"బంగారు" ద్వీపం (అనువాద నవల) -4
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
@@@@@@@@
(ముగ్గురు పిల్లల్ని తమ బంధువుల యింట్లో విడిచిపెట్టి వారి తల్లిదండ్రులు వెళ్ళిపొయారు. ఎంత పొద్దుపోయినా, జార్జి రాలేదని అనుకుంటూనే పిల్లలు నిద్రపోతారు. ఉదయాన్నే నిద్ర లేచిన అన్నె తన పక్కన పడుకున్న అమ్మాయిని చూస్తుంది. తనను జార్జినా అని పిలిచినందుకు ఆ అమ్మాయి అన్నె ను కసురుకొంటుంది. తనను జార్జి అని మాత్రమే పిలవాలని, తాను మగవాడిలా ప్రవర్తించటాన్నే ఎప్పుడూ యిష్టపడతానని జార్జి చెబుతుంది. తరువాత . . ..)
@@@@@@@@@
ఇద్దరు అమ్మాయిలు ఒకరి వైపొకరు ఒక క్షణం పాటు రెప్ప వాల్చకుండా చూసుకొన్నారు. "నిజంగానే అమ్మాయిలా ఉండటాన్ని నువ్వు అసహ్యించుకొంటావా?" జార్జ్ అడిగింది.
"వాస్తవానికి కాదనుకో!" అన్నె చెప్పింది.
"చూడు. నేను అందమైన పావడాలను యిష్టపడతాను. నా బొమ్మలను ప్రేమిస్తాను. నువ్వు అబ్బాయిలా ఉంటే అలా చేయలేవు కదా!"
"ఫో! అందమైన పావడాల గురించి ఆలోచిస్తేనే నాకు చిరాకు" జార్జ్ తిరస్కారంగా అంది. "బొమ్మలంటావా! బాగుంది. నువ్వింకా చిన్నపిల్లవి. నేనదే చెప్పగలను."
అన్నె మనస్తాపం చెందింది. "నీకు మర్యాద తెలియదు" అందామె. "నీకే అంతా తెలిసినట్లు వ్యవహరిస్తే, నా సోదరులు కూడా నిన్ను పట్టించుకోరని నీకు తెలియటం లేదు. వాళ్ళు నిజమైన అబ్బాయిలు. నీలాగ అబ్బాయిల్లా నటించటం లేదు."
"సరె! వాళ్ళు నాతో కఠోరంగా ప్రవర్తిస్తే, నేను వాళ్ళను అసలు పట్టించుకోను" అని జార్జ్ మంచం మీద నుంచి దూకింది. "ఏమైనప్పటికీ, నేను మిమ్మల్ని ఎవరినీ ఇక్కడకు రమ్మని కోరలేదు. ఇక్కడకొచ్చి మీరే నా జీవితంలో జోక్యం చేసుకొంటున్నారు! నా అంతట నేను ఆనందంగానే ఉన్నాను. ఇప్పుడు నేను పావడాలను, బొమ్మలను యిష్టపడే ఒక వెర్రి పిల్లను, యిద్దరు మూర్ఖులను దాయాదులుగా కలిగి ఉన్నాను!"
తమ పరిచయమే చాలా చెడ్డగా మొదలైందని అన్నె భావించింది. ఆమె మరేమీ మాట్లాడకుండా తన ముస్తాబులో ములిగిపోయింది. ఆమె బూడిద రంగు జీన్స్, ఎర్రని జెర్సీని వేసుకొంది. జార్జ్ కూడా జీన్స్, మగపిల్లలు వేసుకొనే జెర్సీని కట్టుకొంది. వాళ్ళ ముస్తాబు పూర్తయ్యే సమయానికి అబ్బాయిలిద్దరూ వచ్చి తలుపు కొట్టారు.
"మీరింకా ముస్తాబవలేదా? జార్జినా అక్కడ ఉందా? కజిన్ జార్జినా! బయటకు వచ్చి మమ్మల్ని చూడు."
జార్జ్ దూకుడుగా తలుపు తీసి, తలెగరేస్తూ బయటకొచ్చింది. ఆమె తమను అసలు పట్టించుకోకపోవటంతో ఆ ఆబ్బాయిలు విస్తుపోయారు. ఆమె గర్వంగా అడుగులేస్తూ మెట్లను దిగి, కిందకెళ్ళింది. మిగతా ముగ్గురు పిల్లలు ఒకరినొకరు చూసుకొన్నారు.
"మీరు ఆమెను జార్జినా అని పిలిస్తే ఆమె సమాధానం చెప్పదు"అన్నె వివరించింది. "ఆమె చాల చిత్రమైనది అనుకొంటాను. ఆమె విషయాల్లో మనం జోక్యం చేసుకొంటామని, ఆమె మనం యిక్కడకు రావాలని కోరుకోలేదట! తనే చెప్పింది. ఆమె నన్ను ఎగతాళి చేసింది. కొంచెం మొరటుగా కూడా ఉంది."
బాధపడుతున్న అన్నె చుట్టూ ఓదార్పుగా జూలియన్ చేతినుంచాడు. "ఉత్సాహంగా ఉండు!" అన్నాడతను. "నిన్ను అంటిపెట్టుకొని ఉండటానికే మేము ఉన్నాం. అల్పాహారానికి కిందకెడదాం పద."
వాళ్ళందరికీ ఆకలిగా ఉంది. మాంసం, గుడ్ల వాసన వాళ్ళకు చవులూరిస్తోంది. వాళ్ళు పరుగున మెట్లు దిగి వెళ్ళి వాళ్ళ పిన్నికి శుభోదయం చెప్పారు. ఆమె అప్పుడే బల్ల దగ్గరకు అల్పాహారాన్ని తెస్తోంది. వాళ్ళ బాబాయి బల్ల మొదట్లో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నాడు. అతను పిల్లలకు పలకరింపుగా తలను ఊపాడు. తినేటప్పుడు మాట్లాడనిస్తారో, లేదో అని ఆలోచిస్తూ ఆ ముగ్గురు పిల్లలు మౌనంగా కూర్చున్నారు. వాళ్ళు తమ యింట్లో మాదిరి హుషారుగా ఉన్నారు, కానీ వాళ్ళ బాబాయి క్వెంటిన్ చాలా గంభీరంగా ఉన్నాడు. కాల్చిన రొట్టెముక్కకు వెన్న రాస్తూ, జార్జ్ అక్కడే ఉంది. ఆమె ముగ్గురు పిల్లల్ని కోపంగా చూసింది.
"అలా చూడకు జార్జ్!" అంది ఆమె తల్లి. "ఇప్పటికే మీరంతా స్నేహితులయ్యారని ఆశిస్తున్నాను. మీరంతా కలిసి ఆడుకొంటే సరదాగా ఉంటుంది. ఈ ఉదయం నువ్వు నీ కజిన్లను 'బే' కు తీసుకెళ్ళి, స్నానం చేయటానికి మంచి ప్రదేశాలను చూపించాలి."
"నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను" అని జార్జ్ అంది.
వెంటనే ఆమె తండ్రి తల పైకెత్తాడు.
"నువ్వు వద్దు" అన్నాడతను. "మార్పు కోసం నువ్వు కొంత మర్యాదను చూపించాల్సి ఉంటుంది. నీ కజిన్లను బే కు తీసుకెళ్ళు. వింటున్నావా?"
"అలాగే!" తన తండ్రిలాగే ముఖాన్ని చిట్లిస్తూ అంది జార్జ్.
"ఓ! జార్జ్! చేపలు పట్టడానికి వెళ్ళినట్లయితే, మేము స్వయంగా బే కు వెళ్ళగలం" వెంటనే అన్నె చెప్పింది. దురుసుగా ప్రవర్తించినట్లయితే, జార్జ్ తమతో రాకపోవటమే మంచిదని ఆమె తలపోసింది.
"తనేమి చెప్పిందో అదే చేస్తుంది జార్జ్" ఆమె తండ్రి చెప్పాడు. "ఆమె అలా చేయకపోతే, దాని సంగతి నేను చూస్తాను."
అందువల్ల, అల్పాహారం కాగానే, నలుగురు పిల్లలు సముద్ర తీరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. 'బే'కి వెళ్ళే దారి సుగమంగా ఉండటంతో, నలుగురు పిల్లలు పరుగులు తీస్తూ వెళ్ళారు. సూర్యుని వెచ్చదనాన్ని అనుభవించటం, నీలి సంద్రంలో నాట్యం చేసే మెరుపులను చూడటంతో జార్జ్ లోని కోపం కూడా మాయమైంది.
"నీకు యిష్టమైతే చేపలను పట్టడానికి వెళ్ళు" సముద్ర తీరానికి చేరుకొన్నాక అన్నె చెప్పింది. "నీ కథలేవీ ఎక్కడా చెప్పం. మేము నీ వ్యవహారాల్లో కలగచేసుకోవాలని అనుకోవట్లేదని నీకూ తెలుసు. మాకు మేమే తోడు కాగలం. మాతో కలవటం నీకు యిష్టం లేకపోతే, నువ్వు కలవకు."
"కానీ మాతో ఉండాలని నువ్వు కోరుకొన్నట్లయితే, అలాగే మేము నిన్ను యిష్టపడతాం" జూలియన్ ఆత్మీయంగా అన్నాడు. జార్జ్ మొరటుగా, దురుసుగా వ్యవహరిస్తుందని అతను భావించాడు. కానీ సూటిగా చూసే చూపులు, పొట్టిగా కత్తిరించిన జుట్టు, నీలి కళ్ళు, మూతి విరుపు గల ఆ చిన్న అమ్మాయిని యిష్టపడకుండా ఉండలేకపోతున్నాడు.
జార్జ్ అతని వైపు రెప్ప వాల్చకుండా చూసింది. "నేను ఆలోచిస్తాను" అందామె. "నాకు బంధువులైనంత మాత్రాన లేదా అలాంటి పిచ్చి కారణంతో, జనాలను నా స్నేహితులుగా చేసుకోను. నేను యిష్టపడ్డ వాళ్ళను మాత్రమే నా స్నేహితులుగా చేసుకొంటాను."
"మేమూ అంతే!" జూలియన్ చెప్పాడు. "బహుశా, మేము నిన్ను యిష్టపడకపోవచ్చు."
"ఓ!" ఆ ఆలోచన తనకు రానట్లుగా అందామె. "సరె! మీరు యిష్టపడక పోవచ్చు. చాలామంది నన్ను యిష్టపడరు. ప్రస్తుతం దాని గురించే నేను ఆలోచించాలి."
అన్నె నీలి సంద్రం వైపు రెప్ప వాల్చకుండా చూసింది. దాని మొదట్లో ఆసక్తి గొలిపే రాతి ద్వీపం ఉంది. దాని మీద శిధిలమైన పాత కోట లాంటిది కనిపించింది.
"అది విచిత్రంగా లేదూ?" అందామె. "దాన్ని ఏమంటారా అని ఆలోచిస్తున్నాను."
"కిర్రిన్ ద్వీపం" సముద్రాన్ని పోలిన నీలి కళ్ళను అటువైపు తిప్పి చెప్పింది జార్జ్.
"వెళ్ళటానికి అది అద్భుతమైన ప్రదేశం. మీకిష్టమైతే, ఏదో రోజు మిమ్మల్ని నేను అక్కడకు తీసుకెళ్ళొచ్చు. కానీ నేను మాటివ్వలేను. అక్కడకు వెళ్ళాలంటే పడవ ఒక్కటే మార్గం."
"ఆ చిత్రమైన ద్వీపం ఎవరికి చెందినది?" జూలియన్ అడిగాడు.
జార్జ్ వాళ్ళకు బాగా ఆశ్చర్యపరిచే బదులిచ్చింది. "అది నాకు చెందినది" అందామె. "కనీసం, ఏదో ఒక రోజు అది నాకే చెందుతుంది. అది నా స్వంత ద్వీపం, నా స్వంత కోట అయి తీరుతుంది."
@@@@@
ముగ్గురు పిల్లలు జార్జ్ వైపు విస్తుపోయి చూసారు.
జార్జ్ వాళ్ళను కన్నార్పకుండా చూసింది.
"ఏమంటున్నావు?" చివరకు డిక్ అడిగాడు. "కిర్రిన్ ద్వీపం నీకు చెందినది కాదు. నువ్వు డంబాలు పలుకుతున్నావు."
"లేదు, నేను గప్పాలు కొట్టను" జార్జ్ అంది. "మా అమ్మను అడుగు. నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే యింకొక మాట చెప్పను. కానీ నేను అబద్ధాలు ఆడను. నిజం చెప్పని వాళ్ళను నేను పిరికివాళ్ళుగా భావిస్తాను. నేను పిరికిదాన్ని కాదు."
ఫానీ పిన్ని జార్జ్ పూర్తిగా నిజాయితీపరురాలని చెప్పిన విషయాన్ని జూలియన్ గుర్తుచేసుకొన్నాడు. అందుకే అతను బుర్ర గోక్కుంటూ జార్జ్ వైపు చూసాడు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment