హరిదాసులే మాకు నడ్డమై కాతురుగాక
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0337-06 సం: 04-219
పల్లవి: హరిదాసులే మాకు నడ్డమై కాతురుగాక
శరణంటి వారికి నే సకలోపాయములు
చ.1: పెరుగబెరుగగానే పెద్దలాయ నింద్రియాలు
యిరవైనమాబుద్ధు లిందుగొల్పీనా
తిరిగితిరిగి మాకు ద్రిష్టమాయ జన్మములు
దురితాలుబుణ్యాలు దోసేమా యికను
చ.2: కూడగూడ నానాటగొనకెక్కె గోరికలు
వీడనిబంధములన్నీ విడిచీనా
పాడితో నీడా నాడబ్రాణములుదీపులాయ
యేడనున్ననేము నేమే యెరిగేమా యికను
చ.3: చింతించ జింతించ జేతికి వచ్చె మనసు
అంతలో శ్రీవేంకటేశుడంది కాచెను
దొంతులై తిరుమంత్రము తోడనే నాలుక నంటె
మంతనాన గురుసేవ మరచేమా యికను
భావం:
పల్లవి:
హరిదాసులే(నృత్య గాన సహితముగా హరికి సంబంధించిన పురాణాది కథలను చెప్పువారు , హరిసేవ చేయువారు) హరికి - మాకు నడుమనుండి రక్షించెదరుగాక !
సకలోపాయములతో వారిని నేను శరణము కోరుతున్నాను.
చ.1:
నేను పెరుగుతుంటే ఇంద్రియాలకు సంబంధించిన కోర్కెలు కూడా పెద్దవయ్యాయి.
స్థిరంగా మా బుద్ధులను ఇవి ఇముడ్చుకొంటాయా? (ఇముడ్చుకోవని భావం)
తిరిగితిరిగి మాకు జన్మములు దృష్టాంతములయ్యాయి.(పాపపుణ్యాల నిదర్శనాలుగా జన్మలు నిలిచాయని భావం)
ఇక పాపాలు, పుణ్యాలు - వీటిని మేము తోయగలమా? ( అవిలేని మోక్షము పొందగలమా అని ప్రశ్న)
చ.2:
కలిసి కలిసి ప్రతిరోజు కోరికలు శిఖరానికి చేరాయి.
ఇక వీడని బంధములన్నీ విడిచిపెడతాయా? ( విడువవని భావం)
ఇక్కడా , అక్కడా (అన్నిచోట్ల)ప్రాణములు చాలా ఇష్టములవుతున్నాయి.
ఎక్కడున్నా మేము మేమే. ఇది మాకు తెలుస్తుందా?
(కోరికల బానిసలుగా ఎక్కడైనా మేము, మేముగా ఏ మాత్రం మారకుండా ఉన్నాము. హరి చింతన మేము చేయలేకపోతున్నాం. ఇది తెలిసినా ఆచరించలేకపోతున్నామని ఆవేదన)
చ.3:
హరిని చింతించగా చింతించగా మనస్సు స్వాధీనమయింది.
అంతలో శ్రీవేంకటేశుడు శరణుకోరిన ఈ జీవుడిని అందుకొని రక్షించాడు.
ఒకదాని మీద ఒకటిగా ఉండే అదృష్టంలా తిరుమంత్రము(ఓం నమో నారాయణాయ) నా నాలుకపై చేరింది.
ఏకాంతంలో రహస్యంగా గురుసేవ ఇక మరుస్తామా? ( మరువమని భావం)
ధన్యవాదములు.
No comments:
Post a Comment