కైకొన్నకొలది కర్మము
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0338-01 సం: 04-220
పల్లవి:
కైకొన్నకొలది కర్మము
వాకుచ్చి తనతోనే వగవగనేలా
చ.1:
తలచినకొలదేదైవము తన-
కలపుకోలుకొలదే కడనరులు
బలువుకొలదియే పంతము
తొలగక యితరుల దూరగనేలా
చ.2:
మచ్చిక నొడివినంతే మంత్రము
అచ్చపుభక్తి కొలదే యాచార్యుడు
నిచ్చలు గోరినయంతే నిజమైనలోకము
పచ్చివెచ్చిచదువుల భ్రమయగనేలా
చ.3:
నెమ్మది జాతెంతే నియమము
సమ్మతించినంతే సంతోసము
యిమ్ముల శ్రీవేంకటేశుడిచ్చినంతే యిహపర-
మెమ్మెల కిది మరచి యేమరగనేలో
భావం
పల్లవి:
ఎంతగా సమ్మతింపచేస్తామో అంతగా కర్మము యొక్క ఆచరణ ఉంటుంది..
ఇది చెప్పిన తరువాత కూడా తనతో (కర్మతో) విచారించుట ఎందుకు? (కర్మాచరణకు సమ్మతి చాలా ప్రధానమని భావం)
చ.1:
తలచినకొద్దీ దైవానుగ్రహము లభిస్తుంది.
మైత్రి, ఐకమత్యం ఉన్న కొద్దీ తనకు దగ్గరగా మానవులుంటారు.
బలం కొద్దీ పంతము నెరవేరుతుంది.
ఈ విషయాలనుంచి తొలగక ఇతరులను నిందించుట ఎందుకు? (ఈ విషయాలను గ్రహించాలని, ఇతరులను నిందించకూడదని భావం)
చ.2:
ఆసక్తితో చెప్పినకొద్దీ మంత్రఫలితం వస్తుంది.( శ్రద్ధతో జపిస్తే మంత్రఫలితం వస్తుందని భావం)
అచ్చపుభక్తి ఎంత ఉన్నదో అంతగా గురువు యొక్క దయ కలుగుతుంది.
నిశ్చయంగా ఎంత కోరుకుంటే అంతగా ఈ నిజమైన లోక సందర్శన కలుగుతుంది.
అపరిపక్వమైన చదువులలో భ్రమించుట ఎందుకు?
చ.3:
జాతిలో ఎంత ఓర్పు ఉంటుందో అంతగా నియమము ఉంటుంది.
సమ్మతించినంతగా సంతోషము ఉంటుంది.
శ్రీవేంకటేశుడు ఏది అనుగ్రహిస్తాడో అదే ఇహము పరము.-
అధిక ప్రసంగాలలో ఇది(వేంకటేశుని అనుగ్రహం) మరచి అజాగ్రత్తగా ఉండుట ఎందుకు? (శ్రీవేంకటేశుని శరణాగతి చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలని భావం)
***
No comments:
Post a Comment