గురువు అజ్ఞా పాలన వైశిష్ట్యం. - అచ్చంగా తెలుగు

గురువు అజ్ఞా పాలన వైశిష్ట్యం.

Share This

గురువు అజ్ఞా పాలన వైశిష్ట్యం

సి.హెచ్.ప్రతాప్  
( చరవాణి: 95508 51075 ) 

ఆద్యాత్మిక జీవితం మిక్కిలి నిఘూఢమైనట్టిది, కష్టతరమైనది. ఆచి తూచి అడుగులు వేయకపోతే ఆవేదన, అశాంతి ఆందోళన తప్పవు. ఇతర మార్గముల వలే కాక అద్యాత్మిక జీవితం లో మార్గదర్శి తప్పని సరి. సర్వ సమర్ధులైన గురువు మార్గ దర్శకత్వం లోనే సాధకుడు అనుక్షణం సంశయ నివృత్తి పొందుతూ, సాధన, అనుష్టయాలను చక్కగా నిర్వర్తించుతూ లక్ష్యాన్ని చేరగలడు. లేనిచో ఏ క్షణమైనా వక్ర మార్గం పట్టడమో లేక భ్రాంతి, మోహం అనే సుడిగుండం లో పడడమో జరుగుతుంది. దారి చూపే వారు లేక తీవ్రమైన అశాంతికి లోనవుతారు. కొందరు ఈ మాయలో పడి నాస్తికులుగా మారిన వైనం కూడా వుంది. అందుకే అధ్యాత్మిక జీవితం లో సర్వ సమర్ధుడైన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి గురుగీత స్పష్టం గా తెలియజేసింది.

ఈ కలియుగం లో మిడి మిడి జ్ఞానం తో , ఆత్మ సాక్షాత్కార అనుభూతి లేకుండా అహంకారపూరితులైన కొందరు గురువులు-సద్గురువులు-పరమ గురువులు, జగద్గురువులు అంటూ బిరుదులు తగిలించుకుంటూ ప్రచారం చేసుకుంటారని , వారిని నమ్మకుండా , జాగ్రత్తగా, వివేకం తో చరించమని పరాశర మహర్షి ద్వాపరయుగం లోనే సాధకులను హెచ్చిరించారు. హెచ్చరించిన విధం గానే ఎందరో అధ్యాత్మిక పరిపక్వత లేని వారు కలి ప్రభావానికి లోనై గురువులుగా తెర మీదకు వచ్చారు. విబ్భిన్న సిద్ధాంతలు, సాధనా మార్గాలు, ప్రచారాలు చెయ్యడం మొదలుపెట్టారు. కొందరైతే పూజాది కార్యక్రమాలను చేయనవసరం లేదని, భగవంతుడిని నిరాకార రూపం లో ధ్యానించమని, విగ్రహ ఆరాధన చేయవద్దని, ముద్రలను వేయించుకొని ధ్యానం మాత్రమే చేయమని, ఇలా విబ్భిన రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అవివేకపు సిద్ధాంతాలు. అతి సనాతమైన మన సాంప్రదాయాలకు విరుద్ధం. ఈ మధ్య కాలం లో కొందరు గురువులు సేవ,పాప ప్రక్షాళన ల పేరుతో శిష్యుల నుండి ధనాన్ని విపరీతం గా వసూలు చేస్తున్న సంధర్భాలు కూడా వెలుగు లోనికి వచ్చాయి.  

రోజుకో గురువు, సిద్ధాంతం ప్రచారం లోనికి వస్తుండడంతో సాధకుడు దేనిని నమ్మాలి,ఏ మార్గం లో పయనించాలి అన్న గందరగోళానికి గురవుతున్నాడు. ఈ సంధర్భం లో సాధకుని అధ్యాత్మిక జీవితం లో సర్వ సమర్ధుడైన , సర్వజ్ఞుడైన , కరుణామయుడు, సర్వ శక్తిమంతుడైన సారధి అవసరం ఎంతైనా వుంది. ఆ సారధి సారధ్యం లో ఎట్టి సంశయం లేక దిక్కులు చూడక సూటిగా నడిస్తే గమ్యం వైపుకు శ్రీఘ్రమే చేరగలిగి వుండాలి.  

ఈ కలియుగం లో అతి సమర్ధుడైన సారధి శ్రీ శిరిడీ సాయినాధులు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. నిరాకార పరబ్రహ్మ అవతారం. ఈ సృష్టి అంతటికీ సద్గురువు. అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు,యోగిరాజు శ్రేష్టుడు. కోట్లాది మందిని కరుణించి, శ్రేయోమార్గం లో నడిపించిన అపూర్వ పరమ గురువు. సాయికి సాటి రాగల అవతార పురుషుడు భూత, భవిష్య, వర్తమానములలో ఇక రారు. భక్తులకు ఎట్టి కఠోర నియమ నిభంధనలను విధించక ప్రేమపూరితుడై సదా కరుణించడమే ఆయన కర్తవ్యం. ఎన్నో వేల జన్మలలో పుణ్యం చేసి, దైవానుగ్రహం పుష్కలం గా లభిస్తే తప్ప ఈ జన్మలో సాయి దర్శనం,అనుగ్రహం కలుగదు. అది కలిగిన తర్వాత ఆ గురుదేవుల బోధనలను సంపూర్ణం గా తెలుసుకోవడం, వాటిని తు చ తప్పక ఆచరించడమే మన తక్షణ కర్తవ్యం. ఎవరైతే సాయి బోధనలను సంపూర్ణం గా అవగతం చేసుకొని,వాటిని త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వారే అతి శ్రీఘ్రముగా సాయి కరుణా కటాక్షాలకు పాత్రులౌతారు. సంశయ మనస్థత్వం తో గురుదేవులను విశ్వసించని వారికి ఆ సాయి సన్నిధిలో వేలాది సంవత్సరాలు నివసించినా లవలేశమైనా అనుగ్రహం కలుగదు. గురు బోధలను ఆచరించని వారికి గురు అజ్ఞా ధిక్కార పాపం చుట్టుకుంటుంది. జన్మ జన్మలకు ఈ పాప భూయిష్టమైన జీవిత చక్రం లో కొట్టునిట్టాడుతునే వుంటారు. కాబట్టి ఈ జన్మలో సాయిదేవుని శిష్యులం కావడం యొక్క భాగ్యాన్ని అర్ధం చేసుకొని సాయి బోధలను తెలుసుకొని, వాటిని తు చ తప్పక ఆచరించడం  వెంటనే చేయాలి. లేనిచో సాయి చెప్పిన మామిడి పూత వలే మధ్యలోనే రాలిపోతాం. అధ్యాత్మిక జీవితపు గందర గోళం లో కొట్టు మిట్టాడుతునే వుంటాం.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు.

No comments:

Post a Comment

Pages