మానస వీణ -41
వి.వి.వి.కామేశ్వరి (v³k)
ఆసుపత్రి
లోపలికి రావాలంటే భయపడి, వణుకుతున్న తల్లి
భుజం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుని లోపలికి జాగ్రత్తగా నడిపించుకు వచ్చింది
మానస.
అమ్మా
మనూ! ఆ బూచాడి దగ్గరకు వద్దమ్మా. మళ్ళీ నిన్ను ఎత్తుకు వెడితే... అమ్మో! నా చిట్టి
తల్లిని వదిలి నేను ఉండలేను.” పసిపిల్లలా మానసను గట్టిగా పట్టుకుని వెనక్కి
లాగుతున్న శ్రావణి వంక ఓదార్పుగా చూసి...
“నేను ఉన్నాగా శ్రావణీ... మన బంగారు తల్లిని ఎవరూ ఏమీ చెయ్యలేరు”
ధైర్యం చెప్పి స్పృహ తప్పి పడుకున్న భూషణం
బెడ్ వైపు కదిలాడు రఘురాం.
అలికిడికి స్పృహ వచ్చి మెలుకువ వచ్చిందో, లేక...
రక్త సంబంధం తట్టి లేపిందో, ప్రేమ పాశమే మెలి పెట్టిందో,
తెలియదు గానీ.. మెల్లగా కళ్ళు తెరిచిన భూషణానికి పులిని చూసి భయపడి
దూడను దాస్తున్న గోమాతలా కనిపించింది... మానసను చీర కొంగుతో కప్పుతున్న శ్రావణి.
పశ్చాత్తాపంతో
వరదలవుతున్న కళ్ళు మసక బారుతుంటే, “నీకు అపకారం
చేసిన నన్ను క్షమించి నా కోసం వచ్చావా బంగారు తల్లీ! యిలా రామ్మా” అని
చెప్పాలనుకున్న
మాటలు పెల్లుబికి బయటకు రాక చేసిన కనుల భాష అర్థం చేసుకున్న మానస
“తాతయ్యా” అని వాటేసుకుంది.
అటు
ఇటు చూస్తున్న భూషణం దగ్గరకు పరుగున వచ్చిన నర్సు ఇప్పుడే వస్తానని,
డాక్టర్ గారికి చెప్పటానికి పరుగున వెళ్ళింది.
చున్నీతో కళ్ళను తుడుస్తూ “నాకు మొత్తం విషయం తెలిసింది. మీరంతా నా
సొంత వాళ్ళు అని తెలిశాక రాకుండా ఎలా ఉంటాను తాతయ్యా... అందుకే ఆగలేక వచ్చేశాను.
ఇన్నాళ్ళూ నేను మిస్ అయిన ప్రేమంతా మీ నుంచీ పొందాలి కదా” అంది మానస.
అనిర్వచనీయమైన అనుభూతితో తాతా మనవరాళ్ళ ముఖాల లోని మెరుపును చూసిన
రఘురాం, శ్రావణిల మనసులో భయాలు తొలిగి ప్రశాంత మనస్కులు
అయ్యారు.
అప్పుడే
రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ ఆనంద్ మానసను ఆశ్చర్యంగా చూసి...“మానసా,
నువ్వు ఇక్కడ అదీ ఐసిసియు లో... నానుంచి ఏదైనా హెల్ప్ కావాల్సి
వచ్చావా! నా రూమ్ లో వెయిట్ చెయ్యి... పేషెంట్లను చూసి వస్తాను” అన్నారు.
కళ్ళు
తెరిచిన భూషణం గారి వంక చూసి,
నర్స్ నడిగి కేస్ షీట్ తీసుకుని, మెడిసిన్స్
చేంజ్ చేసి, మిగిలిన పేషెంట్ల పరిస్థితిని కూడా తెలుసుకుని,
రౌండ్స్ కంప్లీట్ అయిన తరువాత కన్సల్టింగ్ రూమ్
లో వెయిట్ చేస్తున్న మానస వాళ్ళను కలిసి... "రియల్లీ గ్రేట్,
ఇదంతా మిరాకిల్ లా ఉంది. మందులకు స్పందించని మీ నాన్నగారు... మానసను
చూడగానే కాన్షస్ లోకి వచ్చారని అనిపిస్తోంది. ప్రతి రోజూ తను వస్తుంటే కోలుకునే
చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనిపిస్తోంది” రఘురాంతో అని... మానసతో, "మరి నీకు ఓకేనా?" అన్నారు డాక్టర్ ఆనంద్.
“ఓకే డాక్టర్, ప్రతి శని, ఆదివారాలు
లయన్స్ క్లబ్ వారు నిర్వహించే వైద్య సేవలలో మీ వద్దకు వచ్చే పేషెంట్లకు వాలంటరీగా
హెల్ప్ చెయ్యటం నాకు అలవాటేగా. మా ఇంటికి తీసుకెళ్లే వరకూ మా తాతయ్యకు
కావలసినవన్నీ నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను” అంటున్న మానసను
అభినందిస్తూ...
“అదే నీలో నాకు నచ్చే విషయం. అందరినీ నీ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తావు.
నిన్ను చూస్తుంటే నీ లాంటి కూతురు ఉంటే ఎంత బాగుంటుంది" అనిపిస్తుంది.
“మానస మా అమ్మాయే డాక్టర్” జరిగిన సంగతంతా చెప్పారు రఘురాం.
“ఇదేనేమో డెస్టినీ అంటే, ఏది ఏమైనా మీరు
అదృష్టవంతులు... ఇన్నేళ్ళ తరువాత కలుసుకోవటం చూస్తుంటే భగవంతుడు ఉన్నాడని నమ్మి
తీరాల్సిందే... ఏ టైముకు ఏ మందు ఇవ్వాలో డ్యూటీ నర్సు చెబుతుంది. అలా ఫాలో
అవ్వమ్మా. ఆల్ ద బెస్ట్” అన్నారు డాక్టర్ ఆనంద్.
“నాన్నా... అమ్మ, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్
తీసుకోండి” అని వాళ్ళిద్దరినీ పంపించి ఐసిసియు వైపు కదిలింది మానస.
*********
“మనూ, మనూ...” పిలుస్తూ సరాసరి మానస రూమ్ లోకి
వెళ్ళిన అనిరుధ్ తో శ్రావణి.
“మానస వాళ్ళ తాతయ్యకి సహాయంగా హాస్పిటల్ లో ఉంది. తన రూమ్లో ఉన్న బుక్స్
చదువుతూ ఉండు. నీకు క్షణంలో కాఫీ తెచ్చిస్తా” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
అనిరుధ్
బుక్స్ కోసం చూస్తుంటే
డైరీ కనిపించింది. మరొకరి పర్సనల్స్ చదవటానికి సంస్కారం అడ్డు వచ్చినా,
“తన గురించి ,రాజేష్ గురించి తప్పకుండా రాసే ఉంటుంది.
చదివితే మానస మనోగతం తెలుస్తుంది కదా! అయినా ఫోనులో చెప్పిందిగా నాతో ఏదో
మాట్లాడాలని” స్వగతంలో అనుకుని వణుకుతున్న చేతులతో డైరీ ఓపెన్ చెయ్యగానే...
“మానస” అని ముత్యాల్లాంటి అందమైన అక్షరాలతో రాసి వీణ బొమ్మ వేసి ఉంది.
అప్రయత్నంగా “మానస వీణ” పైకి అని, ఎంత క్రియేటివ్ మైండ్
తనది. తను ఎంత అందగత్తో దానికి తగ్గట్లే మనసు కూడా అంతే అందమైనది” అనుకుని చివరి
పేజీలోని మానస మనసులోకి తొంగి చూశాడు అనిరుధ్.
“చిగురించిన స్నేహలత
అల్లుకుంది పందిరంత
పెనవేసుకుంది తనువంత
వదలనంది బ్రతుకంత
చెలరేగింది పులకింత
ప్రేమ పొంగింది మనసంత
కష్ట సుఖాలు పంచుకునేంత
జీవిత కాలం దాచుకునేంత
తోడు నీడగా నిలిచేంత
నా సర్వస్వం "అని" అనుకునేంత!
మొదటి
సారి చదివితే ఎవరి గురించి రాసిందో అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివాడు. మనసులో ఏదో
గిలిగింత...
కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి “అనిరుధ్... మీ అంకుల్
వచ్చినట్లున్నారు. ఇప్పుడే వస్తా" అని, బయటకు వెళ్ళింది
శ్రావణి.
కాఫీ
తాగగానే చిన్న మెదడికి మేత వేసినట్లు అయి, ఈ
సారి ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా చదువుతుంటే బుర్రలో ట్యూబ్ లైట్ వెలిగినట్లయింది
అనిరుద్ కి.
“అని” ఎంత ముద్దుగా రాసుకుంది. “అమ్మదొంగా! నా మీద ఇంత ప్రేమని మనసులో
దాచుకుని... నన్ను ఇన్ని రోజుల నుంచి ఆట పట్టించిందన్న మాట. చెప్తా నీ సంగతి”
అనుకున్నదే తడవుగా
మనసు గాల్లో తేలిపోతుంటే...
ఆగమేఘాల
మీద రెక్కలు కట్టుకున్నట్లు మానస ముందు వాలాడు అనిరుధ్.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment