శ్రీధరమాధురి -103 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -103

Share This

 శ్రీధరమాధురి -103

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు) 




మాతా పూర్వరూపం...

తైత్తరీయ ఉపనిషత్తు

తల్లి పూర్వీకుల రూపం. తల్లి ఈ సృష్టి యొక్క మూలం నుంచి వస్తుంది. తల్లి పూర్వీకుల నుంచి వస్తుంది. ఆమె అనేక మార్లు తల్లిగా ఉంది. ఆమె ఆప్యాయతను చూసి, ఆమె మీ లోతైన గతానికి చెందినదని మీరు గుర్తిస్తారు. ఆ ప్రేమ బంధం, అనేక తరాల పాటు ప్రయాణించి కొన్ని వేల ఏళ్ళ పాటు కొనసాగింది.  ఈ ప్రపంచంలో ఆమె ప్రేమే ఉన్నతమైనదని మీరు గుర్తిస్తారు. ఆమె ఈ సృష్టి యొక్క ఉనికి నుంచి వచ్చింది గనుక, ఆమె ప్రేమకు ఏదీ సాటి రాలేదని మీరు గుర్తిస్తారు. బిడ్డపై ఆమెకు ఎటువంటి స్వార్థం ఉండదు.

***

నేను తన స్వగ్రామానికి వెళ్లాను. అతడు నన్ను ఆ ఊరి గ్రామ దేవత ఆలయానికి తీసుకొని వెళ్ళాడు. ఆమె చాలా అందంగా ఉంది.

నేను గ్రామస్తులతో ఇలా అన్నాను "మీరు చాలా అదృష్టవంతులు. మీ గ్రామ దేవతలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆమె ఇక్కడ సజీవంగా ఉంది. ఆమె కేవలం 'శిలామూర్తి' కాదు. మీ ప్రేమను సంపూర్ణంగా ఆమెపై వర్షింప చేయండి."

ఆ గ్రామంలో అతని పొలాన్ని సందర్శించిన తర్వాత మేము 'థేని' కి వెనక్కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లసాగాము.

దారిలో అతనిలా అడిగాడు "గ్రామస్తులను తృప్తిపరచడానికే మీరు ఆమె సజీవంగా ఉందని వ్యాఖ్యానించారా?"

నేను నవ్వి ఇలా అన్నాను "నేను కేవలం నిజమే మాట్లాడతాను."

 ఆరు నెలల తర్వాత ఒక రోజున నేను అతన్ని పిలిచి ఇలా అన్నాను "మనం రేపు మీ గ్రామానికి వెళ్దామా? నేను ఇవాళ థేని వెళుతున్నాను."

అతను "సరే!" అన్నాడు.

మర్నాడు ఉదయం 6 గంటలకు మేము బయలుదేరి పదిన్నరకు అక్కడికి చేరుకున్నాము. మేము పొలం లో కూర్చుని ఉన్నాము.

ఒక గ్రామస్థుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు "గ్రామ దేవత ఆలయం నుంచి మాయమైంది."

 అతను ఇలా అన్నాడు "ఇది అసాధ్యం! ఆమెను ఎవరు దొంగిలిస్తారు? ఆ రాతి విగ్రహాన్ని పైకి లేపడానికి పదిమంది కూడా సరిపోరు. అంతేకాక ఆమె భూమికి అతుక్కుని ఉంది."

మేమిద్దరం ఆలయానికి వెళ్ళాము, నిజంగానే ఆ శిలామూర్తి మాయమైంది.
 
తమ తల్లి వంటి అమ్మవారు తమ గ్రామాన్ని వదిలి పోయినందుకు గ్రామస్తులు ఏడవ సాగారు. అమ్మవారు తమ పట్ల కోపంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని భావించారు.
 
నేను ఇలా అన్నాను "మీలో ఎవరి పట్లా కూడా ఆమె కోపంగా ఉందని నేను భావించడం లేదు. ఇది నేను నిశ్చయంగా చెప్పగలను. గ్రామంలో ఆమెను అన్నిచోట్లా వెతుకుదాం పదండి."

కాబట్టి అతనితో పాటు మేము అందరం కలిసి వెతకసాగాము. అతను, నేను కలిసి  ఆ గ్రామం చివరన పారుతున్న ఒక కాలువ వద్దకు వచ్చాము.
 
కొంత మంది స్త్రీలు స్నానం చేయసాగారు కాబట్టి మేము వెనుదిరిగాము.
 
వారిలోని ఒక అందమైన స్త్రీ ఇలా అంది "మేము స్నానం చేస్తున్నాము కనుక మీరు ఇద్దరూ సిగ్గు పడుతున్నట్లు ఉంది. ప్రధాన ఆలయంలో నుంచి మాయమైన గ్రామదేవత కోసం మీరు వెతుకుతున్నట్లు ఉంది. ఇతర ఆలయాల్లో ఉన్న చిన్నచిన్న దేవతలు కూడా మాయమయ్యారని గ్రామస్తులు గుర్తించలేదు. మిగిలిన శిలామూర్తులన్నీ కూడా ఉన్నాయో లేదో చూసి మీరు ఇక్కడికి తిరిగి రండి.
 
కాబట్టి మేమిద్దరం ఇతర గ్రామస్థులతో కలిసి చిన్న ఆలయాల్లోపల పరిశీలిస్తే, అక్కడి శిలామూర్తులు కూడా మాయమయ్యాయి.

అందుకే మేమంతా ఆ కాలువ దగ్గరకు వెనక్కి వచ్చాము.
 
స్త్రీలంతా స్నానం చేసి ఒక చెట్టు కింద దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్లగానే, ఇందాక మమ్మల్ని వెళ్లి చిన్న ఆలయాలలో వెతకమని చెప్పిన అందమైన స్త్రీ మమ్మల్ని చూసి నవ్వింది.
 
ఆమె నన్నిలా అడిగింది "ఇతను ఆరోజున కార్లో నిన్ను ఏమి అడిగాడు?"

నేను ఇలా అన్నాను "గ్రామస్తుల తృప్తి కోసం నీవు ఆ దేవత సజీవంగా ఉందని చెప్పావా?" అని అడిగాడు.

ఆమె అతని వంక చురుగ్గా చూసి, "నేను నా సోదరీమణులతో కలిసి ఈ గ్రామంలో ఉంటానని ఇతడు చెప్పిన మాటలను నీవు నమ్మవా?"
 
అతడు మాట రాక మూగబోయాడు. వారంతా మాయమయ్యారు.
 
అప్పుడే ఒక గ్రామస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, "ప్రధాన ఆలయంతో సహా శిలా మూర్తులన్నీ ఆయా ఆలయాల్లో తిరిగి ప్రత్యక్షమయ్యాయి" అన్నాడు.
 
భూమాత నమ్మకం లేని వారి ఎదుట కూడా ప్రత్యక్షమై, తన సత్యాన్ని నిరూపించింది.
 

***

No comments:

Post a Comment

Pages