మానవ భూతం - అచ్చంగా తెలుగు
 మానవ భూతం
(కవిత)
శెట్టిపల్లి అరుణా ప్రభాకర్ 

పూసిందన్న మాటేగానీ 
పుట్టెడు దిగులు పువ్వుకి 
ఎప్పుడు ఎవరు తెంచుకు పోతారో !

దూకుతుందన్న మాటే గానీ 
ఆకాశమంత ఆరాటం జలపాతానికి 
ముందర ఏ మత్తడి ఎదురవుతుందో!

ఎగురుతుందన్న మాటేగానీ 
ఎనలేని భయం పక్షికి 
ఏ విమానం రెక్కలు తన రెక్కలు విరిచేస్తాయో!

వీస్తుందన్న మాటేగానీ  
ఆపుకో వీలు లేనంత దుఃఖం గాలికి 
ఏ దుర్గంధం తనని వెంటాడుతుందో!

కాస్తుందన్న మాటేగానీ 
కనపడని ఆవేదన వెన్నెలకి 
క్రిక్కిరిసిన ఆకాశ హర్మ్యాల మధ్య నేలని ముద్దాడలేనేమో!

నిటారుగా నిలుచున్నదన్న మాటేగానీ 
నిలువలేనంత క్షోభ వృక్షానికి 
ఏ రంపం తన ఎదని కోస్తుందో!

తలెత్తుకుందన్న మాటేగానీ ఆకాశానికేసి 
తలచుకుంటే భయం శిఖరానికి
ఏ డైనమెట్లు తనని పిండి చేస్తాయో!

తిప్పుతుందన్న మాటేగానీ ఋతు చక్రాల్ని
 గుక్క తిప్పుకోనివ్వని సంవేదన ప్రకృతికి
కడుపు చీల్చుకుని వచ్చి 
రొమ్ము పీల్చుకునే మనిషి తనని మింగేస్తాడేమో!

No comments:

Post a Comment

Pages