మానస వీణ - 39
వాయుగుండ్ల శశికళ
చిన్నపిల్లలాగా
పరుగులు తీస్తూ పనులు చేస్తున్న శ్రావణి ని చూస్తే సంతోషంగా ఉంది
రఘురాం కి. మళ్లీ తమ పెళ్లినాటి శ్రావణి ని చూసినట్లుగా ఉంది. కాకుంటే
అప్పుడు పెళ్లి పీటల మీద కూర్చున్నారు, ఇప్పుడు
దత్తత పీటల మీద.
"ఏమిటి ఊరికే చూస్తున్నారు. పనులు చేయకుండా? ఇంకా పంతులు రాలేదు. ఆ విషయం కనుక్కోండి"
గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ అంది శ్రావణి.
ఊగుతున్న మామిడి రెమ్మల మధ్య గాలికి ఎగురుతూ
ఉన్న ముంగురులు తోసుకుంటూ పని చేస్తున్న శ్రావణి ని చూస్తే
కదలాలి అనిపించడం లేదు రఘురాం కి.
"నిన్నేమి కొరుక్కోని తిననులే. నువ్విలా
ఆనందంగా తిరుగుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా?" అన్నాడు.
"ఎంత?" అడిగింది పకపకా నవ్వుతూ శ్రావణి.
"ఇదిగో ఆ రోజు పాపను కన్నప్పుడు ఇంతే
ముద్దుగా ఉన్నావు. నిజంగా తల్లితనం ఆడవాళ్లకు భలే అందం ఇస్తుంది." చెప్పాడు
చిన్నగా నవ్వుతూ.
అవును
లోపల గుండెల నిండా నిండిన ప్రేమ మొహం లో కనిపిస్తోంది.
"సరే సరే. మీరు పంతులు సంగతి చూడండి. నేను
మానస ను రెడీ చేస్తాను" వెళ్లి మానస గది దగ్గర నిలబడి పిలిచింది.
లోపలనుండి సమాధానం లేదు. పెద్దగా అరిచింది "మానసా."
*********
"ఈ రోజు దత్తత ఉంది అని తెలుసు కదా. ఎందుకని ఇంకా అనిరుధ్ రాలేదు? నిన్ననగా రాళ్ళ దాడి గురించి విచారిస్తాను అని వెళ్ళాడు. ఇంకా రాలేదు.
పైగా ఈ రోజు కార్యక్రమం ఉందని కూడా తెలుసు." ఆలోచనల్లో మునిగి, తలుపు దబదబా బాదిన శబ్దం వినబడడంతో, ఉలిక్కిపడి
తలుపు తీసింది మానస.
ఎదురుగా శ్రావణి. భయంతో వణుకుతూ
ఉంది. "నీకేమి కాలేదుగా తల్లి." గబగబా మానసను నిమిరింది.
"నాకేమీ కాలేదు. నాకేమీ కాలేదు. ముందు నువ్వు కూర్చో"
మంచం మీద కూర్చోపెట్టి శ్రావణి భుజం చుట్టూ చేయి వేసింది మానస.
"మరి ఎందుకు అన్ని సార్లు పిలిచినా తలుపు
తియ్యలేదు? ఎంత భయం వేసిందో
తెలుసా?" గుండెల మీద చేయి వేసుకుంటూ చెప్పింది
శ్రావణి.
"అదేమీ లేదులే అమ్మ. ఏదో పరధ్యానం లో
వినలేదు" అనునయించింది మానస.
"అన్ని సార్లు పిలిచినా వినపడనంత పరధ్యానం ఎవరి
గురించి తల్లి?" అడిగింది
శ్రావణి.
"నిజమే, ఏమిటి ఇంత ఆలోచన! ఏంటి అనిరుధ్ రాకపోతే ఇంతలా
బెంగ పడుతోంది మనసు? ఎందరు మంచి స్నేహితులున్నారు తనకి?
కానీ ఇప్పుడు ఈ సమయం లో అనిరుధ్
మాత్రమే పక్కన ఉంటే బాగుండునులని మనసెందుకు తపన పడుతూ ఉంది? త్వరగా
వస్తే బాగుండును." మనసులో అనుకుంది మానస.
"ఇదిగో ఈయన వచ్చారు. మీరిద్దరూ త్వరగా రండి" బయట నుండి రఘురాం పిలుపు.
******
బయటకు వచ్చిన మానసకు పంతులు కనిపించాడు.
గబగబా పూజారి కి కావలిసినవి అందించారు.
పూజారి పెద్దపళ్ళెం లో బియ్యం పోసి మూడు గ్లాసుల్లో నీళ్లు పోసి,
మావిడాకులు వేసాడు. ముందు తమలపాకు మీద పసుపు గణపతిని చేసి పెట్టాడు.
రఘురాం కి శ్రావణి కి మధ్యలో మానస ను
పీటల మీద కూర్చోపెట్టాడు. శ్రావణి తెచ్చిన పట్టుచీర, చిక్కగా కట్టిన మల్లెపూలు పెట్టుకొని
మెరిసిపోతున్న మానసను తృప్తిగా చూసుకుంటూ ఉంది శ్రావణి.
"ఇంకెంత! ఒక గంటలో ఈ పాప తన పాప అవుతుంది ఎప్పటికీ" అనుకుంటూ ఉంది.
పూజారి చెప్పినట్లు అక్షింతలు గణపతి మీద
వేస్తూ, మనసు గుమ్మానికి అతికించింది మానస. ఏ అలికిడి
వినిపించినా, అనిరుధ్ అనుకుని చూస్తూ ఉంది.
మెల్లిగా
తలుపు మీద ఎవరో కొట్టిన చప్పుడు. గబుక్కున తల వెనక్కి తిప్పి చూసింది మెరుస్తున్న
కళ్ళతో మానస.
*******
ఎదురుగా కనపడిన వ్యక్తిని చూసి
నిరాశ పడింది.
ఎదురుగా కృషీవలరావు...
"నేను లోపలకు రావచ్చా?" అని అడిగి లోపలకు వచ్చాడు. లోపల జరిగే కార్యక్రమం అర్ధం అయింది.
"ఇక ఈ తంతు అవసరం లేదు. పూజారిని పంపేయ్యండి"
చెప్పాడు కృషీవల రావు. ఇంత సంతోషం మీద నీళ్లు చల్లినట్లుగా ఉంది శ్రావణికి.
రఘురాం పరిస్థితి అలాగే ఉంది.
"మీరెవరు అలా చెప్పడానికి? ఇది మా సొంత విషయం" కటువుగా చెప్పి బయటకు
చేయి చూపించాడు.
"మానస మీ అమ్మాయే. ఎవ్వరూ దూరం చేయలేరు.
ముందు పంతులును పంపేయ్యండి." సౌమ్యంగా చెప్పాడు కృషీవలరావు.
"ఇన్నాళ్లకు తనకు లభిస్తున్న తల్లి తండ్రుల
భాగ్యం మళ్లీ చేజారిపోతూ ఉన్నట్లుగా ఉంది." మనసులోనే బాధగా అనుకుంది మానస.
కానీ కృషీవలరావు మీద గౌరవంతో మౌనంగా
ఉండిపోయింది.
పంతులుకు గౌరవంగా సంభావన ఇచ్చి పంపేసారు.
******
"నిజంగా మానస మీ అమ్మాయి. మీరు ఇక మళ్లీ
దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు." అందరి మౌనాన్ని
బ్రద్దలు చేస్తూ అన్నాడు కృషీవలరావు.
"నిజమా! మానస తప్పిపోయిన తమ బిడ్డా!"
ఆనందంతో పొంగిపోయారు రఘురాం, శ్రావణి.
"ఎవ్వరికీ తెలియకపోయినా కన్నపేగు బిడ్డను
గుర్తు పడుతుంది. అందుకే మానసను చూసి శ్రావణి ఆరోగ్యం బాగుపడింది." మనసులో
అనుకున్నాడు రఘురాం.
"ఇది నిజమే అని నమ్మకం ఏమిటి?"
అడిగాడు.
"మీ నాన్నగారు భూషణమే సాక్ష్యం."
చెప్పాడు చిన్నగా.
"నాన్నా! నాన్నకేమి తెలుసు? తెలిస్తే ఎందుకు చెప్పకుండా ఉంటారు. అదీ శ్రావణి పిచ్చిది అయిపోతూ ఉంటే
చూస్తూ కూడా. నేను నమ్మను" చెప్పాడు రఘురాం.
శ్రావణి, మానస
ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
"ఆయన చెప్పరు. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇష్టం
లేక దూరం చేసింది ఆయనే కాబట్టి!" మెల్లిగా అన్నాడు.
అందరూ పిడుగు పడినట్లు ఉలిక్కిపడి చూసారు.
"నాన్న, అంత
దుర్మార్గుడు కాదు." గట్టిగా అరిచాడు రఘురాం.
"అరిచినంత మాత్రాన నిజం, అబద్దం కాదు. చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అయిపోరు. మీ
నాన్న పుట్టిన పాపని చంపమని మా నాన్నకి ఇచ్చాడు.
కానీ మా నాన్న ఆ పాపం చెయ్యలేక, ఆయనను
ఎదిరించలేక పాపని
హేమలత అనాధాశ్రమంలో వదిలి పెట్టాడు. కావాలంటే చూడండి. అమ్మాయి ఆశ్రమంలో
చేరిన తేదీ, మీ పాప తప్పిపోయిన తేదీ ఒకటే. తన చిన్నప్పటి ఫోటో
కూడా అక్కడ రిజిస్టర్ లో ఉంది." చెప్పాడు కృషీవలరావు.
ఇంకా నమ్మకం కలగక చూస్తున్నవాళ్ళతో
"ఇంకా చెపుతాను వినండి. మా నాన్నగారు చివరి
దశలో మీ అమ్మాయిని మీకు చేర్చి తన పాపం తొలగించమని చెప్పాడు. అప్పుడే నేను చేసిన
విచారణలో మానస విషయం తెలిసింది."
"నాన్న ఇంత దారుణం చేసారా?" కళ్ళలో నీళ్ళు, మొహం లో కోపం ఒకేసారి వచ్చాయి రఘురాం
కి.
శ్రావణి భయంగా మానసను చేతులు చుట్టి
దగ్గరకు తీసుకుంది, వదిలితే దూరం
అయిపోతుందేమో అన్నట్లుగా!
"ఇది నిజం అయితే ఆయనకు ఏ శిక్ష వేసినా
తక్కువే!" కోపంగా అన్నాడు రఘురాం.
"మీరేమి వేయాల్సిన అవసరం లేకుండా దేవుడే
ఆ పని చేసాడు. పక్షవాతంతో మంచం పట్టారు. నన్ను పిలిపించి చేసిన
పాపం చెప్పి ఏడ్చారు. అప్పుడే మానస గురించి చెప్పాను.
మిమ్నల్నందరినీ కలిపి తీసుకొని రమ్మని చెప్పారు." చెప్పాడు కృషీవలరావు.
ముగ్గురూ మొహాలు చూసుకున్నారు.
"లేదు. నాకు ఇంత ద్రోహం చేసిన ఆ గడప ఇక
తొక్కేది లేదు" విసురుగా చెప్పింది శ్రావణి. దుఃఖం
తో ఎక్కిళ్ళు పెడుతూ ఉంది. మధ్యలో మానసను తడుముతూ ఉంది.
భార్యను ఆ స్థితిలో చూసిన రఘురాం మనసు బాధపడింది.
"నిజమే ఇక ఆయన మొహం చూసేది లేదు."
చెప్పాడు.
"అమ్మా, నాన్నా
ఏమంటున్నారు? ఆయన తప్పు చేసాడు నిజమే.కానీ మీరు మంచివాళ్ళు
కదా. అదీ కాక మంచాన పడిన వ్యక్తిని ఏమి సాధిస్తారు?మీరు
వెళ్ళండి సార్. అమ్మా , నాన్నకు నేను నచ్చచెప్పి తీసుకొని
వస్తాను." చెప్పింది మానస కృషీవలరావుతో.
తనను చంపేయ్యమని చెప్పినవాడిని కూడా క్షమించమంటూ
ఉంది. నిజంగా మానస తమ బిడ్డే!
రఘురాం, శ్రావణి మానసను చూసి
ఆనందపడ్డారు.
కృషీవలరావు వెళ్లాకా, ఇప్పుడిక ఏమి
చెయ్యాలో ఆలోచించుకుంటూ ఉన్నారు రఘురాం, శ్రావణి.
"ఇంకా రాలేదు అనిరుధ్! ఇప్పుడు దత్తత విషయం
కాదు, నిజంగా తన అమ్మా నాన్న దొరికిన
విషయం చెప్పాలి. ముందు అనిరుధ్ కే చెప్పాలి. కానీ ఇంకా రాలేదు. కొంపతీసి ఏమైనా ఆ
రాళ్ళ వర్షం కురిపించిన వాళ్ళు ఏమైనా చేసుంటారా?" ఆలోచనతోనే ఉలిక్కిపడింది. వెంటనే ఫోన్ చేసింది అనిరుధ్
కి.
అవతల నుండి స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంది.
ఏమయ్యి ఉంటుంది అనిరుధ్ కి!
(ఇంకా ఉంది...)
No comments:
Post a Comment