"బంగారు" ద్వీపం (అనువాద నవల) -3
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Writer: Enid Blyton
(అనుకొన్నట్లుగా మంగళవారం వారంతా కారులో కిర్రిన్ బే కు బయల్దేరారు. దారిలో కనిపించిన సముద్రాన్ని చూసి పిల్లలు ఆనందించారు. ఫానీ వాళ్ళను సహృదయంతో ఆహ్వానించింది. కానీ వాళ్ళు ఆశపడ్డ జార్జిని చూడలేకపోయారు. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@
"మీరామెను జార్జి అని పిలుస్తారా?" అన్నె ఆశ్చర్యంగా అంది. "ఆమె పేరు జార్జినా అనుకొంటా!"
"పేరదే!" ఆమె పిన్ని చెప్పింది. " కానీ జార్జి ఒక అమ్మాయిలా చెప్పుకోవటాన్ని యిష్టపడదు. అందుకే అబ్బాయిని పిలిచినట్లు మేము జార్జి అని పిలుస్తాము. మేము ఆ కొంటెపిల్లను జార్జినా అని పిలుస్తే సమాధానం యివ్వదు."
పిల్లలు జార్జినా హుషారుగా ఉంటుందని భావించారు. ఆమె రావాలని వారు కోరుకున్నారు. కానీ ఆమె రాలేదు. బదులుగా వారి బాబాయి క్వెంటిన్ హఠాత్తుగా కనిపించాడు. అతను చాలా అసాధారణంగా కనిపించే వ్యక్తి. చాలా పొడవైనవాడు, బాగా నల్లగా ఉన్నాడు మరియు అతని విశాలమైన నుదిటిపై కోపం తాండవిస్తోంది.
"హలో క్వెంటిన్! "పలకరించాడు డాడీ. "నేను నిన్ను చూసి చాలా కాలం అయ్యింది. మీరు పనిలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు మిమ్మల్ని అంతగా బాధపెట్టరని నేను నమ్ముతున్నాను. "
"క్వెంటిన్ చాలా కష్టమైన పుస్తకాన్ని చేపట్టాడు" ఫానీ చెప్పింది. "అయితే నేను అతనికి ఇంటి అవతలి వైపు ఒక గదిని ఇచ్చాను. అందువల్ల అతను బాధపడతాడని నేను అనుకోను."
వారి బాబాయి ముగ్గురు పిల్లల్ని చూసి మెల్లిగా తలాడించాడు. కోపం అతని ముఖం నుంచి తొలగిపోలేదు. దానితో వారు కొద్దిగా భయపడ్డారు. అతను పని చేసుకోవటానికి ఆ యింట్లో మరొక వైపుకి వెళ్ళిపోతాడని విని చాలా సంతోషించారు.
"జార్జి ఎక్కడ?" గంభీరంగా అడిగాడతను.
"మళ్ళీ ఎక్కడికో వెళ్ళుంటుంది" ఫానీ బాధగా చెప్పింది. "నేను ఆమెను యిక్కడే ఉండి, వచ్చే బంధువులను కలవమని చెప్పాను."
"ఆమెకు బాగా పడాలి" అన్నాడు బాబాయి క్వెంటిన్. అతను చమత్కరించాడా, లేదా అని పిల్లలకు చాలావరకు అర్ధం కాలేదు. "సరే పిల్లలూ! మీకిక్కడ బాగానే ఊసుపోతుందని నేను నమ్ముతున్నాను. అంతేగాక, మీరు జార్జికి కొంచెం యింగితజ్ఞానం నేర్పించవచ్చు."
కిర్రిన్ కాటేజీ చాలా యిరుకుగా ఉండటం వల్ల అమ్మ, డాడీలకు రాత్రి బస చేయటానికి స్థలం లేదు. కాబట్టి తొందరగా భోజనం ముగించి, వారు సమీప పట్టణంలోని ఒక హోటల్లో ఉండటానికి బయలుదేరారు. వారు మరుసటి రోజు అల్పాహారం తీసుకున్న వెంటనే లండనుకి తిరిగి వెళ్తారు. కాబట్టి వారు ఆ రాత్రి పిల్లలకు వీడ్కోలు చెప్పారు.
జార్జినా యింకా రాలేదు.
"క్షమించండి. మేమింకా జార్జినాను చూడలేదు" అమ్మ చెప్పింది. "ఆమెకు మా ప్రేమాభినందనలు తెలియజేయండి. డిక్, జూలియన్, అన్నెతో కలిసి ఆడటం వల్ల ఆమె ఆనందిస్తుందని ఆశిస్తున్నాము."
అమ్మానాన్నలు వెళ్ళిపోయారు. పెద్ద కారు రోడ్డు మలుపు తిరగ్గానే పిల్లలను ఒంటరితనం చుట్టుముట్టింది. కానీ ఫానీ వారిని మేడ మీదకు తీసుకెళ్ళి, వారి పడక గదులను చూపించింది. వాళ్ళు వెంటనే తమ విచారాన్ని మరిచిపోయారు.
పైకప్పు వాలుగా ఉన్న గదిలో అబ్బాయిలిద్దరూ కలిసి పడుకోవాలి. అక్కడనుంచి చూస్తే అద్భుతమైన సముద్రతీరం కనిపిస్తుంది. అది చూసి అబ్బాయిలిద్దరూ సంతోషించారు. జార్జినాతో కలిసి అన్నె ఒక చిన్న గదిలో పడుకోవాలి. దాని కిటికీల్లోంచి చూస్తే యింటి వెనుక ఉన్న బీడు భూములు కనిపిస్తాయి. కానీ ఒక వైపు కిటికీ సముద్రాన్ని చూపిస్తుంది. దానికి అన్నె బాగా ఆనందించింది. అది చాలా మనోహరమైన గది. ఎర్ర గులాబీలు కిటికీ వద్ద తలలూపుతూ పలకరిస్తాయి.
"జార్జినా త్వరగా రావాలని నేను కోరుకొంటున్నాను. ఆమె ఎలా ఉంటుందో చూడాలి" అన్నె తన పిన్నితో అంది.
"ఆమె సరదాగా ఉండే చిన్నపిల్ల" ఆమె పిన్ని చెప్పింది. “తను కొంచెం మొరటుగా అహంతో ప్రవర్తించవచ్చు. కానీ దయాహృదయం కలది. చాలా నమ్మకస్తురాలు, నిజాయితీకి ప్రాణం యిస్తుంది. ఒక్కసారి నీతో స్నేహం చేస్తే, మరి జీవితాంతం స్నేహితురాలిగానే ఉంటుంది. కానీ ఆమె స్నేహితులను సంపాదించటమే కష్టం. అదే పెద్ద జాలి కలిగించే అంశం."
అకస్మాత్తుగా అన్నె ఆవులించింది. అబ్బాయిలు ఆమెను కోపగించుకొన్నారు. ఎందుకంటే, తరువాత జరిగేదేమిటో వారికి బాగా తెలుసు. అదే జరిగింది!
"పాపం అన్నే! ఎంత అలిసిపోయావో! మీరంతా తిన్నగా వెళ్ళి, హాయిగా నిద్రపొండి. అప్పుడు మీకు రేపు ఉదయం లేవగానే తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది" ఫానీ చెప్పింది.
"అన్నే! నువ్వొక మూర్ఖురాలివి" ఆ గదిలోంచి పిన్ని బయటకు వెళ్ళగానే డిక్ ఆమెను కేకలేశాడు. "మనం అలా వాళ్ళ ముఖం మీదే ఆవులిస్తే, పెద్దవాళ్ళు ఏమనుకొంటారో నీకు బాగా తెలుసు. నేను కాసేపు బీచ్ లో తిరిగి రావాలని అనుకొన్నాను."
"నన్ను క్షమించండి" అన్నె చెప్పింది. "ఏమైనప్పటికీ, నేను ఆపుకోలేను. అదిగో డిక్! నువ్వు కూడా ఆవులిస్తున్నావు. జూలియన్ కూడా!"
వాళ్ళ పరిస్థితీ అలాగే ఉంది. దూరప్రయాణం చేసినందున వాళ్ళంతా నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళందరి మనసులో త్వరగా ముడుచుకు పడుకోవాలనే ఉంది.
అన్నె తన సోదరులకు శుభరాత్రి చెప్పి, తనకు కేటాయించిన గదికి వెళ్ళిపోయింది. "జార్జినా ఎక్కడ ఉందో" అనుకొందామె. "ఆమె మమ్మల్ని అహ్వానించటానికి ఆగలేదు. రాత్రి భోజనానికి కూడా రాలేదు. కనీసం యిప్పటికీ రాలేదు. చాలా చిత్రమైన పిల్లలా ఉందే! అంతా అయిపోయాక, నాకు కేటాయించిన గదిలో వచ్చి పడుకొంటుంది. ఆమె ఏ సమయంలో యింటికి వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి!"
జార్జినా పడుకొందుకు వచ్చే సమయానికి ముగ్గురు పిల్లలు గాఢనిద్రలో ఉన్నారు. ఆమె అన్నె గది తలుపులను తెరవటం వారు వినలేదు. ఆమె బట్టలు మార్చుకోవటం, పళ్ళు తోముకోవటం కూడా వారికి తెలియదు. ఆమె తన మంచం ఎక్కినప్పుడు కిర్రుమన్న శబ్దం కూడా వాళ్ళకి వినిపించలేదు. మరునాడు ఉదయం వారిని సూర్యుడు నిద్రలేపే వరకూ, వాళ్ళకేమీ వినిపించలేదు.
నిద్రలేచిన అన్నెకు మొదట తాను ఎక్కడ ఉన్నదీ అర్ధం కాలేదు. తన చిన్న మంచం మీద పడుకొనే, కిందకు వాలిన యింటి పైకప్పును, కిటికీకి అవతల మెల్లిగా తలలూపుతున్న ఎర్ర గులాబీలను చూసింది. అకస్మాత్తుగా ఆమెకు గతమంతా చక్రంలా కళ్ళు ముందు తిరిగింది!
"నేనిప్పుడు 'కిర్రిన్ బే'లో ఉన్నాను. మాకిప్పుడు బడి సెలవులు." తనలో అనుకొంటూ మంచం మీద బాసిపీట వేసుకొని కూర్చుంది. అప్పుడామె గదిలో ఉన్న పక్క మంచం వైపు చూసింది. దాని మీద దుప్పటి కప్పుకు ముడుచుకొని పడుకొన్న మరొక అమ్మాయి కనిపించింది. మెడ కొద్దిగా వంగిన తల పైభాగాన్ని మాత్రమే అన్నె చూడగలిగింది. అంతే! ఆ ఆకారం కొద్దిగా కదలగానే, అన్నె పలకరించింది.
"నేను చెప్తున్నా! నువ్వు జార్జినావి కదూ?"
ఎదుటి మంచంలోని పిల్ల లేచి కూర్చుని అన్నె వైపు చూసింది. ఆమె గిరజాల జుట్టుని కలిగి ఉంది. అది అబ్బాయి జుట్టులా దాదాపు పొట్టిగా ఉంది. ఆమె ముఖం సూర్యకాంతి పడటం వల్ల ముదురు గోధుమ రంగులో కనిపిస్తోంది. ఆమె నీలి కళ్ళు 'ఫర్గెట్-మి-నాట్' పువ్వుల్లా మెరుస్తున్నాయి. కానీ ఆమె నోరు మాత్రం చిరచిరమని ముడుచుకోగా, వాళ్ళ నాన్న మాదిరి కోపంగా చూస్తోంది.
"లేదు" చిరాకుగా చెప్పిందా పిల్ల, "నేను జార్జినాని కాదు."
"అలాగా!" అన్నె ఆశ్చర్యపోయింది. "అయితే నువ్వెవరు?"
"నేను జార్జ్" అని అమ్మాయి చెప్పింది. "నువ్వు నన్ను జార్జ్ అని పిలిస్తేనే నేను సమాధానం ఇస్తాను . అమ్మాయిని అనిపించుకోవటం నాకిష్టం లేదు. నేనలా ఉండను. అమ్మాయిలు చేసే పనులు చేయడం నాకు ఇష్టం లేదు. అబ్బాయిలు చేసే పనులు చేయడం నాకు చాలా ఇష్టం. నేను అబ్బాయిల కన్నా బాగా పైకి ఎగబాకగలను. వాళ్ళ కన్నా వేగంగా ఈత కొట్టగలను. నేను ఈ తీరంలో ఉన్న జాలర్ల అబ్బాయి కన్నా వేగంగా పడవను నడపగలను. నువ్వు నన్ను జార్జ్ అనే పిలవాలి. అప్పుడే నేను నీతో మాట్లాడుతాను. కానీ అలా చేయకపోతే నేను మాట్లాడనంతే!"
"అలాగా!" అంటున్న అన్నెకు తన కొత్త కజినుకి అతిశయం ఎక్కువ అని అర్ధమైంది. "సరె! నిన్ను ఎలా పిలవాలన్న దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. నాక్కూడా జార్జ్ మంచి పేరు అనిపిస్తోంది. జార్జినా అంటే నాకూ యిష్టం ఉండదు. ఏమైనా నువ్వు అబ్బాయిలాగే కనిపిస్తున్నావు."
"నిజంగానా?" ఒక్క క్షణం పాటు ఆ పిల్ల ముఖంలో చిరాకు మాయమైంది. "నేను నా జుట్టుని పొట్టిగా కత్తిరించుకొన్నప్పుడు అమ్మ నాతో భయంకరంగా కొట్లాడింది. నా మెడను చుట్టుకొనేంత జుట్టు ఉండేది. నాకది ఘోరం అనిపించేది."
ఇద్దరు అమ్మాయిలు ఒకరి వైపొకరు ఒక క్షణం పాటు రెప్ప వాల్చకుండా చూసుకొన్నారు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment