చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 24 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 24

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 24

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene


 

(హోటలుకి చేరిన నాన్సీ పోలీసులను విచారించగా, పోయిన ఆమె కారు కానీ, కిడ్నాపయిన న్యాయవాది ఆచూకీ కానీ తెలియలేదని తెలుస్తుంది. దుర్భిణీ పట్టుకొని హోటలు పైకప్పు నుంచి కోట వైపు చూసిన ఆమెకు, ఎవరో వ్యక్తి కోట బురుజు పైనుంచి దుర్భిణీలో కొంతసేపు చూసి ఎవరికో చేతులూపి సైగ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వచ్చిన ఆమె స్నేహితుడు నెడ్ ఆమె శోధిస్తున్న కేసు పూర్వాపరాలు తెలుసుకొంటాడు. తరువాత నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు ఆరోజే వచ్చిన తమ ప్రియులతో ఖరీదైన రెస్టారెంటుకి వెడతారు. అక్కడ మాటల మధ్యలో నాన్సీకి బహుమతిగా తాను చంద్రమణిని పంపలేదని నెడ్ చెప్పటంతో, అందరూ డైలమాలో పడతారు. అతను పంపకపోతే, ఎవరు పంపారన్నది వారికి మిస్టరీగా తోచింది. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@

"ఈ చంద్రమణికి, చంద్రమణి లోయకు ఏదో సంబంధం ఉన్నట్లు నువ్వు ఊహించావని నేను అనుకొంటున్నాను" బర్ట్ చెప్పాడు.

"అదే ఉంటే, అది నన్ను నేర్పుగా తప్పించుకుంటుంది" నాన్సీ బదులిచ్చింది. "కానీ పంపిన వ్యక్తి మనసులో పరిహాసమో, హెచ్చరికో ఉంటే, విలువ తక్కువ రాతి నెందుకు పంపలేదు? ఇది నేనెప్పుడూ చూడని అందమైన చంద్రమణి. దాన్ని మీకు చూపిస్తాను." ఆమె తన సాయంత్రం పర్సునుంచి బయటకు తీసింది.

“వావ్! ఏమి బహుమతి! ” బర్ట్ ఆశ్చర్యపోయాడు.

ఒక వెయిటర్ వారి బల్ల వద్దకు రావటంతో, ముగ్గురు జంటలు తమ దృష్టిని విందు మరియు నృత్యం మీదకు మళ్ళించారు. ఆకర్షణీయమైన ఆ రెస్టారెంట్లో వారు చాలా సమయం గడిపి వదిలిపెట్టారు.

"నేరుగా యింటికి వెళ్ళడమంటే, చాలా ముందుగా అవుతుంది" అన్నాడు నెడ్. "ఒక స్పీడ్ బోటుని అద్దెకు తీసుకొని నదిలో విహారయాత్రకు వెళ్తే ఎలా ఉంటుంది?"

బెస్ ఆకాశం వైపు చూసింది. "ఎంత అందమైన చంద్రుడు!" పరవశంతో అందామె. " ఈ సమయంలో నీటి మీద ప్రయాణమంటే పూర్తిగా స్వర్గతుల్యమే అవుతుంది. పదండి వెళ్దాం."

నాన్సీ రాత్రి పడవులను అద్దెకు తీసుకొనే రేవుకి నెడ్ ను తీసుకెళ్ళింది. వాళ్ళకు యిరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఒక దాన్ని కనుగొన్నారు. నెడ్ కారుని ఆపి, విచారణ కోసం లోనికెళ్ళాడు.

ప్రస్తుతం వెనక్కి వచ్చి "వాటర్ విచ్" అనే సొగసైన మోటారుబోటుని తీసుకోవచ్చని వారికి చెప్పాడు.

"విచ్ వాటర్ (ఏ నీరు)?" శ్లేషని ప్రయోగించాడు డేవ్. ఆపైన బర్ట్ అతన్ని నదిలోకి విసిరినట్లు నటించాడు.

ఆరుగురు మోటారుబోటు ఎక్కారు. నెడ్ స్టీరింగుని అందుకొన్నాడు.

"మీరు శిధిలమైన మిస్టర్ వీలర్ పడవను చూడాలనుకొంటే, నదికి అవతలవైపున కొద్ది దూరంలో దిగువకు పోవాలి" నాన్సీ చెప్పింది.

నాన్సీ ఆదేశాలను అనుసరిస్తూ నెడ్ నీరు ప్రవహిస్తున్న దిగువకు పడవను తిప్పాడు. అదే సమయంలో వారి వైపు వస్తున్న స్పీడ్ బోట్ ఒకటి వాళ్ళందరికీ కనిపించింది. ఐఎన్ అన్న అక్షరాలు ఉన్న అది తిన్నగా వారి పడవ దిక్కుకే వస్తోంది..

ఉన్నట్లుండి నెడ్ తమ పడవను పక్కకు తిప్పాడు. అయినప్పటికీ, ఏదో అయస్కాంతం లాగినట్లు, అది వారి పడవను సమీపిస్తోంది. నెడ్ తమ పడవ సైరన్ మోగించాడు. కానీ అవతల పడవను నడిపే వాడు దాన్ని పట్టించుకోలేదు.

"వాడు పిచ్చి వెధవా?" బర్ట్ ఆందోళనగా అడిగాడు.

వస్తున్న పడవ మార్గం నుంచి పక్కకు తప్పుకోవాలని నెడ్ తమ పడవను యిటూ, అటూ తప్పిస్తున్నాడు.

"అది మనని గుద్దుకోబోతోంది!" బెస్ అరిచింది. చిత్రమైన ఆ పడవ వారిని సమీపించే లోపున, దాన్ని నడిపేవాడు నీటిలోకి దూకాడు. నెడ్ స్పీడ్ బోటుని, ఈతకొట్టే వాణ్ణి తప్పించటానికి విశ్వప్రయత్నం చేసి, చివరకు తన ప్రయత్నంలో సఫలమయ్యాడు.

"మంచి పని!" జార్జ్ మెచ్చుకొంది.

నీటిలో దూకినవాడికి ఏమి జరిగిందో అని నదిలోకి తొంగిచూసారు.

"అతన్ని చూసాను!" నాన్సీ అరిచింది. "అతను తీరం వైపు ఈదుకెళ్తున్నాడు."

"అతను క్షేమంగానే ఉన్నాడని ఊహిస్తున్నాను" అన్నాడు నెడ్. "ఇప్పుడు మనం డ్రయివరు లేని ఆ స్పీడుబోటుని వెంబడించి, ఏదైనా నష్టం కలిగే ముందుగా ఆపటానికి ప్రయత్నించాలి!"

పోటీ మొదలైంది. నెడ్ తన పడవను పూర్తి శక్తితో నడుపుతుండగా, అది డ్రయివరులేని పడవకు కొద్ది కొద్దిగా దగ్గర కాసాగింది.

"నేను అడ్డంగా దూకుతాను" అని బర్ట్ చెప్పి, పక్క పడవలోకి దూకాడు. అతను స్టీరింగు అందుకొన్నాడు. అది బాగానే పనిచేయటం గమనించాడు. "స్టీరింగ్ పనితనంలో సమస్యేమీ లేదు. అంటే ఆ వెధవ ఉద్దేశపూర్వకంగా తమను ఢీకొట్టాలనే అలా చేసాడు. ఇది ఖచ్చితం." అతను పిలవటంతో, జార్జ్ దానిలోకి దూకి అతని పక్కన కూర్చుంది. "ఇప్పుడు మనం ఎక్కడకు వెళ్తాం?" అడిగాడతను.

"మనం ఆ పడవతో పాటు వెనక్కి వెళ్ళి రేవులో అప్పగించి, అసలేం జరిగిందో వివరించాలని నేను అనుకొంటున్నాను" అంది నాన్సీ.

“అయితే నేను మొదట ఆ కోటను చూడాలనుకుంటున్నాను” అన్నాడు నెడ్. "ఆ భవనం ముందే ఉంది కదా?"

"అవును."

రెండు స్పీడుబోట్లు రికెటీ డాక్ వైపు వెళ్ళాయి. దాన్ని కోటలోని మాజీ కిరాయిదార్లు వాడే వారని స్పష్టంగా కనిపిస్తోంది.

అకస్మాత్తుగా నాన్సీ ఆశ్చర్యంతో అరిచింది. "కోటలోపల దీపం కదలటం నాకు కనిపించింది!"

"నాక్కూడా!" వంత పాడాడు నెడ్.

"బుంగ మీసాలోడు అక్కడ ఉండి ఉండాలి!" బెస్ సూచించింది.

జార్జ్ పెద్దగా నిట్టూర్చింది. "అది తేల్చటానికి ఒకటే మార్గం ఉంది. పడవను గట్టుకి కట్టేసి, మీ అబ్బాయిలంతా వెళ్ళి పరిశోధించవచ్చు కదా?"

అపరిచితుడి స్పీడుబోటు నుంచి ఆమె దిగబోతుండగా, ఆ సమూహం అదిరిపడేలా కర్కశంగా విజిల్ వినిపించింది. వాళ్ళంతా పక్కకు తిరిగారు. విపరీతమైన వేగంతో వస్తున్న పోలీసు లాంచీ కనిపించింది. పెద్ద సెర్చిలైట్ కాంతి "వాటర్ విచ్" పైన, పక్కనున్న పడవ మీద కేంద్రీకృతమైంది.

రెండు పడవల్లోని యువ జనం వారి సీట్లలో ఉన్నారు. కొన్ని సెకన్లలో లాంచీ వారి పక్కకు వచ్చి ఆగింది.

ప్రధాన అధికారి లాంచీ రైలింగ్ మీదకు వాలి "అయితే పడవను దొంగిలించింది మీరన్నమాట!" అన్నాడు.

నాన్సీ, ఆమె స్నేహబృందం అవాక్కయ్యారు. తాము పడవను దొంగిలించలేదని ఆమె దృఢంగా నిరసిస్తూ, అసలేమి జరిగిందో వివరంగా చెప్పింది.

“క్షమించండి మిస్! కానీ మీరు ఇప్పుడే నిందను వేరొకరిపైకి నెట్టేయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు ధ్వనిస్తోంది."

"ఇదే నిజమండీ!" అని నాన్సీ నొక్కి చెబుతుంటే, మిగిలినవారు ఆమె కథను సమర్ధించారు.

"సరె! అదంతా మీరు మా ప్రధాన కార్యాలయంలో చెప్పుకోండి" అధికారి అన్నాడు. తరువాత అతను బర్ట్, జార్జ్ వైపు తిరిగాడు. "మీరిద్దరూ కిందకు దిగి, మా లాంచీ ఎక్కండి" అన్నాడు.

కోపంతో, కానీ విధేయతతో ఆ జంట పోలీసు లాంచీ ఎక్కింది. మరొక అధికారి దొంగిలించబడిన స్పీడుబోటులోకి దూకి, స్టీరింగ్ వెనుక కూర్చున్నాడు.

"అంతా సిద్ధమేనా?" ప్రధాన అధికారి అతన్ని అడిగాడు.

"సిద్ధం సార్!"

ఇప్పుడు లాంచీ కమాండర్ నెడ్ వైపు తిరిగి ఆదేశించాడు, "మీరందరూ కూడా మాతో పాటు రావాలి!"
@@@@@@@@@@@

రివర్ పోలీసులతో జార్జ్, బట్ తమ వాదనను కొనసాగించారు కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు జార్జ్ యిలా చెప్పింది, "మా స్నేహితులు ఉన్న పడవ గంటల లెక్కన అద్దెకు తీసుకోబడింది. దయ ఉంచి, మనం ప్రధాన కార్యాలయానికి చేరే ముందుగా దాన్ని వెనక్కి యివ్వలేమా?"

ప్రధాన అధికారి అంగీకరించాడు.

"ధన్యవాదాలు" చెప్పింది జార్జ్. పడవను అద్దెకు తీసుకొన్న వ్యక్తి సంప్రదించటం ద్వారా, యువజన సమూహం విముక్తమవుతుందని ఆమె ఆశపడింది.

ఆమె ఆశలు ఫలించలేదు. తన పడవల్లో ఒక దాన్ని అద్దెకు తీసుకొన్న సమూహంగా వారిని గుర్తించినా, ఆ వ్యక్తి వాళ్ళు ఎక్కడకు వెళ్తున్నారో తనకు తెలియదని చెప్పాడు. అతనికి తెలిసిందల్లా, మరొక పడవను దొంగిలించటానికే తన పడవను వాళ్ళు అద్దెకు తీసుకొని ఉండొచ్చు. "వాటర్ విచ్" వాడుకొన్నందుకు నెడ్ అతనికి చెల్లించాడు. తరువాత అతను, నాన్సీ, బెస్, డేవ్ అధికారుల లాంచీని ఎక్కారు.

అది పోలీసు రేవుకి చేరింది. అక్కడ ఆరుగురు స్నేహితులను ఒక భవనంలోకి ప్రవేశపెట్టారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages