మానస వీణ - 38 - అచ్చంగా తెలుగు

మానస వీణ - 38

Share This

 మానస వీణ - 38

ములుగు లక్ష్మీ మైథిలి

  



 'రాత్రి కొందరిని సేద తీరుస్తుంది...

మరి కొందరికి నిద్రలేకుండా చేస్తుంది...

       వెన్నెల రాత్రుల కోసం ఎందరో ఎదురు చూస్తారు... అమావాస్య రాత్రుల కోసం కొన్ని అసంఘటిత శక్తులు మాత్రమే కాచుకుని ఉంటాయి.'

       కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో అనిరుధ్, ఆ నలుగురు యువకులు, మొబైల్  లైట్ వెలుగులో శ్వేత ను, వర్షను వెతుక్కుంటూ అటువైపు వస్తున్నారు. 

        కొద్ది దూరంలో, ఎవరో కర్రతో ఎవరినో తల మీద కొట్టడం కనిపించడంతో, అనిరుధ్ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నాడు. 

       తమను చూసి పారిపోతున్న వ్యక్తిని 

పట్టుకుందామనుకునే లోగా, అతడు ఆ చీకట్లో కలిసిపోయాడు.

         అనిరుధ్ కింద పడిన మనిషిని సెల్ ఫోన్ కాంతిలో పరిశీలనగా చూసాడు.  అంతే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ దినేష్. 

        దినేష్ తల మీద దెబ్బ తగలటం  వల్ల విపరీతంగా బ్లడ్ పోతోంది. 

       "అనిరుధ్ గారు... ఏమైంది? ఎవరు?

ఇతను మీకు తెలుసా?" అడిగాడు రవీంద్ర.

     "యస్... నా ఫ్రెండ్ దినేష్, ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్. అతను కేసు టేకప్ చేసాడంటే, ప్రత్యర్థుల గుండెల్లో  రైళ్లు పరుగెడతాయి.

ఈ అడవిలో మిస్టరీని ఛేదించడానికి నేను రమ్మంటే వచ్చాడు. ముందు ఇతన్ని ఎలా అయినా కాపాడుకోవాలి. ఇక్కడినుండి సిటీ కి వెళ్ళాలంటే, కనీసం గంట పైనే పడుతుంది. మనకు దినేష్ అవసరం చాలా ఉంది. ఎలా...ఎలా... ఏం చేయాలి? " అంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్ తో గాయాన్ని శుభ్రం చేస్తున్నాడు.

         "అనిరుధ్ గారు... ఒన్ మినిట్" అని చెపుతూ, సాయి తన మొబైల్ లైట్ తో రోడ్ పక్కన తనకు కావలసిన మొక్కలు వెతికాడు. ఆ ప్రదేశంలో దొరికిన కొన్ని ఆకులు తీసుకుని వచ్చి, దినేష్ గాయం పైన ఆకుల రసం పూసాడు.  మరి కొన్ని ఆకులను నలిపి ముక్కు దగ్గర వాసన చూపించాడు.

      కొద్ది సేపటికి దినేష్ కళ్ళు తెరిచాడు. 

ఎదురుగా ఫోన్ వెలుగులో  నిలబడి ఉన్న వ్యక్తులను చూసి, కొద్దిగా సందేహం కలిగింది. తల భారంగా ఉండటంతో చేయి పెట్టగానే కట్టు కట్టి ఉండడం‌ తెలిసింది. ఇద్దరు మనుషులు ఒక అమ్మాయిని  తీసుకుని వెళ్ళటం, వారిని తాను వెంబడిస్తూ వెళ్లడం, వారికి తెలియకుండా, తాను ఉన్న లొకేషన్ ని, అక్కడ చూసిన దృశ్యాన్ని, పోలీస్ బెటాలియన్ కి షేర్ చేస్తున్నపుడు... వెనక నుండి తనను ఎవరో తలపై కొట్టటం వల్ల తను పడిపోయిన సంగతి గుర్తుకొచ్చాయి.

       'అయితే వీళ్ళు ఎవరై ఉంటారు... నేను స్పృహలోకి రావటానికి కారణం వీళ్ళు  కావచ్చు. వీరి గురించి తర్వాత చూద్దాం. ముందు పోలీస్ స్టేషన్ కి మెసేజ్ చేయాలి.' అనుకుంటూ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, తన కర్తవ్యాన్ని పూర్తి చేసాడు  దినేష్.

     తర్వాత చిన్నగా లేచి నిలబడి... తన ఫోన్ లైటింగ్ తో చూస్తూ, "నువ్వు అనిరుధ్ వి కదూ!వీరంతా ఎవరు? ఈ అర్థరాత్రి  ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో మీరు ఎందుకు ఉన్నారు? ఏమైనా... మీరు నాకు చేసిన హెల్ప్ మరిచిపోలేను." చెప్పాడు దినేష్.

       "దినేష్... నేను ఫోన్ చేయగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నీకు తెలుసు కదా... మానస మీద దాడి చేసిన వారి గురించి  వెతుకుతున్న సమయంలో, వీళ్ళు కనిపించారు. వీరంతా బొటానికల్ టూర్ పోగ్రామ్ మీద ఇక్కడికి వచ్చిన కాలేజీ స్టూడెంట్స్. వీరిలో ఇద్దరు అమ్మాయిలు దారి తప్పి పోయారు. వారికి ఫోన్ చేద్దామంటే దారిలో ఆ గర్ల్స్ ఫోన్లు కనిపించాయి. అందుకే నేను కూడా వీరితో కలిసి వెతుకుతున్నా." అంటూ వారిని పరిచయం చేసాడు అనిరుధ్.

    "ఐసీ... నాకు ఆకులతో ట్రీట్మెంట్ చేసి బొటానికల్ స్టూడెంట్స్ అనిపించారు. కాబోయే ఆయుర్వేద వైద్యులు అన్నమాట. మీకు చాలా కృతజ్ఞతలు. పదండి, ఆపదలో ఉన్న ఆడపిల్లలను కాపాడాలి. బహశా... ఈ అమ్మాయిలను కూడా అప్పల నాయుడు మనుషులు తీసికెళ్ళి ఉండవచ్చు" అంటూ ఇందాక ఒక  అమ్మాయిని బలవంతంగా  లాక్కుని  వెళ్లిన దారి గుండా నడవ సాగాడు దినేష్.

అనిరుధ్, రవీంద్ర, సాయి, ఆదిత్య, రఘు అతన్ని అనుసరించారు.

*****

రఘురాం కు, శ్రావణి కి చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా 'అమ్మా' అనే పిలుపు కోసం ఎదురు చూస్తున్న శ్రావణి కి,  దేవుని దయవల్ల ఆ కోరిక శాశ్వతంగా తీరబోతోంది. తనకు పాప పుట్టిన రోజు నుంచి, ఒక్కో ఏడు పెరిగి పెద్దదై పోతున్నప్పుడు, సంతోష పడే మధురస్మృతులను ఇన్నేళ్లుగా ఊహించుకుని బతికింది.  తన వేలు పట్టుకుని నడిచే చిట్టి తల్లి అడుగులకు మడుగు లొత్తుతూ, ఆ చిలుక పలుకుల ముచ్చట్లు తనివి తీరా వినలేని ఎడబాటును తట్టుకోలేక ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిందో తనకు తెలుసు. 

      'అమ్మా' అని మానస పిలిచే తీయని పిలుపు లోని మాధుర్యం, శ్రావణి హృదయలోని గతం తాలూకు  వేదనలను పూర్తిగా దూరం చేస్తోంది.

       దత్తత కార్యక్రమానికి  కావలసిన వస్తువులు, పూజా సామాగ్రి, ఏమేమి కావాలో పురోహితుడి కి ఫోన్ చేసి ముహూర్తం  తదితర వివరాలను నోట్ చేసుకున్నాడు రఘురాం.

     దత్తత తీసుకునే రోజున  మహాలక్ష్మి లా తన ఇంట అడుగు పెట్టాలని, మానస కోసం  పెరట్లో పూచిన పూలు మల్లెలు, కనకాంబరాలు గులాబీ లతో మాల కట్టింది. ఆకుపచ్చ రంగు కి ఎర్రటి అంచు గల పట్టు చీర సెలెక్ట్ చేసి, తన బంగారు నగలన్నీ  రెడీ చేసింది శ్రావణి.

       అన్నింటికీ మించి తన రక్తం పంచుకు పుట్టిన తన బిడ్డను కలుస్తున్నప్పుడు, ఈ  ముహూర్తం, వారాలు, వర్జ్యాలు అవసరంలేదని... కన్నపేగు మౌనంగా చెపుతోంది.

       అదే నిజమంటూ చెప్పటానికి కృషీవలరావు ఏ క్షణమైనా రావచ్చు.


No comments:

Post a Comment

Pages