తమలోనే ఉన్నవి - ధర్మాధర్మములు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
9866691587
తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 83 సంకీర్తన: 83
రాగము: శంకరాభరణం
తమలోనే ఉన్నవి - ధర్మాధర్మములు
భ్రమయక తలపోసి - పని గొనవలయు ॥పల్లవి॥
కన్నవారితో నెల్లా - కల్లలాడకుంటే చాలు
అన్ని జపములు చేసి - నంత ఫలమే
మిన్నక నొకరి సొమ్ములే - మీ దీసుకోకుంటే చాలు
నిన్ని దానాలందరికి - నిచ్చినంత ఫలమే ॥తమలోనే॥
వీనుల బరనిందలు - బడకుంటే చాలు
పూని పురాణాలు విన్న - పుణ్యఫలమే
తాను పరకాంతల - దలచకుంటే చాలు
నానా దానాలు చేసి - నంత ఫలమే ॥తమలోనే॥
వొట్టుక పాపాలు సేయ - కూరకుంటే చాలు
అట్టె యజ్ఞములు చేసి - నంత ఫలమే
గుట్టున శ్రీవెంకటేశు - గోరి శరణంటే చాలు
గట్టిగా సుజ్ఞానము - గైకొన్న ఫలమే ॥తమలోనే॥
తాత్పర్యం
ఓ జీవుడా !ధర్మము అధర్మము అనేవి వేరే ఎక్కడా లేవు .ఆలోచిస్తే నీలోనే ఉన్నాయి కనుక నువ్వు ఎటువంటి భ్రమలకు గురికాకుండా బాగా ఆలోచించి ,వాటిని తగిన రీతిలో ప్రవర్తించేటట్లుగా నియోగించు.
1. ఓ జీవుడా!నిన్ను కన్న తల్లిదండ్రులతో నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఉంటే చాలు. అన్ని రకాల జపములు చేసినంత ఫలితం నీకు వస్తుంది. ఏమాత్రం సంశయించకుండా ఇతరుల సొమ్ములను రకరకాల పద్ధతులలో నీ దగ్గరకు చేర్చుకోకుండా ఉంటే చాలు ఎంతోమందికి నువ్వు దానాలు చేసినంత ఫలితం వస్తుంది.
2. ఓ జీవుడా !నీ చెవులలో ఇతరులను తిట్టే తిట్లు వినకుండా ఉంటే చాలు .ప్రయత్నించి అనేక పురాణాలు విన్న ఫలితం నీకు వస్తుంది. ఎప్పుడు ఇతర స్త్రీల గురించి ఆలోచించకుండా ఉంటే చాలు. అనేక దానాలు చేసినంత ఫలితం నీకు కలుగుతుంది.
3. ఓ జీవుడా!ఒట్టు పెట్టుకొని, పాపాలు చేయకుండా ఊరికే ఉంటే సరిపోతుంది .అనేక యజ్ఞాలు చేసిన ఫలితం అప్పుడు నీకు కలుగుతుంది. ఏకాంతంలో స్థిరమైన మనసుతో శ్రీ వేంకటేశ్వరుని ఇష్టపడి తదేక ధ్యానంతో స్వామివారికి శరణు అని చెబితే చాలు .సుజ్ఞాన సంపదనిచ్చే పుస్తకాల సారాన్ని నువ్వు గ్రహించినంత ఫలితం వస్తుంది.
ధన్యవాదములు.
No comments:
Post a Comment