పురాణ కధలు-బసవ పురాణం -25 పి.యస్.యమ్. లక్ష్మి
25. కిన్నెర
బ్రహ్మయ్య కధ
పూర్వము పోడూరు అనే గ్రామంలో కిన్నెర బ్రహ్మయ్య అనే పేరుగల భక్తాగ్రేసరుడుండేవాడు. ఆయన వీర శైవ భక్తుడు. జీవనముకోసం ఎన్ని పనులు చేసినా వాటితో ఆర్జించే ధనాన్ని భక్తులకోసం ఖర్చు చేసేవాడు. ఆయన కిన్నెర మీటుతూ పాడుతుంటే నారదాది గాయకులనేకమంది ఆ సంగీత సుధనాస్వాదించేవారుట. ఆ నాదము విన్న శివుడు కూడా తన భక్తుని గానానికి మెచ్చి రోజూ అతనికి కొంత ధనము సమకూర్చేవాడుట. బ్రహ్మయ్య ఆ ధనాన్ని కూడా జంగమ పూజకే వినియోగిస్తూవుండేవాడు.
బ్రహ్మయ్య ఆ కాలంలో విశ్వవిఖ్యాతి చెందిన బసవేశ్వరుని కధలు విని ఆయనని
దర్శించాలని బిజ్జలరాజు పరిపాలిస్తున్న కళ్యాణ
పురానికి వెళ్ళాడు. బసవేశ్వరుని
నివాసమదే. బసవేశ్వరుడు కూడా బ్రహ్మయ్య రాక
గురించి తెలుసుకుని ఆయనకెదురేగి సకల సత్కారాలతో తమ ఇంటికి తీసుకువచ్చి
గౌరవిస్తాడు. భోజనానంతరము ఇద్దరూ ఆ నగరంలో
వున్న త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్ళారు.
బసవేశ్వరుడు కొంత సేపు వుండి వెళ్ళగా, బ్రహ్మయ్య అక్కడ వున్న భక్తులతో మరికొంతసేపు
సద్గోష్టి జరుపుతూ వుంటాడు. ఆ సమయంలో ఒక
విటుడు ఆ రోజు పండగ కనుక తన వేశ్యకు ఇవ్వటానికి బాగా కండపట్టిన ఒక గొఱ్ఱెపోతుని
కొని దాని మెడకు తాడు కట్టి తీసుకుని వెళ్తుండగా, ఆలయం సమీపానికి వచ్చేసరికి ఆ
గొఱ్ఱె తాడు తెంచుకుని తప్పించుకుని ఆలయంలో గర్భగుడిలోకెళ్ళి దాక్కున్నది. దాని వెనుకే ఆ విటుడు కూడా ఆ గొఱ్ఱెకోసం లోపలకి
రాగా బ్రహ్మయ్య అతనిని వారిస్తూ, “ఇంకా ముందుకు
రావద్దు. నీపాలిటబడ్డ ఆ గొఱ్ఱె దైవ వశమున
తప్పించుకుని ఈ ఆలయంలోకి వచ్చి మా శరణుజొచ్చింది.
ఎంత మూర్ఖుడైనాగానీ, శరణుకోరినవారిని రక్షిస్తాడుగానీ విడిచిపెట్టడు. అలాంటప్పుడు ఈశ్వరుని భక్తులమయిన మేమెలా దీనిని
చంపటానికి అంగీకరిస్తాము? నువ్వంతగా పట్టుపడితే ఈ గొఱ్ఱె కొనటానికి
నీకయిన ఖర్చు మేమిస్తాము. తీసుకుని
వెళ్ళు.” అంటాడు.
ఆ విటుడు పకపకానవ్వి, “పండగపూటా
కావాలని కొవ్విన గొఱ్ఱెని డబ్బులు పెట్టి కొని తీసుకువెళ్తన్నాను. మీరు
చెప్పారని ఎలా విడిచిపెడతాను? అది గుళ్ళోకెళ్ళినా
మళ్ళోకెళ్ళినా నేను విడిచిపెట్టను. నా
గొఱ్ఱెను నాకివ్వండి. ఆలస్యమయితే నా భోగినికి
కోపం వస్తుంది. నేను తొందరగా వెళ్ళాలి” అని ఎన్ని విధాల
అడిగినా బ్రహ్మయ్య ఆ గొఱ్ఱెను విడిచి పెట్టలేదు.
అప్పుడా విటుడు తన మనసులో తానే ఆలోచించుకున్నాడు. ఎంత బతిమాలినా ఈయనీ గొఱ్ఱెను విడిచిపెట్టేటట్లు లేడు. ధనమిస్తానన్నాడు గనుక ఈతని దగ్గర వీలయినంత ఎక్కువ ధనము తీసుకుని తొందరగా ఇంకొక గొఱ్ఱెను కొనుక్కెళ్ళి నా పడతిని సంతోషపెడతాను. నాకూ కొంత ధన లాభముంటుంది అని విపరీతమైన కోపముతో వెళ్ళేవాడి వలె వెళ్ళబోయాడు. బ్రహ్మయ్య అతనిని ఆపి వెయ్యి మాడలు తెప్పించి అతనికిప్పించాడు. అతను కూడా ఇంకొక గొఱ్ఱెను కొని సాని ఇంటికి తీసుకుపోయి ఆమెతో చూడు నీ కోసము ఎంత మంచి గొఱ్ఱె తెచ్చానో దీనితో పండుగ చేసుకుందాము అని మంచి మాటలతో ఆమెని సంతోష పెట్టబోయాడు.
దానికామె అతనిని దూషించి మొదట కొన్న మంచి గొఱ్ఱెని విడిచిపెట్టి ఈ
నాసిరకం గొఱ్ఱెని తెచ్చి నన్ను సంతోషపెట్టటాలని చూస్తున్నావా? అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. నాకు మొదటి గొఱ్ఱెనే తెచ్చిమ్మని
పట్టుబట్టింది. దానితో అతను మళ్ళీ గుడికి
వెళ్ళి బ్రహ్మయ్యను ఆ గొఱ్ఱెని ఇమ్మని బతిమాలుకున్నాడు. బ్రహ్మయ్య అతడిని ఆ గొఱ్ఱెని
ముట్టుకోనియ్యలేదు. “అదిప్పుడు
గొఱ్ఱె కాదు. దాని వెల చెల్లించినప్పుడే దానికి
లింగధారణ చేశాము. అది ఇప్పుడు వృషభమయింది. అంటే ఆ శివుని వాహనం. నువ్వు దానిని తాకవద్దు.” అని వారించబోయాడు. ఆ ఘర్షణలో విటుడు తన చేతిలోని కత్తితో
బ్రహ్మయ్య తల నరకబోతాడు. బ్రహ్మయ్య తన చేతిలోని కత్తితో అడ్డుపెట్టబోగా
విటుని తల తెగి గుడి వెనక పడింది.
అప్పుడు అక్కడవున్న అతని చుట్టాలు అతని మరణానికి బాధపడి రాజు దగ్గరకు
వెళ్ళి, “రాజా, మీ పాలనలో
శివ భక్తుల ఆగడాలు చాలా ఎక్కువగా వున్నాయి.
వాళ్ళు తమ ఇష్ట వచ్చినట్లు ప్రజలను నాశనం చేస్తున్నారు. మీ పాలనలో వాళ్ళనే వుండనీయండి. మేమెక్కడికన్నా వెళ్తాము” అని మొరబెట్టుకున్నారు.
దానితో రాజు కోపగించి బసవేశ్వరుని దగ్గరకెళ్ళి, “బసవ మంత్రీ, మీ
భక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. భక్తులు
దయగలవారు, అహింసాపరులు, సన్మార్గులు అంటారు కదా. మరి ఈ విషయమేమిటి? ఇవాళ మన శివాలయంలో ఒక భక్తుడు ఒక గొఱ్ఱెపోతు
విషయంలో ఒక సంసారితో గొడవపడి అతని తల నరికాడుట.
సంసారుల జోలి వాళ్ళకెందుకు? అయినా మీ భక్తులు మాత్రం
సామాన్యలు కారు,” అని అంతకుముందు భక్తి
పారవశ్యంలో కొందరు భక్తులు చేసిన అకృత్యాలను ఏకరువు పెట్టి, “మీ భక్తుల
విషయాలు మీకే తెలుసు. మీలాంటివారున్న చోట
మేము రాజ్యము చేయలేము. ఈ రాజ్యాన్ని మీరే
ఏలుకోండి. మేమెక్కడికన్నా వెళ్తాము” అని కోపంగా అన్నాడు.
దానికి బసవేశ్వరుడు రాజుని సమాధానపరిచి, “శివ భక్తులు
కరుణామయులుగానీ అకృత్యములు చేసేవారు కాదు.
ఎవరయినా ఏదయినా చెబితే వెంటనే వారి మాటలు విశ్వసించి తగు చర్య
తీసుకోకూడదు. మంత్రులను పంపి ముందు విచారణ
చేయించండి. నిజా నిజాలు తెలిసిన తర్వాత నేరస్తులని శిక్షించవచ్చు” అనగా రాజు
అసలు విషయం తెలుసుకు రమ్మని తన మంత్రులను పంపాడు.
వారు కూడా ఆలయానికి వెళ్ళి అక్కడి వారి ద్వారా బ్రహ్మయ్య మంచితనాన్ని,
భక్తి పరాయణతను గొఱ్ఱె విషయము తెలుసుకుని బ్రహ్మయ్య దగ్గరకు కూడా వెళ్ళి, “అయ్యా, మీరు శివ
భక్తులు. ఇలాంటి పనులు చేసినచో శివ
భక్తులకందరికీ చెడ్డ పేరు వస్తుంది కదా, మా వాడి గొఱ్ఱెనెందుకు చంపారో తెలుసుకు
రమ్మని మా రాజు మమ్మల్ని పంపారు. మీరు
వివరాలు చెబితే మేము మా రాజుకి విన్నవిస్తాము” అని అడిగారు. బ్రహ్మయ్య జరిగినదంతా చెప్పగా
దానికి సాక్ష్యులెవరైనా వున్నారా అని మంత్రులు అడిగారు. దానికి బ్రహ్మయ్య “నాకు సాక్ష్యులు
ఎవరూ లేరు. కావాలంటే ఆ
త్రిపురాంతకునిచేతనే నిజము చెప్పించగలను” అని చెప్పాడు.
మంత్రులు రాజు దగ్గరకు వెళ్ళి సమాచారం విన్నవించగా రాజు
ఆశ్చర్యపోతాడు. సంగతేమిటో స్వయంగా
తెలుసుకుందామని మంత్రి బసవేశ్వరుని వెంట తీసుకుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మయ్యని చూసి బసవేశ్వరుడు నమస్కరించి
అయ్యా మీరు భూలోక ఈశ్వరులు. మీరు ఇలాంటి
వివాదంలో చిక్కుకున్నారేమిటి. పూర్వము
అనేకమంది భక్తులు అనేక విధముల ప్రజలు తమకు పెట్టిన పరీక్షలలో నెగ్గి ఈశ్వర
సాక్షాత్కారం చేయించారు. మీరు కూడా శివుని
చేత నిజము పలికించి మీ భక్తిని నిరూపించుకోండి
అని ప్రార్ధించాడు. అది విని గుడి
పూజారి, మిగతా అక్కడివారందరూ భయంతో తలొకమూలా దాక్కున్నారు. బ్రహ్మయ్య “శివా శివా శివా”
అంటూ మూడు సార్లు గర్భాలయం తలుపు తడుతూ పిలవగా గర్భాలయం తలుపులు వాటంతటవే పూర్తిగా
తెరుచుకున్నాయి.
ఆలయంలో వున్నవారంతా ఇదివరకొక భక్తుడికోసం భగవంతుడు ఆలయం తలుపులు
తెరిచాడని విన్నాముగానీ, ఇప్పుడు నిజంగా చూస్తున్నాము. తలుపులు తీయించిన ఇతను భగవంతుని చేత కూడా
మాట్లాడించగలడని ఆత్రంతో, భయంతో ఎదురు చూడసాగారు.
బ్రహ్మయ్య “ఓ దేవా, నేను చెప్పినదంతా నిజమో, అబధ్ధమో చెప్పటానికి నాకు నీకన్నా
సాక్ష్యం ఎవరూ లేరు. నన్ను కరుణించి, నేను
చెప్పినది నిజమో కాదో నీవో చెప్పు తండ్రీ” అనీ బిగ్గరగా
అడిగినంతనే, గుడిలోనుంచి “నీవు చెప్పినదానిలో ఆవ గింజంతయినా అబధ్ధం లేదు. అంతా నిజమే” అనే మాటలు
వినబడి, వాటి ధ్వని క్రమక్రమంగా పెరగసాగింది.
అంతే కాదు ఆ మాటలు అలా ఏడు రోజులు వరుసగా వినబడ్డాయి.
అంతకంతకూ పెరిగిని ఆ ధ్వనితో ప్రళయ చిహ్నాలు కనిపించసాగాయి. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. రాజు బిజ్జలుడు ఆ పరిస్ధితి గమనించి
బసవేశ్వరుడిని బ్రహ్మయ్యకు నచ్చచెప్పి ఆ విపత్తు తప్పించమంటాడు. బసవేశ్వరుడు బ్రహ్మయ్యతో, “భక్తాగ్రేసరా, భగవంతుడు మాయా సహాయుడు కనుక భక్తులననేక మాయోపాయలతో
పరీక్ష చేస్తాడు. భక్తుడు వాటికి లొంగక
అన్నిటినీ దాటితే భగవంతుడు భక్తుడిని మెచ్చి వారికి సర్వ శక్తి, సర్వసామర్ధ్యము ఇస్తాడు. మీరు భగవంతునిచే ఘటనాఘటన సామర్ధ్యాన్ని
పొందారు. కనుక మీరీ భయంకర ధ్వనిని ఆపి
మమ్మల్ని అందర్నీ రక్షించండి” అని ప్రార్ధిస్తాడు.
బ్రహ్మయ్య గర్భగుడివైపు తిరిగి “హో” అని ఒక్కసారి అనగానే ఆ శబ్దము ఆగిపోయింది. అప్పుడు బిజ్జలుడు తన పరివారమంతటితో అతనికి
సాష్టాంగ నమస్కారం చేసి, “భగవంతుడంతటివాడు మీరు పలకమంటే పలికాడు, ఆగమంటే ఆగాడు. ఇంక నేనెంత వాడను. మీ గొప్పతనం తెలుసుకోలేక తప్పు చేశాను
క్షమించండి” అని వేడుకుంటాడు.
అప్పుడు బ్రహ్మయ్య అందరూ చూస్తూవుండగానే తన చేతిలో చనిపోయిన ఆ విటుని
బతికించి, లింగసంగతుని గావించి, భగవద్భక్తుడవై జీవించమని బుధ్ధిచెప్పి
పంపుతాడు. అందరూ బ్రహ్మయ్య భక్తిని
మెచ్చుకుంటూ తమ తమ నివాసాలకి వెళ్ళారు.
నిజమైన భక్తులకు భగవంతుడు అండగా నిలిస్తాడని చెప్పే కిన్నెర బ్రహ్మయ్య
కధ ఇది.
***
No comments:
Post a Comment