'ఆకలిదీర్చే అమృత గుళిక 'అన్నం!'
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
అన్నప్రసాదం సమస్య ప్రాణి కోటికి జీవనాధారం. బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధులు, ఔషధుల నుంచి అన్నo , అన్నం నుంచి జీవుడు పుట్టాయని తైత్తరీయ ఉపనిషత్తు తెలియజేస్తోంది. అన్నం మనిషి ప్రాణాన్ని నిలుపుతుంది.శరీరానికి ఎదుగుదలనిస్తుంది. ఔషధంలా పనిచేస్తుంది. మనం అన్నగత ప్రాణులం. ఒక్కపూట అన్నం లేకపోతే విలవిల్లాడిపోతాం. ప్రపంచవ్యాప్తంగా ' అన్నమో రామచంద్రా' అని తిండికోసం అలమటించే అభాగ్యజీవులు ఎందరో ఉన్నారు. సమయానికి కడుపు నింపుకోవడానికింత దొరుకుతున్న మనం ఎంతో అదృష్టవంతులం. అన్నం ముద్దను దగ్గర పెట్టుకునే ముందు, కోత కోసిన వారినుంచి కంచంలో వడ్డించే వారివరకు అందరిని "అన్న దాతా సుఖీభవ " అని తలుచుకోవడం మన సదాచారం. మన పూర్వీకులు కాళ్లూ, చేతులు శుభ్రంగా కడుక్కుని, బాసింపట్టుతో పీటమీదకూర్చుని, ఆకులో వడ్డించిన అన్నాన్ని భక్తిశ్రద్ధలతో' భోజనకాల హరినాస్మరణే 'గోవిందాగోవింద' అంటూ ప్రార్థన చేసి ఒక్క మెతుకు కింద పడకుండా తినేవారు . భోజనం చేస్తున్నప్పుడు పొరపాటున కంచం దాటి రెండు మెతుకులు నేలపై పడితే, వాటిని తీసి కళ్ళకద్దుకునే వారు. ఒకప్పుడు ఏ భిక్షగాడు ఆకలితో వస్తాడో ' అని కొంచెం అన్నం పక్కకు తీసి పెట్టేవారుట. పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా ఫర్వాలేదు, కాలే కడుపుకు పట్టెడు పచ్చడి మెతుకులు దొరికితే చాలు.. పరమానందం కలుగుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే అన్నదానం. అన్ని దానాలకన్నా అన్నదానము మిన్న అన్నది లోకోక్తి. అన్నం పెట్టిన వారిపట్ల విధేయత చూపించడం మన సంస్కారం బంగారం, దానం ఏది దానమిచ్చినా, ఎంతిచ్చినా తృప్తి కలుగదు. అన్నం తిన్నవారు మాత్రం కడుపు నిండాక 'చాలు' అంటూ సంతృప్తిగా పీటల మీద నుంచి లేస్తారు. భక్తులకు, అతిధులకు భోజనాన్ని పెట్టకుండా చేసే ఏ యజ్ఞము పరిపూర్ణం కాదని పూర్వీకులు చెప్పారు. మనం తినడమే కాకుండా మనకున్నంతలో పదిమందికీ పెట్టాలని వ్రతాలు, శుభకార్యాలకు పిలిచి భోజనాలు పెడతాం . కడుపునిండా తినమని అభ్యర్థిస్తాం. గుళ్ళలో నిత్యాన్న దానాలు నిర్వహించి భక్తుల ఆకల్ని తీరుస్తాయి దేవస్థానాలు. రంతి దేవుడు అభాగ్యతునిలో భగవంతుణ్ణి దర్శించి అతని క్షుద్భాధ తీర్చి తరించాడు. నిత్యాన్న దాతగా శాశ్వత కీర్తి గడించిన డొక్కా సీతమ్మ గురించి మనకు తెలిసిందే. "మానవ సేవ మాధవ సేవ భవతారాణానికి నావ" అన్న సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మి , అతిధులకు అన్ని కాలాల్లోనూ తగిన భోజనం సమకూర్చి సంతృప్తి పరిచేవాడు విష్ణుచిత్తుడు. ఈ సృష్టి పోషకురాలు 'అమ్మ' అనే అంతరార్థం శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం తెలియచేసింది. జగతిలో ప్రాణుల తాపత్రయం జానెడు పొట్ట నింపుకోవడం. ప్రకృతిలోని జీవరాసుల ఆకలిని గ్రహించి తీర్చగలిగేది ఒక్క మనిషి మాత్రమే. చీమలకు చక్కర పెడుతూ, పక్షులకు, గింజలు వేస్తూ, భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకు, పక్షులకో పెట్టి భగవంతునికి పెట్టినట్లు భావించే మనిషి సమస్త జీవజాతి జీవకారుణ్యం చాటుకుంటున్నాడు . అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిసిన మనిషి ,తిన్నంత తిని తినలేనిది వృధా చేయకుండా ఒక్కో మెతుకు మరొకరి ఆకలి తీర్చే అమృత గుళిక అవుతుందన్న అవగాహన కలిగి ఉంటె చాలు.. మన జన్మ ని సార్థకం చేసుకున్నట్టే !.
***
No comments:
Post a Comment