుజు పైకప్పు మీద నిలబడి ఉన్నాడు. అతను కూడా తన కళ్ళ దగ్గర దుర్భిణీని పెట్టుకొన్నాడు. ఆతను నేరుగా మోటెల్, నాన్సీపై తన దృష్టిని కేంద్రీకరించాడు!


వెంటనే నాన్సీ చెట్టు చాటుకు తప్పుకొంది. "అతను నన్ను చూడలేదనే ఆశిస్తున్నాను." అతని దృష్టిలో తను పడకుండా, తన దుర్భిణీని అతనిపై కేంద్రీకరించటం ఆపలేదు.


ఆ వ్యక్తి తన దుర్భిణీని కిందకు దించి, తన చేతులను విచిత్రంగా కదిలించసాగాడు. నాన్సీ ఏకాగ్రతతో అతనినే చూస్తోంది.


"ఆ మనిషి కేమన్నా పిచ్చి పట్టిందా? లేక వేరే వ్యక్తి కెవరికైనా సంకేతాలు పంపుతున్నాడా?" నాన్సీ తనలో ప్రశ్నించుకొంది.

@@@@@@@@@


"హై! గూఢచారీ!" మగ స్వరం పిలిచింది.


నాన్సీ దుర్భిణీని కిందకి దించి, వేగంగా వెనక్కు తిరిగింది. "నెడ్!" హుషారుగా అరిచింది.


అతను ఆమెను ముద్దు పెట్టుకొన్నాడు, తరువాత ఈ మిస్టరీ కేసులో ఆమె ఎలా ముందుకెళ్ళిందని అడిగాడు. బదులుగా ఆమె అతని చేతికి దుర్భిణీనిచ్చి, దూరంగా ఉన్న కోట బురుజు వైపు చూపించింది. "ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో నువ్వు కనిపెట్టగలవేమో చూడు" ఆమె సూచించింది.


నెడ్ అద్దాలను సర్ది చూసాడు. చివరకు కోపంగా యిలా అన్నాడు, "ఆ పొడవాటి గడ్డంతో, చింపిరి జుట్టుతో అదో చెట్టు కాయలా ఉన్నాడు. కానీ వాస్తవానికి అతను తన ధోరణిలో పని చేసుకుపోతున్నాడు. బహుశా ఎవరికో సాంకేతిక పద్ధతిలో సందేశాన్ని పంపుతున్నాడనుకొంటా!"


నాన్సీ అతని దగ్గర అద్దాలను తీసుకొని, తాను ఆ వింత మనిషిని పరికించింది. అతను మరో అరగంట వరకు అవే సైగలను కొనసాగించి అదృశ్యమయ్యాడు.


"అతను కోట లోపలకు వెళ్ళాడని నేను ఊహిస్తున్నాను" చెప్పిందామె.


నెడ్ దుర్భిణీని అందుకొన్నాడు. "నేను ఆ వ్యక్తి కోట వెలుపలకు వస్తాడో, లేదో చూస్తాననుకో! ఒకవేళ బయటకు వస్తే, అతను ఎక్కడకు వెళ్తాడో, ఏమి చేస్తాడో గమనిస్తాను. ఈ లోపున నువ్వు యింతవరకు జరిగిన వివరాలు, తాజా సమాచారంతో పాటు, నాకు తెలియపరచు."


జోనీ హోర్టన్ తప్పిపోవటం గురించి, మిసెస్ హోర్టన్ సేవకులే ఆ పిల్ల అదృశ్యానికి కారకులన్న తన అనుమానం గురించి నాన్సీ అతనికి చెప్పింది.


హోర్టన్ ఎస్టేట్ వ్యవహారాన్ని పరిష్కరించటంలో వీలర్ పాత్ర, ఆసుపత్రి నుంచి అతని అదృశ్యం, పీటర్ జుడ్ కథ, తనను, జార్జ్ ని అనుసరించిన అపరిచితుల గురించి టూకీగా చెప్పింది.


"వారిలో ఒకడు తన పేరు సీమన్ అని చెప్పుకొంటున్నాడు."


"అంటే పధ్నాలుగేళ్ళ క్రితం పెద్ద పితలాటకం జరిగిందని నువ్వు అనుమానిస్తున్నావు" అని నెడ్ వ్యాఖ్యానించాడు. "ఒక వారంలో ఫలితం తేల్చటానికి మా అబ్బాయిలకు యిది ఒక ఉత్తర్వు అని నేను చెప్తాను. కానీ మా శక్తి కొద్ది ప్రయత్నిస్తామని మాటిస్తున్నాను."


నెడ్, నాన్సీ కొంత సమయం అద్దాలను కోట మీద కేంద్రీకరించి ఎదురుచూసినా, బురుజు మీద కానీ, కోట ముందు మైదానంలో కానీ ఎవరూ కనిపించలేదు. నెడ్ చిరునవ్వు నవ్వాడు. "ఆ వ్యక్తి అక్కడే నివసిస్తున్నాడని నేను ఊహిస్తున్నాను" అన్నాడతను. "నువ్వు అద్దె చెల్లించకుండా ఉండటానికి, అదేమంత పనికిమాలిన ప్రాంతం కాదు."


"మేము కందకం నీటిలో ఈదుకొంటూ కోట వైపు వెళ్ళినప్పుడు నన్ను, జార్జ్ ని హెచ్చరించిన వ్యక్తి బహుశా యితనే అయి ఉంటాడు" అంది నాన్సీ.


"అలాంటప్పుడు, మీ అమ్మాయిలు ఒంటరిగా మళ్ళీ అక్కడకు వెళ్ళకూడదు."


నెడ్, నాన్సీ బురుజు పైనుంచి సంకేతాలను పంపిన వ్యక్తి గురించి మాట్లాడుకొంటూ మోటెల్ వైపు నడిచారు. అతను ఎవరికి సందేశాన్ని పంపాడన్న విషయాన్ని ఆశ్చర్యపోతూ చర్చించుకొన్నారు.


"నేను పరిష్కరించటానికి ప్రత్నిస్తున్న ఈ కేసుతో అతనికి సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు" అని నాన్సీ వ్యాఖ్యానించింది.


"అదే ఉన్నట్లయితే, ఆ సందేశాన్ని అందుకొనే వ్యక్తి మిస్టర్ సీమన్ కానీ, మరో వ్యక్తి కానీ కావచ్చు" నెడ్ చెప్పాడు.


నాన్సీ అంగీకరిస్తున్నట్లు తలూపుతూ, నెడ్ ని మోటెల్ నడవ లోకి తీసుకెళ్ళింది. అక్కడ బెస్, జార్జ్ తమ మిత్రులైన డేవ్ ఎవాన్స్, బర్ట్ ఎడిల్టన్లతో ఉత్సాహంగా మాట్లాడుతూ కనిపించారు. ఆమె మిసెస్ థాంప్సన్ కి నెడ్ ని పరిచయం చేసింది. బదులుగా, అతనికి ముగ్గురు కుర్రాళ్ళు పడుకోవటానికి ఆమె ఒక గదిని చూపించింది.


నలభై నిమిషాల తరువాత, ఆ యువత ఆకర్షణీయమైన దుస్తులు, సూట్లు ధరించి, నడవలో కలుసుకొన్నారు. విందు ఎక్కడ తీసుకోవాలో చర్చించారు. మిసెస్ థాంప్సన్ ఒక ప్రసిద్ధ భోజన ప్రదేశాన్ని సూచించింది.


"అక్కడ డాన్సింగ్ సౌకర్యం ఉంది. సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది."


"అది నా ప్రాంతం" అంటూ డేవ్ కొన్ని నాట్య భంగిమలు ప్రదర్శించాడు.


నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు అక్కడే విందు చేయాలని నిశ్చయించుకొని, నెడ్ కారులో బయల్దేరారు.


"నీ కారు విషయం ముందుకెళ్ళలేదా?" కారు ముందు సీట్లలో తన పక్కన కూర్చున్న నాన్సీని అడిగాడు నెడ్.


"ఒక్క అడుగు కూడా! పాదయాత్ర, కాకపోతే అద్దె టాక్సీయే మా పని. కానీ కోటకు వెళ్ళటం ఈరోజు మా కార్యక్రమాల్లో లేదు. రేపు చర్చి తరువాత అక్కడకు వెళ్దాం."


"నేను మీ సేవలో ఉన్నాను" అన్నాడు నెడ్.


వా ళ్ళు వెళ్ళిన రెస్టారెంట్ భవనం చాలా పెద్దదిగా ఉంది. ఆధునిక కాంక్రీటు నిర్మాణం, సరైన కొలతలతో తీర్చిన డిజైన్లు, వాటిపై తళతళలాడే రంగులు వేయబడ్డాయి.


లోపల అలంకరణంతా అసాధారణమైన శోభను విరజిమ్ముతోంది. వాళ్ళు వెళ్ళిన సమయానికే అక్కడ సజీవమైన సంగీతం మోగించబడుతోంది.


"ఇది న్యూయార్కు నగరంలోని అధునాతన ప్రదేశంగా కనిపిస్తోంది!" నెడ్ ఆశ్చర్యంతో వ్యాఖ్యానించాడు.


బెస్ మెల్లిగా తలనూపింది. "చంద్రమణి లోయ అధునాతనంగా లేదని మీకు అనిపించటానికి కారణమేమిటి?"


ఆమె మాటలకు ముగ్గురు కుర్రాళ్ళు విస్తుపోయారు. "చంద్రమణి లోయా?" డేవ్ అడిగాడు.


" ఔ! ఎవరో దాని పేరు మార్చారు" బెస్ వివరించింది. "ప్రస్తుతం దీన్ని డీప్ రివర్ లోయ అని పిలుస్తారు. కానీ చంద్రమణి అంటేనే చాలా ఎక్కువ అద్భుతంగా ఉంది."


ముగ్గురు జంటలు ఒక టేబుల్ వద్ద కూర్చున్న తరువాత, బెస్ కొనసాగించింది, "చంద్రమణుల గురించి చెప్పాలంటే, ఒక అందమైన దాన్ని నాన్సీ బహుమతిగా అందుకొన్నట్లు మీకు తెలుసా?" బెస్ సూటిగా నెడ్ నికర్సన్ వైపు చూస్తూ అడిగింది.


"లేదు, ఆమె నాకు చెప్పలేదు," అతను సమాధానం చెప్పాడు. తనే దాత నని చెప్పటానికి తనను ఆటంకపరచేదేదీ లేదని అతను చెప్పాడు.


"ఇది చాలా విచిత్రం" బెస్ అంది. "అక్కడ బహుమతితో పాటు కార్డు ఏమీ లేదు. . .కేవలం హెచ్చరిస్తున్న చీటీ తప్ప."


"హెచ్చరికనా?" నెడ్ పునరుద్ఘాటించాడు. "ఏ రకమైనది?"


అతను పరిహాసమాడినట్లు ఒప్పుకొనేవరకూ తను మరొక మాట అతనికి చెప్పనని బెస్ ప్రకటించింది. నెడ్ దీన్ని తీవ్రంగా ఖండించాడు. "నిజాయితీగా చెప్తున్నా! ఆ చంద్రమణిని నేను పంపలేదు" ప్రకటించాడతను.


"అయితే దాన్ని ఎవరు పంపారో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకొంటున్నాను. ఈ హెచ్చరిక గురించి నాకు చెప్పు."


మొత్తం కథంతా విన్నాక యిదేదో మిస్టరీయే అని అబ్బాయిలు అంగీకరించారు. వారిలో ఎవరూ దీన్ని వినోదంగా భావించలేదు. చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలనుకొన్నారు.


"ఈ చంద్రమణికి, చంద్రమణి లోయకు ఏదో సంబంధం ఉన్నట్లు నువ్వు ఊహించావని నేను అనుకొంటున్నాను" బర్ట్ చెప్పాడు.


(సశేషం)


No comments:

Post a Comment

Pages