త్రివిక్రమావతారం - 7
శ్రీరామభట్ల ఆదిత్య
నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరిని సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్నిచూపుతావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షంవలె భక్తులైనవారి కోర్కెలు నెరవేర్చుతావు." ఇలా మనవిచేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు. "నాయనా! ప్రహ్లాదా! మంచిది. నీవు నీమనుమనితోపాటు నీవారితోపాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏకష్టమూ కలుగదు.
ఈ విధంగా సుతలమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేసాడు. నొసటిపై చేతులు జోడించి సెలవుతీసుకున్నాడు. ఆ తరువాత, అతడు బలిచక్రవర్తినీ రాక్షసుల సమూహాన్ని వెంటపెట్టుకొని, ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట, మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చుని యున్న శుక్రాచార్యుని చూసి, ఇలా అన్నాడు. "శుక్రాచార్యా! విప్రోత్తమా! బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీవంటి బ్రహ్మవేత్తలవల్ల సఫలమవుతాయి."
ఇలా యజ్ఞం సంపూర్తి చేయమనిన విష్ణువు తో శుక్రుడు ఇలా అన్నాడు. "నీవే అన్ని కార్యాలకూ అధినాదుడవు. నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏకార్యాలకూ లోపం కలుగదు. నిన్ను ధ్యానంచేస్తే ధనానికీ దేశానికి మంత్రతంత్రాలకూ ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంది." ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేసాడు. అతనికి బ్రాహ్మణులూ ఋషులూ తోడ్పడ్డారు.
ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పితృదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు "లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు" అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, "ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి" అని నిర్ణయించాడు.
( ఇంకా ఉంది )
No comments:
Post a Comment