ఒకటి కాదు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు
బ్రతకటం,జీవించటం ఒకటి కాదు.
బ్రతకటం అందరూ చేసే పనే,
కానీ జీవించటం
కొందరు మాత్రమే చేయగల పని.
బ్రతకటానికి యాతన చాలు,
జీవించటానికి స్పందన కావాలి.
బ్రతకాలంటే కష్టాలు తీరాలి,
జీవించటానికి ఇష్టాలు చాలు.
బ్రతికేవానికి నిర్లక్ష్యం ఉంటుంది,
జీవించేవానికి లక్ష్యంఉంటుంది.
బ్రతకాలనుకొనేవాడు
తనకోసం మాత్రమే బ్రతుకుతాడు,
జీవించాలనుకొనేవాడు
ఇతరులకోసం కూడా బ్రతుకుతాడు.
బ్రతికేవాడు భ్రమల్లో బ్రతికేస్తాడు
జీవించేవాడు నిజాల్లో బ్రతుకుతాడు.
బ్రతికేవానికి నీతి,రీతి పాటించటం కష్టం,
జీవించేవానికి నియమనిష్టలంటే ఇష్టం.
మనం బ్రతకటమే కాదు,
జీవించటం కూడా నేర్చుకోవాలి.
బ్రతకటంలో వేదనలు అందుతాయి,
జీవించటంలో దీవెనలు అందుతాయి.
బ్రతకటం ఆరోహణాక్రమం,
జీవించటం ఆరోహణాక్రమం.
***
No comments:
Post a Comment