బంగారు ద్వీపం (అనువాద నవల) -2
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(జూలియన్, డిక్, అన్నె వేసవి సెలవులకు ఎక్కడకు వెళ్ళాలని తమ తల్లిదండ్రులను అడుగుతారు. ఆ సంవత్సరం ఎప్పటిలా వెళ్ళే పోల్జెత్ కి వెళ్ళటం కుదరదని, వాళ్ళ అమ్మ తనతో స్కాట్లాండ్ వస్తున్నందున వారితో ఉండదని డాడీ చెబుతాడు. చివరకు వాళ్ళు చర్చించుకొని కిర్రిన్ బే లో తన తమ్ముడి యింటికి పంపటానికి డాడీ ఏర్పాట్లు చేస్తాడు. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@
"నాన్నా! మనం రైల్లో వెళ్తామా? కారులో వెళ్తామా?"
"కారులో" డాడీ చెప్పాడు. "సామానంతా డిక్కీలో సర్దేద్దాం. సరే! మంగళవారం ఏమంటావు?"
"ఆ రోజు నాకు బాగా వీలవుతుంది" అని తల్లి చెప్పింది. "అప్పుడైతే మనం పిల్లల్ని దిగవిడిచి వెనక్కి రావచ్చు. విశ్రాంతిగా మన సామాన్ని సర్దుకొని, శుక్రవారం మనం స్కాట్లాండుకి బయల్దేరవచ్చు. అవును ... ముందు మంగళవారానికి ఏర్పాట్లు చేసుకోవాలి."
మంగళవారం ప్రయాణం నిశ్చయమైంది. పిల్లలు ఆసక్తిగా రోజులు లెక్కబెడుతున్నారు. అన్నె ప్రతి రాత్రి కాలెండరులో తేదీలను కొట్టేస్తోంది. వారం రోజులు చాలా దీర్ఘమైన సమయం అనిపించింది. చివరకు మంగళవారం రానే వచ్చింది. ఒకే గదిలో పడుకొన్న డిక్, జూలియన్ యించుమించు ఒకే సమయానికి నిద్ర లేచి, దగ్గరలో ఉన్న కిటికీలోంచి బయటకు చూసారు.
"ఇది మనోహరమైన రోజు, హుర్రే!" జూలియన్ అరుస్తూ, మంచం మీద నుండి దూకాడు. "ఎందుకో నాకు తెలియదు, కానీ సెలవుదినం యొక్క మొదటి రోజు ఎండగా ఉండటం చాలా ముఖ్యం. అన్నేని లేపుదాం."
అన్నె పక్క గదిలో పడుకొంది.. జూలియన్ లోపలికి పరిగెత్తి ఆమెను కదిలించాడు. "లే! ఇది మంగళవారం! అంతేకాదు. సూర్యుడు ప్రకాశిస్తాడు."
అన్నె ఒక దూకుతో మేల్కొని, జూలియన్ వైపు ఆనందంగా చూసింది. "ఇది చివరికి వచ్చింది!" ఆమె అంది. "ఇది ఎప్పటికీ రాదని నేను అనుకున్నాను. ఓహ్, సెలవుదినం బయటకు వెళ్ళడం ఉత్తేజకరమైన అనుభూతి కదా!"
అల్పాహారం ముగియగానే వాళ్ళు బయల్దేరారు. అది పెద్ద కారు కావటంతో అందరూ సౌకర్యవంతంగా కూర్చున్నారు.
ముందు సీట్లలో అమ్మ, నాన్న కూర్చుంటే, ముగ్గురు పిల్లలు వెనుక సీట్లో రెండు సూటుకేసులపై తమ పాదాలనుంచి కూర్చున్నారు. కారు వెనుక భాగంలో సామాన్లు పెట్టుకొనే స్థలంలో చిన్నా, చితక సామాన్లతో పాటు ఒక ట్రంకు పెట్టె ఉంది. దేన్నీ మరిచిపోకుండా సర్దినట్లు అమ్మ భావించింది.
రద్దీగా ఉన్న లండన్ రహదారుల వెంట వారు మొదట నెమ్మదిగా వెళ్లారు. తరువాత, వారు పట్టణాన్ని విడిచినప్పుడు, వేగాన్ని పెంచారు. వెంటనే వారు బహిరంగ ప్రదేశంలోకి వచ్చారు. దానితో కారు మరింత వేగంగా దూసుకెళ్లింది. పిల్లలు, ఎప్పటిలాగే తాము సంతోషంగా ఉన్నప్పుడు చేసినట్లే, తమలో తామే పాటలు పాడుకొన్నారు.
"దారిలో ఎక్కడన్నా ఆగుదామా?" అకస్మాత్తుగా ఆకలి వేస్తున్నట్లు అనిపించి, అన్నె అడిగింది.
"ఆగుదాం" అంది తల్లి. "అయితే యిప్పుడే కాదు. ఇప్పుడింకా పదకొండే అయింది. అన్నె! కనీసం పన్నెండున్నర వరకూ భోజనం చేయకూడదు."
"ఓహ్! నీ దయ!" అన్నె అంది. "అప్పటి వరకు నేను నిలబడలేనని నాకు తెలుసు!"
అందువల్ల ఆమె తల్లి పిల్లలకు తలొక చాక్లెట్టు యిచ్చింది. ఆమె, మిగిలిన అబ్బాయిలు వాటిని సంతోషంగా చప్పరిస్తూ, పోతున్న కారులోంచి కొండలు, అడవులు, పొలాలను చూస్తున్నారు.
దారిలో వారి పిక్నిక్ మనోహరంగా ఉంది. వారు దాన్ని ఒక కొండపైన, వాలుగా ఉన్న పొలంలో జరుపుకొన్నారు. అక్కడ నుంచి కిందకు తొంగిచూస్తే ఎండలో ప్రకాశించే లోయ కనిపిస్తుంది. ఒక పెద్ద గోధుమరంగు ఆవు దగ్గరకొచ్చి తన వైపే చూడటం అన్నెకి యిష్టం లేదు. కానీ డాడీ పొమ్మని చెప్పగానే అది వెళ్ళిపోయింది.
పిల్లలు విపరీతంగా తిన్నారు. నాలుగున్నరకు టీ పిక్నిక్ చేసుకొనే బదులు ఎక్కడో టీ హౌస్ వద్ద ఆగవలసి ఉంటుందని అమ్మ అంది. ఎందుకంటే వారు భోజనంతో పాటే టీతో తీసుకొనే శాండ్విచ్ లను కూడా లాగించేసారు!
"పిన్ని యింటి వద్ద ఏ సమయానికి ఉండాలి?" చివరి శాండ్విచ్ ని పూర్తిచేస్తూ జూలియన్ అడిగాడు. అతనిలో ఇంకా తినాలన్న అభిలాష పోలేదు.
"కాలం అనుకూలిస్తే సుమారు ఆరు గంటలకు" అన్నాడు డాడీ. “ఇప్పుడు కొద్దిగా కాళ్ళు చాచాలని ఎవరు అనుకొంటున్నారు? మనం కారులో యింకొక సుదీర్ఘమైన ప్రయాణం చేయవలసి ఉంటుందని మీకు తెలుసు."
కారు వేగంగా పరుగుతీస్తూ మైళ్ళ కొద్దీ దూరాన్ని మింగేస్తోంది. టీ సమయం కావటంతో, ముగ్గురు పిల్లలు మరొకసారి ఉత్సాహపు అనుభూతిని పొందారు.
"మేము సముద్రాన్ని తప్పక చూడాలి" అన్నాడు డిక్. "అది యిక్కడకు దగ్గరలో ఉన్నట్లు వాసన పట్టేసాను!"
అతను చెప్పింది నిజమే. వారొక కొండపైకి వచ్చారు. అక్కడ నుంచి చూస్తే, సాయంత్రపు నీరెండలో ప్రశాంతంగా, మృదువుగా కదిలే నీలి సముద్రం కనిపించింది. ముగ్గురు పిల్లలు ఆనందంతో కేకలు పెట్టారు.
"అదిగో అదే!"
"అద్భుతంగా ఉంది."
"ఓ! ఇప్పుడే దానిలో దిగి స్నానం చేయాలనుకొంటున్నాను!"
"మనం కిర్రిన్ బే చేరటానికి ముందు, యిక్కడ యిరవై నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు"డాడీ అన్నాడు. "మనం చాలా త్వరగా వచ్చాం. మీరు త్వరలోనే బే ని చూస్తారు. ఇది చాలా పెద్దది. బే ప్రవేశద్వారం వద్ద ఒక విచిత్రమైన ద్వీపం ఉంది."
కారు తీరం వెంబడి వెళ్తూంటే, పిల్లలు ద్వీపం కోసం చూసారు. ఉన్నట్లుండి జూలియన్ గట్టిగా అరిచాడు.
"అదిగో! అక్కడ.. .అదే కిర్రిన్ బే అయి ఉండాలి. డిక్! అటు చూడు. అది మనోహరంగాను, నీలంగాను లేదా?"
"బే ప్రవేశద్వారానికి కాపలాగా ఉన్న ఆ చిన్న రాతి ద్వీపాన్ని చూడు" అన్నాడు డిక్. "నేను దాన్ని సందర్శించాలనుకొంటున్నాను."
"సరె! మీరలా చేస్తారనటంలో నాకెలాంటి సదేహం లేదు" అమ్మ చెప్పింది. "ఇప్పుడు పిన్ని యింటి కోసం చూద్దాం. దాన్ని కిర్రిన్ కాటేజీ అంటారు."
వారు వెంటనే అక్కడకు చేరుకొన్నారు. అది బే కు ఎదురుగా ఎత్తు తక్కువ ఉన్న కొండపై పాత యిల్లు. ఇది నిజంగా కుటీరం కాదు. పాత తెల్ల రాయితో నిర్మించిన చాలా పెద్ద యిల్లు. దాని ముందు భాగాన్ని గులాబీలు మూసేస్తుంటే, ఆకర్షణీయమైన పూలతోట ముచ్చట గొల్పుతోంది.
"ఇదే కిర్రిన్ కాటేజీ" కారును ఆ యింటి ముందు ఆపుతూ డాడీ చెప్పాడు. "ఇది సుమారు మూడు వందల సంవత్సరాల పురాతనమైనది. ఇప్పుడు. . . క్వెంటిన్ ఎక్కడ? హల్లో! ఫానీ అక్కడ ఉంది!"
పిల్లల పిన్ని కారు కోసం ఎదురుచూస్తోంది. అది గుమ్మం బయట ఆగటం చూడగానే, పాత చెక్క తలుపును దాటి బయటకు పరుగున వచ్చింది. పిల్లలు ఆమె రూపాన్ని చూడగానే యిష్టపడ్డారు.
"కిర్రిన్ కు స్వాగతం" ఆమె ఆనందంగా ఆహ్వానించింది. "హల్లో! మీ అందరికీ. మిమ్మల్ని చూడటం చాలా మనోహరంగా ఉంది. పిల్లలు ఎంత పెద్దవాళ్ళయ్యారు!"
అందరూ ఒకర్నొకరు ముద్దాడాక, పిల్లలు యింట్లోకి నడిచారు. వాళ్ళకు ఆ యిల్లు ఎంతగానో నచ్చింది. అది ఒక విధంగా పాతదిగా, నిగూఢమైనదిగా అనిపించింది. ఇంట్లో ఫర్నిచరంతా పాతది మరియు చాలా అందంగా కనిపించింది.
"జార్జినా ఏది?" అంటూ తనకు పరిచయంలేని కజిన్ కోసం అన్నె చుట్టూ చూసింది.
"ఓహ్! కొంటెపిల్ల! నేను మీ కోసం తోటలో వేచి చూడమని చెప్పాను" అని ఆమె పిన్నిచెప్పింది. "ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోయింది. పిల్లలూ! నేను మీకు చెప్పేదేమిటంటే, జార్జి మొదట మీకు కష్టంగా అనిపించవచ్చు. ఆమె ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది, మీకు తెలుసు. మొదట మీరు ఇక్కడ ఉండటం తనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. కానీ తక్కువ సమయంలోనే మారిపోతుంది. మీరిలా రావటం, జార్జి కోసం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆడుకోవటానికి ఆమెకు సాటి పిల్లల అవసరం ఎంతైనా ఉంది."
"మీరామెను జార్జి అని పిలుస్తారా?" అన్నె ఆశ్చర్యంగా అంది. "ఆమె పేరు జార్జినా అనుకొంటా!"
(సశేషం)
No comments:
Post a Comment