త్రివిక్రమావతారం - 6 - అచ్చంగా తెలుగు
త్రివిక్రమావతారం - 6

శ్రీరామభట్ల ఆదిత్య 



ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకూ ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు; సత్యవాది; మేలు మేలు ఈతని ప్రవర్తనకు నాకు మెప్పుకలుగుచున్నది. సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. దేవతలకు సైతం ఊహించడానికీ వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడతాను కూడ. రోగాలూ శ్రమలూ ఆపదలూ దుఃఖాలు లేకుండా; విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతలలోకంలో, అంతవరకూ ఇతడు దానవుల సేవలు అందుకుంటూ. ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు."

ఈ విధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. "ఇంద్రసేనమహారాజా! నీకు మేలు కలుగుతుంది. భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్ఠమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహల పడతారు. అంత చక్కటి ఆ లోకంలోనివారికి దుఃఖమూ, కష్టమూ, దుర్మరణమూ, రోగబాధలూ, కీడు కలగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంక ఇతరులను లెక్కించేది ఏముంది. ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను. కనికరంతో కనిపెట్టి ఉంటాను. దైత్యదానవుల కలయికవలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు."

ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలే దూరి, లోపలా బయటా నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటునుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. వక్షస్ధలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు. " ఓ శేషశాయిశయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా, ఈ మాటలు, మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు."

ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువునకూ, బ్రహ్మదేవునకూ, చంద్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. "ఓ మంగళస్వరూపా! బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

( ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages