దైవమీమాంస - పుస్తక సమీక్ష - అచ్చంగా తెలుగు

దైవమీమాంస - పుస్తక సమీక్ష

Share This
దైవమీమాంస సమీక్ష
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు 



 శ్రీ వేంకట వినోద్ పరిమిగారి దైవంతో నా అనుభవాలు రెండు భాగాలు చదివిన వారికి ఆధ్యాత్మికంగా పరిమివారు ఎంత ఉత్తములో, ఉన్నతులో అవగతమవుతుంది. భగవంతుడు మనిషిగా జన్మనిచ్చినందుకు జన్మను చరితార్థం చేసుకోవాలి. అప్పుడే మానవ జన్మ ఓ వరం అన్న భావన కలుగుతుంది. అంతర్యామి సేవలో తరిస్తూ, మానవ సేవలో మాధవత్త్వాన్ని అనుభవైకవేద్యం చేసుకుంటూ జీవించడం అందరికీ సాధ్యం కాదు, దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలన్నది నా భావన.

పరిమిగారి మనసునుంచి మనదాకా వచ్చిన మూడో ఆధ్యాత్మిక సాహిత్యధార దైవమీమంస! ఏ విషయం మీదన్నా పట్టు చిక్కాలంటే ప్రశ్న, అందుకు తగిన సమాధానం దొరకబుచ్చుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో వెడుతున్నప్పుడు ప్రశ్నలెన్నో మనసును దొలిచేస్తూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తేలిగ్గా లభిస్తాయి. మరికొన్ని జటిలంగా ఉండి ఎంతకు తెగవు. సరిగ్గా అప్పుడే ఓర్పు వహించాలి. పట్టుదల చూపించాలి. జవాబు దొరికేదాకా వదలకూడదు. ఆ సమాధానం గురువుగారి నుంచి రావచ్చు, లేదా పరిమిగారిలాంటి పరిణతి చెందిన మనస్కుల నుండైనా పుస్తక రూపంలో దొరకొచ్చు. ఏదైనా సుకృతమే! ఒక్కసారి సమాధానం పొందగలిగితే భగవంతుడికి మరింత చేరువైనట్టుగా అనిపిస్తుంది. మిగతా విషయాల్లో ఉన్నట్టుగా ఆధ్యత్మికతలో ప్రశ్నలు, జవాబులు ఒకేలా ఉండవు. ఎవరి అనుభవం వారిది. అయినప్పటికి కొన్ని మాత్రం సర్వసాధారణంగా, సర్వత్రా వినిపించేవే! పుస్తకంలో కొన్ని మనకు తెలిసినవి ఎన్నో మనకు తెలియనివీ చోటు పొందాయి.

 దైవమీమాంస పుస్తకంలో భగవంతుని ఉనికి, నువ్వెవరు?, కర్మలు జన్మలు తో మెదలై స్వామితో నా అనుభవం దాకా 22 అంశాలున్నాయి. ప్రతి అంశం భక్తుల మనసులో ఉద్భవించే సమస్యలకు పురాణకథలు, పరిమివారు, వారి స్నేహితుల అనుభవాలు, గురుబోధలు, స్వాముల మాటల ద్వారా సమాధానాలు లభిస్తాయి. రచయిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు, మనస్తత్వశాస్త్రం, జోతిషశాస్త్రం క్షుణ్నంగా ఎరిగున్న వారు కావడంతో అనూచానంగా వస్తున్న పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను విడమర్చి విపులంగా విశ్లేషించారు. మూఢనమ్మకాలను విమర్శించారు. 

ఆలయాల ప్రాశస్త్యాన్ని, సత్యాలను కళ్లకు కట్టారు. విషయానుసంధానంగా ప్రతి అంశం చివర్లో భగవద్గీత శ్లోకాలను అందించడం శోభించింది. అంశాల వివరణలోకి నేనెందుకు వెళ్ళడం లేదంటే, ఇది మామూలు కథల పుస్తకం కాదు. ప్రశ్నించే మనసును సమాధాన పరచే ఉత్తమ ప్రయత్నం. ఎవరికి వారు పొందాల్సిన మధురానుభూతి. పుస్తకం చివర్లో నా పరిధిలో..నాకున్న జ్ఞానం ద్వారా అని చెప్పడం వారి నిరాడంబరతను తెలియజేస్తుంది. ఇది సత్సంగం.. నిస్సందేహం. 

పరిమివారు 'భక్తి అనే నావలో, తర్కం అనే అలలను దాటి, బలీయమైన నమ్మకమనే తెరచాప సహాయంతో, జీవితంలోని ఆటూపోట్లను ధైర్యమనే తెడ్డుతో అఢిగమించి, అర్ణవం వంటి పరమాత్మలో లయమవ్వడమే మన లక్ష్యం కావాలి’ అంటారు. ఈ పుస్తకం మనసు పొరలు తొలగించి అందుకు మార్గ సుగమం చేస్తుంది. అందరికీ అవసరమైన దైవమీమంస పుస్తకం అక్షరరూపం దాల్చడానికి తనవంతు సహకారం అందించిన యం రమేష్ కుమార్ గారికి, అందమైన పుస్తకంగా రూపొందించి కవరపేజీతోటే ఆధ్యాత్మిక పరిమళాలు వ్యాపింపజేసిన అచ్చంగాతెలుగు పద్మినిగారికి అభినందనలు చెప్పడం మనందరి కనీస ధర్మం. ఓం నమో వేంకటేశాయ!

No comments:

Post a Comment

Pages