జగదభిరామ శతకము - టి. శ్రీవల్లీ రాధిక - అచ్చంగా తెలుగు

జగదభిరామ శతకము - టి. శ్రీవల్లీ రాధిక

Share This
జగదభిరామ శతకము - టి. శ్రీవల్లీ రాధిక

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవయిత్రి పరిచయం
పేరు: టి. శ్రీవల్లీ రాధిక
విద్య : 1. M.Tech(Digital Syatems and
         computer electronics
      2. M.A. (Telugu)

రచనలు:

I. కథలు :(1) ఆలోచన అమృతం (2000), (2) మహార్ణవం (2000), (3) స్వయంప్రకాశం (2009), (4) తక్కువేమి మనకూ (2012), (5) హేలగా ఆనంద డోలగా(2016), 6.రసశేవధి (2022)
II. నవలలు: (1) ఒకరికొకరు: 1998 ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచూరించబడింది. (2) ఇంద్రధనుస్సు: 1999 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికం గా ప్రచూరించబడింది (3) ఆమె నడిచే దారిలో; 1999లో ఆంధ్రప్రభ వారపత్రికలో  ధారావాహికంగా ప్రచూరించబడింది.2022 సం|| లో పుస్తకంగా ముద్రించబడింది.
III విమర్శ:*ఆంధ్రజ్యోతి (వివిధ) మూసీ, ఆంధ్రభూమీ, పుస్తకం.నెట్ మొదలైన పత్రికలలో 50కి పైగా సాహిత్య విమర్శనా వ్యాసాలు ప్రచురితమైనాయి
* సాహిత అకాడమీ, తెలుగు వీశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం భారతీయ భాషా పరిషద్ వేదికలపై పత్రసమర్పణలు
* e-books (1) పురాణవైర గ్రంథామాల పరిచయాలు, (2) నేను చదివిన నవలలు
IV. వచన కవిత్వం: రెండు వచన కవితా సంపుటాలు (1) రేవు చూడని నావ, (2) కైవల్యం
V పద్య కవిత్వం: ఋషిపీఠం, భక్తినివేదన వంటి పత్రికలలో సంకలనాలలో పద్యకవిత్వం ప్రచూరింపడింది
రెండు శతకాలు ధ్వనిముద్రణగా వచ్చాయి (1) విఘ్నరాజ శతకము, (2) జగదభిరామ శతకము
VI బాల సాహిత్యం: (1) బాలభారతం: కొత్తపల్లి పత్రికలలో బాలలకథలు ప్రచురితమయ్యాయి, (2) ఫింగర్ బుంగర్ అనే బాలల సంచికలో బాలభారతం ధారావాహికంగా వచ్చింది.
VII. గేయరచన: (1) ఆకాశవాణిలో కొన్ని లలిత గీతాలు ప్రసారమయ్యాయి, (2) మరికొన్నిటిని రచయిత్రి శారదా మురళి గారు స్వరపరచి ఆలపించారు.

పురస్కారాలు : (1) "నా స్నేహితుడు" కథకు డిల్లి "కథ" సంస్థ వారి "ఉత్తమ కథ" పురస్కారం, (2) "తక్కువేమి మనకూ" కథకు వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం, (3) "మహార్ణవం" కథాసంపుటికి కలకత్తా భారతీయ భాషా పరిషద్ వారి పురస్కారం,(4) కథారచనకు తెలుగు విశ్వవిద్యాలయము వారి కీర్తి పురస్కారం, (5) మచిలీపట్నం ఆంధ్ర సారవత పరిషత్తు వారి ఉత్తమ కథా రచయిత్రి పురస్కారం, (6) తక్కువేమి మనకూ కథా సంపుటికి భారతీభూమిక వారి "విశ్వనాథ వాఙ్మయి"  పురస్కారం, (7) లేఖిని సాంస్కృతిక సంస్థ నుంచి ఉత్తమ కథా రచయిత్రి పురస్కారం, (8) అమృతలత గారి నుంచి ఉత్తమకథా రచనకు "అపురూప పురస్కారం", (9) ఒంగోలు కలామిత్రమండలి నుంచి ఉత్తమ కథారచయిత్రిగా జాతీయ పురస్కారం.

ఇతర వివరాలు: (1) ఆలోచన అమృతం హిందిలోకి అనువదించబడి మితవా అనే పేరుతో ప్రచురించబడింది, (2) ఆలోచన అమృతం మరాఠీలోకి అనువదించబడి మితవా అనే పేరుతో ప్రచురించబడింది, (3) తక్కువేమి మనకూ హిందీలోకి అనువదించబడి పాయోజీమైనే అనే పేరుతో ప్రచురించబడింది, (4) మహార్ణవం కథాసంపుటి హిందీలోకి అనువదైంచబడి మహాసాగర్ అనేపేరితో ప్రచూరించబడింది, (5) మరెన్నో కథలు ఆంగ్లం, ఒరియా, కన్నడ, తమిళ, పంజాబీ, నేపాలి భాషలలోకి అనువదించబడ్డాయి. 

శతక పరిచయం:
"రామ శ్రీరామ జగదభిరామ రామ" అనే మకుటంతో తేటగీతిలలో రచింపబడిన ఈశతకం నీతిరస ప్రథానమైన శతకం. భాష సరళంగా ఉండి అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నది. రచయిత్రి సమకాలీన సామాజిక పరిస్థితులను తనదైన శైలిలో మన ముందుకు తీసుకువస్తారు. కొన్ని పద్యాలను చూద్దాము.

తమకు తెలియని ధర్మము దంభమంద్రు
తమకు కుదరని నియమము తగనిదంద్రు
జనులు తాము నేర్చీ విద్య శస్త్రమంద్రు
రామ శ్రీరామ జగదభిరామ రామ

మచ్చ లేకుండ బ్రతికిన మెచ్చరెవరు
వంకతోనున్న మంచికి వన్నె హెచ్చు
తెలుసు కొంటిని లోకుల తీరు తెన్ను
రామ శ్రీరామ జగదభిరామ రామ

అసురపక్షమున నిలచి యరచు ఘనులు
మునుల వేదన సుంతైన కనరదేమి
ముందు వెనుకలు చూడని తొందరేమి
రామ శ్రీరామ జగదభిరామ రామ

మెత్తనైన దేవుడవు నోరెత్తవనుచు
మచ్చ లేని శీలమునకు మసిని బూసి
మురిసిపోదురు కొందరు మూర్ఖ జనులు
రామ శ్రీరామ జగదభిరామ రామ

తీరి తాట్కన్ జంపిన తీరు పైన
తీర్పు లిచ్చెడి వారు నీ ఓర్పు కనరు
కడకు మారీచుడే చెప్పుగాక వినరు
రామ శ్రీరామ జగదభిరామ రామ

కోరి దుర్యోధనుని వైపు చేరువారు
కర్ణుని కొరకు కన్నీరు కార్చువారు
కలియుగము నందనేకులు కలరు కలరు
రామ శ్రీరామ జగదభిరామ రామ

నిజమైన మాన్యులు సాధకులు ఎట్లుంటారో చూడండి

మాయలోనున్న వారికి మంచిచెడులు
గరప గలిగెద మనుచు గర్వ పడక
మౌన ధారణ చేతురు మాన్యులెపుడు
రామ శ్రీరామ జగదభిరామ రామ

మొద్దు నిదరలు వీడని మొండి వారి
మార్చబూనక మూర్ఖపు చర్చ జొరక
సాగిపోవును నిజమైన సాధకుండు
రామ శ్రీరామ జగదభిరామ రామ

మాటిమాటికి వెనుకకు మరలువారి
కలుపుకొని పోదమనుచును నిలచిపోక
ముందు ముందుకు బోవలె మోక్షగామి
రామ శ్రీరామ జగదభిరామ రామ

శ్రీరామనామ జపముపై ఎంత చక్కని పద్యాలో చూద్దాము

పలు సుప్పలు పెక్కులు వలదు నాకు
భాష తలుకులు బెళుకులు బరువు చేటు
చక్కనైన నీనామము చాలు చాలు
రామ శ్రీరామ జగదభిరామ రామ

తాపముల చల్లార్చును, కోపములను
బాపు, నడగించు నతి ఘోర పాపములను
నామమొక్కటి చాలుర క్షేమమొసగ
రామ శ్రీరామ జగదభిరామ రామ

నరము లేనినాల్కకు నీదు నామ జపము
తిరము లేని హృదికి నీదు స్మరణ గుణము
నెనరు మీర నేర్పితినయ్య నేర్పుగాను
రామ శ్రీరామ జగదభిరామ రామ

మరికొన్ని చక్కని పద్యాలను చూద్దాము

అడుగక నడుగక నడుగ నవని తనయ
కామ జనకుడ వయ్యును కథను మార్చి
ఈయ తల్చక పోతివే మాయలేడి
రామ శ్రీరామ జగదభిరామ రామ

నీదు వనిత నపహరించి కహిదు చేసి
నీదు దూతను బంధించి నిప్పు పెట్టి
తనరు వానిఁ తిట్టవు గద దమము వీడి
రామ శ్రీరామ జగదభిరామ రామ

రామ నామము పలికెడు రక్తి లేక
సీత ప్రేమను పొందుట చేత కాక
హనుమ తోకకు జిక్కెరా యసుర లంక
రామ శ్రీరామ జగదభిరామ రామ

చివరగా కవియిత్రి చెప్పినట్లు తన మనసులోని మాటలనే ఎంతో చక్కగా సూటిగా తెలియ చేసారు

తోచిన పలుకుల్ వ్రాయితి తోచినట్లు
పథక మేమియు లేదొక వరుసలేదు
మనసులోనుండి దుమికిన మాటలివిర
రామ శ్రీరామ జగదభిరామ రామ

ఘనతలున్న పద్యములివి కావు గాని
భక్తి పొంగగ రాధిక వ్రాసెననుచు
చిరునగవు తోడ వీనిని స్వీకరించు
రామ శ్రీరామ జగదభిరామ రామ

చక్కని సరళమైన భాషలో వ్రాసిన ఈశతకము అందరూ చదవదగినది.
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.


***

No comments:

Post a Comment

Pages