శతవసంతాల గాన గంధర్వుడు ఘంటసాల
డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారథి
ఘంటసాల వెంకటేశ్వర రావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుడివాడ సమీపాన చౌటుపల్లి గ్రామం లో డిసెంబర్ 4, 1922 న జన్మించారు. వారి తండ్రి శ్రీ ఘంటసాల సూరయ్య గారు కర్ణాటక సంగీత విద్వాంసులు. తండ్రిగారు వెంకటేశ్వర రావు గారి బాల్యం లోనే పరమపదించడంతో మేనమామ అయిన శ్రీ ర్యాలీ పిచ్చి రామయ్య గారివద్ద పెరిగారు.
1936 లో తన పద్నాలుగేళ్ల ప్రాయంలో వెంకటేశ్వర రావు ఇంట్లోవారికి చెప్పకుండా విజయనగరం చేరుకున్నారు. అక్కడ సాలూరు చిన్న గురువుగారిగా పిలువబడే శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారివద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. సీతారామశాస్త్రి గారు సంగీత మాస్టారుగా పనిచేసే ప్రఖ్యాతి గాంచిన మహారాజా సంగీత కళాశాల లో వెంకటేశ్వర రావు విద్యార్థిగా ప్రవేశించారు. ఆ సమయంలో సుప్రసిద్ధ వాయులీనం విద్వాంసులు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడుగారు విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్ పదవిలో వున్నారు.
విజయనగరం లో నివసించిన కాలంలో (1936-1942) కర్ణాటక సంగీతం తో పాటు ఘంటసాల జానపద సంగీతం, బుర్రకథ, హరికథ, నాటకం, తోలుబొమ్మలాట ఇత్యాది కళలలో కూడా మంచి పట్టు సాధించారు.
1942 లో విజయనగరం సంగీత కళాశాల వేసవి శెలవలలో ఘంటసాల తన స్వగ్రామానికి వెళ్లారు. ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ముమ్మరంగా వున్న సమయం. ఉద్యమం వైపు ఆకర్షితుడైన ఘంటసాల దేశభక్తి గీతాలు పాడుతూ, జనాలని ఉత్తేజపరిచి వారిని ఉద్యమం వైపుగా మరలించటానికి చురుగ్గా ప్రయత్నాలు చేస్తూవుంటే, గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఘంటసాలకి పద్దెనిమిది నెలలు కఠిన కారాగార శిక్ష విధించింది. ఘంటసాలని తొలుత కైకలూరు జైలులో అటుపిమ్మట బళ్లారి లోని అలీపూర్ జైల్లో నిర్బంధించారు.
కారాగారవాసంలో ఘంటసాలకి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీయుతులు - బెజవాడ గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, ఎర్నేని సుబ్రహ్మణ్యం వంటి వార్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. జులై, 18, 1942 లో ఘంటసాల మహారాజా సంగీత కళాశాల, విజయనగరం వారి సంగీత డిప్లొమా ని పొందారు.
జైలు నుంచి విడుదల అయ్యాక ఘంటసాల తన స్వగ్రామం చేరుకొని, పరిసర ప్రాంతాలలో సంగీత కచేరీలు ప్రదర్శిస్తూ, నాటకాలలో వేషాలు వేస్తూ కొంతకాలం గడిపారు. మార్చ్, 3, 1944 న ఘంటసాలకి సావిత్రమ్మగారితో వివాహం అయింది. ఘంటసాల గారి అత్తవారి గ్రామం పెదపులివర్రు లో ఘంటసాల కి శ్రీ సముద్రాల రాఘవాచారి గారి పరిచయం కలిగింది. శ్రీ సముద్రాల రాఘవాచారిగారు అప్పటికే తెలుగు సినిమాల్లో బాగా పేరు పొందిన రచయిత. వారి ప్రోత్సాహంతో ఘంటసాల మద్రాసులో తెలుగు సినిమా రంగంలో గాయకుడిగా అడుగుపెట్టారు.
ప్రముఖ సంగీత సంస్థ హెచ్ ఎం వీ వారు ఘంటసాల గాత్రాన్ని తిరస్కరించగా శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు ఘంటసాలకు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో గాయకుడిగా అవకాశం ఇప్పించారు. అటుపిమ్మట హెచ్ ఎం వీ వారి తరఫున శ్రీ పేకేటి శివరాం 1945 లో ఘంటసాల గారిచేత ప్రైవేట్ పాటలు రికార్డింగ్ చేయించారు.
ఘంటసాల 1944 లో సీతారామ జననం సినిమాలో పాటలో కోరస్ గాయకుడిగా దానితోపాటు ఒక చిన్న పాత్ర కూడా ధరించారు. నేపధ్య గాయకుడిగా 1945 లో భానుమతి సరసన స్వర్గసీమ చిత్రం లో ఘంటసాల తన గళం విప్పారు. ఈ చిత్రానికి దర్శకులు శ్రీ బీ యన్ రెడ్డి గారు. ఆ తరువాత ఘంటసాల ఇంక వెనుతిరిగి చూసుకోలేదు. 1947 లో సంగీత దర్శకత్వం కూడా చేబట్టి 108 చిత్రాలకి ( 84 తెలుగు సినిమాలు అందులో 8 చిత్రాలలో జంటగా ఇతర సంగీత దర్శకులతో , 13 తమిళ సినిమాలు, 8 కన్నడ సినిమాలు, 3 డబ్బింగ్ సినిమాలు ) ఆణిముత్యాల్లాంటి సంగీతాన్ని అందించారు.
తాను పాడే నటుడి వాచకం, స్వరస్థాయికి అనుగుణంగా తన గళాన్ని మలచుకునేవారు ఘంటసాల. దానితో ఆ పాటని ఆ నటుడే పాడుతున్నట్టు ప్రేక్షకులు భ్రాంతి చెందేవారు. శాస్త్రీయ సంగీతం, జానపద గీతం, హరికథ, బుర్రకథ, యక్షగానం, పాడేపాట ఏదైనా ఉన్నతంగా, అత్యద్భుతంగా, ఇతరులు అందుకోలేని స్థాయికి చేరుకున్నారు ఘంటసాల. విలక్షణమైన స్వరస్థాయితో, స్వచ్ఛమైన పదోచ్చారణతో అన్నిరకాల పాటలు- శృంగారం, విషాదం, భక్తిరసం, నవరసాలు తన గళంలో అమృతధారగా సునాయాసంగా పలికించారు ఘంటసాల. భారత దేశ చలన చిత్ర రంగంలో శాస్త్రీయ సంగీతం తో పాటు లలిత సంగీతం, జానపదసంగీతం ఇలా అన్నిరకాల సంగీతాన్ని ఎంతో సులభంగా ఆలపించి పండిత పామరులని సమానంగా రంజింపచేసిన వేళ్ళమీద లెక్కించదగ్గ అరుదైన గాయకులతో ఘంటసాల శాశ్వతంగా ముందువరసలో వుంటారనటంలో సందేహం ఎంతమాత్రం లేదు.
" కొందరు గాయకులు తమ కంఠాన్ని శృతితో మేళవించడానికి ప్రయత్నిస్తారు. కానీ, శ్రీ ఘంటసాల గారి గాత్రంలోనే శృతి పలుకుతూ వుంటుంది . ఇది ఒక అపూర్వ సృష్టి విధానం. గంధర్వాంశ సంభూతులకు గాని, ఇటువంటి గాత్ర సంపద లభించదు. " అని కొనియాడారు చిత్తూరు నాగయ్యగారు.
ఘంటసాల జగదేకవీరుని కథ చిత్రం (1961) లో పాడిన "శివశంకరీ " పాటని సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు దర్బారీ కానడ రాగంలో స్వరపరిచారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీత బాణీల మిళితం అయిన ఈ పాట భారత దేశ చలన చిత్ర సంగీతంలో అత్యంత క్లిష్టమయిన పాటలలో అగ్రగామిగా చిరస్థాయిగా నిలిచివుంటుందనటం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియుల, సంగీత కళాకారుల, సంగీత విమర్శకుల చేత ప్రశంశల పరంపర పొందుతూ వుంది. ఘంటసాల సమకాలీకుడైన ప్రఖ్యాత హిందీ చలనచిత్ర నేపధ్యగాయకుడు మొహమ్మద్ రఫీ ఘంటసాల పాడిన శివశంకరీ, పయనించే ఓ చిలుకా (కులదైవం, 1960) పాటలని పదేపదే ప్రశంసించేవారు. ఘంటసాల పాడిన పయనించే ఓ చిలుకా పాటకి మాతృక రఫీ హిందీ లో పాడిన 'చల్ ఉడ్ జారే పంచీ' (చిత్రం భాభీ ,1957).
చల్ ఉడ్ జారే పంచీ పాట ముగింపులో వచ్చే రాగాలాపనలో తనకన్నా పయనించే ఓ చిలుకా పాట లో ఘంటసాల ఆ రాగాలాపనకి సంపూర్ణ న్యాయం చేకూర్చారని రఫీ బాహాటంగా అంగీకరించారు. ఇంతకన్నా ఒక మహాగాయకుడు మరో మహాగాయకుడికి అందించే కితాబు ఉండదని చెప్పవచ్చు.
ఘంటసాల పాడిన శివశంకరీ పాటని ప్రశంసిస్తూ ఆ పాట సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల గారు ' మందర, మధ్యమ, తారా స్థాయి, ఈ మూడింటినీ అలవోకగా ఆలపించే అరుదైన మహా గాయకులలో ఘంటసాల ఒకరు ' అని శ్లాహించారు. (సంగీతంలో స్థాయీ భేదాలు మూడు. దీనినే 'త్రిస్థాయి ' అంటారు. అవి మందరం, మధ్యమం, తార. మందరానికి హృదయం, మధ్యమానికి కంఠం, తారకు మూర్ధము స్థానములు. ఈ మూడు స్థాయిల్లోనూ సునాయాసంగా పాడటం కేవలం నాదోపాసకులకి, గాంధర్వంశ సంభూతులకి మాత్రం సాధ్యం అవుతుంది.)
1964 లో ఘంటసాల 'జండా ఊంచా రహే హమారా ' అనే హిందీ చిత్రానికి (తమిళ మాతృక ని హిందీ లో డబ్ చేశారు) సంగీత దర్శకత్వం వహించి అందులో ఒక పాటని స్వయంగా పాడారు. ఈ చిత్రం లో రఫీ పాటలు పాడారు.
సువర్ణ సుందరి చిత్రం హిందీ వెర్షన్ లో రఫీ తో కలిసి లతామంగేష్కర్ ' కుహు కుహు బోలే కోయలియా ' (తెలుగులో ' హాయి హాయి గా ఆమని సాగే ') పాటని పాడుతున్నప్పుడు తనతో కలిసి కనీసం కొన్ని పదాలు హిందీ పాటలో పాడవలసిందిగా ఘంటసాలని లతాజీ కోరారు. ఘంటసాల ఆ పాట లో హిందుస్తానీ రాగాలని అత్యద్భుతంగా ఆలపించడం విని మెచ్చుకోలుతో లతాజీ ఆ కోరిక కోరారు. ఘంటసాల లతామంగేష్కర్ కోరికని సున్నితంగా త్రోసిపుచ్చుతూ ' తన స్నేహితుడు రఫీ హిందీలో ఆ పాటని పాడుతుండగా తాను మధ్యలో కొన్ని పదాలను పాడటం సబబు కాదని మనవి చేశారు.
సుమారు మూడు దశాబ్దాల కాలం (1945-1974) యెన్ టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు ల నట జీవితంలో వారికి నేపధ్య గాయకుడిగా ఘంటసాల ప్రధాన పాత్ర పోషించారు. తమిళంలో శివాజీ గణేశన్, ఏం జీ రామచంద్రన్, జెమినీ గణేశన్, కన్నడంలో రాజ కుమార్, మలయాళం లో ప్రేమ్ నజీర్ లకి పలు చిత్రాలలో ఘంటసాల తన గాత్ర దానం చేశారు. పలు చిత్రాలు ఇతర అంశాల పరంగా సాధారణంగా ఉన్నప్పటికీ ఘంటసాల గారి పాటలవల్ల విజయవంతం అయినవి చాలానే వున్నాయి.
ఒకవైపు చలనచిత్రాలకి గాత్రం తో పాటు సంగీత దర్శకత్వం వహిస్తూ, మరోవైపు శ్రీ గురజాడ అప్పారావు గారి " పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ", మహాకవి శ్రీశ్రీ గారి " పొలాలనన్నీ హలాల దున్ని ", "ఆనందం ఆర్ణవమయితే", శ్రీ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి " పుష్పవిలాపం ", " కుంతీ కుమారి " వంటి ఆణిముత్యాలకి ఘంటసాల గారు స్వర రచన చేసి పాటలుకూడా పాడారు. ఈ ఆణిముత్యాలు ఇప్పటికీ సంగీత ప్రియుల, తెలుగు సాహితీ ప్రియులని అలరింపచేస్తున్నాయి.
పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశకంలో ఆంధ్ర రాష్ట్రంలో పద్య నాటకాల సంప్రదాయం ప్రారంభమయ్యింది. అప్పటి పౌరాణిక నాటకాలలో పద్య పఠనంలో రాగాలాపనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. దాని ప్రభావం తొలినాటి తెలుగు పౌరాణిక చిత్రాలమీద కూడా బాగా పడింది. ఘంటసాల గారి రాకతో తెలుగు చలన చిత్రరంగంలో పద్యాలు పాడే విధానం లో ఒక కొత్త ఒరవడి మొదలయ్యింది. రాగాలాపనని కుదించి, సంగీతం, సాహిత్యం, పదోచ్చారణ వీటన్నిటికీ తగిన ప్రాధాన్యతని ఇచ్చి, జనాకర్షకంగా బాణీలు కూర్చి, పండిత పామర రంజకంగా పద్యాలకు తెలుగునాట ప్రాచుర్యం రావటానికి ఘంటసాల గారు చేసిన కృషి చెప్పనలవి కానిది. "పద్యానికి పేటెంట్ తెలుగువాడు " అన్న ప్రజాభిప్రాయం కలిగించింది ఘంటసాల గారి సంగీత ప్రతిభ.
తొలినాట 1944 లో సీతారామ జననం చిత్రం లో వేసిన చిన్న వేషంతో పాటు ఘంటసాల వెండితెరపై త్యాగయ్య (1946), శ్రీ వెంకటేశ్వర మహాత్యం (1960) చిత్రాలలో కూడా మనకి కనిపిస్తారు. పరోపకారం (1953), సొంత ఊరు (1956) భక్త రఘునాథ్ (1960) ఘంటసాల గారు స్వయంగా నిర్మించిన చిత్రాలు.
శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రం లో అశేష ప్రజాదరణ పొందిన పాట " శేషశైలా వాసా శ్రీవేంకటేశా " సన్నివేశాన్ని తిరుమల లో సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి గర్భగుడిలో చిత్రీకరించారు. ఆ సన్నివేశంలో చాలామంది భక్తజనుల నడుమ కూర్చుని ఘంటసాల ఈ పాటని ఆలపించారు. పదిహేనవ శతాబ్దంలో అన్నమాచార్యుల (క్రీ. శ. 1408-1503) తరువాత కలియుగ వైకుంఠం తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి లో కూర్చుండి స్వామివారిని స్తుతిస్తూ గానం చేసిన ఘనత, అరుదైన అదృష్టం మన ఘంటసాల మాస్టారికి కలిగింది.
1969-1972 లో ఘంటసాల మాస్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన గాయకుడిగా వున్నారు. ఘంటసాల గారి ప్రైవేట్ పాటలు కూడా బహుళ ప్రజాదరణని చూరగొన్నాయి. వాటిల్లో స్వాతంత్ర ఉద్యమం నాటి గీతాలు, దేశభక్తి గీతాలు, గీత గోవిందం (సంస్కృత భాషలోని జయదేవుని అష్టపదులు), వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి గీతాలు మచ్చుకి కొన్ని. ఘంటసాల మాస్టారు స్వయంగా రచించి, స్వరపరచి పాడిన పద్నాలుగు పాటలు తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిల్లో నాలుగు పాటలు పుట్టపర్తి సత్యసాయిబాబా వారి మీద పాడినవి. ఘంటసాల గారు సత్యసాయిబాబా భక్తులు. ఘంటసాల గారు రచించి, స్వరపరచిన పాటల్లో వారి తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావన మనకి అవగతం అవుతాయి.
ఘంటసాల స్వరపరచి పాడిన (హెచ్ ఎం వీ) భగవద్గీత వారి మరణానంతరం ఏప్రిల్, 1974 లో విడుదల చేయబడింది. ఘంటసాల భగవద్గీత రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లె పల్లె లో, వీధి వీధిలో బహుళ ప్రాచుర్యం పొందింది. ఘంటసాల మద్రాసుకి వచ్చిన తొలినాళ్లలో ఆయన స్వరాన్ని తిరస్కరించిన హెచ్ ఎం వీ వారు తదనంతరం ఘంటసాల పాటలద్వారా తెలుగు రాష్ట్రాలలో తమ వర్తకాన్ని విస్తరింపచేసి ఎంతో లబ్దిని పొందారు.
ఘంటసాల మాస్టారు ప్రముఖ హిందుస్తానీ గాయకులు బడే గులాం ఆలీ ఖాన్ గారి ని అభిమానించేవారు. ఖాన్ సాబ్ అంటే ఘంటసాల గారికి ఎంతో గౌరవం. 1959 లో ఖాన్ సాబ్ బృంద సమేతంగా మద్రాసుకి వచ్చి సంగీత కచేరీలు ఇచ్చినప్పుడు ఘంటసాల గారి గృహం లో అతిధులుగా బస చేశారు.
భారత్ చైనా యుద్ధం లో, భారత్ పాకిస్తాన్ యుద్ధం లో (1965) మరియు ఇంకెన్నో సందర్భాలలో (రాయలసీమ క్షామం, రక్షక భటుల సంక్షేమ నిధి, జాతీయ సైన్య నిధి) ఘంటసాల దక్షిణ భారత చలనచిత్ర కళాకారులతో పాటు చురుగ్గా పాల్గొని విరాళాలు పోగు చేయటానికి తనవంతు సేవని చేశారు. ఆ సందర్భాలలో ఘంటసాల మాష్టారు దేశభక్తి గీతాలని ఆలపించి ప్రజలలో స్ఫూర్తిని కలుగజేసేవారు.
1970 లో భారత ప్రభుత్వం ఘంటసాల వారిని పద్మశ్రీ పురస్కారం తో గౌరవించింది. ఫిబ్రవరి, 1, 1970 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఘంటసాల చలనచిత్ర పరిశ్రమకి వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
భారత దేశ చలనచిత్ర పరిశ్రమ నుంచి హేమాహేమీలు ఈ రజతోత్సవ వేడుకలకి హాజరై ఘంటసాల మాస్టారిని ఘనంగా సన్మానించారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి దేవానంద్, వహీదా రెహమాన్ ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. ఆ రోజు వేడుకలకి దాదాపు ముప్పై వేల మంది ప్రేక్షకులతో లాల్ బహదూర్ స్టేడియం క్రిక్కిరిసిపోయింది.
1971 లో లతా మంగేష్కర్ గారి చేతులమీదుగా ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారి పేరిట స్థాపించిన పురస్కారాన్ని ఘంటసాల గారు అందుకున్నారు. 1971 అక్టోబర్, నవంబర్ నెలలలో ఘంటసాల గారు జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా పర్యటించి అక్కడి ప్రేక్షకులకి తన గానామృతం తో వీనులవిందు కలిగించారు. అక్కడ వారి కచేరీలన్నీ ఘనవిజయం సాధించాయని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
ఈ విదేశీ పయనం లోనే ఘంటసాల మాస్టారు తన బృందం తో ఐక్య రాజ్య సమితి లో కచేరీ చేయగా ఐక్య రాజ్యసమితి వారు మాస్టారిని శాంతి పతకం తో గౌరవించారు. గొట్టింజెన్ నగరం జర్మనీ లో తన తొలి విదేశీ కచేరీ ద్వారా వచ్చిన ధనాన్ని మొత్తం మాస్టారు బాంగ్లాదేశ్ యుద్ధం లో ఇబ్బందులపాలై కాందీశీకులుగా మన దేశానికి తరలివచ్చిన యుద్ధ బాధితుల సహాయార్ధం పశ్చిమ బెంగాలు ప్రభుత్వానికి విరాళంగా సమర్పించారు.
ఫిబ్రవరి, 11, 1974 న యాభై ఒక్క ఏళ్ల వయస్సులో ఘంటసాల మాస్టారు స్వర్గస్థులయ్యారు. ప్రతీ ఏడూ వారి జయంతి (డిసెంబర్ 4), వర్ధంతి (ఫిబ్రవరి 11) నాడు ఘంటసాల గారి అభిమానులు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు కూడా నివాళులు సమర్పించడం ఒక ఆనవాయితీ గా మారింది.
ఫిబ్రవరి, 11, 2003 న కేంద్ర ప్రభుత్వం ఘంటసాల గారి గౌరవార్ధం తపాలా బిళ్ళని విడుదల చేశారు. విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ఆంధ్ర ప్రభుత్వం ఘంటసాల గారి పేరు పెట్టారు. అక్టోబర్, 6, 2014 న అమెరికా తపాలా శాఖ వారు ఘంటసాల గారి గౌరవార్ధం తపాలా బిళ్ళని విడుదల చేశారు.
ఈ తపాలా బిళ్ళని ఉత్తర అమెరికా తెలుగు సంస్థ వారు న్యూయార్క్ లోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ తో కలిసి సంయుక్తంగా విడుదల చేశారు. మాస్టారి స్మారకార్థం భారత దేశం లోని ఘంటసాలగారి అభిమానులు స్వచ్ఛందంగా అనేక శిలాప్రతిమలు (సుమారు 50) నెలకొల్పి కొన్ని దేవాలయాలు కూడా నిర్మించారు.
" సినిమా వ్యక్తిగా ధన సంపాదన చేస్తూ, అశేష ప్రజలని ఆకర్షిస్తూ ఆనందింపజేస్తూ, వారి సన్మానాలు అందుకోవడం మాత్రమే కళాకారుని జీవిత పరమార్ధంగా భావించేలేకపోతున్నాను. కళ ఎంత ఉన్నతమైనదైనా కావచ్చును. కళాకారుడు కళను తపస్సుగా భావించవచ్చును. కాని కళాకారుడు ప్రజాసమస్యలకు, జీవితానికి ప్రజల కష్ట నిష్టూరాలకు దూరం కాకూడదు. తన కళ ప్రజాశ్రేయస్సుకి వినియోగింపబడినప్పుడే కళాకారుని జీవితం ధన్యం అవుతుందని నా విశ్వాసం. ఆ కారణం చేతనే దేశమాత పిలుపు ఎప్పుడు ఏ రూపంగా వినవచ్చినా నా సేవలర్పించడానికి సంసిద్దుడుగానే ఉన్నాను. "అనేవారు ఘంటసాల.
స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా ఘంటసాల గారి శతజయంతి వేడుకలని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించటం ముదావహం. అదేవిధంగా ఈ సందర్భంలో ఆ మహాగాయకుడికి భారత రత్న పురస్కారం తో గౌరవించటం సముచితంగా, సందర్భోచితంగా కూడా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా తమ ప్రతిపాదనని కేంద్రానికి సత్వరమే పంపుతారని ఆశిద్దాం.
***
No comments:
Post a Comment