గోవా యజ్ఞ మహాత్మ్యము - అచ్చంగా తెలుగు

గోవా యజ్ఞ మహాత్మ్యము

Share This

గోవా యజ్ఞ మహాత్మ్యము

(మా జొన్నవాడ కథలు)

- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


సదాశివశాస్త్రి పేరు చెబితే జొన్నవాడలో విపరీతమైన గౌరవం. ఆయన వీధిలో నడుస్తుంటే అందరూ గౌరవంగా లేచి నిలబడతారు. వేదం చదవడం మొదలెట్టాడంటే గంటలు గంటలు అలా గడచిపోయేవి. ఇంట్లో దేవతార్చన ఉదయం 6గంటలకు మొదలుపెట్టాడంటే మధ్యాహ్నం తల్లి పార్వతమ్మ భోజనానికి పిలిస్తే కానీ లేచే వాడు కాదు. ఇంతా చేసి సదాశివశాస్త్రికి 30 యేళ్ళు కూడా లేవు. కాశీలో శిక్షణపొంది వచ్చిన వేద పండితుడు. పెద్దలిచ్చిన ఇల్లు, పొలాలు తోటలు ఉండడం వల్ల, తండ్రి కాలం చేయడంవల్ల వచ్చిన పెద్దతనం శాస్త్రి గారిది. కామాక్షీ దేవి  ఆయనకు ధ్యానంలో ఉన్నప్పుడు కనిపిస్తుందని మాట్లాడుతుందని జనం అనుకునేవారు. కొంతమంది తెల్లారకుండానే వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుని “ఆ తల్లికి చెప్పండి శాస్త్రిగారూ!”  అంటే విని మౌనంగా ధ్యానముద్రలో ఉండిపోయేవారు తప్ప 'అలాగే' అని కూడా అనేవాడు కాదు. కోరికలు తీరినవారు మాత్రం వచ్చి శాస్త్రిగారి తల్లికి చెప్పుకుని, కానుకలు గట్రా ఇచ్చి సంతోషపడి వెళ్తూ ఉండేవారు. తల్లి పెండ్లి చేసుకోరా నాయనా ఈవయసులో ఒక్కదాన్ని పనీబాట చేసుకోలేక పోతున్నాను అంటే అదుగో ఇదుగో అని కాలం గడుపుతూ “ఇవన్నీ నా  పూజ పునస్కారాలు అడ్డు వస్తాయమ్మా!”  అంటూ ఉండేవాడు. 


ఒకరోజు మేనమామ బెజవాడలో వేదపండితుని కుమార్తె అపర్ణాంబ అనే ఒకమ్మాయి ఉందని వయసు 25 వచ్చినా.. తనకు నచ్చినవాడు దొరక్క పెండ్లిచేసుకోలేదని, పగలంతా పూజలు, వ్రతాలు, నోములూ అంటూ మడితో తడిబట్టలతోనే ఉంటుందని  మేనల్లుడికి తగిన సంబంధమని కబురు పట్టుకొచ్చాడు. తల్లి మాటలకు శాస్త్రి షరామామూలే అన్నట్టు "అమ్మా! మొదట్లో అలాగే ఉంటారు. తర్వాత నా ప్రతి పనికి అడ్డు తగులుతారు భార్యలు” అని భీష్మించుకున్నా, ఈ సంబంధం చేసుకోకపోతే ఉరి వేసుకుని ఛస్తానని బెదిరించడంతో చేసేదేమీ లేక ఒప్పుకున్నాడు. అమ్మాయితో అబ్బాయి మాట్లాడడం కానీ, అలాగే ఆ అమ్మాయికూడా  అబ్బాయితో మాట్లాడతానని అనడంగానీ లేకుండానే పెండ్లి జరిగిపోయింది. పెళ్ళిలో పురోహితుడు మంత్రాలు సరిగ్గా చదవడంలేదని ఆయన ఆపినప్పుడల్లా పెండ్లికుమారుడే మంత్రాలు ఎత్తుకోవడంతో మామగారు కంగారుపడి  అతగాణ్ణి మార్చి వేరే పురోహితుణ్ణి ఏర్పాటు చేసి పరువు దక్కించుకున్నాడు.

శాస్త్రి వివాహంలో కనీసం పెండ్లి కూతురు వైపు చూడడం కూడా చేయలేదు. అపర్ణకూడా ఏమీ మాట్లాడదు. కనీసం చిరునవ్వుకూడా లేదు. ఇదంతా తల్లికి దిగులుగానే ఉన్నా, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలే అని మనసుకు సర్ది చెప్పుకుంది. శోభనం రోజున ఉదయాన్నే ఇద్దరూ బయటకు వచ్చినా ఇద్దరిమొహంలో కనీసం చిరునవ్వుకూడా లేదేమిటని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఉదయాన్నే మామగారితో పూజకు కూర్చున్న శాస్త్రి, మామగారు పూజ కానిచ్చి, అన్ని బజారు పనులు చూసుకుని ఇంటికి వచ్చినా శాస్త్రి పూజలోనే ఉన్నాడు. క్రొత్త పెండ్లికొడుకై కూడా, ఒంటిగంటకు అందరూ భోజనాలకు కూర్చుంటే గానీ, పూజనుంచీ లేవకపోవడం కూడా అందరూ గుసగుసలుగా చెప్పుకున్నారు. అపర్ణకు, శాస్త్రి మాత్రం ఇవేమీ పట్టనట్టు తమ పనులు తాము  చేసుకుని పోతూ ఉన్నారు. 

ఒక శుభ ముహూర్తాన అపర్ణ జొన్నవాడలో కాపరానికి దిగింది. మామగారు కూడా ఉన్నవాళ్ళే, ప్రవచనాలు, ఉపన్యాసాలు, అవధానాలు చేసి బోలెడు వెనకేశాడు. అడక్కుండానే కట్న కానుకలన్నీ సమర్పించాడు.  అపర్ణ రావడంతోటే వంటింట్లో తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న పూజసామాను ఒక మూల ఏర్పాటు  చేసుకుంది. అత్తగారి దగ్గరే పడుకోవడం, ఉదయాన్నే ఆమెతో పాటూ లేచి పెన్నకు స్నానానికి వెళ్ళి రావడం,  కామాక్షి తల్లి దర్శనం చేసుకోవడం, అత్తగారు చెప్పిన పనులు చేయడం, వంటావార్పూ చూడడం, పూజలో మునిగిపోవడం, ఇద్దరికి భోజనాలు వడ్డించడం,  ఇదే పెళ్ళయినప్పటినుండి జరుగుతున్న తంతు. ఇవన్నీ తల్లికి బాధగా ఉన్నా ఇద్దరిని ఏమీ అడగలేదు. శాస్త్రి నిత్యకృత్యం షరా మామూలే! పూజలు పునస్కారాలు, సాయంత్రం శిష్యబృందానికి వేదపఠనం జరిగిపోతూ ఉంది. భార్యను ఇది కావాలి అని అడగడు. భార్య కూడా తనకు ఇది కావాలి అని అడగదు. చిన్న చిన్న సైగలతోనే కాలం గడిచిపోతున్నది.


మేనమామ ఒక రోజున క్రొత్త కాపురం ఎలా ఉందా ? అని చూడడానికి వచ్చి విస్తుపోయాడు. అక్క అన్నీ చెప్పి భోరుమని ఏడ్చి ఎలాగైనా నువ్వే వాడి కాపురాన్ని గాడిన పడెయ్యలిరా తమ్ముడూ అంటూ వలవల ఏడ్చింది.  ఇద్దరికిద్దరూ ఇలా ఎందుకుంటున్నారో అర్ధం కాక తలపట్టుకున్నాడు.  ఆ రోజు సాయంత్రం శాస్త్రిని కామాక్షితాయి గుడిని చూపించమని అడిగి తీసుకుని వెళ్తూ మధ్యలో "శాస్త్రీ! అపర్ణ ఎలా ఉంది? కలిసిపోయిందా? నీకు అనుకూలమేనా?" అన్నాడు. 

"నా దైనందిన చర్యలకు తను, తన పనులకు నేను అడ్డు రావడంలేదు. ఇక అనుకూలం, కలిసిపోవడం గురించి అంటావా! మీ అక్కను అడగాల్సిందే!"

"అదేమిట్రా! అన్నిటికి మీ అమ్మ మీద నెట్టేస్తావు. ఇంకా పిల్లా పీచూ సంగతి ఏమన్నా అనుకున్నారా?"

"పిల్లలు ఉంటే తనకూ నాకూ పూజలకు అడ్డమే కదా బావా? వేదాధ్యయనం, పిల్లకు పాఠాలు సాగుతాయా? ఎవరి ప్రక్కలు వాళ్ళవి. ఎవరి పూజలు వాళ్ళవి”  అంటూ అదేదో పెద్ద జోకయినట్టు నవ్వాడు.

అప్పటికి అర్ధమైంది మేనల్లుడి వాలకం. ఇంటికివచ్చి అక్కయ్యకు రహస్యంగా జరిగినదంతా చెప్పి "ఏం చెయ్యాలంటావు?" అన్నాడు.

"ఒక్కసారి కోడలితో  కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడరా! మీ బావగారు కూడా పూజలవీ చేసేవారు. కానీ సంసారం చెయ్యలేదా? మరీ ఇంత ఇదిగానా? కోడలు రోజూ తనతోనే పడుకోవడం చెప్పి" కన్నీళ్ళు తుడుచుకుంది. "వద్దక్కా..అలా కాదులే… ఇంకో ఉపాయం నేనే ఆలోచిస్తా!.. నాల్రోజులాగు... "

మేనల్లుడు పనిచేస్తున్న ఆఫీసులో ఒక స్నేహితుడికి మాటవరసకు ఈ విషయం చెప్పగానే నవ్వుతూ " ఒరే! సింపుల్ సొల్యూషన్ చెప్తా. అమలు చెయ్యి...జాగ్రత్తగా విను, ఇద్దరినీ ఒకసారి  వేదపండితులకు సన్మానం. యజ్ఞం జరుగుతోందని చెప్పి గోవాకు తీసుకుని వెళ్ళి, ఒకరోజు  అన్ని రకాల బీచ్‌ల్లో తిప్పి, నువ్వు యజ్ఞం విషయం మాట్లాడి నేను మరుసటిరోజు వస్తాను ఖాళీ చెయ్యకు! రూములోనే ఉండమని గట్టిగా చెప్పి గోవాలో వేరే చోట ఉండి వాళ్ళను గమనించు. వాళ్ళకు ఏకాంతం కలిగించు. రెండు రోజుల తర్వాత వెళ్ళు! వాళ్ళు చిన్నప్పటినుండి పూజా పునస్కారాలలో మునిగి తేలారు కదా! అందువల్ల వచ్చే తిప్పలు ఇవన్నీ... మా బావమరిది కూడా అలా ఉన్నవాడే! ఒక్కసారి ఊటీకి తీసుకువెళ్ళి ఒక రూములో బంధించా! అంతే! సంవత్సరంలోపు పండంటి మగ బిడ్డ! " అని సలహా ఇచ్చాడు. వెంటనే అక్కయ్యకు ఫోన్ చేసి చెప్పగానే పధకం బాగానే ఉంది వీణ్ణి, దాన్ని తోలుకుపోయే  పూచీ మాత్రం నీదే సుమా!" అనింది.

ప్రక్కరోజు మధ్యాన్నం భోజనాలు కాగానే "శాస్త్రీ! గోవాలో ఏదో మహాయజ్ఞం చేస్తున్నారట. వేదపండితులకు 10వేల రూపాయలు దక్షిణా సన్మానం ఉందట. కాకపోతే దంపతిపూజ జరగాలట. అదీ కండిషను!” శాస్త్రిని ఓరకంట చూస్తూ  “నువ్వూ అపర్ణా రండి. పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుంది. పైసా ఖర్చులేదు. మా ఆఫీసువాళ్ళు కారు కూడా ఇచ్చారు” అని చెప్పాక "సరే!" అన్నాడు అతి కష్టం మీద సంభావనకు ఆశపడి. వారిని కారులో బయలుదేరదీశాడు. దారిలో నాకు ఎవ్వరూ చెప్పనేలేదు ఈ యజ్ఞం గురించి…మీకెలా తెలిసింది ఈ విషయం? దాని పాంప్లెట్టూ భోగట్టా ఎక్కడా? అని గోణుగుతూ ఉన్నాడు. మేనమామ ఏమీ బదులు చెప్పకుండా, భార్యా భర్తలిద్దరిని వెనుక సీట్లో కూర్చోబెట్టి, తను ముందు కూర్చున్నాడు. దూరం ప్రయాణం అవడంతో అపర్ణ భర్త ఒడిలో తలపెట్టి నిద్రలోకి జారుకుంది. ఏ.సి. కారు. అపర్ణ తలలో మల్లెపూలు శాస్త్రికి మత్తెక్కిస్తున్నాయి. ఏదోగా ఉంది   వారిద్దరి వ్యవహారం. తను చూసినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుంటున్న అపర్ణను గమనించాడు.  మధ్య మధ్యలో మేనల్లుణ్ణి  వ్యవహారం కూడా తేడాగా ఉండడం గమనిస్తూ ఉన్నాడు.  

గోవా చేరగానే "ఎక్కడ యజ్ఞం జరిగే ప్రదేశం ?.. మావయ్యా! బయల్దేరు.. బయల్దేరు.. " అన్నాడు.

"చెప్తాను బావా!  గుర్రాన్ని కట్టెయ్ కాస్తా ఆగు!  ఇవాళ కాదు రేపో యెల్లుండో గుర్తులేదు. ఇక్కడికి దగ్గర్లోనే ఆ ప్రాంతం అన్నారు. మా ఆఫీసు తాలూకు వాళ్ళది. నేను కనుక్కుని వస్తాను కదా! తొందర పడకు.  ఇక్కడికి వచ్చాక యజ్ఞంలో పడితే  అన్నీ చూసే తీరిక ఉంటుందో ఉండదో తర్వాత అని ముందుగా వచ్చాం" అన్నాడు. గోవాలో ఎన్ని బీచీలు ఉన్నాయో అన్నీ తిప్పాడు. ఎక్కడ చూసినా అర్ధనగ్నంగా స్నానం చేసే జంటలే కనిపిస్తున్నారు. శాస్త్రి ఆసక్తిగా చూస్తున్నాడు వాళ్ళను. అపర్ణ కూడా దొంగ చూపులు చూస్తోంది. వళ్ళంతా తెలియని ఒక భావనతో శాస్త్రి అదో రకంగా అపర్ణ వంక చూస్తున్నాడు. అపర్ణ కూడా భర్త వంక తదేకంగా చూస్తోంది. రూముకు చేరాక "నేను మళ్ళీ వస్తాను. మీరిద్దరూ లోపలే ఉండండి. యజ్ఞం సగతి తేల్చుకుని వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు. 


ఒకే డబుల్ కాట్ మంచం ఉన్నగదిలో ఇద్దరూ పడుకున్నారు. మావయ్య మూడు రోజులు గడిచాక వచ్చాడు. బయట వాచ్‌మెన్ వాళ్ళిద్దరూ బీచిలో స్నానాలు చేసి వచ్చిన  వివరాలన్నీ చెప్పాడు. తలుపు తీసేసరికి అపర్ణా శాస్త్రీ సిగ్గుపడుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు.  శాస్త్రి పూల పూల గోవా చొక్కా ఒకటి వేసుకొని ఉన్నాడు. ఇద్దరూ ఒకే ప్లేటులో ఏదో తింటున్నట్లు గుర్తులు కనిపించాయి.

"సారీ..శాస్త్రీ..ఏమనుకోకు.. వాతావరణం సరిలేదని యజ్ఞం క్యాన్సిల్ అయిందట" అన్నాడు శాస్త్రి ఏమి నిప్పులు చెరుగుతాడో అని భయపడుతూ.

"ఒక్కోసారి అంతే!..పర్వాలేదులే.. మనచేతుల్లో ఏముంది? రూముకు అడ్వాన్సు ఇంకా ఎన్నిరోజులకు ఉంది?"

"ఇంకో రెండు రోజులకు ఉంది. కావాలంటే సగం మినహాయించుకుని సగం తిరిగి ఇచ్చేస్తారు. వెళ్ళిపోదామా?"

"ఎందుకు బాబాయిగారూ! నష్టం కదా! మీరు వెళ్ళండి. ఆఫీసు ఉందికదా మీకు. మేము రెండు రోజులయ్యాక వస్తాం" అంది అపర్ణ.

"మావయ్యా! నాక్కూడా అపర్ణ చెప్పిందే సబబు అనిపిస్తోంది. డబ్బులు వృధా చేయడం ఎందుకు?  కారు మాత్రం బయట ఉంచి నువ్వు బయలుదేరు! మా గురించి బెంగపడకు!" అన్నాడు. 

చేసేదేమీ లేక సగం ఆనందంతో సగంబాధతో "సరే! వస్తాను. జాగ్రత్తగా వచ్చెయ్యండి" అని చెప్పేలోపే తలుపులు మూసేసింది.  జొన్నవాడ చేరాక మరెప్పుడూ అపర్ణ అత్తగారితో పడుకోలేదు.

***


No comments:

Post a Comment

Pages