పురాణ కధలు-బసవ పురాణం
పి.యస్.యమ్. లక్ష్మి
26. మోళిగ మారయ్య కధ
వీరశైవ సాంప్రదాయం విశిష్టంగా వున్న రోజులలో ఎంత పేదవారైనా లింగ పూజతోబాటు, లింగ ధారణ, అతిధి సత్కారం, విశేషించి శివ భక్తులనాదరించి భోజనం పెట్టటం నిత్యకృత్యంగా చేసేవారు. అలాంటివారిలోనే మారయ్య కూడా ఒకరు. ఆయన వృత్తి కట్టెలు కొట్టి జీవించటం. కానీ ఆయన ఇంట్లో ఎప్పుడూ శివ భక్తులు భోజనం చేస్తూ వుండాలని ఆయన కోరిక. మారయ్య కట్టెలు కొట్టటానికి అడవికి వెళ్ళినా, ఆయన భార్య అతిధులను ఆదరించి వున్నంతలో భోజనం పెట్టేది.
ఒకసారి వారి ఇంట్లో కొందరు జంగమ భక్తులు భోజనం చేసి, అక్కడనుండి మరునాడు ప్రసిధ్ధ శివ భక్తుడైన బసవేశ్వరుని ఇంటికి వెళ్ళారు. అక్కడ వారికి విందులో భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాది చతుర్విధాహారాలు లభించాయి. అయినా వారికి తృప్తి కలుగలేదు. అదే విషయం బసవన మంత్రితో చెప్పారు. మీ ఇంట్లో లభించిన ఈ విందు భోజనం, మోళిగ మారయ్య ఇంట్లో తిన్న అంబలి అంత రుచిగా లేదు అని. బసవన మంత్రికి ఆశ్చర్యం వేసింది. షడ్రసోపేతమైన ఈ విందుకన్నా మారయ్య ఇంట్లో అంబలి రుచిగా వుందంటున్నారు. ఇదేమిటో వెళ్ళి చూడాలనుకున్నాడు.
ఒక రోజు బసవన మంత్రి నిరుపేద జంగమ భక్తుడి వేషంలో మారయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో మారయ్య అడవికి కట్టెలు తేవటానికి వెళ్ళాడు. అతని భార్య మారు వేషంలో వున్న బసవేశ్వరుని చూసి, అతిధి వచ్చారని సకల మర్యాదలు చేసి, వంట ప్రయత్నం చేయ సాగింది. భోజన సమయం ఇంకా కాలేదుగనుక కొంత సేపు అక్కడ వేచి చూసిన బసవేశ్వరునికి ఇంకొక అనుమానం వచ్చింది. అక్కడికి వచ్చినవారెవరైనా తనని గుర్తుపడితే తనకి తలవంపులని భావించి, పూజా మందిరంలో కూర్చుని మారయ్య భార్యని పిలిచాడు. అమ్మా, నా శివ పూజ పూర్తయింది. నాకు చాలా ఆకలిగా వుంది. మహా నైవేద్యానికింకా సమయం వుంది కదా. నేను వేరే గ్రామం వెళ్ళాలి. తినటానికి ఇంట్లో ఏముంటే అది పెట్టమ్మా, అంబలి అయినా సరే అన్నాడు. ఆ సాధ్వి సరేనని ఎంతో భక్తితో అంబలి తీసుకొచ్చి పెట్టింది.
అది తిని సంతృప్తుడై బసవేశ్వరుడు తనలో తానే మారయ్యను అనేక విధముల మెచ్చుకున్నాడు. ఇంత పేదరికంలో వుండి, ఇంత భక్తి శ్రధ్ధలతో భక్తులనాదరిస్తున్నాడు. ఈ మారయ్య రెండవ విశ్వనాధుడులాంటివాడే. ఈయన కీర్తి జగద్విఖ్యాతమవుతోంది. పేదవాడైనా, ఈయన ఇంట్లో నిత్య సంతర్పణ జరుగుతున్నది. ఈ అంబలి రుచి సాటిలేనిది. అని లోలోన మెచ్చుకున్నాడు. అంతే కాదు. వారి పూజా మందిరంలో శివ లింగానికున్న నాగేంద్రుని పడగ వెనుక రెండు బంగారు మాడలు పెట్టి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్న సమయానికి మారయ్య కట్టెల మోపు నెత్తినబెట్టుకుని ఇంటికి వచ్చాడు. భార్య ఎదురెళ్ళి, కట్టెల మోపు దించి, కాళ్ళు చేతులు కడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. మారయ్య ఆ సమయంలో తనింట భోజనం చేస్తున్న భక్తులను చూసి సంతృప్తిగా, నా ఇంట ఇలాగే భక్తులు ఎప్పుడూ భోజనం చేస్తు వుండాలి అనుకుని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని, స్నానాదులు ముగించి వచ్చి శివ పూజకు కూర్చున్నాడు. ఆ సమయంలో శివుని వెనుక వున్న బంగారు మాడలు చూసి వీటిని ఎవరిచచ్చారు అని భార్యనడుగగా, ఇంతకుముందు ఒక భక్తుడు వచ్చి వెళ్ళాడు. ఆయన పెట్టాడేమో అన్నది. మారయ్యకి ఇది బసవేశ్వరుని పనే అని, వారు ధనవంతులని, మేము పేదవారమని, మాకు మాడలు తెలియవని, మాకు రెండు మాడలిచ్చి వెళ్ళాడు. ధనవంతులకు పేదవారి మీద ఇలాంటి దయ వుండటం మంచిదే కదా అనుకున్నాడు.
తాను శివునికి చేసిన అభిషేక జలాన్ని తెచ్చి తను తెచ్చిన కట్టెలమోపుపై జల్లాడు. అవ్వన్నీ బంగారు కట్టెలయ్యాయి. వాటిని ఒక్కొక్కదాన్నీ వెయ్యి మాడల ఎత్తుగా ముక్కలు చేయించాడు. బసవన మంత్రి ఇచ్చిన రెండు మాడలనూ ఇద్దరు భక్తులకిచ్చి, మిగతావారందరికీ తాను ముక్కలుగా చేయించిన వెయ్యి మాడల ఎత్తు బంగారాన్నిచ్చి పంపించాడు.
అక్కడనుంచి బసవేశ్వరుని దగ్గరకు వెళ్ళిన వారిచ్చిన సమాచారంతో బసవేశ్వరుడు సిగ్గుచెందాడు. తానిచ్చిన మాడలు తెచ్చిన వారి దగ్గర అవి తీసుకుని, మిగతావారితో సమంగా వారికీ వేయి మాడలిచ్చి పంపి తాను మారయ్య దగ్గరకెళ్ళి ఆయన కాళ్ళమీద పడ్డాడు. మీ ఔన్నత్యం తెలియక పొరపాటు చేశాను క్షమించండి అని. మారయ్య కూడా, నువ్వేం తప్పు చేశావని క్షమాపణ అడగటానికి. నీవు భాగ్యవంతుడవు మేము నిర్భాగ్యులము. సహాయం చేయటం సరియైన పనేకదా. నువ్వేమీ తప్పు చెయ్యలేదు. నీలాంటి భక్తుడెక్కడ వుంటాడు. రోజూ నీ దగ్గరకు వచ్చేవారికి ఇలాగే సహాయం చేస్తూ వుండు. నీ కీర్తి దశ దిశలా వ్యపిస్తుంది. మాలాంటివారిని మీతో కలుపుకుని ఆదరించండి చాలు అని అనునయంగా మాట్లాడి పంపించాడు.
దీనివలన తెలుసుకోవలసినదేమిటంటే భగవంతుడు పలికేది భక్తికని.
No comments:
Post a Comment