గుణం తర్వాతే ధనం - అచ్చంగా తెలుగు

 గుణం తర్వాతే ధనం

-ప్రతాప వెంకట సుబ్బారాయుడు





ఆకాశాన ఒక కాలు

భూమ్మీదో కాలు అదిమిపెట్టడానికి

నువ్వు అనంతాకార రాక్షసుడివి కావు

సామాన్య మానవుడివి

అయినా హద్దులు మీరే ఆశ

అలవిమారిన కక్కూర్తి

ఇరవై అంగుళాల పరిమాణంలో పుట్టి

ఆరడుగుల గోతితో అంతమవడానికి మధ్య

అంతంత ఆరాటాలెందుకో

కనిపించిందంతా సొంతం చేసుకోవాలన్న కాంక్ష ఎందుకో

నీ వరకూ నువ్వు బతికి

నీ వారసులకు విలువల పునాది వేయొచ్చుకాని

ఆస్తుల భవంతులెందుకు?

అపాత్రదానాలే కాదు..అనవసర పంపకాలూ కూడదు

చరిత్రలో నిలిచిన వాళ్ళ పేర్లూ, వ్యక్తిత్వాలూ చెబుతాంగాని

సంపద గురించి మాట్లాడం

ఒకవేళ మాట్లాడినా గుణం తర్వాతే ధనం

ఇన్ని తెలిసినా మనీ తర్వాతే మనం అంటావా

ఎంతో మందిలో నువ్వొకడివి..అంతే!

***

No comments:

Post a Comment

Pages